స్త్రీలపై అత్యాచారాలు, కురచ దుస్తులు, ఒక పరిశీలన


 

(స్త్రీల వస్త్రధారణ వారిపై అత్యాచారాలకు ఒక కారణం అంటూ డి.జి.పి దినేష్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా బొందలపాటిగారు తన కోణంలో విశ్లేషిస్తూ ఒక టపా డిసెంబర్ 29 తేదీన రాశారు. సదరు టపా కు స్పందనగా మిత్రులు రాజశేఖర్ రాజు గారు చేసిన వ్యాఖ్యానం అద్భుతం. ఆయన చేసిన విశ్లేషణకు మరింత వెలుగు కల్పించవలసిన అవసరం ఉంది. అందుకే ఆయన వ్యాఖ్యలలోని ప్రధాన భాగాన్ని టపాగా మారుస్తున్నాను.  రాజశేఖర్ రాజు, బొందలపాటి గార్ల అనుమతి ఉన్నదని భావిస్తూ స్వతంత్రించి ఈ పని చేస్తున్నాను. -విశేఖర్)

*   *   *   *   *   *

పురుషులు అర్ధదిగంబరంగా ఉన్నా, నిక్కరు మాత్రమే వేసుకుని పనులు చేసుకుంటున్నా కనిపించని, అనిపించని అసభ్యత ఒక్క స్త్రీల దుస్తుల విషయంలో మాత్రమే కనిపించడంలోనే ఎక్కడో హిపోక్రసీ దాగి ఉంటోందనిపిస్తోంది.

దాదాపు 20 సంవత్సరాల క్రితం సుప్రభాతం అనే పత్రికలో అమెరికా నుంచి విశాఖపట్నంకు వచ్చి పరిశోధన చేస్తున్న కొంతమంది యువతీ యువకులను ఇంటర్వ్యూ చేశారు. వాళ్లు తెలుగు నేర్చుకుని మహాప్రస్థానం, కొయ్యగుర్రం వంటి ఆధునిక కావ్యాలను కూడా చదివి ఆకళింపు చేసుకున్నంత ప్రతిభావంతులు.

వాళ్లలో ఒకమ్మాయిని ఆ జర్నలిస్టు ప్రశ్న అడిగారు. ‘ఇండియాలో మీకు నచ్చింది, నచ్చనిది ఏమిటి?’ అని. “ఇండియాలో నచ్చినది ఇక్కడి వారిలో కనిపించే ఆత్మీయ భావం అయితే నచ్చనిది ఏమిటంటే విదేశీయులను ముఖ్యంగా మహిళలను తేరిపార చూడటం. అదేదో మానవేతర పదార్ధాన్ని చూస్తున్నట్లు ఎగాదిగా చూడటం చాలా ఎంబ్రాసింగ్‌గా ఉంటుంద”ని ఆ అమ్మాయి చెప్పింది.

పాశ్చాత్య సంస్కృతిలో మన కళ్లకు ఎంత అభ్యంతరకరమైన విషయాలయినా కనబడవచ్చు. కాని దుస్తులను బట్టి వ్యక్తులను ముఖ్యంగా మహిళలను అంచనా వేయడం, ముఖ్యంగా ఆ అమ్మాయి చెప్పినట్లు తేరిపార చూడటం, ఇంకా పచ్చిగా చెప్పాలంటే తినేసేలా చూడటం.. ఆ సమాజంలో చాలా తక్కువ స్థాయిలో ఉందనిపిస్తుంది.

పెన్సిల్ కట్ దుస్తులు వేసుకుని ఆఫీసుకు వస్తున్న ఒక నవయువతిని చూసి తట్టుకోలేక పోతున్నామని గత ఈ సంవత్సరం మొదట్లో అమెరికాలోనే అనుకుంటాను.. ఒక ఆఫీసులో మగమహారాజులు ఆరోపిస్తే వారికి మద్దతుగా యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం పెద్ద సంచలన వార్త అయిపోయింది. ఇదేం అన్యాయం అంటూ ఆమె యాజమాన్యాన్ని కోర్టుకు ఈడ్చిందనుకోండి.

