పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు సర్వ సాధారణం. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు వీటికి ‘సైక్లిక్ క్రైసిస్’ అని పేరు పెట్టి సైద్ధాంతీకరించేశారు కూడా. (అంటే సిద్ధాంతం కనక ఇక అడగొద్దని.) పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభం అంటే ప్రధానంగా పెట్టుబడిదారుల సంక్షోభమే. పెట్టుబడిదారులకు లాభాలు తగ్గిపోతే అదే సంక్షోభం. దేశంలో దరిద్రం తాండవిస్తున్నా అది సంక్షోభం కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నూటికి యాభై మందికి ఇళ్ళు లేకపోయినా, నలభై మంది ఆకలితో, అర్ధాకలితో చస్తూ బతుకుతున్నా, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నా అవేవీ సంక్షోభం కింద లెక్కించరు. మహా అయితే ‘లోపం’ అవుతుందంతే. ఆ లోపం కూడా పట్టించుకోనక్కర్లేని లోపమే.
2008 లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తలెత్తింది. దీనికి కారణం పెట్టుబడిదారీ వ్యవస్ధలో మౌలికంగా ఉండే దోపిడీ వైరుధ్యమే. (పెట్టుబడిదారీ కంపెనీలు శ్రామికులపై శ్రమ దోపిడి సాగిస్తూ వారి ఆదాయాలను అంతకంతకూ ఎక్కువగా తమ ఖాతాల్లోకి తరలించుకోవడం ఒక వైపు సాగుతుండగా, మరోవైపు ఆదాయాలు కోల్పోయి కొనుగోలు శక్తి పడిపోయి ప్రజలు సరుకులు కొనలేకపోవడం వల్ల అది నేరుగా పెట్టుబడిదారీ వ్యవస్ధకే ఎసరు పెట్టడం పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉండే మౌలిక దోపిడీ వైరుధ్యం.) అయితే ఈ సంక్షోభానికి కారణం వాల్ స్ట్రీట్ కంపెనీలే అని ఐ.ఎం.ఎఫ్ తో సహా అమెరికా, యూరప్ ల ప్రభుత్వాల వద్ద నుండి పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలందరూ ముక్త కంఠంతో తేల్చేశారు.
ఈ సంక్షోభ పరిష్కారానికి అమెరికా, యూరప్ లు ఒకవైపు తమ దేశ ప్రజలపై పొదుపు ఆర్ధిక విధానాలు రుద్దుతూ మరో వైపు మూడో ప్రపంచ దేశాల ఆర్ధిక వనరుల దోపిడీ పెంచడానికీ, ప్రభుత్వాల సేవలను కూడా రద్దు చేసి అదనపు మార్కెట్లు సృష్టించుకోవడానికీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రభుత్వాల జోలికి పోకుండా ప్రజలే స్వయం ఉపాధి కల్పించుకున్న రంగాలను కూడా వశం చేసుకోవడానికి ప్రభుత్వాలను బలవంతపెడుతున్నాయి. అందులో భాగంగా భారత ప్రజల ఆదాయాలపై కూడా అవి కన్నేసాయి. ఇండియా ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాలని పూర్తిగా తమకి అప్పజెప్పమంటున్నాయి. దాదాపు ఇరవై కోట్లమంది ఆధారపడి బతుకుతున్న రిటైల్ రంగాన్ని తమకి ఇచ్చేయ్యమని ఒత్తిడి తెస్తున్నాయి. ఆ మేరకు కొద్ది రోజుల క్రితం ఒబామా చేత ప్రకటన చేయించి ఇండియాపై ఒత్తిడి పెంచాయి.
