హిందూ పరిరక్షకుల చేతిలో మానవీయ సంస్కృతి విధ్వంసం -ఫొటోలు


“దాడి చేసినవారిలో ఒకడు ఆకలిగొన్న కుక్కలా నా స్నేహితురాలి శరీరం అంతా తాకాడు. ఆటవస్తువులా ఆడుకున్నాడు. నేను వివరించలేను… వాడి అసలు ఉద్దేశ్యం ఏమిటో మీరే అర్ధం చేసుకోవాలి.” మంగుళూరులో హిందూ సంస్కృతి పరిరక్షకులమంటూ పెచ్చరిల్లిన మూకల దాడిలో బాధితురాలు సిగ్గుతో చస్తూ చెప్పిన నాలుగు మాటలివి.

“అది రేవ్ పార్టీ కాదు. మేమలాంటివారం కాదు. మా ఫ్రెండ్ తన పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంది. ఆడపిల్లల్ని ఇలాగేనా చూసేది? మంగుళూరులో నేనిక ఏ పార్టీకీ వెళ్లను… మా స్నేహితురాలు అనుభవించినది నేను ఎదుర్కోలేను.” ఆమె స్నేహితురాలి నిరసన.

“వారికి (పోలీసులకి) జరిగిందంతా చెప్పాము. వాళ్లపైన ‘అత్యాచార ప్రయత్నం’ ఫిర్యాదు చేద్దామని నా ఫ్రెండు మొదట భావించింది. కాని అది మరొక వేదన. మళ్ళీ దానిని ఎదుర్కోవడానికి తను సిద్ధంగా లేదు. న్యాయం పొందడం కోసం అనేక సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరి దగ్గరికీ పరుగెడుతూనే ఉండాలి. వాళ్ళు ఎక్కడెక్కడ తాకిందీ, ఏమేమి చేసిందీ ప్రతి ఒక్కరికీ వివరిస్తూ పోవాలి… మీడియా అంతా ఆమె పేరు మార్మోగుతుంది… ఆ మానసిక హింస భరించలేనిది. అంత జరిగినా ఆమెను హింసించినవారికి శిక్ష పడుతుందన్న గ్యారంటీ లేదు. ఇదంతా ఎలాగో వెనక్కి నెట్టి ముందుకు సాగాలని ఆమె భావిస్తోంది.” ఆడపిల్లలు పోలీసులకి ఫిర్యాదు చెయ్యడానికి ముందుకు రాలేదు కనక వారు ఏదో తప్పు చేసే ఉంటారని కూసిన హిందూ జాగరణ వేదిక నాయకుడి కూతకి ఇది ఆ నిస్సహాయ బాలిక సమాధానం.

“2:30 కి పార్టీ మొదలుపెట్టుకున్నాం. అమ్మాయిలు పెందలకాడే ఇంటికి పోవలసి ఉన్నందున ఆరుకల్లా ముగించుకోవాలనుకున్నాం. వెళ్లిపోవడానికి సిద్ధపడుతుండగానే 40-50 మంది ఉన్న గ్యాంగ్ దాడి చేసింది. వారి ఉద్దేశ్యం అర్ధం కావడంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాం. కాని అన్నివైపులనుండీ మమ్మల్ని అడ్డుకున్నారు… జంతువుల్లా ప్రవర్తించారు” అని బాధితుల్లో ఒకరైన వేణు (పేరు మార్చబడింది) దాయిజీ వరల్డ్ డాట్ కామ్ కి చెప్పాడు.

“మేమంతా 18 యేళ్ల వయసు మించిన పెద్దవారమే. మా పరిమితులు మాకు తెలుసు. మా ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏ రూల్ నీ, నియమాన్నీ ఉల్లంఘించలేదు. లౌడ్ స్పీకర్లేమీ లేవు. ఒక్క స్టీరియోనే ఉంది. దాన్నసలు వాడనే లేదు. స్వేచ్ఛా దేశంలో మేమున్నామని నమ్మడం చాలా కష్టంగా ఉంది. పార్టీ ప్రేమికులందరికీ నాదొక సలహా. ఇక్కడ సెలెబ్రేట్ చేసుకోవద్దు. సెలెబ్రేషన్స్ కి మంగుళూరు సరైన చోటు కాదు. ఈ దేశ నియమాలు అమలయ్యే మరో చోటేదైనా చూసుకోండి.” మరో బాధితుడు వివేక్ (పేరు నిజం కాదు) ఆక్రందన.

“నేను ఇప్పటివరకూ తాలిబాన్ గురించి వినడమే జరిగింది. తాలిబాన్ ఎలా ప్రవర్తిస్తారో, వాళ్ళు నిజంగా ఎలా ఉంటారో ఇప్పుడు తెలిసి వచ్చింది. నన్ను కొట్టడమే కాదు. రు.20,000/- ఖరీదు చేసే మొబైల్ ని దొంగిలించారు. మంచి మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు మా అంకుల్ నాకది కొనిచ్చాడు.” మతోన్మాదం ఏ మతంలోనైనా ఎలా ఉంటుందో చవిచూసిన వివేక్ అనుభవం యువకులకు ఒక గుణపాఠం.

దాయిజీ వరల్డ్ వార్తా సంస్ధ ప్రకారం బాధిత అమ్మాయిల్లో కర్ణాటక లోకాయుక్త లో పని చేస్తున్న ఒక పోలీసు ఉన్నతాధికారి కూతురు కూడా ఉంది.