ఇలాగే ఉద్యోగ మహిళల గురించి అమెరికాలోనే ఒక నగరమేయర్ కువ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యాడని చదివాను. ఎక్స్‌పోజింగ్‌గా బట్టలేసుకుంటేనే అమ్మాయిలను రేప్ చేస్తున్నామని ఇంతవరకు అలాంటి చర్యలకు పాల్పడి ప్రపంచవ్యాప్తంగా దొరికిన వారు తమను సమర్థించుకున్నట్లు నేనయితే ఒక్క ఘటనలోనూ చదవలేదు. వినలేదు.

అత్యాచారం చేయడం, బలహీనులపై శారీరకంగా, మానసికంగా దౌర్జన్యం చేయడం వంటివి అర్ధనగ్న దుస్తులు వేసుకోవడం, వేసుకోకపోవడంపై ఆధారపడి జరగటం లేదని నా విశ్వాసం.

దానికి పురుషస్వామ్యం అనండి.. లేదా ఆపోజిట్ సెక్స్‌ని బలవంతంగా లోబర్చుకోవడం అనే ఆదిమకాలం నుంచి నేటి వరకు కొనసాగుతూ వస్తున్న జంతుప్రవృతి మనలో ఈనాటికీ ఆదిమరూపంలోనే కొనసాగుతోందని చెప్పండి. ఏ పేరుతో అయినా పిలవండి. కాని దీనికి మన చుట్టూ కొనసాగుతున్న సామాజిక కారణాలే తప్పితే వస్త్రధారణ లేకుంటే మరేదో సబ్జెక్టివ్ అంశాలు కారణం కావని నేననుకుంటున్నాను.

మన ప్రబంధాలలో మహిళ అంగాంగాన్ని వర్ణిస్తూ ఆమెను నగ్నంగా కవి నిలబెట్టినప్పుడు, అద్భుతమైన కావ్యశైలితో మహిళ అవయవాలను కావ్యరూపంలో ప్రదర్శించినప్పుడు వాటిని అసభ్యమని మనం ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే రాజులూ, రాజరికాలు కావ్యకన్యకలను అంకితంగా పుచ్చుకుని కవులకు నజరానాలు ఇచ్చిన కాలంలో రాజుల భోగలాలసత్వానికి ప్రతీకగానే ప్రబంధాలు మహిళల అంగాగాన్ని అక్షరాలలో ఆరబోశాయి. ఇలాంటి వర్ణనలను క్షుద్ర సాహిత్యమంటూ ఇప్పుడు విమర్శిస్తున్నప్పటికీ టోకున ప్రబంధ కావ్యాలను నిషేధించమని ఎవరూ కోరడం లేదు. అలా కోరడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని కూడా చెప్పలేము.

కాని ఇప్పుడు ఆధునిక సమాజం పేరుతో మన అంగాంగాలనే కాకుండా ఇటీవలి వరకు మనం లోపలే దాచుకున్న మన లైంగిక ఇంద్రియానుభూతులను కూడా బహిరంగంగా వ్యక్తీకరించుకునే రకం సంస్కృతి సినిమాల రూపంలో, టీవీ షోల రూపంలో, సాహిత్యం రూపంలో వచ్చాక, ఈ తరహా ఆధునిక సంస్కృతికి మనమంతా దాసోహమవడం జరిగిపోయాక మహిళల వస్త్రధారణ మాత్రమే తప్పయిపోయి సమాజంలో అడుగు పెట్టిన ఇతర అసభ్యకర అంశాలు, ప్రవర్తనలూ తప్పు కాకుండా పోతాయా?

ఇన్నాళ్లుగా మనదీ అని మనం అనుకున్న లేదా అలా అనుకుని భ్రమించిన సాంస్కృతిక జీవిత విలువలన్నింటినీ ఊడ్చిపారవేస్తున్న కొత్త సంస్కృతికి సంబంధించిన అన్ని అంశాలను ఈ దేశంలోకి ప్రవేశపెట్టి, అన్ని రకాలుగా ఆ కొత్త సంస్కృతికి సకల అనుమతులను మంజూరు చేసిన మన ఆర్థిక, పాలనా విధానాలను ప్రశ్నించకుండా, ఎదిరించకుండా కేవలం మహిళల వస్త్రధారణ కారణంగా పురుషుడి బుద్ధి మకిలి పట్టిపోతోందని వాపోవడం కంటే బోలుతనం మనలో ఇంకొకటి లేదనుకుంటాను.

