‘బర్త్ డే పార్టీ’ లపై హిందూ సంస్కృతి పరిరక్షకుల అసభ్య దాడి, అరెస్టులు


హిందూ సంస్కృతిని పరిరక్షిస్తామంటూ బయలుదేరిన గుంపు కర్ణాటక లోని మంగుళూరులో మరోసారి వీరంగం ఆడింది. పుట్టిన రోజు పార్టీ జరుపుకుంటున్న యువతీ, యువకుల బృందం పై ‘హిందూ జాగరణ వేదిక’ కు చెందిన మూకలు దాడి చేసి విచక్షణారహితంగా చావబాదారు. పుట్టిన రోజు పార్టీ అని చెబుతున్నప్పటికీ వినకుండా మృగాల్లా ప్రవర్తించారు. అమ్మాయిలను తాకకూడని చోట తాకుతూ, జుట్టు పట్టి లాగుతూ, కొడుతూ నీచంగా ప్రవర్తించారు. హిందూ సంస్కృతి పరిరక్షణ పేరుతో భారతీయ సంస్కృతికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ కనీస ప్రజాస్వామిక విలువలకు సైతం తిలోదకాలిచ్చారు.

మంగుళూరు శివార్లలోని పాడిల్ వద్ద శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ‘మోర్నింగ్ మిస్ట్’ అనే హోమ్ స్టే భవనంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురు అబ్బాయిలు, మరో నలుగురు అమ్మాయిలు ఈ పార్టీ జరుపుకుంటున్నారు. యువతీ యువకులు ఉన్న గదిలోకి జొరబడిన మూకలు విచక్షణా రహితంగా కొట్టడం మొదలుపెట్టారు. వీడియో చానెళ్లను పిలిచి మరీ దాడి చేసినట్లు చానెళ్ళు ప్రసారం చేసిన దృశ్యాలను బట్టి స్పష్టం అవుతోంది. ఒక దశలో ఓ యువకుడు తాము బర్త్ డే పార్టీ జరుపుకుంటున్నామని బతిమాలుకుంటున్నప్పటికీ అతని కడుపులో గుద్దుతూ చితకబాదారనీ ‘ది హిందూ’ తెలిపింది. “మేము ఏమీ చేయలేదు” అని ఒక యువతి చెప్పడానికి ప్రయత్నిస్తుండగా, మూకలోని ఒకడు ఆ యువతిని చెంపపై శక్తికొద్దీ కొట్టడంతో ఆమె కూలిపోయింది. మరో క్లిప్ లో దాడి చేసినవారు ఒక యువతిని కిందపడేసి బర బరా ఈడ్చుకెళ్తున్న దృశ్యం రికార్డయింది.

ఇంకా దాడులు చేస్తాం

రేవ్ పార్టీ జరిగినట్లు హిందూ జాగరణ వేదిక (హెచ్.జె.వి) నాయకులు ఆరోపిస్తున్నారు. అది తమపని కాదంటూనే దాడిని సమర్ధిస్తున్నట్లు హెచ్.జె.వి రాష్ట్ర కన్వీనర్ జగదీష్ విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు. హెచ్.జె.వి నగర కోఆర్డినేటర్ సుభాష్ పాడిల్ దాడి చేసినవారిలో ఉన్నాడని అంగీకరిస్తూనే తమపని మాత్రం కాదని చెప్పుకున్నాడు. అనైతిక కార్యక్రమాలకు సమాజ స్పందనే దాడి అని చెబుతూ హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రజాందోళన చేస్తామని ప్రకటించాడు. పబ్స్, స్పా లు, రిసార్ట్ లు, హోమ్ స్టే లు, డిస్కో ధేక్ లను టార్గెట్ చేస్తామని కూడా ప్రకటించాడు.