ఈ ఫొటోల్లో కొన్ని దాయిజీ వరల్డ్ అందించినవి కాగా మరి కొన్ని వీడియో ఫుటేజి నుండి నేను సేకరించిన స్క్రీన్ షాట్స్. హిందూ సంస్కృతి పరిరక్షణ పేరుతో ఆకలిగొన్న మగ మృగాలు నిస్సహాయ బాలికలపై ఎంత అఘాయిత్యానికి పాల్పడగలవో ఈ స్క్రీన్ షాట్స్ చెబుతున్నాయి. యువకుడికి బలవంతంగా చొక్కా విప్పి మూకుమ్మడిగా చుట్టుముట్టి కొట్టడం, అమ్మాయిలని వాటేసుకుని తీసుకెళ్లడం, జుట్టు పట్టి లాక్కెళ్లడం, కిందకి నెట్టి లేపే నెపంతో ‘బాడీ అటాక్’ కి పాల్పడడం వీటిలో చూడవచ్చు. హిందూ సంస్కృతి పరిరక్షకులం అంటూ కాలేజిల్లో, యూనివర్సిటీల్లో, పబ్లిక్ పార్కుల్లో, రాజకీయాల్లో అన్ని చోట్లా బొట్టు నామాలతో సహా విచ్చలవిడిగా సంచరిస్తున్న మూకల అంతఃస్వరూపం, నిజ స్వరూపం బహుశా ఇదే కావచ్చు.

18 thoughts on “హిందూ పరిరక్షకుల చేతిలో మానవీయ సంస్కృతి విధ్వంసం -ఫొటోలు

 1. ప్రతి పట్టణంలోనూ గోడల మీద షకీలా సినిమాల పోస్టర్లు కనిపిస్తోంటే ఏమీ అనని హిందూత్వవాదులకి ఈ పబ్‌ల సంస్కృతి మీదే అంత కసి ఎందుకు?

 2. ఇది వ్యక్తుల తప్పే కాని హిందూ మతం తప్పు కాదని బ్లాగ్ మిత్రులు ఈ ఘోర దుర్ఘటనపై కూడా తమ తమ వ్యాఖ్యానాలు చేయవచ్చు.

  హిందూ జాగరణ సంస్థకి చెందిన ‘నీచాధములు’ -నీచ పదంలో దళిత సంకేతం కనిపిస్తే క్షమించాలి- చేసిన పని తప్పా ఒప్పా అనే విషయంపై ఇంతవరకు ఏ హిందూ సంస్థకాని, హిందూ ఆధ్యాత్మిక గురువులు కాని తమ అభిప్రాయం చెప్పినట్లు లేదు. ఒకవేళ కొందరు ఆద్యాత్మికవాదులైనా ఈ విషయంలో తమ వాణిని వినిపించి ఉంటే వాటిని కూడా ఇక్కడ పొందుపర్చాలి.

  “వాళ్లపైన ‘అత్యాచార ప్రయత్నం’ ఫిర్యాదు చేద్దామని నా ఫ్రెండు మొదట భావించింది. కాని అది మరొక వేదన. మళ్ళీ దానిని ఎదుర్కోవడానికి తను సిద్ధంగా లేదు. న్యాయం పొందడం కోసం అనేక సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరి దగ్గరికీ పరుగెడుతూనే ఉండాలి. వాళ్ళు ఎక్కడెక్కడ తాకిందీ, ఏమేమి చేసిందీ ప్రతి ఒక్కరికీ వివరిస్తూ పోవాలి… మీడియా అంతా ఆమె పేరు మార్మోగుతుంది…”

  బూర్జువా లేదా పాలకవర్గ రాజ్యాంగ న్యాయాన్ని సకాలంలో పొందటం అనేది ఈ దేశంలో అసాధ్యం. కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉన్న, ప్రజల్లో స్థానం సంపాదించుకుని ఉన్న కాలంలో నాకు తెలిసి కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలను వేధించడం అనే ఆలోచన జోలికి కూడా ఎవరూ పోలేని, సాహసించలేని కాలం ఒకటుండేది. ఎర్రబాబులుగా బ్లాగ్ లోకంలో నిందించబడుతున్నవారు కనీసం ఈ విషయంలో అయినా ఇతర విద్యార్థి సంఘాలకు భిన్నంగా, వేధించబడేవారికి సపోర్ట్‌గా నిలిచిన కాలమది.

  బూటకపు ప్రజాస్వామిక వ్యవస్థలు కూడా తుప్పు పట్టిపోయిన కాలంలో ఇలాంటి మానవీయ అంశాల్లో సత్వర న్యాయం లభించటం కల్లోనిమాటే. అన్యాయాన్ని, వికృతచర్యలను చట్టపరంగా మాత్రమే ఎదుర్కోవడం కంటే భౌతికంగా -ఫిజికల్- ఎదుర్కోవడం అనే ఆవశ్యకతలోంచే ఈ దేశంలో ప్రజాకోర్టులు అనేవి పుట్టుకొచ్చి కొన్ని ప్రాంతాల్లో అయినా అమలవుతున్నాయి.

  రాజ్యాంగం చేష్టలుడిగి నీరు గారిపోయినప్పుడు రాజ్యాంగేతర కార్యాచరణ అది ఎంత తప్పుల తడకతో నడుస్తున్నప్పటికీ దానికి న్యాయబద్దత… కాదు కాదు… ప్రజా సమర్థత ఆటోమేటిక్‌గా లభిస్తుంది. ప్రజాకోర్టులలో సత్వర న్యాయం అందుకే పోరాట ప్రాంతాల్లోని ప్రజలను అంతగా ఆకర్షిస్తోంది.