“స్వతంత్ర దేవత కలకత్తా కాళిక కంటే భయంకరమైనది.. అది స్వేచ్ఛను కోరుతుంది…” అని 80 ఏళ్ల క్రితమే చలంగారు “స్త్రీ” అనే వ్యాస సంపుటిలో ప్రకటించారు. మనిషి స్వేచ్ఛను కోరుకోవడం ప్రారంభయమయ్యాక, మహిళ స్వేచ్చను కోరుకోకుండా ఉంటుందా? ఆధునికత పేరుతో అన్ని అలవాట్లను, అవకాశాలను, ఆకాంక్షలను మనవిగా చేసుకుని ఒక్క వస్త్రధారణ మాత్రమే అదీ మహిళ వస్త్రధారణ మాత్రమే అభ్యంతరకరం అంటే భావ్యమేనా?

ఒక్కటి మాత్రం నిజం. ఏదయితే ప్రజల సంస్కృతి అని అనుకుంటున్నామో ఆ ప్రజా సంస్కృతికి ఇవ్వాళ అన్ని రకాలుగా తూట్లు పడుతున్న సమాజంలో మనం జీవిస్తున్నాం. మనది ఇప్పుడు అక్షరాలా పాపులర్ సంస్కృతి.. పాప్ సంస్కృతి… ర్యాంప్ సంస్కృతి.. రాక్ సంస్కృతి, షోల -ప్రదర్శనల- సంస్కృతి… మన సంస్కృతి అని మనం దేన్నయితే గొప్పదిగా భావిస్తున్నామో దాన్ని నిలబెట్టవలసిన పూర్తి బాధ్యత మహిళలపైనే ఉందని చెప్పడం, అలా కోరుకోవడం న్యాయం కాదనుకుంటాను.

న్యాయం విషయం పక్కన పెట్టండి. మన సమాజంలో గత పాతికేళ్లకు ముందుగా మొదలైపోయిన ఈ తరహా కొత్త సంస్కృతి సమాజాన్ని మొత్తంగా ఆవహించేసింది. అన్ని రకాలుగా తలుపులు తెరిచేశాం మనం. బయటి నుంచి వచ్చి పడుతున్న ఈ కొత్త తరహా ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవిత విధానం మనకు అలవాటయి పోయాక, సామూహికంగా మనం దాన్ని ఆమోదించేశాక ఇలా ఉండకూడదు, ఇలా ధరించకూడదు అని సాక్షాత్తూ డీజీపీయే వాకృచ్చినా, పావనిగారన్నట్లు “అలా చెప్పేవాడు అన్నా అయినా, రాష్ట్రపతైనా, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తైనా, శంకరగిరి పీఠాధిపతులైనా…శంకరగిరి మన్యాలు పట్టిపోవాల్సిందే.” తప్పదు.

ఇప్పుడు వచ్చిపడుతున్న పాపులర్ సంస్కృతి యూరప్, అమెరికాల్లో దశాబ్దాల క్రితమే ఆ సమాజాలను ఆవహించేసింది. మన సమాజంలోకి ఇటీవలే అడుగుపెట్టింది. రావడం లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చిన, వస్తున్న దాని ప్రకంపనలకు మనం కదిలిపోతున్నాము. ఇది మంచిది కాదనుకుంటే, ఇది స్త్రీపురుషులకు ఇరువురికీ కూడా మంచిది కాదనే అర్థం. దీన్ని మంచిది కాదని, మనకు వద్దని అనుకుంటే దీనికంటే మంచి సంస్కృతిని మనం కోరుకోవాలి. బయటినుంచి దూసుకు వస్తున్న ఈ కొత్త సంస్కృతి మన సంస్కృతి కాదు, ప్రజా సంస్కృతి కాదు.. అనుకుంటే దానికి అనుగుణంగా మారవలసిన అవసరం, బాధ్యత స్త్రీపురుషులివురిపైనా ఉంది.