ప్రవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ లు కూడా పెట్టుబడిదారీ సంక్షోభం పరిష్కారానికి ఎంచుకున్న సాధనాలే. పోటీ పెరిగితే నాణ్యత పెరుగుతుందనీ, ధరలు తగ్గుతాయనీ, ఆధునిక టెక్నాలజీ వస్తుందనీ మన్మోహన్, మాంటెక్ సింగ్ లాంటి వారు చెప్పిన కబుర్లు ఉత్తుదేనని రెండు దశాబ్ధాల సంస్కరణల అమలు స్పష్టం చేసీంది. బొగ్గు, స్పెక్ట్రమ్, బాక్సైట్, ఇనుము తదితర సహజ, ఖనిజ ఖనిజ వనరులను విదేశీ, స్వదేశీ ప్రవేటు కంపెనీలకు విచ్చలవిడిగా పంచడం కోర్టుల జోక్యం వల్ల నెమ్మదించినా దానిని తిరిగి పట్టాలెక్కించడానికి ప్రణబ్ ని సాగనంపారు. ప్రవేటు కంపెనీల విశ్వసనీయ దోస్తు చిదంబరం ఆర్ధిక శాఖకు మళ్ళీ రప్పించారు. ఇవన్నీ ప్రజలపై భారం మోపుతూ ధరలు, పన్నులు పెంచి మరింత ప్రజాధనాన్ని పెట్టుబడిదారీ కంపెనీలకి తరలించే చర్యలే. ఇదొక నిరంతర ప్రక్రియ. పెట్టుబడిదారీ సంక్షోభం ఎంత నిరంతరమో, ప్రజలపై బాదుడూ అంతే నిరంతరం. సంక్షోభాలు పెట్టుబడిదారీ వ్యవస్ధల అనివార్య లక్షణాలు కాగా వాటి భారం మోసేది మాత్రం ప్రజలు.
గత సంవత్సరం నుండి భారత ఆర్ధిక వృద్ధి పడిపోయింది. ప్రవేటీకరణ, సరళీకరణ లాంటి సంస్కరణలని వేగం చేయడమే దానికి పరిష్కారం అని ఒబామా, హాలండే, కామెరూన్ ల దగ్గర్నుండి (వీళ్ల సంక్షోభానికి టికాణా లేదు గాని మనకి సలహాలు అలియాస్ బెదిరింపులు జారీ చేస్తారు) మన ప్రధాని, మంత్రుల వరకూ ఊదరగొడుతున్నారు. ఆర్.బి.ఐ ద్రవ్య విధాన సమీక్ష చేస్తూ కంపెనీలు అడిగినట్లు వడ్డీ రేట్లు తగ్గించలేదని పెట్టుబడిదారులంతా ఒకటే యాష్టపోతున్నారు. వారి కోసం సో కాల్డ్ ఆర్ధిక వేత్తలు టి.వి చర్చా గోష్టుల్లో కూర్చుని రిటైల్ ని అమ్మేయాలనీ, బ్యాంకుల్నీ, ఇన్సూరెన్స్ రంగాన్నీ అమ్మేయాలనీ ప్రభుత్వానికి నచ్చజెబుతున్నారు. దేశ ప్రజలకి ఏ మాత్రం పనికిరాని ఈ అద్దె మేధావులు తిని తొంగోక ప్రజలకి వ్యతిరేకంగా ఆలోచించడమే ఒక దరిద్రం కాగా తమ భావ దారిద్ర్యాన్ని ఉపయోగించి ప్రజల దరిద్రాన్ని పెంచడానికి ఉపక్రమించడం మరొక దరిద్రం. ఆర్ధికవేత్తలు ఉన్నది దేశ ప్రజల ఆర్ధిక పరిస్ధితి మెరుగుపరచడానికా లేక ధనికుల సంపదలని ఇంకా పెంచడానికా అని వీరిని చూస్తే ఒక పట్టాన అర్ధం కాదు. గత కొద్ది నెలలుగా ఈ మేధావులది ఒకటే రంధి. ఏ టి.వి చర్చా గోష్టి చూసినా, ఏ పత్రిక బిజినెస్ కాలం చూసినా వీరి గోలే. పత్రికలు పెట్టుబడిదారీ విష పుత్రికలు అని శ్రీ శ్రీ ఊరికే అన్నాడా మరి!
పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించేవాళ్ళలో ఒక సాధారణమైన misconception ఉంది. అదేమిటంటే పోటీ పెరిగితే ధరలు తగ్గుతాయని. నిజానికి అలాగేమీ జరగదు. నేను GPRS ఫోన్ కొనాలనుకుంటున్న సమయంలో దాని ధర ఎనిమిది వేలు ఉండేది. ఏడాది తరువాత ధరలు తగ్గుతాయని అనుకున్నాను. కానీ నేను కొనే సమయానికి ధర తొమ్మిది వేల మూడు వందలకి పెరిగింది. రూపాయి విలువ తగ్గినప్పుడు విదేశీ బ్రాండ్ ఉన్న వస్తువుల ధరలు తప్పకుండా పెరుగుతాయి. ఈ లింక్ చదవండి: http://forproletarianrevolution.mlmedia.net.in/economics/622715