అవినీతి నిర్లక్ష్యాల మూల్యం, స్కూల్ బస్సు రంధ్రంలోంచి జారి బాలిక మృతి


చెన్నైలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సులోపల ఉన్న రంధ్రంలోంచి జారిపడి రెండో తరగతి చదువుతున్న బాలిక చనిపోయింది. బస్సు వెనక చక్రాల కింద పడి నలిగిపోవడంతో ఆరేళ్ళ శృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవాణా అధికారుల వద్ద నెల క్రితమే స్కూలు బస్సు ఫిట్ నెస్ సర్టిఫికేట్ పొందినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించగా, ప్రజలు ఆగ్రహంతో బస్సుని తగలబెట్టారు. బస్సు డ్రైవర్ తో పాటు స్కూల్ కరెస్పాండెంటును పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జయలలిత దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, హై కోర్టు సు మోటో గా కేసు విచారణకు స్వీకరించింది.

తాంబరం, సెలైయూర్ లోని ఇందిరా నగర్ వద్ద ఉన్న ‘జియోన్ మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరీ స్కూల్’ లో శృతి రెండో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్లడానికి బస్సులో ప్రయాణిస్తున్న శృతి తమ ఇల్లు దగ్గరపడడంతో కిందకి దిగడానికి లేచి నిలబడింది. అయితే కాళ్ళ వద్ద ఉన్న రంధ్రాన్ని గమనించకపోవడంతో పాప చిన్న శరీరం నిలబడింది నిలబడినట్లుగా రంధ్రంలోకి జారిపోయింది. పిల్లలు కేకలు పెట్టినప్పటికీ బస్సు డ్రైవర్ కి ఏంజరిగిందీ తెలియక బస్సును యధావిధిగా ముందుకు పోనిచ్చాడు. దానితో కిందపడిన శృతి పైనుండి బస్సు వెనక టైర్లు వెళ్లడంతో పాప అక్కడికక్కడే చనిపోయింది.

బస్సు పక్క ప్రయాణిస్తున్న వాహనదారులు బస్సును దాటుకుని ఆపేవరకూ డ్రైవర్ సీమన్ కి జరిగిన విషయం తెలియలేదు. దుర్ఘటనను ప్రత్యక్షంగా చూడడంతో ప్రజలు డ్రైవర్, క్లీనర్ లను చితకబాదారు. పిల్లల తల్లిదండ్రులు, వాహనదారులు ఆగ్రహం పట్టలేక నాలుగున్నర ప్రాంతంలో  బస్సుకు నిప్పు పెట్టారు. ఈలోపు పెట్రోలు వాహనంలో వచ్చిన పోలీసులు డ్రైవర్, క్లీనర్ లను దెబ్బలనుండి రక్షించినట్లు పత్రిక తెలిపింది. అరగంట తర్వాత అగ్నిమాపక దళం వచ్చి మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే బస్సు చాలావరకు కాలిపోయింది.

శృతి మరణాన్ని పాప తల్లిదండ్రులతో పాటు అక్కడివారంతా తట్టుకోలేకపోయారు. దుర్ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటలపాటు అక్కడే గుమికూడి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆటో, మారుతి ఒమిని లకు సొంతదారు అయి డ్రైవర్ గా పని చేస్తున్న శృతి తండ్రి సేతు మాధవన్ అక్కడి ప్రాంతంలో అందరికీ చిరపరిచితుడు. ఉదయాన్నే తమ ఇంటికి దగ్గర్లోని పిల్లలందరినీ తానే డబ్బు తీసుకోకుండా బస్సు ఆగే చోటికి తీసుకెళ్ళడం వలన అతనంటే చాలా మందికి అభిమానం. సాయంత్రం కూడా బస్సు దిగిన పిల్లలని పట్టినంతవరకూ తన వాహనంలోనే తీసుకెళ్ళి ఇళ్ల దగ్గర దింపడం అతని అలవాటు. శృతి మరణవార్త ఫోన్ ద్వారా తెలిసినప్పుడు అతను డ్రైవింగ్ లో ఉన్నప్పటికీ పిల్లలందరినీ వారి ఇళ్ల వద్ద దింపాకనే కూతురు కోసం వచ్చినట్లు తెలుస్తోంది.