*   *   *   *   *   *

పెళ్లికాకముందువరకు నాగరిక దుస్తులతో మెరిసి, పెళ్లయ్యాక పరమ పవిత్రంగా మారిపోయే భారతీయ సినీ హీరోయిన్ల పోకడల వెనుక దాగిన సంస్కృతి గురించి హరిపురుషోత్తమ రావు గారనుకుంటాను 20 ఏళ్ల క్రితమే ఒక వ్యాసంలో అద్భుతంగా విశ్లేషించారు. అయినా మనలో మన మాట.. సినిమాల్లో యువతుల చేత జీన్స్ వేయిస్తున్నది, పెళ్లి తర్వాత వాళ్లను చీరల్లోకి దింపుతున్నదీ ఎవరంటారు.

ఇంకో కోణం. హీరోయిన్ రెబెల్‌గా పొగురుమోతుగా ఉన్నంతవరకు షర్టు, ప్యాంటులో వెలిగిపోతుంది. దర్శకుడు ఆమె పొగరు తగ్గించిన తర్వాత, ప్రాయశ్చిత్తపు దశలోకి ఆమె జీవితాన్ని దింపేసిన తర్వాత రంగంలోకి చీర ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా లేదనుకోండి.

మనం పూర్తిగా భూస్వామ్య సమాజంలోనూ లేము. పెట్టుబడిదారీ సమాజంలోనూ లేము. రెండూ పెనవేసుకుపోయిన కృతక సంస్కృతీ సమాజంలో ఉంటున్నాము. ఎవరి బాధ వారిదే మరి. ఎంత వద్దనుకుంటున్నా పరిభాష వచ్చేస్తోంది. తప్పదు.

అయినా మరీ వింత కాకపోతే..

శతాబ్దాలు ఇంట్లోనే ఉండిపోయిన ఆడది బయటకు వచ్చాక, రప్పించబడ్డాక ఇక చీర, ప్యాంటు ఏది కడితే ఏంటట సమాజానికి? ఎందుకీ అనవసర అభ్యంతరాలు? మహిళల పట్ల అంతర్గతంగా ఏదో పవిత్రకోణం లాంటిది మనల్నందరినీ వెంటాడుతోందనుకుంటాను. డీజీపీ గారే ఈ బుట్టలో పడిపోయారు. మామూలు మనుషులెంతండీ ఇక.

*   *   *   *   *   *

“ఎంత అశ్లీల దుస్తులు వేసుకున్నా భావజాలం మారదు.” (ప్రవీణ్ వ్యాఖ్య) చలం గారు దీన్నే మరోలా అన్నారు. నవీన స్త్రీ వేషంలో మారుతోంది కాని ఆత్మలో మారడంలేదు అని. ఆయన చెప్పిన సందర్భం వేరనుకోండి.

“కులం, కట్నం వంటి మూఢాచారాలు పోకుండానే ఆడవాళ్లు నిక్కర్లు వేసుకోవడం వంటి ఆధునిక అనాగరిక ఆచారాలు వచ్చేస్తాయని అనుకోను” అనే మీ (ప్రవీణ్) వ్యాఖ్య సూత్రరీత్యా సరైనదే. కాని ఈ కొత్త తరహా సంస్కృతి నగరాల్లో శరవేగంగా కింది వర్గాల్లో కూడా పాకుతోంది. ‘పాలకుల సంస్కృతి పాలితుల వరకూ పాకుతుంది’ చందాన ఇది కూడా సహజ పరిణామంగా మారిపోతోంది.

నా ఉద్దేశంలో పాపులర్ సంస్కృతి వద్దు అని అనుకున్నా మన సమాజ గమనం అటువైపే పోతోంది కాబట్టి ఎవరూ ఇప్పుడు ఏమీ చెయ్యలేరు. మూడేళ్ల క్రితం ఇలా వాలంటైన్స్ డే జంటలకు వ్యతిరేకంగా సాంప్రదాయవాదులు పెద్ద ఎత్తున బలవంతపు పెళ్లిళ్లు కూడా చేసి హడలగొట్టారు కాని మరుసటి ఏడుకే చప్పబడిపోయారు.

అందుకే నదిలో పాయను ఆపడం, అడ్డుకోవడం సులభమే కాని వెల్లువను ఆపటం సాధ్యం కాదు. కొత్త సంస్కృతి వెల్లువలా దూసుకొస్తోంది. దీంట్లో మహిళలపై అది వేస్తున్న ప్రభావం మాత్రమే చేదు అంటే కుదరదు కదా. ఇప్పటికే పురుషులు పంచ, కండువా ధరించడం 90 శాతం నిలిచిపోయింది. పురుషులుగా మనం చాలా మారాం. కాని మహిళల్లో మార్పు చాలా లేటెస్టుగా వస్తున్న మార్పు. దీనికే మనం తట్టుకోలేకపోతున్నాము.