  భౌతిక దాడులను భౌతికంగానే ఎదుర్కోవడం ఒక్కటే ఇలాంటి ఘోర చర్యలకు పరిష్కారం. ప్రజలలో విశాల ప్రాతిపదికన ఈ ప్రక్రియకు ఆమోదం లభిస్తే తప్ప ఇలాంటి చర్యలకు, ‘సంస్కృతీ పరిరక్షకుల’ దుశ్చర్యలకు అడ్డుకట్ట పడదు.

  ఈ వాస్తవాన్ని గుర్తించనంతవరకూ ఈ దేశంలో ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతమవుతూనే ఉంటాయి.

  దండకారణ్యంలో అయినా మహానగరంలో అయినా ఇలాంటి ఘోరాలకు ఒకటే పరిష్కారం. పోలీసు అధికారి కూతురయినా సరే ఇలాంటి దారుణ చర్యల నుండి న్యాయం పొందాలంటే ప్రజాకోర్టులో విచారణే సత్వర పరిష్కారం.

  అక్కడ తప్ప ఇంకెక్కడా ఈ దేశంలో సామాన్య ప్రజలకు న్యాయం సకాలంలో దొరకదు కాబట్టి.

 3. కదా వసంత్ గారూ, వారి చేష్టల ఫొటోలు చూడడానికీ, వాటి గురించి చదవడానికే మనకి ఇంత చిరాగ్గా ఉంటే ఈ దుర్మార్గాన్ని ప్రత్యక్షంగా అనుభవించినవారికి ఆ వెధవలపైన ఇంకెంత అసహ్యం వేసిందో మరి.

 4. “ఇంతవరకు ఏ హిందూ సంస్థకాని, హిందూ ఆధ్యాత్మిక గురువులు కాని తమ అభిప్రాయం చెప్పినట్లు లేదు”

  హిందూ ఆధ్యాత్మిక గురువుల మాట ఎవరు వింటారు? మీరు ఏ రోజుల్లో ఉన్నారు?

  “స్వేచ్ఛా దేశంలో మేమున్నామని నమ్మడం చాలా కష్టంగా ఉంది. నిస్సహాయ బాలికలపై ఎంత అఘాయిత్యానికి పాల్పడగలవో ”

  ఇప్పుడైనా అర్థమైంది ఈ దేశంలో ఉన్న స్వేచ్చ ఎమిటొ. రైత్లు, ఆదివాసులు, దళితులు, నిస్సహాయులు, డబ్బులు లేని వారి పై రోజు జరిగే అన్యాయలను పేపర్లో నెలకొకసారి చదివి, ఈ దేశ పరిస్థితిని అర్థం చేసుకొంటే ఈ దేశం లో ఎంత స్వేచ్చ ఉందో వారికి ఎప్పుడో అర్థమై ఉండేది. కాని ఈ దేశం గురించి, పక్కన సమాజంలో ఉండే వారి గురించి ఆలోచించటానికి వారికి తీరికేక్కడ? మధ్యతరగతి లో పుట్టి నిరంతరం డబ్బుల కోసం,కేరిర్ కోసం, కలల్లో,ఊహల్లో పెరుగుతూ ఊహించని ఈ సంఘటన వలన వారికి భారతదేశం అసలు స్వరూపం అర్థమై, పాపం షాక్ తిన్నట్టు ఉన్నారు. బహుశా ఆ పార్టి నిరాటంకంగా జరిగి ఉంటే వారికి ఈ దేశం భూలోక స్వర్గంగా కనిపించి ఉండేదేమో! స్వయంగా వారి పైన జరిగిన ఈ దాడి పైన కనీస న్యాయ పోరాటం కూడా చేయలేని, ఈచదువుకొన్న వ్యక్తులకి స్వేచ్చ గురించి మాట్లాడే హక్కేలేదు. ఎవరి స్వేచ్చ కోసం వారు పోరాడాలి, వారు సాధించుకోవాలి.

  మేమంతా 18 యేళ్ల వయసు మించిన పెద్దవారమే. మా పరిమితులు మాకు తెలుసు. మా ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని స్వయంగా వారే చెపుతూంటె మీరు నిస్సహాయ బాలికలని రాయటం లో అర్థమేమైన ఉందా?

  *ఎర్రబాబులుగా బ్లాగ్ లోకంలో నిందించబడుతున్నవారు కనీసం ఈ విషయంలో అయినా ఇతర విద్యార్థి సంఘాలకు భిన్నంగా, వేధించబడేవారికి సపోర్ట్‌గా నిలిచిన కాలమది. *

  రాజు గారు,
  ఎర్రబాబులుసపోర్ట్‌గా నిలిచిన కాలం లో కనీసం అమ్మాయిలకు కొంచెం సామాజిక స్ఫహ ఉండేది. ఇప్పుడు కాలేజిలో చదివే ఎంత మంది అమ్మాయిలకు ఉంది ఆ స్పృహ? ఈకాలం అమ్మాయిలు నోరు తెరిస్తే కన్స్యుమరిసం కంపు. ఏ మొబైల్ ఖరీదు ఎంత? ఏ మాల్ లో డిస్కౌంట్లు ఇస్తున్నారు? ఏ హోటల్ లో మంచి ఫుడ్ చిక్కుతుంది? ఏ మందును ఎలా కలుపుకొని తాగాలి? నా కోలిగ్ ఒక అమ్మాయి ఆఫీసు కేళ్లే కారులో హింది హీరొయిన్ నడుముదగ్గర ఒక ఇంచ్చే సైజ్ పెరిగిందని పేపర్లో రాస్తే దాని గురించి గంట మాట్లాడింది. ఆ హీరోయిన్ బాడిని పేరు వచ్చిన తరువాత సరిగా పెట్టుకోవటం లేదని తెగ వరి అయిపోయింది.

