ఆర్.బి.ఐ సమీక్ష: జి.డి.పి టార్గెట్ కి కోత, వడ్డీ రేట్లు యధాతధం


వడ్డీ రేట్లు తగ్గించాలన్న పారిశ్రాక సంఘాల డిమాండ్ ను ఆర్.బి.ఐ తలొగ్గలేదు. ద్రవ్యోల్బణంపై పోరాటం తన లక్ష్యమని చెప్పింది. ఈ దశలో ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించి మరింత డబ్బుని మార్కెట్ కి వదిలితే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంటుందని తెలిపింది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను జి.డి.పి వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుండి భారీగా 0.8 శాతం తగ్గించుకుని 6.5 శాతం నమోదయితే చాలని చెప్పింది. ఎస్.ఎల్.ఆర్ లో మాత్రం కొంత సడలింపు ప్రకటించింది.

భారత స్ధూల జాతీయోత్పత్తి (జి.డి.పి) పెరుగుదల బాగా నెమ్మదించడంతో ఆర్.బి.ఐ స్వల్ప కాలిక వడ్డీ రేటు (రేపో రేటు) తగ్గించవచ్చని ధనికవర్గాలైన పరిశ్రమాధిపతులు, స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలు, వాణిజ్యవేత్తలు భావించారు. ఆమేరకు వారు గత కొద్ది వారాలుగా డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ‘ది హిందూ’ అభివర్ణించినట్లు గ్యాలరీ కేకలకోసం తాను ఆడేది లేదని ఆర్.బి.ఐ తన ద్రవ్య విధాన సమీక్షలో సూచించింది.

ఆర్ధిక వృద్ధి

అమెరికా, యూరప్ దేశాలలో ఆర్ధిక వృద్ధి మందగించడం వల్ల భారత జి.డి.పి ముందు అంచనా వేసినట్లుగా 7.3 శాతం వృద్ధి చెందడం సాధ్యం కాదని ఆర్.బి.ఐ నిర్ధారించింది. యూరో జోన్ ఋణ సంక్షోభం మరింత తీవ్రం కావడం, అమెరికా ఆర్ధిక వృద్ధి బలహీనంగా కొనసాగడం, గ్రీసు, స్పెయిన్, ఇటలీ ల ఋణ భారం తీవ్రం కావడం తదితర కారణాల వల్ల భారత దేశ ఎగుమతులు బాగా పడిపోయాయని, పరిశ్రమలు, సేవల రామ్గాలు కూడా దెబ్బతింటాయని తెలిపింది. ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో భారత దేశం మరింతగా భాగం అయినందున ఇతర దేశాల తిప్పలు మనకూ తప్పవని తెలిపింది. జులై 31, 2012 నాటి ఆర్.బి.ఐ సమీక్షా పత్రం ఇలా పేర్కొంది.

…global growth and trade volume are now expected to be lower than projected earlier. Given the greater integration of the Indian economy with the global economy, this will have an adverse impact on growth, particularly in industry and the services sector.

అమెరికా, యూరప్ లు మంచులో తడుస్తుంటే ఇక్కడ మనం గజ గజా వణకడం అన్నమాట! 2013 లో అమెరికా ఎదుర్కోనున్న ‘ఫిస్కల్ క్లిఫ్’ గురించి కూడా ఆర్.బి.ఐ హెచ్చరించింది. అమెరికా అమలు చేస్తున్న తాత్కాలిక పన్ను రాయితీలు 2013 నుండి ముగిసిపోతాయి. ఖర్చుల కోతలు ప్రారంభం అవుతాయి. ఖర్చుల కోతలంటే ప్రజలపై పెట్టే ఖర్చుల్లో కోతలని అర్ధం. ఈ పరిస్ధితి భారత దేశంపై ప్రతికూల ప్రభావం పడవేస్తుందని ఆర్.బి.ఐ తన పత్రంలో పేర్కోంది. 2013 లో అమెరికా కష్టాల గురించి ఇండియా ఆర్ధిక వ్యవస్ధ ఇప్పటినుండే వణికిపోవడమే ఇది. అలా వణికిపోవలసిన పరిస్ధితికి భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను మన పాలకులు తెచ్చారు.  

దేశీయంగా చూస్తే ఋతుపవనాలు తగినంత వర్షపాతం ఇవ్వకపోగా ఇప్పటికీ దేశం అంతా విస్తరించలేదని తెలిపింది. పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మెరుగుపడలేదని తెలిపింది. సాధారణ ఋతుపవనాలు, చురుకైన పారిశ్రామిక కార్యకలాపాలు ఉంటాయన్న అంచనాతో 7.3 శాతం ఆర్ధిక వృద్ధిని గత ఏప్రిల్ లో అంచనా వేశామనీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నందున 6.5 శాతం వృద్ధితో సరిపెట్టుకోవడమేనని తెలిపింది.

