మరోసారి క్షీణించిన జి.డి.పి, తీవ్ర రిసెషన్ లో బ్రిటన్


వరుసగా మూడో క్వార్టర్ లో కూడా బ్రిటన్ స్ధూల దేశీయోత్పత్తి (జి.డి.పి) పడిపోయింది. గత సంవత్సరం చివరి క్వార్టర్ (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) లో ప్రారంభం అయిన బ్రిటన్ జి.డి.పి పతనం ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో కూడా కొనసాగడంతో బ్రిటన్ అధికారికంగా రిసెషన్ (మాంద్యం) లోకి జారుకున్నట్లయింది. ఈ పతనం వరుసగా ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో కొనసాగి మునుపటి కంటే ఎక్కువగా నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదు చేయడంతో బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొంటున్నట్లు స్పష్టం అయిందని బి.బి.సి తెలిపింది.

ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ లో బ్రిటన్ జి.డి.పి -0.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. రెండో క్వార్టర్ లో (ఏప్రిల్, మే, జూన్) ఈ పతనం రెట్టింపు కంటే ఎక్కువకు చేరుకుని -0.7 శాతంగా నమోదయింది. అనుకున్నదాని కంటే ఈ పతనం చాలా ఎక్కువ అని బి.బి.సి తెలిపింది. 2010 చినరీ క్వార్టర్ లోనూ (-0.5%), 2011 రెండో క్వార్టర్ లోనూ (-0.1%) ప్రతికూల వృద్ధి నమోదు చేసిన బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ అనంతరం పాజిటివ్ వృద్ధి నమోదు చేసినప్పటికీ అది తాత్కాలికమేనని తేలింది.

2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ముగిసిందని గణాంకాల ద్వారా చెబుతున్నప్పటికీ మౌలికంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఇంకా మాంధ్యంలోనే కొనసాగుతున్నదని బ్రిటన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చైనా, ఇండియా లాంటి ఆర్ధిక వ్యవస్ధలు 7 శాతం వరకు వృద్ధిని నమోదు చేస్తున్నప్పటికీ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు మూలాధారాలుగా ఉంటున్న అమెరికా, యూరప్ లు ఇంకా కుంటుతూనే ఉన్నాయి. అమెరికా కూడా రెండో క్వార్టర్ లో -0.1 శాతం జి.డి.పి వృద్ధి నమోదు చేసిన విషయం గమనిస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

నిర్మాణ రంగంలో ఉత్పత్తి బాగా పడిపోవడమే రెండో క్వార్టర్ లో జి.డి.పి క్షీణతకు కారణమని బ్రిటన్ కి చెందిన ఒ.ఎన్.ఎస్ (ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్) తెలియజేసింది. వాతావరణం సకహరించకపోవడం, జూన్ లో అదనంగా బ్యాంకులకు సెలవులు రావడం క్షీణతకు కారణంగా చెప్పడానికి బ్రిటన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే వీటి ప్రభావం ఉందని తాము ఇప్పుడే చెప్పలేమని ఒ.ఎన్.ఎస్ చెప్పింది. అందువల్ల ప్రకటించిన గణాంకాలు ఖచ్చితం కాకపోవచ్చని బి.బి.సి అంటోంది. గణాంకాల్లో మార్పు వచ్చినప్పటికీ అది 0.1 శాతం కంటే ఎక్కువ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ఆర్ధిక వృద్ధి గణాంకాలు నిరాశావాహంగా ఉన్నాయని బ్రిటన్ ప్రధాని కామెరూన్ వ్యాఖ్యానించాడు. “మనం ఎంతగా ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటున్నామో అవి (గణాంకాలు) చూపుతున్నాయి. మనమే కాదు. యూరో జోన్ వ్యాపితంగా కూడా మన పొరుగువారంతా నిజంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు” అని కామెరూన్ అన్నాడు. “ఈ గడ్డు పరిస్ధితి నుండి బైటపడడానికి మనం చేయగలిగిందంతా చేయాల్సిందేనన్నది స్పష్టమే. మన ప్రజలకు, ఆర్ధిక వ్యవస్ధకు కావలసిన ఆర్ధిక వృద్ధినీ, ఉద్యోగాలనూ అందించాల్సి ఉంది” అని ఆయన అన్నాడు.