అయినా చూసే చూపు ఏ దృష్టితో ఉంది అనేది ముఖ్యం కాని యవతులు చీర, చుడిదార్ ధరించడం.. అర్ధ దుస్తులు ధరించడం అనేది ముఖ్యం కాదనుకుంటాను.

ఏం! మనం మారుతున్నామా..! ఇంట్లో, బయటా అడ్డదిడ్డంగా, మహా మురికితో, ఇష్టమొచ్చినట్లుగా మగాడు వ్యవహరిస్తున్నప్పుడు ఆడవాళ్లు పడ్డారు, భరించారు కదా..

రంగనాయకమ్మ గారు జానకివిముక్తి నవలలో డ్రాయరుతో ఉన్న వెంకట్రావును పట్టుకుని సత్యం చేత చడా మడా ఉతికేశారు కదా. మహిళల్లో మన పట్ల, మన మురికి పట్ల ఇంకా ఎంత అసహ్యం పేరకుపోయి ఉందో వాళ్లు బయటపడితే కదా తెలిసేది.

===========================

బొందలపాటి ఆర్టికల్ కింద స్వప్న గారి స్పందన కూడా అద్భుత రీతిలో కొనసాగింది. ఆమె ఆంగ్ల వ్యాఖ్యలను కూడా అనువాదం చేసి మరో పోస్టు గా చేయాలని ఉంది. కానీ ఆమెతో నాకు పరిచయం లేనందున ఆ పని చేయలేకున్నాను. ఒక వేళ ఆమె ఈ పోస్టు చదివి నాకు అనుమతి ఇచ్చినట్లయితే ఆమె వ్యాఖ్యలను అనువాదం చేసి పోస్టు గా ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె వ్యాఖ్యలోని ఒక వాక్యాన్ని స్వతంత్రించి పునరుల్లేఖిస్తున్నాను.

“A Rape is more about power and domination than sex. “

ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. స్త్రీల వస్త్రధారణ గురించీ, అత్యాచారాల చుట్టూ అల్లుకుని ఉన్న ‘social stigma’ ల గురించీ, అత్యాచారాలకు దారితీస్తున్న సామాజిక పరిస్ధితుల గురించీ చాలా చక్కగా స్వప్న గారు వివరించారు. ఆమెకు నా అభినందనలు.

(క్రితం టపాకి స్పందనగా ప్రవీణ్ గారు ఇచ్చిన లింకు ద్వారా బొందలపాటి గారి టపా, దానికింద జరిగిన చర్చను చూడడం తటస్ధించింది. ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు -విశేఖర్)

13 thoughts on “స్త్రీలపై అత్యాచారాలు, కురచ దుస్తులు, ఒక పరిశీలన

 1. స్వప్న గారికి తెలుగు టైపింగ్ రాదు. ఆవిడకి ‘లేఖిని‌’ ఉపకరణాన్ని నేనే పరిచయం చేశాను. నేనైతే ఫైర్‌ఫాక్స్ ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్‌టెన్షన్‌తో తెలుగు టైపింగ్ చేసేస్తుంటాను. కానీ ఆఫీస్‌లో ఉన్నప్పుడు లేఖిని ఓపెన్ చేసి టైప్ చేసి, మళ్ళీ పేస్ట్ చెయ్యడం అదంతా కష్టం కదా. అందుకే ఆవిడ ఇంగ్లిష్‌లోనే వ్యాఖ్యలు వ్రాస్తుంటారు.