“శృతి తెలివిగలిగిన అమ్మాయి. మంచి చదువు చెప్పించడానికి పాప తల్లిదండ్రులు చేయగలిగినదంతా చేస్తున్నారు. అందుకోసమే దూరంలో ఉన్నప్పటికీ మంచి స్కూల్ లో చేర్పించారు” అని పొరుగునే నివశిస్తున్న తారకేశ్వరి ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. స్కూల్ లోనే కాక బైట కూడా వివిధ సందర్భాలలో శృతి నాట్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకుందనీ ఆమె తెలిపింది. “సేతు మాధవన్ తమ ఇరుగుపొరుగు వారినందరినీ మెయిన్ రోడ్డు మీదికో, దగ్గర్లోని బస్టాప్ దగ్గరికో దింపుతాడు. ఎప్పుడూ డబ్బులు అడిగి ఎరగడు. పిల్లల కోసం చాలా కష్టపడతాడు” అని తారకేశ్వరి తెలిపింది.

తారకేశ్వరి మాటలు ఎంతనిజమో శృతి అంత్యక్రియలకు హాజరైన జనసంఖ్య తెలియజేస్తోంది. శృతి చనిపోయిన తీరు కూడా అనేకమందిని కదిలించింది. తెలిసినవారు, తెలియని వారు కూడా కొద్ది వేల సంఖ్యలో గురువారం శృతి ఇంటివద్ద హాజరైనారు. శవయాత్రలో పాల్గొన్నవారిలో అనేకమందికి శృతి కుటుంబంతో పరిచయం లేనపటికీ కన్నీటితో సేతు మాధవన్ కుటుంబీకులకు తోడు నిలిచారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నవారు సైతం తమ తమ పిల్లలతో సహా శృతి అంతిమయాత్రకు హాజరయ్యారు. తమ తప్పేమీ లేకపోయినా వేరొకరి నిర్లక్ష్యానికీ, అవినీతికి బలై ప్రాణం కోల్పోవడంతో శృతి మరణం పలువురిని కదిలించింది.

బస్సును కాంట్రాక్టుకి తీసుకున్నట్లు స్కూల్ యాజమాన్యం చెప్పినప్పటికీ స్కూల్ పేరు మీదనే రిజిస్టర్ అయినట్లు విలేఖరుల పరిశోధనలో తేలింది. గురువారం సెలవు ప్రకటించిన స్కూలు యాజమాన్యం శృతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపింది. అయితే ప్రభుత్వం, కోర్టు జోక్యంతో కరెస్పాండెంటును పోలీసులు అరెస్టు చేశారు.

మద్రాస్ హైకోర్టు కి చెందిన ఫస్ట్ బెంచి శృతి మరణాన్ని సు మోటు కేసు గా స్వీకరించింది. “ప్రాంతీయ రవాణా కార్యాలయం నుండి కేవలం 15 రోజుల క్రితమే సదరు బస్సు ఫిట్ నెస్  సర్టిఫికేట్ పొందినట్లు తెలుసుకోవలసి రావడం చాలా దురదృష్టకరం” అని కోర్టు వ్యాఖ్యానించింది. స్కూలు అధికారులు, రవాణా అధికారులు, బస్సుకు సర్టిఫికేట్ ఇచ్చినవారు వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని చీఫ్ జస్టిస్ ఇక్బాల్, జస్టిస్ శివజ్ఞానం లతో కూడిన బెంచి ఆదేశాలు జారీ చేసింది. 

రాష్ట్ర విద్యా శాఖ కూడా ఘటనకు స్పందించింది. ప్రమాదం జరిగిన స్ధలాన్ని విద్యా శాఖాధికారులు సందర్శించారు. ప్రత్యక్ష సాక్షులను విచారించారు. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడారు. స్కూలు బస్సు బధ్రత ఏమాత్రం లేని పరిస్ధితిలో రోడ్డు మీద తీరుగుతోందని వారు అనంతరం ప్రకటించారు. “విద్యార్ధుల సంక్షేమం, భద్రతల పట్ల గౌరవం లేకుండా స్కూలు యాజమాన్యం వ్యవహరించింది. స్కూలుకి గుర్తింపుకోసం ఇచ్చిన షరతులను, నియంత్రణలను అనుసరించడంలో విఫలం అయింది” అని పాఠశాల విద్యా విభాగం డైరెక్టర్ ప్రకటించాడు.

అవినీతి పాలన ప్రజల జీవనంలో ప్రత్యక్షంగా ఎంతటి పాత్ర పోషిస్తుందో తెలియడానికి శృతి మరణం ఒక ప్రబల ఉదాహరణ. రవాణా శాఖ అధికారులు లంచం డబ్బుకి ఆశపడి ఒక పనికిరాని బస్సుకి ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఇవ్వడానికీ అక్కడికి ఎంతో దూరంలో తన ఆటపాటలతో తల్లిదండ్రులనీ, పరిసర ప్రజలనీ అలరిస్తున్న ఓ ఆరేళ్ళ బాలిక మరణానికి ఉన్న సంబంధం గమనించవలసిన విషయం.

