ప్రమాదంలో జర్మనీ టాప్ రేటింగ్, ఋణ సంక్షోభమే కారణం


యూరపియన్ యూనియన్ ఆర్ధిక కేంద్రం అయిన జర్మనీని సైతం ఋణ సంక్షోభం చుట్టు ముడుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ‘మూడీస్’ రేటింగ్ సంస్ధ జర్మనీ క్రెడిట్ రేటింగ్ ‘ఔట్ లుక్’ ను ‘స్థిరం’ (స్టేబుల్) నుండి ‘ప్రతికూలం’ (నెగిటివ్) కు తగ్గించింది. తద్వారా రానున్న రెండేళ్లలో జర్మనీ AAA రేటింగ్ కోల్పోవచ్చని సంకేతం ఇచ్చింది. ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ గా చేసుకున్న 17 దేశాల యూరో జోన్ కూటమి నుండి గ్రీసు బైటికి వెళ్లిపోతుందన్న అంచనా తో పాటు స్పెయిన్, ఇటలీ దేశాలు కూడా గ్రీసు తరహా పూర్తి స్ధాయి ‘బెయిలౌట్’ ను కోరే స్ధాయికి చేరుకోవచ్చన్న ఆందోళనే జర్మనీ రేటింగ్ కోతకు కారణంగా మూడీ పేర్కొంది.

ప్రపంచ ఆర్ధిక కేంద్రాల్లో యూరోపియన్ యూనియన్ ఒకటి కాగా దానికి జర్మనీ ప్రధాన శక్తి కేంద్రం. అమెరికా, జపాన్, ఇ.యు లు ఇప్పటి వరకూ ప్రధాన ఆర్ధిక కేంద్రాలుగా కొనసాగగా 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా చైనా కూడా మరో ఆర్ధిక కేంద్రంగా ముందుకు వచ్చిన సంగతి విదితమే. ఈ నేపధ్యంలో అమెరికాకు పోటీగా ఎదగడానికి దశాబ్దాల తరబడి ప్రయత్నిస్తూ వచ్చిన యూరోపియన్ యూనియన్ ఆర్ధిక భవిష్యత్తు ఒకింత చర్చనీయాంశంగా మారింది.

మూడీస్ రేంటింగ్ తగ్గింపును జర్మనీ ప్రభుత్వం తేలికగా కొట్టిపారవేసినప్పటికీ దాని ప్రభావం విస్మరించలేనిది. ప్రవేటు బహుళజాతి ద్రవ్య సంస్ధల ప్రాపకంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న గ్లోబల్ రేటింగ్ కంపెనీలు ఇప్పుడు ఒక విధంగా జాతీయ ప్రభుత్వాల ఆర్ధిక విధానాలను శాసించడానికి పనిముట్లుగా మారినందున వాటి క్రెడిట్ రేటింగ్ ల ప్రభావాన్ని దేశాల ప్రభుత్వాలు తప్పించుకోలేకున్నాయి.

యూరో కరెన్సీ నుండి గ్రీసు బైటికి వెళ్లిపోయే అవకాశాలు అంతకంతకూ పెరుగుతున్నాయని మూడీస్ అంచనా వేస్తోందని బి.బి.సి తెలిపింది. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల నుండి ఇప్పటికే పాక్షిక బెయిలౌట్ పొందిన స్పెయిన్ పూర్తి స్ధాయి బెయిలౌట్ కోరవచ్చని కూడా మూడీస్ భావిస్తోంది. స్పెయిన్ వెన్నంటే ఇటలీ కూడా ఋణ సంక్షోభంలో కూరుకుపోతున్నట్లు ఆర్ధిక విశ్లేషకులు భావిస్తున్నారు.

యూరోపియన్ కమిషన్ (ఇ.సి), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇ.సి.బి), ఐ.ఎం.ఎఫ్ సంస్ధలు (ఈ మూడింటిని ట్రొయికా అని పిలుస్తున్నారు) ఉమ్మడిగా యూరప్ లోని ఋణ సంక్షుభిత దేశాలకు ‘రక్షణ నిధి’ని ఏర్పాటు చేశాయి. ఓపెన్ మార్కెట్ లో రుణాల సేకరణ భరించలేని స్ధాయికి చేరుకున్న యూరోజోన్ దేశాలకు కఠిన షరతులతో కూడిన రుణాలు మంజూరు చేయడానికి ఏర్పాటు చేసినదే ఈ ‘రక్షణ నిధి.’ ఋణ సంక్షోభంలో ఉన్న దేశాల నిస్సహాయ పరిస్ధితిని ప్రపంచ స్ధాయి ప్రవేటు ద్రవ్య కంపెనీలకు (బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు మొ.వి) అనుకూలంగా ఉపయోగపెట్టడానికి అనేక విషమ షరతులు విధించి రక్షణ నిధి నుండి రుణాలు ఇవ్వడమే ‘బెయిలౌట్’ గా పేర్కొంటున్నారు. ట్రోయికా ఇస్తున్న బెయిలౌట్ తీసుకోవడం అంటే పెనం నుండి పొయ్యి మీదికి జారడమే.