 5. రాజు గారు ,

  ఆరోజుల్లో చదివే అమ్మాయిలకు ఒక తపన, చదువుకొని ఎదో సాధించాలనే కోరిక, కనీసం ఇంట్లో వాళ్లకి భారం కాకుడదనే ఒక లక్ష్యం ఉండేవి. ఈ అమ్మాయిలకు ఏ లక్ష్యాలు ఉన్నాయో నాకు తెలియదు గాని, అంత చదువు, ఎంతో కొంత డబ్బులు గల వారు కనీస న్యాయపోరాటం చేయకుండా స్వేచ్చ గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పిరికివారని అర్థమౌతున్నాది.

 6. మీరు చెప్పినట్లు, ఒకప్పటిలాగా అన్నాలాంటి వారేవరైనా వారి కొరకు వచ్చి సహాయం చెస్తే, దానిని పొంది, వీరు వారికి ఒక థాంక్స్ చెప్పి ఎంచక్క జీవితం లో మంచి గా సెటిల్ అవుతారు. అన్నలు ప్రభుత్వంతో, సమాజం తో పోరాడుతూ వారి జీవితాలు దుర్భరంగా చేసుకొంటారు. ఎప్పుడో యంకౌంటర్ లో లేచి పోతారు. ఆ సమయానికి ఇటువంటి వారునడి వయసులో వాళ్ల పిల్లల చదువుల కొరకు తెగ ఆందోళన చెందుతూ, కనీసం చనిపోయిన అన్న గురించి ఒక్క నిముషం ఆలోచించే పరిస్థితి లో కూడ ఉండరు.

 7. *భౌతిక దాడులను భౌతికంగానే ఎదుర్కోవడం ఒక్కటే ఇలాంటి ఘోర చర్యలకు పరిష్కారం*

  రాజు గారు రాసిన ఈ మాట చదవలేదు. దీనితో నేను ఏకీభవిస్తా. కాని ఎవరి కి అన్యాయం జరిగిందో వారే పూనుకోవాలి ఆపనికి. ఎర్రబాబులు కాదు. వారు ఇప్పటివరకు ఎన్నో సహయాలు చేసిఉంటారు. లబ్ది పొందిన మధ్యతరగతి వర్గం లో వారిని గుర్తుంచుకొనే వాడు ఒక్కడు లేడు. మధ్యతరగస్తి వారందరు ఏరు దాటి కప్పను తగలేసేవారు. వాడు కొని వదిలేసే రకాలు.

 8. ‘ఏడాది పొడవునా గోడల మీద అశ్లీల పోస్టర్‌లు కనిపిస్తోంటే పట్టించుకోకుండా గాడిదలు తోలుతూ కాలక్షేపం చేసి, అప్పుడుడప్పుడూ పబ్‌ల మీద పడి దాడులు చేసి మత పరిరక్షకులమని చెప్పుకునే’వాళ్ళని చూస్తే చిరాకనిపించదా?

 9. శ్రీగారూ
  మీరు విస్తృతంగా చేసిన వ్యాఖ్యలను కాస్త ఆలస్యంగా చూస్తున్నాను. మొత్తం మీద మీ స్పందనను సానుకూలంగానే తీసుకుంటున్నాను. కాని మరింత స్పష్టత కోసం మీ వ్యాఖ్యలు కొన్నింటిపై ఇక్కడ స్పందిస్తున్నాను.

  “హిందూ ఆధ్యాత్మిక గురువుల మాట ఎవరు వింటారు? మీరు ఏ రోజుల్లో ఉన్నారు?”

  మనం ఏ రోజుల్లో ఉన్నా ఒకటి మాత్రం నిజం. మంగుళూరు దుర్ఘటన రాజకీయ పరమైనది కాకపోతే, మనదైన సంస్కృతిని కాపాడుకోవాలనే తపనతోటే హిందూ జాగరణ సంస్థ ప్రతినిధులు ఈ దారుణానికి పాల్పడి ఉంటే… ఇలాంటి కీచకత్వాల ద్వారా సంస్కృతిని ఎవరూ కాపాడుకోలేరనే సత్యాన్ని హిందూ ఆధ్యాత్మిక గురువులు నిర్దంద్వంగా ప్రకటించాలి. జరిగిన ఘటనపట్ల సిగ్గుతూ తలవంచిన సమాజానికి ఈ గురువులు తప్పనిసరిగా తమ న్యాయ స్పందనను తెలియపర్చాలి.