ప్రభుత్వంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న అనేకమంది అధికారులు నిరంతరం లంచం డబ్బులు మింగుతూ సక్రమ పద్ధతిలో జరగవలసిన విధులను అక్రమ మార్గం పట్టిస్తున్నారు. ఈ విధులు అనేకమంది ప్రజల జీవనంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగి ఉంటాయి. ఆ సంబంధంలో ప్రజల ప్రాణాలు సైతం ఇమిడి ఉంటాయని శృతి ఉదాహరణ చెబుతోంది. తమ అక్రమ పద్ధతుల వలన జరగబోయే పరిణామాలు తెలిసినప్పటికీ తమ చుట్టూ ఉన్న అవినీతి వాతావరణం ప్రభుత్వోద్యోగులను విచక్షణాపూరిత ఆలోచనలకు అవకాశం ఇవ్వకపోగా వ్యతిరేక ఆలోచనలకు ప్రోత్సాహం ఇస్తున్నది.

ఇలాంటి అవినీతి వాతావరణానికి ప్రధాన బాధ్యులు పాలకులే. కాంట్రాక్టర్ల వద్ద కోట్లాది సొమ్ము పర్సెంటీజీ లుగా భోంచేసి ప్రతిఘటన రాకుండా చేసుకోవడానికి వారు కింది వరకూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. తమ అవినీతిలో అతి కొద్ది భాగాన్ని కింది ఉద్యోగులకు భాగం పంచుతూ మొత్తం వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఫలితంగా అవినీతి వ్యవస్ధీకృతం అయిపోయింది.

నీతి, అవినీతి లు సామాజిక జీవనంలోని భౌతిక అవసరాలతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ముడి పడి ఉండడమే అవి వ్యవస్ధీకృతం కావడానికి తగిన పునాది. అందువల్లనే భౌతిక అవసరాల జోలికి పోని మతబోధనలు, నీతి ప్రబోధాలు వ్యక్తుల, సమాజాల గతిని మార్చడంలో అశక్తులుగా ఉండిపోతాయి. భౌతిక అవసరాలతో, భౌతిక శక్తులతో సంబంధం ఉంటూ వాటిని మార్చగల భౌతిక చర్యలే నీతి, అవినీతి ల ను మౌలికంగా ప్రభావితం చేయగలుగుతాయి. సక్రమ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికీ సమకాలీన భౌతిక అవసరాలన్నీ అందుబాటులో ఉన్నపుడు ఎవరికైనా అవినీతి మార్గం పట్టవలసిన అవసరం ఉండబోదు. ప్రజా సామాన్యానికి అందవలసిన ఇలాంటి భౌతిక అవసరాలను తీర్చే వనరులను కొద్ది మంది ధనికులు గుప్పెట్లో పెట్టుకోవడం వల్లనే ఇతరులకవి ప్రియంగా మారాయి. కొద్ది మంది స్వార్ధాన్ని అణిచివేసి ప్రజలందరికీ వనరులను అప్పజెప్పే రాజ్య వ్యవస్ధ మానవసమాజానికి తక్షణ అవసరం. అలాంటి రాజ్య వ్యవస్ధను తెచ్చుకోవడానికి ప్రజల ప్రత్యక్ష కార్యాచరణ తప్ప మరొక మార్గం లేదు.

4 thoughts on “అవినీతి నిర్లక్ష్యాల మూల్యం, స్కూల్ బస్సు రంధ్రంలోంచి జారి బాలిక మృతి

 1. Very tragic accident.My deepest sympathies to Shruti’s parents. Especially to the father who is serving his community so selflessly.
  The whole in the bus reflects the level of corruption and callousness for life in India.
  As long as the child is not theirs, no body cares, even the school owner.
  We think of safety only when we value every human life. Not just our own. It will take a long while to come to that stage.

 2. డ్రైవర్, క్లీనర్‌లు కేవలం ఉద్యోగులు. ఆ స్కూల్ యజమానులదే ప్రధానమైన తప్పు. తమ యజమాని వాహనం మార్చకపోతే డ్రైవర్ ఏమి చెయ్యగలడు?

 3. * పాప ఇలా చనిపోవటం చాలా దారుణమైన సంఘటన.
  * ఇంకా, మూతలు వేయని బోరు బావుల్లో పడి ఎందరో పిల్లలు చనిపోతున్నారు.
  * పిల్లల విషయంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s