పూనే పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవే -కేంద్రం


బుధవారం పూనేలో జరిగిన పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవేనని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 500 మీటర్ల పరిధిలో, 45 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుళ్లు ఒక పధకం ప్రకారం సమన్వయంతో జరిగాయని హోమ్ సెక్రటరీ ఆర్.కె.సింగ్ విలేఖరులకు చెప్పాడు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ), ఎన్.ఎస్.జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), సి.ఎఫ్.ఎస్.ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) ల బృందాలు పూణే చేరుకుని పేలుడు పేలుడు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని ఆయన తెలిపాడు.

“500 మీటర్ల పరిధిలో, 45 నిమిషాల లోపాలే ఈ పేలుళ్లు జరిగినందున అవి సమన్వయంతో జరిగినట్లు కనిపిస్తోంది. పేలుళ్ళ వెనుక పధకం ఉందని నేను చెప్పగలను” అని ఆర్.కె.సింగ్ తెలిపాడు. “పేలకుండా మిగిలిన రెండు ఐ.ఇ.డి (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజీవ్ డివైజ్) లను వారు పరీక్షించారు. ఒక్కోదానిలో ఇతర ప్రత్యేకతలతో మూడు డిటోనేటర్లు ఉన్నాయి. పరిశోధన జరుగుతోంది. కొంత పురోగమించాం” అని ఆయన అన్నాడు. అయితే పేలుళ్లపై తాజా సమాచారం ఏమీ లేదని హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. బుధవారమే చిదంబరం నుండి హోమ్ మంత్రిత్వ శాఖను స్వీకరించిన షిండే పేలుళ్లను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపాడు.

బుధవారం రాత్రి పూణేలోని రద్దీ రోడ్డు అయిన జె.ఎం.రోడ్డు లో నాలుగు చోట్ల ఒకదాని తర్వాత మరొకటిగా వరుస పేలుళ్లు సంభవించాయి. బాల గంధర్వ్ ధియేటర్, దేనా బ్యాంక్, మెక్ డొనాల్డ్ ఫుడ్ ఔట్ లెట్, గర్వేర్ బ్రిడ్జ్ ల వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి పెన్సిల్ బ్యాటరీలతో పేలుళ్లు జరిపారని పోలీసులు తెలిపారు. కేక్ బాక్స్ ఉంచిన కేరీ బ్యాగ్ లో పేలుడు జరగడంతో దయానంద్ అనే వ్యక్తి గాయపడ్డాడు. బాంబు తన సంచిలోకి ఎలా వచ్చిందీ అతనికి తెలియదని తెలుస్తోంది. అతను అనుమానితుడు కాదని పోలీసులు నిర్ధారించారు. మరో రెండు బాంబులు కొత్త సైకిళ్ళకు తగిలించి ఉండగా పేలాయని పత్రికలు తెలిపాయి. ఒక బాంబు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బయట ఉన్న డస్ట్ బిన్ లో పేలింది. తర్వాత పోలీసులు రెండు పేలని బాంబులను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు.

నిర్ధారణ కాని సమాచారం ప్రకారం దయానంద్ అన్నా బృందం స్ధాపించిన ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ (ఐ.ఎ.సి) సభ్యుడుని ‘ది హిందూ’ తెలిపింది. సమీప గ్రామం నుండి ప్రతిరోజూ పూణే వచ్చి టైలర్ గా పని చేసే దయానంద్ జె.ఏం.రోడ్డు లో ఐ.ఎ.సి నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొని వెళ్తుండగా పేలుడు జరిగింది. పేలుళ్లు జరిగిన అనంతరం భద్రతా కారణాల రీత్యా ఐ.ఎ.సి ధర్నా విరమించుకోవాలని పోలీసులు కోరారు. తాత్కాలికంగా ధర్నా విరమించడానికి నిర్వాహకులు అంగీకరించారు.

పేలుళ్ళ వెనుక టెర్రరిస్టుల హస్తం ఉన్నదీ లేనిదీ దర్యాప్తు చేస్తున్నామని మహారాష్ట్ర హోమ్ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ చెప్పాడు. సంఘటన వెనుక కాషాయ ఉగ్రవాదుల హస్తం ఉన్నదా అన్న ప్రశ్నకు ఆయన “అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. ఈ దశలో వ్యాఖ్యానించడం సరైనది కాదు” అని అన్నాడు. కొన్ని రోజులుగా అన్నా బృందం నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ పత్రికలు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. పత్రికల వైఖరిని నిరాహార దీక్షలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు కురిపించాక శిబిరం వద్ద విలేఖరులపై దాడులు జరగడం గమనార్హం.

పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో అమర్చి ఉన్న సి.సి.టి.వి కెమెరాలు పని చేయని స్ధితిలో ఉన్నాయని దర్యాప్తు సంస్ధలు చెబుతున్నాయి. దేనా బ్యాంక్, మెక్ డొనాల్డ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బాల గంధర్వ్ ట్రాఫిక్ కూడలి వద్ద కొన్ని సి.సి.టి.వి కెమెరాలు అమర్చబడి ఉన్నప్పటికీ వాటిలో కొన్ని పని చేయలేదని అవి తెలిపాయి. దానితో దర్యాప్తు ముందుకు సాగడం కష్టంగా మారింది. సైకిళ్ళను కొనుగోలు చేసిన షాపుల నుండి సమాచారం సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేలుడు పదార్ధాల సాంద్రతను బట్టి పేలుళ్ళ వెనుక ఉన్న గ్రూపులను అంచనా వేయడానికి కూడా దర్యాప్తు సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కో గ్రూపు ఒక్కో మోతాదులో, కాంబినేషన్ లో పేలుడు పదార్ధాలు వాడుతుందనీ, కనుక దాన్ని బట్టి కూడా టెర్రరిస్టు గ్రూపులను గుర్తించవచ్చని తెలుస్తోంది. కేమెరాలు పని చేయకపోవడం కూడా పధకంలో భాగమేనేమోనాన్న అనుమానాలు తలెత్తాయి.

దేశంలో నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితి పరిస్ధితి నేపధ్యంలో పేలుళ్లు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. వరుస అవినీతి కేసుల్లో ఇరుక్కుని కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ పలువురు మంత్రులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవినీతి ని చూపిస్తూ ప్రతిపక్ష బి.జె.పి పాలక పక్షంపై దాడిని తీవ్రం చేస్తున్నది. బి.జె.పి బలహీనతే కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడిగా మారడంతో కేంద్ర ప్రభుత్వ మనుగడకి ఢోకా లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సమస్యలు తక్కువేమీ కాదు. వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ అధికార పక్షాలను మచ్చిక చేసుకుని మనుగడ సాగిస్తున్న కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి మిగిలిన అస్త్రం అవినీతి కూడా బి.జె.పి అక్కరకు రావడం లేదు. అన్నా బృందం కూడా గతంలో లాగా ప్రజలను ఆకర్షించడం లేదు. ఈ పరిస్ధితి దృష్ట్యా పూణే పేలుళ్ళు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s