జర్మనీ కి ఉన్న AAA రేటింగ్ ను నెగిటివ్ గా మార్చడం అంటే మరో రెండేళ్ల లోపు అసలు రేటింగ్ ను తగ్గించవచ్చని సూచించడమే. యూరప్ లో సంపన్న దేశాలైన నెదర్లాండ్స్ (హాలండ్), లక్సెంబర్గ్ ల AAA రేటింగ్ లను కూడా ‘ప్రతికూలం’ గా మూడీస్ మార్చింది. ఫ్రాన్సు, ఆస్ట్రియాల రేటింగ్ లను మూడీస్ ఇప్పటికే ఏ‌ఏ కు తగ్గించింది. గ్రీసు యూరోజోన్ వదిలి పోవడానికి అవకాశాలు పెరుగుతున్నాయని అదే జరిగితే ద్రవ్య రంగం (ఫైనాన్షియల్ సెక్టార్) వరుస షాక్ లకు గురికాక తప్పదని మూడీస్ హెచ్చరించింది. ప్రభుత్వాలు ఈ షాక్ లను తట్టుకోగలిగినా భారీ మూల్యం చెల్లించుకుంటేనే అది సాధ్యం అవుతుందని కూడా తెలిపింది.

ట్రోయికా మంజూరు చేసిన 130 బిలియన్ యూరోల బెయిలౌట్ లో 31.5 బిలియన్ యూరోల చివరి వాయిదా విడుదల చేయడానికోసం ట్రోయికా పరిశీలకులు గ్రీసు సందర్శించనున్నారు. ప్రజలపై మరిన్ని పన్నులు బాది, వేతనాలు మరింత కోసేసి, ఉద్యోగుల సదుపాయాలు మరిన్ని రద్దు చేసి బెయిలౌట్ రుణాలు తీర్చడానికి గ్రీసు తగిన ఏర్పాట్లు చేస్తున్నదో లేదో ఈ పరిశీలకులు పరీక్షిస్తారు. తాము సంతృప్తి చెందితేనే చివరి వాయిదా విడుదల జరుగుతుంది. అయితే గ్రీసు పై మోపిన కఠిన షరతుల పొదుపు విధానాల వల్ల జి.డి.పి ఇప్పటికే నెగిటివ్ వృద్ధిలో జారిపోయింది. పన్నుల వసూలు పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల కొనుగోళ్ళు కూడా పడిపోయాయి. అనుకున్నదానికంటే వేగంగా గ్రీసు ఆర్ధిక వ్యవస్ధ కుచించుకుపోతోంది.  దానితో గ్రీసుకి చివరి బెయిలౌట్ వాయిదా విడుదల అనుమానాస్పదంగా మారింది.

మరో వైపు స్పెయిన్ ఋణ సేకరణ ఖరీదు ఓపెన్ ఋణ మార్కెట్లో పెరిగిపోతోంది. స్పెయిన్ సావరిన్ ఋణ బాండ్లపై మదుపుదారులు డిమాండ్ చేస్తున్న వడ్డీ రేటు (యీల్డ్) అత్యధికంగా 7.5 శాతాన్ని మించిపోయింది. జర్మనీ సావరిన్ ఋణ వడ్డీ రేటు 3 శాతం తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దానితో ఓపెన్ మార్కెట్లో ఋణ సేకరణ చేయలేక ట్రోయికా నుండి పూర్తి స్ధాయి బెయిలౌట్ ను స్పెయిన్ కోరవచ్చన్న భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో స్పెయిన్, ఇటలీలకు ఇస్తున్న మద్దతు స్ధాయిని పెంచవలసిన అవసరం పెరుగుతోందని మూడీస్ హెచ్చరించింది. దీనివలన జర్మనీ లాంటి సంపన్న దేశాలకు మరింత భారం పెరగనున్నదని రేటింగ్ సంస్ధ తెలిపింది.

జర్మనీ ఆర్ధిక మంత్రి వోల్ఫ్ గాంగ్ ష్యూబుల్ తమ దేశం శక్తివంతంగానే ఉందనీ, ఆందోళన చెందవలసిన అవసరం లేదనీ చెప్పినట్లు బి.బి.సి తెలిపింది. జర్మనీ ఆర్ధిక, ద్రవ్య విధానాలు స్ధిరంగా కొనసాగుతున్నాయని వోల్ఫ్ గాంగ్ వ్యాఖ్యానించాడు.

క్రెడిట్ రేటింగ్ కంపెనీల హెచ్చరికలు అంతిమంగా ప్రజలపై మరిన్ని ఆర్ధిక దాడులకు ప్రభుత్వాలు పూనుకోవడానికి దారితీయడం రివాజు. కనుక రేటింగ్ కంపెనీల ఆందోళనలు సామాన్య ప్రజలకు కూడా పరోక్షంగా ఆందోళనకరమే.

One thought on “ప్రమాదంలో జర్మనీ టాప్ రేటింగ్, ఋణ సంక్షోభమే కారణం

  1. విశెఖర్ గరూ. AAA రెటింగ్ అంటె ఎమిటి అలగే AA+ తగ్గిందంటారు దీన్ని దేని ప్రకారం నిర్నయిస్తారు. కొంచం వివరంగా చెపుతారా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s