రేవ్ పార్టీ ఆనవాళ్లే లేవు

అయితే అక్కడ రేవ్ పార్టీ జరిగిన ఆనవాళ్లే లేవని పోలీసు అధికారులు ప్రకటించారు. అడిషనల్ డి.జి.పి బిపిన్ గోపాల కృష్ణ హెచ్.జె.వి సంస్ధే దాడికి బాధ్యురాలని తెలిపాడు. అరెస్టు చేసిన ఎనిమిది మందీ వేదిక సభ్యులేనని తెలిపాడు. దాడిలో ఎంతమంది పాల్గొన్నదీ తెలియదని పోలీసులు చెబుతున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. దాడిని నిరసిస్తూ మంగుళూరులో విద్యార్ధి సంఘాలు బంద్ కు పిలుపిచ్చాయి. పోలీసుల నుండి సంఘటనపై నివేదిక కోరినట్లు వుమెన్ కమిషన్ చైర్ పర్సన్ మంజుల తెలిపీంది. స్త్రీ శిశు అభివృద్ధి విభాగం అధికారి కూడావిచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోరినట్లు ఆమె తెలిపీంది.

అమానవీయం

జరిగిన సంఘటన ‘అమానవీయం’ అని బి.జె.పి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించింది. దోషులను ఎవరినీ వదిలిపెట్టేది లేదని ప్రకటించింది. బి.జె.పి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తాయి. మోరల్ పోలీసింగ్ కు బి.జె.పి పార్టీయే కారణమని వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు ఆరోపించాయి. దానితో ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, ఉప ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి లతో కలిసి సమీక్ష నిర్వహించాడు. వివిధ విద్యార్ధి, మహిళా సంఘాలు ఆందోళనకు పిలుపివ్వడంతో  మంగుళూరులో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

“ప్రభుత్వం సంఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ అనుమతించేది లేదు” అని ముఖ్యమంత్రి ప్రకటించాడు. “ఇది అమానవీయ చర్య” అని హోమ్ మంత్రి అశోక్ ప్రకటించాడు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదని ఆయన నమ్మబలికాడు. వీడియో క్లిప్పింగ్ ల ద్వారా ఇతర నిందితులను గుర్తించి పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా వేదిక నాయకుల అరెస్టును ఖండిస్తూ హెచ్.జె.వి కార్యకర్తలు డి.సి.పి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సంస్కృతిని రక్షించడం కోసం యువతి, యువకులపై దాడి కరెక్టేనని వారు సమర్ధించారు.

పశువుల్లా ప్రవర్తించారు

‘మోర్నింగ్ మిస్ట్ హోమ్ స్టే’ లో ఆ రోజు వాస్తవానికి ఇద్దరి పుట్టిన రోజు పార్టీలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం నుండి నమిత పార్టీ కాగా సాయంత్రం 6 గం. నుండి మరో యువకుడి పార్టీ జరగాల్సి ఉంది. నమిత పుట్టిన రోజు పార్టీ మధ్యాహ్నం 2.30 కి మొదలయింది. తన ఫ్రెండు జాహ్నవి మరి కొందరితో కలిసి ఆమె సాయంత్రం వరకూ అక్కడే ఎంజాయ్ చేస్తూ గడిపింది. కేక్ కట్ చేస్తూ, ఫోటోలు తీసుకుంటూ వారు గడిపారు. 6.60 కి ఆమె పార్టీ ముగిసి మరొకరి పార్టీ ప్రారంభం కావాలి. 6.30 గంటలకి హిందూ సంస్కృతి పరిరక్షకులుగా చెప్పుకున్న మూకలు ఆ ఇంట్లోకి జొరబడ్డారు. “50 మంది వరకూ ఇంట్లోకి జొరబడి అకస్మాత్తుగా మమ్మల్ని కొట్టడం మొదలు పెట్టారు. వారి చర్యలకు ఏమాత్రం వివరణ ఇవ్వకపోగా, మేము చెప్పేది వినడానికి కూడా నిరాకరించారు” అని జాహ్నవి తెలిపింది. “వాళ్ళు నన్ను గట్టిగా కొట్టారు. మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉన్నారు. నా కడుపులో పిడి గుద్దులు గుద్దారు. నా శరీరంలో ప్రతి ఛోటా తాకారు. ఉద్దేశ్యపూర్వకంగానే తాకకూడని చోట పదే పదే తాకారు” అని ఆమె తెలిపింది.