  రాజశేఖర్ గారి వ్యాఖ్యలపై నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అవేమిటంటే మగవాళ్ళు ఎవరూ నిక్కర్ వేసుకుని ఆఫీస్‌లకి వెళ్ళరు. నేను HDFC బ్యాంక్‌కి వెళ్ళే రోజులలో ఆ బ్యాంక్‌లోని మగ ఉద్యోగులు లేత నీలం రంగు చొక్కా, ముదురు రంగు ప్యాంట్ వేసుకుని బ్యాంక్‌కి వచ్చేవాళ్ళు. ఆ బ్యాంక్‌లోని మహిళా ఉద్యోగులు చూడీదార్-సల్వార్ వేసుకుని వచ్చేవాళ్ళు. సినిమాలలో చూపించినట్టుగా నిక్కర్‌లు లేదా మిడ్డీలు వేసుకుని ఎవరూ రాలేదు. ఎందుకంటే పబ్లిక్ డికోరం అనేది ఒకటి ఉంటుంది. HDFCలో మగ ఉద్యోగైనా లేత నీలం రంగు చొక్కా వేసుకోకుండా టి-షర్ట్, నిక్కర్ వేసుకుని ఆఫీస్‌కి వెళ్తే అతని ఉద్యోగం పోతుంది. ఆఫీస్‌కి డీసెంట్ వేషంలో వెళ్ళేవాళ్ళే ఇంటిలో మాత్రం ఎంత చెత్త గెటప్‌లో ఉన్నా ఫర్వా లేదని అనుకుంటారు.

 2. ప్రవీణ్ గారు, మీ గురువు స్వప్న గారు, ఈ స్వప్న గారు ఒకరేనా? ఒకరే అయితే పైన నేను కోరిన పర్మిషన్ ఆవిడ నుండి సంపాదిస్తే నేను అనువాదం చేసి ప్రచురిస్తాను. ఆ ప్రయత్నం చేయగలరేమో చూడండి.

 3. ఆవిడ మా గురువు స్వప్న గారే. ఇండియాలో పగటి పూటైతే కెనడాలో రాత్రి పూట అవుతుంది. ఇక్కడ రాత్రి అయిన టైమ్‌లోనే నేను కాంటాక్ట్ చెయ్యగలను.

 4. ఇక్కడ భావజాలంలో వ్యక్తివాదం స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న పిల్లల చేత అర్థనగ్న దుస్తులు వెయ్యించి డాన్స్‌లు చెయ్యించే ‘ఆట‌’ లాంటి టివి కార్యక్రమాలని మా బంధువులలో అందరూ చూస్తారు, అది కూడా కుటుంబ సభ్యులతో కలిసి. కానీ వాళ్ళ కుటుంబాలలోని స్త్రీలు ఎవరికీ అటువంటి దుస్తులు వేసుకునే ధైర్యం ఉండదు. సమాజం ఏమైపోయినా ఫర్వా లేదు కానీ తమ కుటుంబాలకి చెందిన స్త్రీలు గడపదాటకుండా ఉంటే చాలు అని అనుకునే వ్యక్తివాద భావజాలం అది.

 5. విశేఖర్ గారూ,
  గత కొద్ది రోజులుగా వేరే పనులతో బిజీగా ఉన్నాను. ఇప్పుడే మీ ఈ పోస్ట్ చూశాను. చాలా సంతోషం. బ్లాగ్ కథనాలను షేర్ చేయడంలో, పంచుకోవడంలో బొందలపాటి ప్రసాద్ గారితో సహా ఎవరికీ అభ్యంతరం ఉండదనుకుంటాను. ఆ అవసరం లేదు కూడా. ఆయన బ్లాగ్ కథనం లింకును ఇక్కడ ఇచ్చి మంచి పనిచేశారు. ఈ చర్చ జరిగిన సమయంలోనే మీ స్పందన ఉండి ఉంటే మరీ బాగుండేది. ఇతర బ్లాగులను చూడటం మీకు కుదరడం లేదు కనుక ఇది సాధ్యం కాలేదేమో.

  ఏమయినా ఒక మంచి చర్చను మీరు మరోసారి వెలుగులోకి తీసుకువచ్చారు. ముందుగా మీరు స్వప్నగారు బొందలపాటి వారి బ్లాగ్ కథనంలో చేసిన అత్యంత స్పష్టమైన స్పూర్తిదాయకమైన స్పందనను తప్పకుండా తెలుగు చేసి ప్రచురించగలరు. ఇది ఆమెతో సహా ఎవరికీ అభ్యంతరం కలిగించదనే అనుకుంటున్నాను. ఆఫీసుల్లో తెలుగు టైప్ చేయలేకపోవడం, తెలుగు కంటే ఇంగ్లీష్ టైపింగ్‌లోనే చాలా మంది సౌలభ్యాన్ని ఫీలవటం వంటి అనేక కారణాల వల్ల ఇంగ్లీషులో వస్తున్న చక్కని స్పందనలు చాలావరకు తెలుగు మాత్రమే తెలిసిన పాఠకులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. మీరు వెంటనే ఆమె స్పందనను తెలుగు చేసి ప్రచురించండి. ఆమె నుంచి సిద్ధాంత అధ్యయనానికి సంబంధించిన కథనాలను కూడా ఆహ్వానించి ప్రచురిస్తే చాలా బాగుంటుంది.