ఒక పక్క పొదుపు విధానాలను బలవంతంగా అమలు చేస్తూ ఆ పేరుతో ఉద్యోగాలనూ, సదుపాయాలనూ, వేతనాలనూ కత్తిరిస్తున్న బ్రిటన్ పధాని ఉద్యోగాలు అందించాల్సి ఉందని చెప్పడం మోసం తప్ప మరొకటి కాదు. కార్మిక వర్గ వేతనాలలో, సదుపాయాలలో కోత కోసి ఆ భాగాన్ని కంపెనీలకు ప్రభుత్వం తరలిస్తోంది. ఫలితంగా కారికుల, ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోయి ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది. దాని ఫలితమే జాతీయోత్పత్తి క్షీణత. ఈ పరిస్ధితిని మార్చడానికి ప్రధానంగా చేయవలసింది ప్రజల కొనుగోలు శక్తి పెంచడం. అంటే ఉద్యోగాలు కల్పించడం, మరిన్ని సదుపాయాలు కల్పించడం. సరిగా దీనికి వ్యతిరేకమైనవే బ్రిటన్ అనుసరిస్తున్న పొదుపు విధానాలు.

బి.బి.సి ఎకనమిక్ ఎడిటర్ స్టెఫానీ ఫ్లాండర్స్ “ఈ అంకెలు నిజమే అయితే, బ్రిటన్ కి ఈ నాలుగు సంవత్సరాల కాలం పెద్ద గడ్డుకాలం. యుద్ధ కాలాన్ని తప్పిస్తే కనీసం వంద సంవత్సరాలలోనే గడ్డు పరిస్ధితి. 1920లు, 1930లలో జరిగినడాని కంటే, 1970లు 1980 ల కాలానికంటే కూడా ఘోరమైన పరిస్ధితి” అని వ్యాఖ్యానించింది. “బ్రిటన్ వృద్ధికి ఇది వినాశనమే” అని స్కాటియా బ్యాంక్ కి చెందిన ఎకనమిస్టు అలన్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. “సగటున చూస్తే, ఈ సంవత్సరం వరకూ జీరో కంటే ఎక్కువ వృద్ధి నమోదు చేయడం కష్టంగా కనిపిస్తోంది. మరింత క్షీణతనే ఎదుర్కొంటాము” అని క్లార్క్ అన్నాడు.

సోషల్ హౌసింగ్ పైన ప్రభుత్వ ఖర్చు బాగా పడిపోయిందనీ, మౌలిక రంగంలో కూడా ప్రభుత్వ ఖర్చు తగ్గిపోయిందనీ అందుకే నిర్మాణ రంగం వృద్ధిలో ఉత్పత్తి బాగా పడిపోయిందని ఒ.ఎన్.ఎస్ తెలిపింది. ఋణ సంక్షోభంతో తీసుకుంటున్న యూరో జోన్ నుండి డిమాండ్ తగ్గిపోవడంతో మానుఫాక్చరింగ్ తో సహా ప్రొడక్షన్ పరిశ్రమలు కూడా ఉత్పత్తిని తగ్గించాయి.  రిటైల్ రంగం తో పాటు ఇతర సేవల రంగం వృద్ధి చెందుతుందని భావించినప్పటికీ అది కూడా నెగిటివ్ వృద్ధినే నమోదు చేసింది. కొన్ని పరిశ్రమలు మెరుగ్గా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెప్పినప్పటికీ మొత్తంగా ఆర్ధిక వ్యవస్ధ స్తంభించిపోయిందని వారు కూడా అంగీకరిస్తున్నారు.

వరుసగా రెండు క్వార్టర్ల పాటు జి.డి.పి వృద్ధి పడిపోతే ఆ దేశం మాంద్యంలో ఉన్నట్లు ఆర్ధికవేత్తలు లెక్కిస్తారు. బ్రిటన్ ఇప్పటికీ వరుసగా మూడు క్వార్టర్లు క్షీణిస్తూనే ఉంది. 2008 తీవ్ర సంక్షోభం దరిమిలా రిసెషన్ లో పడిపోయిన బ్రిటన్ పెరిగినట్లే పెరిగి మళ్ళీ రిసెషన్ లో పడిపోవడాన్ని ఆర్ధిక పరిభాషలో ‘డబుల్ డిప్ రిసెషన్’ గా పరిగణిస్తారు. ఈ లెక్కన బ్రిటన్ ‘డబుల్ డిప్ రిసెషన్’ లో ఉన్నదన్నమాట. ఆర్ధిక సంక్షోభ పరిస్ధితుల భారాన్ని సైతం కార్మిక వర్గంపైనే మోపడం పాలక ప్రభుత్వాలకు, కంపెనీలకు మామూలే. సంక్షోభాన్ని తెచ్చిన కంపెనీలపైనే సంక్షోభ భారాన్ని మోపడానికి బదులు దానిని కూడా కార్మికవర్గంపైకి తరలించడం పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు పుట్టుకతో వచ్చిన బుద్ధి. ఆ బుద్ధి పోవలసింది పిడకలతోనే ఇక.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s