ఇంట్లోకి మూకలు జొరబడడాన్ని నమిత ముందుగానే గమనించింది. తాను బాల్కనీ లో ఉండగా ఆమె మూకలను చూసింది. “చీకటి పడేలోపే ఇంటికి రావాలని తల్లిదండ్రులు చెప్పడంతో నేను వెళ్లిపోవడానికి రెడీ అవుతున్నాను. బాల్కనీ నుండి మేమున్న ఇంటివైపు దూసుకురావడాన్ని నేను చూశాను. నేను స్టోర్ రూమ్ గుండా వెళ్ళి గార్డెన్ లోకి దూకి కాంపౌండ్ వాల్ ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నించాను” అని నమిత హిందూ సంస్కృతీ పరిరక్షకుల దుర్మార్గాన్ని వివరించడానికి ప్రయత్నించింది. గుంపు నుండి కొంతమంది విడిపోయి నమిత వెంట పడ్డారు. ఆమె పార్టీలో మారిజువానా తిన్నదంటూ అరవడం మొదలు పెట్టారు. వారి ఆరోపణలను ఆమె తనకు చాతనైనంత గట్టిగా తిరస్కరిస్తుండగానే ఆమెను ‘కులట’ (prostitute) అంటూ అరుపులతో తిట్టిపోశారు.

“ఇతర అమ్మాయిలతో సహా నన్ను ఒక గదిలోకి లాక్కెళ్లారు. ఒక్కో అమ్మాయిపైనా కనీసం అయిదు మంది దాడి చేశారు. మమ్మల్ని బలవంతంగా కెమెరా ముందు కూర్చోబెట్టారు” అని నమిత తెలిపింది.  కెమెరాల ముందు పెరేడ్ చేశాక వారి ఆరోపణలకు అనుగుణంగా బలవంతంగా ఒక దృశ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నించారని ఆమే తెలిపింది. ఒక అబ్బాయిని చొక్కా ఊడబీకారనీ, బలవంతంగా బెడ్ పై పడుకోబెట్టారనీ తెలిపింది. అతని పక్కన తననూ, మరో అమ్మాయినీ తోసి కూర్చోబెట్టారని తెలిపింది. “వాళ్ళు అతని చొక్కా ఊడబీకారు.  మరొకరి పుట్టిన రోజుకోసం వచ్చినందున అతనెవరో కూడా మాకు తెలియదు. మేము బెడ్ పై ఉండగా పట్టుకున్నామని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని అర్ధమైంది” నమిత వివరించింది.

అమ్మాయిల్లో ఒకరు కోపంగా “ఏం జరుగుతోందిక్కడ?” అని ప్రశ్నించడంతో హిందూ సంస్కృతీ పరిరక్షకులు తట్టుకోలేకపోయారు. వెనువెంటనే ఆమెపై బూతుల వర్షం మొదలయింది. చెంపపై కొట్టడం కూడా జరిగిపోయింది. ఈ దృశ్యాన్ని టి.వి చానెళ్లు శనివారం, ఆదివారం పదే పదే ప్రసారం చేశాయి. యువతి సరిగ్గా కనపడకుండా బ్లర్ చేసి ప్రసారం చేయడం గుడ్డిలో మెల్ల. దాడి చేసిన వారి దుర్మార్గ తీవ్రతను కూడా ఈ దృశ్యం వీక్షకులకు విప్పి చూపింది. “ఆ తర్వాత ఆ అమ్మాయి ఏడ్వడం ఆపలేదు. మేము ఒక దగ్గరకి చేరి మునగదీసుకుని కెమెరా నుండి తప్పుకోవడానికి విఫల ప్రయత్నం చేశాము” అని జాహ్నవి తెలిపింది. (సంస్కృతీ పరిరక్షకుల సంస్కృతీ విధ్వంసం టపా చివర వీడియోలో చూడగలరు.)