  మగవాళ్ళు ఎవరూ నిక్కర్ వేసుకుని ఆఫీస్‌లకి వెళ్ళరు. నేను HDFC బ్యాంక్‌కి వెళ్ళే రోజులలో ఆ బ్యాంక్‌లోని మగ ఉద్యోగులు లేత నీలం రంగు చొక్కా, ముదురు రంగు ప్యాంట్ వేసుకుని బ్యాంక్‌కి వచ్చేవాళ్ళు. ఆ బ్యాంక్‌లోని మహిళా ఉద్యోగులు చూడీదార్-సల్వార్ వేసుకుని వచ్చేవాళ్ళు.”

  అని ప్రవీణ్ గారు చేసిన వ్యాఖ్యకు నా స్పందన. నాకు తెలిసినంతవరకు బ్యాంకులలో కాదు గాని, గూగుల్‌ సంస్థలో ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేదు. బహుశా డ్రస్ కోడ్ అమలు చేయని తొలి కంపెనీ ఇదే అనుకుంటాను. కాజువల్ డ్రస్ అంటే షర్టు, ప్యాంట్ కాకుండా బనియన్, షార్ట్స్ వేసుకుని వచ్చి పనిచేస్తున్నా గూగుల్‌లో నిషేధం లేదని తెలిసింది. కాని ఇది పురుషులకు మాత్రమేనా లేదా మహిళా ఉద్యోగులకు కూడానా అనేది తెలీడం లేదు. కాని మా స్నేహితుడు పంపించిన ఒక గూగుల్ టూర్ సందర్భంగా ఒంటిపై భాగాన కేవలం రౌండ్ నెక్ బనియన్ మాత్రమే ధరించి వచ్చిన ఉద్యోగినులను నేను చూసినట్లు జ్ఞాపకం. ఇది ఆదర్శమా, అనాదర్శమా అనే చర్చ అప్రస్తుతం. గూగుల్‌ డ్రస్ కోడ్ పాటించలేదనేది ఇక్కడ ముఖ్యం.

  “HDFCలో మగ ఉద్యోగైనా లేత నీలం రంగు చొక్కా వేసుకోకుండా టి-షర్ట్, నిక్కర్ వేసుకుని ఆఫీస్‌కి వెళ్తే అతని ఉద్యోగం పోతుంది.”

  కానీ నేను చెన్నయ్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు కార్యాలయాలకు చాలా సార్లు వెళ్లాను. కాని అక్కడ ప్రవీణ్ గారు చెప్పిన తరహా డ్రస్ కోడ్ నేను గమనించలేదు. యూనిఫారం వంటిది అసలే లేదు. ఉద్యోగులు కొంతమంది చాలా కాజువల్‌గా టీషర్ట్‌లు కూడా వేసుకుని వస్తున్నారు. ఉద్యోగినులు కూడా చీరతో సహా ఆధునిక దుస్తులు అన్నీ ధరించడం చూశాను. బ్యాంకులకు నేటికీ నిక్కర్ అభ్యంతరం కావచ్చేమో కాని టీషర్ట్‌లు అభ్యంతరకర దుస్తులుగా మహానగరాల్లో అమలవుతున్నట్లు లేదు.

  ఒక మంచి చర్చా కథనం తిరిగి ప్రచురించినందుకు ధన్యవాదాలు.