  కేవలం పబ్‌లలో పార్టీలు జరుపుకుంటున్నారు కాబట్టే ఇలాంటి హీన దాడులకు ఈ దేశ సంస్కృతీ పరిరక్షకులు పాల్పడుతున్నారనడానికి వీల్లేదు. ఇద్దరు స్త్రీపురుషులు కలిసి పార్కుకు వెళితే కూడా ఆమె బట్టలు వూడదీసి మన దేశ చరిత్రకు కళంకం తెస్తున్న ‘నీచాతినీచులు’ బలపడుతున్న సమాజం ఇది. పార్టీలో గొడవపడి ఆ గొడవను బయటి వీధుల్లోకి ఏ రూపంలోకి తీసుకొచ్చి వీరంగమాడారో మొన్ననే గౌహతి ఘటనలో చూశాం మనం. నిత్యం జరుగుతున్న ఇలాంటి ఘోరాలు సంస్కృతిని నిలబెడుతున్న సమాజంలో కాక సంస్కృతీ రాహిత్య సమాజంలో మాత్రమే జరుగుతాయి. సంస్కృతి పరిరక్షణ పేరిట జరుగుతున్న ఇలాంటి దారుణాలను కనీసం ఖండించే స్థాయిలో కూడా మన ఆధ్యాత్మిక వాదులు, గురువులు లేరంటే, కనీస మానవీయ స్పందనను కూడా ప్రకటించలేకపోతున్నారంటే హిందూ సమాజంగా చెప్పుకుంటున్నది ఇవ్వాళ నిజంగా చచ్చిపోయినట్లే లెక్క.

  బొందలపాటి గారి బ్లాగులో కురుచ దుస్తులపై జరిగిన చర్చలో గతంలోనే పేర్కొన్నట్లుగానే ఆర్ధిక వ్యవస్థను ప్రపంచీకరణకు, సామ్రాజ్యవాద ప్రయోజనాలకు పూర్తిగా తలుపులు బార్లా తెరిచిన రాజకీయ పార్టీయే నేడు హిందూత్వ పరిరక్షణ సంస్థల పేరిట నిర్లజ్జగా నాటకాలాడుతుండటమే పెద్ద బోగస్. పబ్‌ను క్లబ్‌ను మన ఇంటిముంగిటకే తీసుకొచ్చిన ఆర్థిక విధానాలపై మనం చేయి వేయం. కాని అవి తీసుకొచ్చిన కొత్త సంస్కృతి రూపాలపై మాత్రం ఎక్కడ లేని కుహనా చైతన్యంతో యుద్ధం ప్రకటిస్తాం. దేశంలో నిలువుదోపిడీకి లైసెన్స్ ఇచ్చేశాక అది తీసుకొచ్చే కొత్త సంస్కృతికి మాత్రం లైసెన్స్ ఇవ్వమంటూ ఇలాంటి దాడులకు పాల్పడటం ద్వారా ఈ పరిరక్షకులు తాము నమ్ముతున్న సంస్కృతిని కాపాడుకోలేరు.

  పబ్‌లలో పాల్గొంటున్న వారిపై కిరాతక ప్రవర్తన కాదు ప్రదర్శించవలసింది. ఆ పబ్‌ను, క్లబ్‌ను, బార్‌ను, లేకుండా చేయమనండి చాలు. ఆ క్లబ్‌ను పబ్‌ను నడిపే వాళ్లు కూడా మన సంస్కృతీ పరిరక్షకులలో ఎవరో ఒకరి బావో, బావమరిదో అయి ఉంటారు మరి. ఆస్తి సంబంధాలతో ముడిపడిన ఇలాంటి పనులకు మన ఘనతర సంస్కృతీ పరులు ఎవరూ ఇంతవరకూ ఈ దేశంలో పాల్పడినట్లు లేదు. దేశీయ రైతుల మూలుగులను పీల్చి వేస్తున్నాయంటూ కెఎఫ్‌సి, మోన్‌శాంటో వంటి సామ్రాజ్య వాద ఆహారోత్పత్తుల సంస్థలపై ఈ దేశ రైతులు పోరాడారు తప్పితే మన సంస్కృతీ పరిరక్షకుల కళ్లు మూసుకుపోయాయి మరి అప్పట్లో.

  వరుసగా జరుగుతున్న ఈ కిరాతక దాడుల వెనుక ఉద్దేశం సంస్కృతి పరిరక్షణ కానే కాదని స్పష్టమవుతోంది.

  మరోసారి…

  చెరబండరాజు మండే కలంతో రాసిన ‘వందేమాతరం’ కవిత గుర్తొస్తోంది.

  ఓ నా ప్రియమైన మాతృదేశమా
  తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
  దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
  అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
  సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
  ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
  కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
  ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నించున్న “భారతి” వమ్మా
  నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
  వందేమాతరం వందేమాతరం

  ఒంటి మీద గుడ్డలతో జండాలు కుట్టించి
  వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
  అప్పుతెచ్చి వేసిన మిద్దెల్లో
  కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
  ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
  ఓదార్చలేని శోకం నీది
  ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో
  వీధిన బడ్డసింగారం నీది
  అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
  వందేమాతరం వందేమాతరం.

  “మాతృదేశం పై విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు. భారతమాతకి “దైవత్వం” ఆపాదించి, ఆ దైవత్వం ఒక ప్రతీకగా వాడాడు చెరబండరాజు. ఆ దేవత అందం, యవ్వనం, ముఖ్యంగా శీలం గురించి జుగుప్స కలిగించే మాటలు వాడుతాడు.”

  మన నిజమైన సంస్కృతి, వేల సంవత్సరాలుగా సాగుతున్న మన జీవిత విధానమూ ఇక్కడ చస్తోంది నిజంగా.. సంస్కృతీ పరిరక్షకులకు నిజంగా చేవ ఉంటే, నిజాయితీ ఉంటే, దేశం పట్ల, ప్రజల బాధల పట్ల నిజమైన ప్రేమ ఉంటే వారి పోరాటం సాగవలసింది పబ్‌లలో పార్టీలు జరుపుకునే యువతీయువకులపై కాదు.

  అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన మన వ్యవస్థ మూలాలపై పోరాటం చేయాలి. ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న మహాకవి గురజాడ కవితా సారాంశమైన మనుషుల గురించి పట్టించుకోవాలి. అది నిజమైన సంస్కృతి పరిరక్షణలో భాగమవుతుంది.

  శ్రీ గారూ,
  ఇది మీకు క్లాస్ అనుకోకండి…

 10. ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు ఆలోచించాలి. ఏడాది పొడవునా వీధుల్లో గోడల మీద షకీలా సినిమాల పోస్టర్‌లు కనిపిస్తున్నప్పుడు లేని అభ్యంతరం కేవలం పబ్‌ల సంస్కృతి విషయంలోనే ఎందుకు ఉంది? వ్యాపారం కోసం నిర్మించే సినిమాలు చూసి ఎవరూ తమ సంస్కృతిని మార్చుకోరు అనే అభిప్రాయం వల్ల కావచ్చు. కానీ పక్క వీధిలోకి పబ్ వచ్చినప్పుడు మాత్రం సంస్కృతి మారిపోతోంది అనే భయం కలుగుతుంది. వ్యాపారం కోసమైనా సరే, అలా స్త్రీలని చెత్తగా చూపించడం తప్పే.

  ఈ కేస్‌లో చూస్తే రేవ్ పార్టీలు జరుపుకోకుండా కేవలం బర్త్ డే పార్టీలు జరుపుకునేవాళ్ళపై దాడులు చేసి తమది తాలిబాన్ తరహా భావజాలం అని నిరూపించుకుంటున్నారు.

 11. రాజుగారు,

  మీరు రాసింది ఆసాంత చదివాను. ఆధ్యాత్మిక వాదులు మీరనుకొన్నంత సమాజన్ని ప్రభవితం చేసేఏవారు, ప్రజలలో పలుకుబడి ఉన్నవాళ్లు కారు. వారి దగ్గర కి ఎవరైనా వస్తే నాలుగు మాటలు చెప్పి పంపిస్తూంటారు. సమాజం లో పలుకుబడి,డబ్బులున్న వాళ్లు వారి దగ్గరికి పోతూండటం వలన వారేదో గొప్ప వారుగా భ్రమిస్తుంటారు. ఈ విషయం పక్కన పేడితే ఈ రోజు ఏ. కృష్ణా రావు రాసిన వ్యాసం చదవండి. నాకైతే నేను నిన్న చెప్పాలనుకొన్న నా అభిప్రాయన్ని ఆయన మరింత విడమరచి,చక్కగా వివరిస్తూ మంచి వ్యాసం రాశారు.
  ఇక ప్రభుత్వం విదేశాలకు డొర్లు బార్లా తెరచి ఉండవచ్చు, కాని మన దేశానికి ప్రత్యేకమైన కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. అందరు కనీస సంస్కృతిక విలువలు పాటిస్తే యం.యన్.సి. కంపేనిల వ్యాపారాన్ని అట్లిస్ట్ కొన్ని సెగ్మెంట్లలో అడ్డుకోవచ్చు. అది వస్రాధారణలో జీన్స్, బ్రండేడ్ షర్ట్స్, ఆడవారి మేకప్ కొరకు వాడే సమాగ్రి, చిప్స్, కోక్ మొద|| వాటిని కుటుంబ పరిధిలో శాంతి యుతంగా పిల్లలను ఏడ్యుకేట్ చేయటం ద్వారా వాటిని చాలా వరకు అడ్డుకోవచ్చని నా అభిప్రాయం.

  మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించ గుడదా అనే వాదన చేస్తే , పైన చెప్పినట్లు అలా స్వేచ్చ కావాలను కొనేవారు, స్వేచ్చకొరకు వారే పోరాటం చేయాలి.

  విలువలేని ప్రపంచం – ఎ.కృష్ణారావు

  http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/aug/1/edit/1edit2&more=2012/aug/1/edit/editpagemain1&date=8/1/2012

 12. రాజు గారు ,

  కొన్నిసార్లు ఓటమిని మనస్పూర్తిగా అంగికరిస్తే అది విజయంగా మారుతుంది. ఎప్పుడైతే మధ్య తరగతి ప్రజలకి వారి అసలు స్థానం వారికి ఆర్థమౌతుందో (పై సంఘటనల లాంటివి ద్వారా),వారిని రక్షించటానికి ఎవరు లేరని తెలుసుకొంటారో, వారి పోరాటం వారే చేయాలో విరమించుకోవాలో నిర్ణయంతీసుకొంటారు. ఎక్కువమంది 99% విరమించుకొనే బాపతే ఉంట్టుంది. ఆతరువాత ఎవరి జాగ్రత్తలు వారు తీసుకొంటారు (intelligence means knowing our limitations also ). ఇవి అంతిమంగా మీరు చెప్పే కంపేనీల వస్తువుల పై మోజునుంచి వారిని బయటపడేస్తాయి. ఎప్పుడైతే ఆ కంపేనిలకి లాభాలు రావటం తగ్గుతాయొ, వారు రెండు-మూడూ సం||లలో తట్టా బుట్టా ఎత్తుకొని చెక్కేస్తారు. లాభాలు రాని చోటు వారు అదే పని గా పెట్టుబడులు పెట్టరు. అయినా సరే, కొంతమంది ఆశ చావక వ్యాపారం చేయాలంటే వారి వ్యాపారం కొరకు మనదేశ చట్టాలను మెరుగు పరచటానికి ప్రభుత్వం పైన ఒత్తిడి వారే తీసుకురావలసి ఉంట్టుంది. అప్పుడే ప్రభుత్వం నిజంగా స్పందిస్తుంది. ఇది ఒక విధంగా మంచిదేగా! మనలాంటి సామాన్యులు అయినదానికి కాని దానికి ఆవేశంగా స్పందిస్తుంటే పెద్ద లాభం లేదు.మనం ఉరకుంటే ఆ పోరాటం కంపేనిల వారు వాళ్ల ప్రాడక్ట్స్ అమ్మకాల కొరకు చేసుకోవలసి వస్తుంది. అది వారికి తలకు మించిన భారం, అందులో ఎన్నో చిక్కులు ఉంటాయి. కొన్నిసార్లు ఊరక కూచొని ఉండటం ఓటమి కాదని తెలుసుకోవాలి.