షూటింగ్ ద మెసెంజర్

దాడి దృశ్యాన్ని చిత్రీకరించినవారిపైనా పోలీసులు కేసులు మోపారు. దాడి చేసిన మూకలపై మోపిన కేసులే టి.వి చానెల్ రిపోర్టర్ నవీన్ సూరింజే పైనా, కెమెరామెన్ శివకుమార్ పైనా మోపారు. ఇది మెసెంజర్ ని షూట్ చెయ్యడమేనని విలేఖరి నవీన్ అభివర్ణించాడు. తాను సంబంధిత పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసినా ఆయన ఎత్తలేదనీ, మరో చానెల్ విలేఖరికి చెప్పి పోలీసులకు చెప్పమని కూడా చెప్పాననీ అతనికి కూడా ఇన్స్పెక్టర్ దొరకలేదని నవీన్ ‘ది హిందూ’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు. దాడి జరిగాక మాత్రమే పోలీసులకి ఫోన్ చేశాననడం అవాస్తవమని నా ఫోన్ కాల్ రికార్డే దానికి సాక్ష్యమని ఆయన తెలిపాడు. దగ్గర్లోని మెకానిక్ నాకు సమాచారం ఇవ్వడంతో తాను అక్కడికి వచ్చాను తప్ప హెచ్.జె.వి తనము ముందుగా సమాచారం ఇచ్చిందనడం వాస్తవం కాదని, పోలీస్ కమిషనర్ సిటీలో లేకపోవడంతో ఆయనకి చెప్పడం కుదర్లేదనీ చెప్పాడు. కనీసం 70 మంది హెచ్.జె.వి కార్యకర్తలు దాడిలో పాల్గొన్నారని, మేమిద్దరమే దాడిని ఆపే పరిస్ధితి కాదని నవీన్ తెలిపాడు. ఇలాంటి మూకలు కుటుంబ సభ్యుల ముందు కూడా అనేకమందిని ఇలాగే వేధించినందున నా కుటుంబ సభ్యులైతే ఇలాగే చేసి ఉంటానా అన్న ప్రశ్న న్యాయం కాదన్నాడు.

అమ్మాయిలకు సాయం చెయ్యడానికే తాను ప్రయత్నించాననీ మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రతిరోజూ జరుగుతున్న ఇలాంటి నేరస్ధ సంఘటనలలో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నదీ వెల్లడించడమే తన ఉద్దేశ్యమని నవీన్ తెలిపాడు. “శనివారం రాత్రి ఫుటేజీ మీరు చూసినట్లయితే పోలీసులు స్పాట్ కి వచ్చాక కూడా దాడి చేస్తున్నవారిపై చర్యలేమీ తీసుకోని సంగతి మీరు గమనించవచ్చు. వారిని భద్రమైన చోటికి తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ అమ్మాయిలపై దాడిని కొనసాగించారు. అయినా పోలీసులు వారిని ఎదుర్కోలేదు. ఈ మొత్తం షాకింగ్ ఎపిసోడ్ ని నేను చిత్రీకరించకపోతే ఈ పరిరక్షకులపైన ఏ చర్యలూ ఉండేవి కావు. గత కొన్ని నెలల్లో దక్షిణ కన్నడ లో ఇలాంటి సంఘటనలు పెరిగిపోయిన విషయాన్ని కొద్ది మందే గమనిస్తున్నారు. ప్రతిసారీ బాధితులపైనే పోలీసులు అసభ్యత కేసులు నమోదు చేసి దాడులు చేసినవారిని వదిలేస్తున్నారు. పోలీసులు తమ విధి తాము నిర్వర్తిస్తే ఈ మూకలు ఇలాంటి దాడులు చేసేందుకు ధైర్యం చెయ్యరు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాన్ని మేము ఎత్తిచూపాం గనక వాళ్ళు మెసెంజర్ నే షూట్ చేయాలని భావిస్తున్నారు” అని నవీన్ వివరించాడు.

