అమెరికాలో మరో మానసిక వికలాంగుడి మరణ శిక్షకు రంగం సిద్ధం


గత బుధవారం ఒక మానసిక వికలాంగుడికి మరణ శిక్ష అమలు చేసిన అమెరికా ప్రభుత్వం సోమవారం మరో మానసిక రోగికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేయనుంది. ఫ్రాన్సు ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి లతో పాటు ప్రపంచ వ్యాపితంగా అనేకమంది ప్రముఖులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ వెనక్కి తగ్గడానికి అమెరికా ససేమిరా అంటోంది. మూడు విడతల మిశ్రమ డోసులో ఇంజెక్షన్స్ ఇచ్చి నెమ్మదిగా ప్రాణం తీసే మామూలు పద్ధతి కాకుండా మొదటిసారిగా ఒకే ఒక్క కొత్త విషం ‘పెంటో బార్బిటల్’ ఉపయోగించి ప్రాణం తీయడానికి నిర్ణయించారని ఫ్రాన్సు కి చెందిన ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది.

52 సంవత్సరాల ఆఫ్రికన్ అమెరికన్ ‘వారెన్ హిల్’ 21 సంవత్సరాల క్రితం జైలులో సహచరుడిని చంపిన కేసులో నిందితుడు. స్నేహితురాలిని హత్య చేసిన కేసులో జైలులో ఉంటూ సహచరుడిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు మరణ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. అయితే వారెన్ ఐ.క్యూ 70 పాయింట్లు మాత్రమేనని వైద్య పరీక్షలు నిర్ధారించాయి. మానసిక వికలాంగుడిగా ఈ రీడింగ్ నిర్ధారిస్తున్నప్పటికీ జార్జియా రాష్ట్ర సుప్రీం కోర్టు మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారడానికి నిరాకరించింది. వారెన్ హిల్ మానసిక వికలాంగుడని అనుమానం లేకుండా రుజువు చేయడంలో డిఫెన్స్ విఫలం అయిందని 2003 లో జార్జియా కోర్టు భావించినట్లు తెలుస్తోంది.

“గణనీయ స్ధాయిలో మేధో వైకల్యాలు ఉన్న ఈ వ్యక్తిని చంపకుండా జార్జియా రాష్ట్రాన్ని అమెరికా సుప్రీం కోర్టు అడ్డుకోవాలి” అని మానవ హక్కుల సంస్ధ హ్యూమన్ రైట్స్ వాచ్ డిమాండ్ చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ హిల్ మరణ శిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చాలని కోరాడు. ఫ్రాన్సు ప్రభుత్వం ‘పరిస్ధితి పట్ల ఆందోళన చెందుతున్నామని’ ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నీ మరణ శిక్ష ను రద్దు చేయాలని ఫ్రాన్సు ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేసింది. “మరణ శిక్ష కేసుల్లో అనుమానం లేకుండా మానసిక వైకల్యం రుజువు చేయాలని చెప్పడం ద్వారా జార్జియా రాష్ట్రం తీవ్రమైన, క్రూరమైన ‘పరాయి’ (outlier) గా రుజువు చేసుకుంది” అని హ్యూమన్ రైట్స్ వాచ్ వ్యాఖ్యానించింది.

“మానసిక వైకల్యం అనుమాన రహితంగా రుజువు చేసుకునే అన్యాయమైన భారాన్ని డిఫెండెంట్ పై మోపిన ఒకే ఒక్క రాష్ట్రం జార్జియా. ఈ నిబంధనను నిపుణులు భేషుగ్గా మానిపులేట్ చేయగలరు. ఫలితంగా రాజ్యాంగ విరుద్ధమైన మరణ శిక్షలు సంభవిస్తాయి” అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎడిటోరియల్ వ్యాఖ్యానించిందని ఎ.ఎఫ్.పి తెలిపింది. మానసిక వికలాంగులకు మరణ శిక్ష వేయడాన్ని 2002 లో అమెరికా సుప్రీం కోర్టు నిషేధం విధించింది. అయితే మానసిక వైకల్యం ఎలా నిర్ణయించాలన్న విషయాన్ని రాష్ట్రాలకు వదిలి పెట్టింది. దానితో జార్జియా రాష్ట్రం సొంత స్కేలు అమలు చేయగలుగుతోంది.

“మానసిక-సామాజిక వైకల్యంతో బాధపడుతున్న వారికి మరణ శిక్ష విధించడం రాజ్యాంగ రక్షణాలు ఉల్లంఘించడమే” అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ క్రిష్టాఫ్ హేన్స్ వ్యాఖ్యానించినట్లు ప్రెస్ టి.వి తెలిపింది.  గత బుధవారమే టెక్సాస్ రాష్ట్రం 33 సంవత్సరాల యోకామోన్ హెర్న్ అనే మానసిక వికలాంగుడికి మరణ శిక్ష విధించింది. బాల్యం నుండి హెర్న్ మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు సాక్ష్యాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరణ శిక్ష అమలు చేసిందని ప్రెస్. టి.వి తెలిపీంది. వారెన్, హెర్న్ లకు మరణ శిక్ష ను సస్పెండ్ చేయాలని ఐక్యరాజ్య సమితి కోరినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమితి వినతిని పెడచెవిన పెట్టాయి.

2 thoughts on “అమెరికాలో మరో మానసిక వికలాంగుడి మరణ శిక్షకు రంగం సిద్ధం

  1. Many southern states in US are very conservative and some what anachronistic. They often go against the federal government and I’m not surprised that they ignored human rights protests from France. Its not fair to blame it on the federal govt as they too struggle dealing with those states. But I don’t support their current stance of just being quiet in fear of elections.

  2. గౌతం గారూ, వారెన్ మరణ శిక్ష ను జార్జియా రాష్ట్రం అమలు చేయకుండా జోక్యం చేసుకోవాలని అమెరికా సుప్రీం కోర్టుకు వారెన్ తరపు లాయర్లు అప్పీలు చేసుకున్నప్పటికీ సుప్రీం కోర్టు వారి అప్పీలును తిరస్కరించింది. ఆ విధంగా ఫెడరల్ ప్రభుత్వానికీ బాధ్యత ఉంది. అదీ కాక ఒక రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యవస్ధను దేశ వ్యవస్ధ నుండి వేరుగా చూడలేము. వివిధ రాష్ట్రాల పాలనా వ్యవస్ధలు సైతం జాతీయ వ్యవస్ధల్లో భాగంగానే ఉంటాయి. అవి పరస్పరం ఆధారితాలు. ఒక దానినొకటి ప్రభావితం చేసుకుంటూ నిత్యం సంబంధంలో ఉంటాయి. కనుక ఫెడరల్ ప్రభుత్వానికి బాధ్యత లేదు అనడం ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s