 13. శ్రీ గారూ,
  ధన్యవాదాలు. మీరు ఇచ్చిన లింకును ఉదయమే కథనంతో సహా ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్ నుంచి కాపీ చేసుకున్నాను. మళ్లీ మళ్లీ మననం చేసుకోవడానికి స్పూర్తిదాయకమైన ఇలాంటి పలు రచనలను గత కొన్ని సంవత్సరాలుగా సిస్టమ్‌లోకి కాపీ చేస్తూ భద్రపర్చుకుంటున్నాను. వాటిలో కొన్నిటిని నా మరో బ్లాగులో లింకులతో సహా సమయాన్ని బట్టి పోస్ట్ చేస్తూ వస్తున్నాను కూడా. కనీసం నా వరకైనా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

  “స్వేచ్చకొరకు వారే పోరాటం చేయాలి” మీ ప్రకటన నాకు సమ్మతమే. కాని వ్యక్తి స్వేచ్చకు విఘాతం పలికినప్పుడు స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఆటంకాలు కలిగినప్పుడు, అలాంటి వారి వ్యధకు నైతిక సమర్థన ఇవ్వవలసిన బాధ్యతం మొత్తం సమాజంపై ఉందనే భావనతో మీరూ ఏకీభవిస్తారనే అనుకుంటున్నాను. కృష్ణారావు గారి కథనం సకాలంలో, ససందర్భంగా వచ్చింది.

  ప్రవీణ్ గారూ,
  “ఏడాది పొడవునా వీధుల్లో గోడల మీద షకీలా సినిమాల పోస్టర్‌లు కనిపిస్తున్నప్పుడు లేని అభ్యంతరం కేవలం పబ్‌ల సంస్కృతి విషయంలోనే ఎందుకు ఉంది?”

  ఏకీభవిస్తున్నాను. ఓడిపోతున్నవారి ఏడుపుపాటగా మాత్రమే ఇలాంటి ఘటనలు చరిత్రలో మిగులుతాయి. నిజంగా మంచి సంస్కృతి కోసం తపన పడేవారు, సమాజం బాగుపడాలనుకునేవారు ఇలాంటి ఏడుపుగొట్టు చర్యలకు పాల్పడరు. తాలిబాన్‌లకు వారి మార్గమేదైనా, అమెరికా సామ్రాజ్యవాదాన్ని ధిక్కరించడం అనే ఒక రాజకీయ కారణమైనా ఉంది సాకుగా చెప్పుకోవడానికి. మన ఏడుపుగొట్టు చర్యలకు ఏదీ లేదు. అదే పెద్ద విషాదం. పూత మందు పూసి రాచకురుపుకు పరిష్కారం చూపాలనుకునే బాపతు పనికిమాలిన చర్యలివి.

 14. శ్రీగారూ,
  “ఆధ్యాత్మిక వాదులు మీరనుకొన్నంత సమాజాన్ని ప్రభావితం చేసేవారు, ప్రజలలో పలుకుబడి ఉన్నవాళ్లు కారు. వారి దగ్గర కి ఎవరైనా వస్తే నాలుగు మాటలు చెప్పి పంపిస్తూంటారు. సమాజం లో పలుకుబడి,డబ్బులున్న వాళ్లు వారి దగ్గరికి పోతూండటం వలన వారేదో గొప్ప వారుగా భ్రమిస్తుంటారు.”

  మీ అభిప్రాయం సమాజంలో అందరి అభిప్రాయమూ అయితే అంగీకరించడానికి సమస్యే లేదు. కాని ఎక్కడ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసినా, సభలు జరిపినా వేలకొద్దీ, లక్షల కొద్దీ జనం ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. వింటూనే విన్నారు. ఆధ్యాత్మిక గురువుల ప్రభావం అంతగా గిడసబారిపోయిందంటే నమ్మటం కష్టమేమో.. కాని ఈ గురువులకు ఇహ లోక సమస్యల కంటే పరలోక వ్యవహారాలే జీవికకు పనికి వస్తున్నాయి కాబట్టే నిజమైన సమస్యల పట్ల వాళ్లు ఎప్పటిలాగే కళ్లు మూసుకుని ఉండవచ్చు. లేదా సంస్కృతీ పరిరక్షక కీచకులు చేస్తున్న ఏడుపుగొట్టు చర్యలను లోపల్లోపల సమర్థిస్తూ అయినా ఉండవచ్చు. వీరినుంచి నైతిక ప్రకటనలు ఆశించటం కూడా తప్పే కాబోలు!

  “నా కోలిగ్ ఒక అమ్మాయి ఆఫీసు కేళ్లే కారులో హిందీ హీరొయిన్ నడుముదగ్గర ఒక ఇంచ్చే సైజ్ పెరిగిందని పేపర్లో రాస్తే దాని గురించి గంట మాట్లాడింది.”