జరిగిన సంఘటనలో కాస్త సభ్యతగా ఉన్న దృశ్యాలను తాము చూపామే గాని తమ కళ్ళతో చూసి కూడా చిత్రీకరించడానికి మనసొప్పని దృశ్యాలు ఉన్నాయనీ, జరిగింది రేప్ కంటే తక్కువేమీ కాదనీ నవీన్ తెలిపాడు. తమ చిత్రీకరణ వలన బాధితులు సిగ్గుపడవలసిన అవసరం లేదనీ వారేమీ తప్పు చేయలేదనీ, అమ్మాయిలను అసభ్యంగా వేధించడమో, కొట్టడమో వారు చేయలేదనీ నవీన్ అన్నాడు. తమపై అక్రమ కేసు బనాయించడం వల్ల సమస్యేమీ లేదనీ తమ విజువల్స్ ద్వారా ఎనిమిది మంది నిందితులను గుర్తుపట్టి అరెస్టు చెయ్యడం తమకు సంతోషం కలిగించేదని నవీన్ ‘ది హిందూ’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు.

హిందూ తాలిబాన్లు

దక్షిణ కన్నడ జిల్లాకు ఇన్-చార్జి మంత్రిగా ఉన్న సి.టి.రవి సంఘటనను దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఐసోలేటేడ్ ఘటనగానే చూడాలి తప్ప రాజకీయం చెయ్యొద్దని కోరాడు. రాజకీయం చేస్తే వాస్తవం మరుగున పడుతుందని హెచ్చరించాడు. ఎవరిపైనైనా దాడి చేసే హక్కు ఇంకేవ్వరికీ లేదనీ ముఖ్యంగా మహిళలపై దాడి చేయరాదని ప్రకటించాడు. దాడి చేసినవారి ప్రవర్తన తాలిబాన్ తో పోలి ఉన్నదని విమర్శించాడు. నిందితులను పట్టుకుని అరెస్టు చెయ్యడానికి పోలీసులకు స్వేచ్చా ఇచ్చామని తెలిపాడు. స్వేచ్చా ఇచ్చామని చెబుతూనే ‘ప్రైమా ఫేసీ’ బట్టి చూస్తే దాడి పధకం ప్రకారం జరిగినదిగా కనపడట్లేదని పోలీసుల ముందరి కాళ్ళకు బంధం వేశాడు. పరిశోధనలో నిజం తేలుతుందంటూ సదరు పరిశోధన ఎలా ఉండబోతోందో చెప్పేశాడు. 70 మంది గుంపుగా వెళ్ళి చేసిన దాడి పధకం ప్రకారం కాకుండా ఇంకెలా జరుగుతుందో మంత్రివర్యులు చెప్పలేదు. ఆఫ్ఘనిస్ధాన్ మహిళల స్వేచ్చ కోసం గొంతు చించుకుంటూ దొంగ కన్నీళ్లు కార్చే కుహనా హిందూ మేధావులు సంస్కృతి పరిరక్షణ పేరుతో హిందూ మూకలు సాగిస్తున్న ఇలాంటి దుర్మార్గాలకు ఏ పేరు పెడతారో తెలియవలసి ఉంది. తాలిబాన్ చేస్తే మతోన్మాదం, హిందూ మతం పేరు చెప్పుకునే మూకలు చేస్తే ‘హిందూ సంస్కృతి పరిరక్షణ’ అనడం దయనీయమైన హిపోక్రసీ.