ద్రవ్యోల్బణం

మార్చి 2013 నాటికి భారత ద్రవ్యోల్బణం 6.5 శాతం ఉండవచ్చని ఆర్.బి.ఐ గత ఏప్రిల్ లో చేసిన వార్షిక సమీక్షలో పేర్కొంది. ఇది కూడా కొంతవరకు సాధారణ ఋతుపవనాలు సంభవిస్తాయన్న భావనతో వేసిన అంచనాయేనని తెలిపింది. వర్షపాతం ఇప్పటికే లోటు అయిందని, అదీకాక అసమ విస్తరణ కూడా తోడయినందున ఆహార ద్రవ్యోల్బణం పై ప్రతికూల ప్రభావం తప్పదని తెలిపింది. దానితో పాటు అంతర్జాతీయ స్ధాయిలో క్రూడాయిల్ ధరలు అధిక స్ధాయిలో కొనసాగుతున్నాయని గుర్తు చేసింది. రూపాయి విలువ క్షీణత వల్ల దిగుమతుల ఖర్చు పెరిగిపోతుందని ఫలితంగా దేశీయంగా ఇంధన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగేలా చేస్తాయని తెలిపింది.

అంతర్జాతీయంగా పెరిగిన ఆయిల్ ధరలు ఇంకా పూర్తిగా భారత దేశ ఇంధన ధరల్లో ప్రతిఫలించలేదని కూడా ఆర్.బి.ఐ తెలిపింది. పూర్తిగా ప్రతిఫలిస్తే ఆయిల్ ధరలు ఇంకా పెరిగి ద్రవ్యోల్బణమూ పెరుగుతుందని ఆర్.బి.ఐ చెబుతోంది. అంటే త్వరలో లేదా మునుముందు పెట్రోల్, డీజెల్, కిరోసిన్ ధరలు మరింత పెరగనున్నాయిని అర్ధం. సిరియాలో కిరాయి తిరుగుబాటుకి ఆయుధ, ధన, సైనిక సాయం అందిస్తూ ఇరాన్ పై యుద్ధానికి అమెరికా, యూరప్ లు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నందున ఈ పెరుగుదల గూబ గుయ్యిమనేలా ఉంటుంది కూడా.

అనిశ్చితి

ఇంత చెప్పినా ఆర్ధిక వృద్ధి ద్రవ్యోల్బణం లపై తాను ఇచ్చిన అంచనా నికరం కాదనీ అనిశ్చితమేనని ఆర్.బి.ఐ ముక్తాయించింది. బయటినుండి వచ్చిపడే ప్రమాదాల ప్రభావం ఎక్కువగానే ఉన్నందున భారత ఆర్ధిక వ్యవస్ధపై వాటి ప్రభావం తీవ్రమవుతోందని ఆర్.బి.ఐ తెలిపింది. (2008 ఆర్ధిక సంక్షోభం నుండి) గ్లోబల్ రికవరీ మూలనపడడం, ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల్లో వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండడం మొ.న కారాణాల వల్ల ఆహార, ఇంధన ధరల పరిస్ధితి ఎప్పుడేమవుతోందో అన్నట్లుగా ఉందని తెలిపింది. ఈ పరిణామాల ప్రభావం భారత ఆర్ధిక వృద్ధి, ద్రవ్యోల్బణాలపై అనివార్యమని తెలిపింది.

ఈ పరిస్ధితుల నేపధ్యంలో ద్రవ్యోల్బణం పై అదుపు కొనసాగించడానికి రేపో రేటు (ఆర్.బి.ఐ వద్ద తీసుకునే అప్పుకి బ్యాంకులు చెల్లించే రేటు) ను 8 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు చెప్పింది. (దీన్ని తగ్గిస్తే బ్యాంకులు మరిన్ని నిధులను తమకు పందేరం పెడతాయని ధనిక వర్గాలు ఆశించాయి.) రివర్స్ రేపో రేట్ (తమ వద్ద ఉంచిన నిధులకు ఆర్.బి.ఐ బ్యాంకులకు చెల్లించే రేటు) కూడా 7 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే సి.ఆర్.ఆర్ (కేష్ రిజర్వ్ రేషియో) ను 4.75 శాతం వద్ద కొనసాగిస్తూ ఎస్.ఎల్.ఆర్ (స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో – ప్రభుత్వ బాండ్లలో బ్యాంకులు పార్క్ చేయవలసిన నిధులు) ను 24 నుండి 23 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది.

ఆర్.బి.ఐ సమీక్షా పత్రం పై ఆసక్తి ఉన్నవారు పి.డి.ఎఫ్ కాపీని ఇక్కడ చూడవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s