 6. నాకు 2011 జనవరి వరకు HDFCలో అకౌంట్ ఉండేది. HDFC ఉద్యోగులలో ఎవరూ సినిమాలలో చూపించిన తరహా costumes వేసుకోవడం చూడలేదు. IDBIలో డ్రెస్ కోడ్ లేకపోయినా అక్కడి ఉద్యోగులు తెల్ల చొక్కాలు వేసుకుని రావడం చూశాను. ఆంధ్రా బ్యాంక్‌లో కూడా డ్రెస్ కోడ్ లేదు. అయినా మా నాన్నగారు లేత నీలం రంగు చొక్కా వేసుకుని వెళ్ళేవారు. మా నాన్న గారు 2007 వరకు ఆంధ్రా బ్యాంక్ కరెన్సీ చెస్ట్‌లో సిసి కెమెరా ఆపరేటర్‌గా పని చేశారు. కరెన్సీ చెస్ట్ అంటే జిల్లాలోని అన్ని బ్రాంచ్‌ల నుంచి తెచ్చిన డబ్బులు దాచే స్టోర్ రూమ్. అక్కడ ఫ్రాడ్ జరగకుండా ఉండేందుకు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కంప్యూటర్‌కి కనెక్ట్ చేశారు. ఆ కంప్యూటర్ ముందు కూర్చుని మా నాన్నగారు మానిటర్ చేసేవారు. అది ఎలాగూ కస్టమర్లు వెళ్ళని & బ్యాంక్ ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డ్‌లు మాత్రమే వెళ్ళే స్థలం. అక్కడ పని చెయ్యడానికి లేత నీలం చొక్కానో, తెల్ల చొక్కానో వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. అయినా మా నాన్నగారు వ్యక్తిగతంగా డ్రెస్ కోడ్ పాటించారు.

 7. కేవలం ఒకరిద్దరు స్త్రీలు, అది కూడా పెళ్ళికి ముందు మాత్రమే అశ్లీల దుస్తులు వేసుకుని తిరిగితే కలికాలం, కలికాలం అనే వాళ్ళలో డిజిపి ఒకడు. అయితే ఆ మాటలు అన్నది డిజిపి కాబట్టి మీడియా కంచర గాడిదలకి మేత దొరికింది. ఆడవాళ్ళ గురించి నీచమైన అభిప్రాయాలు ఉన్న ఆధునిక అగ్నిహోత్రావధానులు వీధికొకరు ఉంటారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఆ మాట అంటే మీడియావాళ్ళకి అది వార్త కాదు కానీ ప్రముఖ వ్యక్తులు అన్న మాటలు మాత్రం వార్తలైపోతాయి.

 8. రాజుగారూ, స్వప్న గారు గతంలో ఎప్పుడైనా ఈ బ్లాగ్ లో వ్యాఖ్య చేసి ఉంటే ఈ మెయిల్ ద్వారా అనుమతి కోరి ఉండేవాడ్ని. బ్లాగ్ ద్వారా నైనా పరిచయం లేనందున స్వతంత్రించలేకపోతున్నాను.తనకి అభ్యంతరం ఉండదనే నేనూ భావిస్తున్నాను. అయినా మర్యాద పాటిస్తే బాగుంటుంది. ప్రవీణ్ ద్వారా అనుమతి వస్తుందేమోనని చూస్తున్నాను. తనకి ఇంకా సమాధానం వచ్చినట్లు లేదు. తొందరెందుకు, నిదానంగానే కానిద్దాం లెండి.

 9. ప్రవీణ్, నాకే మెయిలూ రాలేదు. మీరు మెయిల్ పంపాననడం, నాకు రాకపోవడం ఇది రెండోసారి. మెయిల్ అడ్రస్ తప్పు రాసారేమో. మీ బ్లాగ్ (కార్మికవర్గ రాజకీయాలు) లో వ్యాఖ్యలు పోస్ట్ చెయ్యడానికి ఏర్పాటు లేదేమి?

 10. నేను లినక్స్ థండర్ బర్డ్ మెయిల్ క్లైంట్ ద్వారా మెయిల్ పంపాను. ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా పంపిన మెయిల్స్ స్పామ్ బాక్స్‌లోకి వెళ్ళవు. అయినా ఒకసారి చూడండి. మళ్ళీ మెయిల్ పంపుతున్నాను.

 11. ప్రవీణ్, ఈసారి మీ మెయిల్ అందింది. అయితే ఈ అడ్రస్ మే నెలలోనే మీరు నాకు తెలియజేశారు. ఈ రెండు మెయిల్స్ మధ్యలో ఒక మెయిల్ పంపినట్లు చెప్పారు గాని అది నాకు అందలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s