మంత్రుల నీలి లీలలు, ప్రభుత్వ రేవ్ పార్టీలు

కర్ణాటక ను ఏలుతున్న బి.జె.పి ప్రభుత్వానికి ఉన్న నీలి విశిష్టతలకు కొదవలేదు. ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకర్షించదానికని చెప్పి ‘ఇంటర్నేషనల్ మూజికల్ ఫెస్టివల్’ (The Spring Zouk Island Festival 2012) పేరుతో రాష్ట్ర టూరిజం మంత్రిత్వ శాఖ ఇక్కడ ‘రేవ్ పార్టీ’ ఏర్పాటు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో బి.జె.పి కి గట్టి పట్టు ఉన్న ఉడుపి లోనే మాల్పే తీరంలోని ‘సెయింట్ మేరీ ఐలాండ్’లో ఈ రేవ్ పార్టీ జరిగింది. అనేకవందల మంది ఫారెన్ జంటలు హాజరైన ఈ పార్టీలో సభ్యత, సంస్కారం అటుంచి ఏ విలువలూ మిగల్లేదని అప్పట్లో పత్రికలు విమర్శించాయి. గంజాయి, మారిజువానా లాంటి డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా ఉపయోగించారని తెలిపాయి. ఈ ఆరోపణలను ప్రభుత్వము, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో పాటు పోలీసు అధికారులంతా తిరస్కరించినప్పటికీ వేదిక సమీపంలో నివసిస్తున్న స్ధానికులు ఇచ్చిన వివరాలు ప్రజలను హతాశులు చేశాయి. విదేశీయులు అత్యంత పొదుపుగా దుస్తులు ధరించి ఉన్నారనీ, అర్ధ నగ్న స్ధితిలో విచ్చలవిడిగా తిరుగుతూ అంతా చూస్తుండగానే లైంగిక చేష్టలకి దిగారని వారు తెలిపారు. కొన్ని జంటలు అందరూ చూస్తుండగానే బహిరంగ లైంగిక కార్యకలాపాలకీ పాల్పడ్డారని తెలిపారు. భారతీయ జంటలతో పాటు వందల సంఖ్యలో విదేశీ జంటలు ఈ సంస్కృతీ ప్రదర్శనలో మునిగితేలారని పోలీసులు వారిపై ఏ చర్యలు తీసుకోలేక మిన్నకుండిపోయారని స్ధానికులను ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి.

ఇక కర్ణాటక ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు సాక్ష్యాత్తూ అసెంబ్లీలోనే నీలి చిత్రాలు చూస్తూ దొరికిపోవడం అందరికీ తెలిసిందే. విచిత్రమ్ ఏమిటంటే ఈ ఉడిపి రేవ్ పార్టీ గురించి అసెంబ్లీ లో చర్చ జరుగుతున్న సందర్భంలోనే అసెంబ్లీలో నీలి చిత్రాలు చూడవలసి వచ్చిందని సదరు మంత్రులు తమ సిగ్గుమాలిన చర్యను సమర్ధించుకోబోయారు. ముగ్గురు మంత్రులే అనుకుంటే ఆ తర్వాత పది మంది ఎమ్మెల్యేల వరకూ ఒకరి తర్వాత ఒకరు నీలి వీక్షణం కావించి తమ హిందూ సంస్కృతీ పరిరక్షణ ఎంత గొప్పదో చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇటీవలే గుజరాత్ లో కూడా అసెంబ్లీ జరుగుతుండగానే ఎమ్మేల్యేలు ఇద్దరు (ముగ్గురో మరి) ఇలాగే నీలి వీక్షణం కావిస్తూ కెమెరా కంటికి దొరికిపోయారు. సదరు విలేఖరి స్పీకర్ కి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యేని బైటికి పంపారే తప్ప చర్యలేవీ తీసుకోలేదు. కర్ణాటక నీలి మంత్రులు, ఎమ్మేల్యేల పై కూడా చర్యలేవీ లేవు. ఎమ్మేల్యేలు చూశారానడానికి సాక్ష్యాలు లేవని విచారణ ముగించినట్లు వార్తలు కూడా వచ్చాయి.

సోకాల్డ్ హిందూ సంస్కృతీ పరిరక్షకులు ఈ నీలి మంత్రులపైన దాడులేవీ చేయలేదు. కనీసం పత్రికాముఖంగా ఖండించిన పాపానికి కూడా పోయినట్లు లేదు. మంత్రులను మంత్రి పదవులను తొలగించి అదే శిక్ష అని సరిపెట్టుకున్నారే తప్ప హిందూ సంస్కృతికి కలిగిన గాయం గురించి గానీ, సంస్కృతికి మంత్రులు చేసిన ద్రోహం గురించి గానీ హెచ్.జె.వి, భజరంగ్ దళ్ లాంటి లాంటి సంస్ధలు దాడులు అటుంచి ఆందోళనైనా వ్యక్తం చేయలేదు. హిందూమత పరిరక్షణ కోసం వెయ్యి మందికి పైగా ముస్లింలను ఊచకోత కోయించిన గుజరాత్ ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యే దుష్కృత్యానికి శిక్షలేవీ విధించలేదు. మంగుళూరు లో అనేకమంది యువతీ, యువకులపై అనేకసార్లు దాడులు చేసినప్పటికీ హెచ్.జె.వి లాంటి సంస్ధలపై చర్యలేవీ లేవని విలేఖరి నవీన్ చేసిన ఆరోపణ ఎంత నిజమో బి.జె.పి ద్వంద్వ విధానాలు స్పష్టం చేస్తున్నాయి.