  ఇంతకు ముందు మర్చిపోయాను. ఈ రకమైన స్వేచ్ఛ, ప్రపంచంలో ఏదైనా మాట్లాడే స్వేచ్చ ఇప్పటి సమాజంలో అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా ధారాళంగా సంక్రమించిందనుకుంటాను.

  మనసును కరిగించే ఒక మంచి పుస్తకం చదివి, హృదయాన్ని ఉద్వేగంతో ముంచెత్తే ఒక గొప్ప దృశ్యాన్ని సినిమాలో, నాటకంలో చూసి కన్నీళ్లు పెట్టే సాహిత్య, కళాత్మక సంస్కారం నేటి తరానికి అందుబాటులో లేదేమో.. మనసును కాకుండా శరీరాన్ని, ఇంద్రియాలను ఊగించే, ఉద్రేకపరిచే రకం కళలే కదా ఎటు చూసినా….

  నియోన్ లైట్ల వెలుగుల్లో మెరిసిపోయే రంగుల ప్రపంచంలోని సమస్త అవకాశాలను అందిన కాడికి కొల్లగొట్టడం లేదా జుర్రుకోవడం అనేది మన ఉన్నత మధ్యతరగతికి ఆయాచితంగా ఇప్పుడు లభిస్తోంది.

  దేశంలో కోట్లమంది ఇప్పటికీ కనీస ప్రాథమిక సౌకర్యాలకు కూడా నోచుకోకుండా జంతు సమాన జీవనంలో కూరుకుపోతుండగా మహానగరాల్లో సంపద విభ్రమ విలాసాలు నాగరిక ప్రపంచపు ఔన్నత్యాన్ని నిలువునా అభాస చేస్తున్నాయి.

  సంపదలు, సౌభాగ్యాలు, మానవ ఆకాంక్షల మధ్య ఇంత తారతమ్యం మన సమాజాన్ని ఇలాగే బతకనివ్వకపోవచ్చు,

  ఏదో ఒక రోజు ఈ వైభవోజ్వల విలాసాలు పెటిల్లున పేలిపోయే క్షణం రాకతప్పదు.

 15. >>>>>
  నా కోలిగ్ ఒక అమ్మాయి ఆఫీసు కేళ్లే కారులో హింది హీరొయిన్ నడుముదగ్గర ఒక ఇంచ్చే సైజ్ పెరిగిందని పేపర్లో రాస్తే దాని గురించి గంట మాట్లాడింది. ఆ హీరోయిన్ బాడిని పేరు వచ్చిన తరువాత సరిగా పెట్టుకోవటం లేదని తెగ వరి అయిపోయింది.
  >>>>>
  అదంతా వ్యాపార సంస్కృతి ప్రభావం. అలా మాట్లాడే అమ్మాయికైనా నిజ జీవితంలో నిక్కర్‌లు వేసుకుని పార్క్‌లకి వెళ్ళే ధైర్యం ఉంటుందని అనుకోను.

 16. “ఎక్కడ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసినా, సభలు జరిపినా వేలకొద్దీ, లక్షల కొద్దీ జనం ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. వింటూనే విన్నారు. ”

  ఇంటికన్నా గుడిపదిలమనే సమేత వినలేదా! అలా అటెండ్ అయ్యే వారిలో చాలా మందికి అదోక టైంపాస్. ప్రపంచంలో ఏ మత గ్రంథం తీసినా చాలా మంచి విషయాలు ఉంటాయి. చాలా మంది వ్యక్తులు తమ జీవితకాలంలో వాటిని చదివి ఉంటారు. ఆ పుస్తకాలు చదివిన వారు ఎంత మంది మారుతారు? అలా వారు మారిఉంటే భూలోకం ఎప్పుడో బాగుపడి ఉండేది. అంతేందుకు క్రైస్తవులు దేవుడుగా చెప్పే జీసస్ తో ఎంతో పరిచయం ఉన్న శిష్యులలో ఒకడు (పీటర్ అనుకొంటాను కరుణామయుడు సినేమా చూసి చాలా ఏళ్లు అయ్యింది.) రాజ భటులు నీకు జీసేస్ తెలుసా అని అడిగితే తెలియదు అని జీసెస్ ఆచూకి చెపుతాడు. ఆ భటులు జీసేస్ ను పట్టుకొని పోయి, శిలువ శిక్ష వేస్తారు. అంతలావు దేవుడు తో పక్కన ఉంట్టూ అన్ని రోజులు గడిపిన పీటరే మారలేదు, ప్రాణ భయం తో అబద్దం చెప్పి ప్రభువును పట్టిస్తడు. ఇక గంట సేపు ఉపన్యాసం వినేవారు మారుతారా? అలా ఎవరైనా మారారు అంటే, నిజంగా మారలనుకొన్న వారే మారుతారు. ఆధ్యాత్మిక గురువుల ఖండలన ప్రకటనల కన్నా ప్రభుత్వం తీసుకొనే చర్యల వలన మాత్రమే సమాజం లో మార్పులు వచ్చేది.

  *నాటకంలో చూసి కన్నీళ్లు పెట్టే సాహిత్య, కళాత్మక సంస్కారం నేటి తరానికి అందుబాటులో లేదేమో.. *

  నేటి తరానికి కావలసిన బీరును ప్రభుత్వం మంచి నీళ్ల కన్నా ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నాది కదా! ఇక సాహిత్యం ఎందుకు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s