అధికారం కోసమే హిందూత్వ, సంస్కృతికోసం కాదు

నిజానికి బి.జె.పి కి గానీ ఇతర హిందూమతోన్మాద సంస్ధలకు గానీ కావలసింది హిందూ సంస్కృతీ కాదు. ఆ పేరుతో వచ్చే అధికారం వాటికి కావాలి. ఈ దేశంలో ని రాజకీయ పార్టీలన్నీ పశ్చిమ దేశాల కంపెనీల కోసం, వారు పడవేసే కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నవే. ఈ దేశ సంపదలు ఈ దేశ ప్రజలకే దక్కాలన్న నిబద్ధత వీరికి లేనే లేదు. దేశ ప్రజలు ఏమైపోయినా సరే, దేశ సంపదలు విదేశీ కంపెనీలు కొల్లగొడుతున్నా సరే… వారు విదిల్చే ఎంగిలి మెతుకుల కోసం పోటీ పడడమే వీరి నైజం. భారత దేశ వనరులను మనమే దోచుకుందాం అన్న నిబద్ధత కూడా భారత పెట్టుబడిదారులకు లేదు. సోనియా విదేశీయత పైన గొంతు చించుకోవడమే తప్ప అసలు కాంగ్రెస్ పార్టీయే విదేశీయులు నిర్మించిన పార్టీ అనీ, అందులో జాతీయత ఏ కోశానా లేదనీ దేశ వనరులను పశ్చిమ దేశాలకు తాకట్టుపెట్టడమే అది దశాబ్దాలుగా చేస్తున్న పని పనీ వీరెప్పుడూ గమనించినట్లు కనపడదు.

అందుకోసమే అలాంటి అధికారంలో భాగం కోసం, వాటా కోసం పోటీ పడుతున్న బి.జె.పి లాంటి పార్టీలు ‘హిందూ మతం’ అంటూ రెచ్చగొట్టగానే కొందరు యువకులు  ఆ మాయలో పడిపోతున్నారు. వీరు గమనించవలసిన ముఖ్య విషయం కాంగ్రెస్ కూ, బి.జె.పి కీ తేడా ఏమీ లేదని. ఇద్దరివీ ఒకే ఆర్ధిక విధానాలని వీరు గుర్తించవలసి ఉంది. ఒకే ఆర్ధిక విధానాలు కనుక ప్రజల అవసరాలు తీర్చడంలో భిన్నత్వాన్ని కనబరిచే అవకాశం బి.జె.పి కి లేదు. కానీ తాను కాంగ్రెస్ కంటే భిన్నమైన పార్టీ అని చూపించుకోవాలి. అందుకోసమే వారికి ‘హిందూత్వ’ కావాలి. ఆ పేరుతో జమకూడే ప్రజల ఓట్లు కావాలి. ఓట్ల కోసం నిరంతరం ఏదో ఒక పేరుతో హిందూ సెంటిమెంట్లను రెచ్చగొడుతూ  ప్రజల మధ్య తగువులు పెట్టి పబ్బం గడుపుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. హిందూత్వ పేరుతో ఎన్ని సంస్ధలు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా అధికారం కోసం, అధికారం ద్వారా వచ్చిపడే పశ్చిమ దేశాల సాంగత్యం కోసమేనని గుర్తించాలి. లేదంటే హిందూత్వ పేరుతో సృష్టించబడుతున్న మారణహోమంలో, ఆర్ధిక దోపిడిలో, శ్రామిక అణచివేతలో సమిధలుగా మిగిలిపోక తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s