కాల్పులకు ముందు హెచ్చరికలు జారీ చేశామని అమెరికా చెబుతున్నది ఒట్టి అబద్ధమని దుబాయ్ తీరంలో అమెరికా సైనికుల కాల్పుల్లో గాయబడిన భారత జాలర్లు ‘ది హిందూ’ కు తెలిపారు. యు.ఏ.ఇ కి చెందిన కంపెనీలో పని చేస్తున్న భారత జాలర్లపై అక్కడి అమెరికా సైనిక స్ధావరానికి చెందిన సైనికులు కాల్పులు జరపడంతో ఒక భారతీయ జాలరి చనిపోగా, మరో ముగ్గురు జాలర్లు గాయపడ్డారు. కాల్పులకు ముందు అనేకసార్లు హెచ్చరికలు జారీ చేశామనీ వినకపోవడంతో కాల్చారని అమెరికా చెబుతుండగా భారత జాలర్లు ఆ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నారు. కాల్పులు జరిగింది అంతర్జాతీయ జలాల్లో అని అమెరికా చెబుతుండగా తమ దేశీయ జలాల్లోనే హత్యలు జరిగాయని యు.ఏ.ఇ ప్రకటించింది.
“ఒక వ్యక్తి మెషీన్ గన్ నుండి ఐదు నిమిషాలు ఆపకుండా కాల్పులు జరిపాడు. అది అకస్మాత్తుగా జరిగింది. ఏమి జరుగుతోందో తెలిసేలోగానే అంతా అయిపోయింది” అని గాయపడి దుబాయ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాలరి ‘ది హిందూ’ కు ఫోన్ లో తెలిపాడు. “మా అమాయకత్వాన్ని తెలియపరిచే అవకాశం కూడా వారు మాకివ్వలేదు. మా పడవ నిండా రక్తం నిండిపోయింది” అని 40 యేళ్ళ మురుగన్ తెలిపాడు. పడవలో ఉన్న నలుగురు భారతీయుల్లో మురుగన్ ఒకరు. యు.ఏ.ఇ కి చెందినవారు పడవ నడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఎటువంటి సూచన గానీ అవసరం గానీ లేకుండానే కాల్పులు జరిపారని మురుగన్ తెలిపాడు. కాల్పులు జరిపాక వైద్య సహాయం కావాలని సైగలతో చెప్పినప్పటికీ అమెరికా నౌక ఆగకుండా వెళ్లిపోయిందని ఆయన తెలిపాడు. “బాధ్యులైన వ్యక్తులపై కేసు పెట్టాలని భారత ప్రభుత్వం, యు.ఏ.ఇ ప్రభుత్వంతో గట్టిగా చెప్పాలి” అని మురుగన్ కోరాడు. భారత జాలర్లు ఉన్న పడవ ఘటన జరిగినపుడు అమెరికా నౌకను చుట్టి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నదని జాలర్లు చెప్పినట్లు ది హిందూ తెలిపింది. ఘటన జరిగినపుడు పడవ వేగంగా వెళుతోందనీ, మెల్లగా వెళ్ళాలని కోరినా వారు వినిపించుకోలేదని మరో జాలరి కుమరేశన్ (32) తెలిపాడు.
“భయానకమైన క్షణాలవి. అలాంటి భయంకరమైన పరిస్ధితిని నేనెప్పుడూ ఎదుర్కోలేదు. కేవలం 50 మీటర్ల దూరం నుండే మమ్మల్ని కాల్చారు. కేబిన్ దగ్గర కింద పడుకుని తప్పించుకున్నాను. మా తప్పు ఏమీ లేకుండానే భారీ మూల్యం చెల్లించుకున్నాము. మా పైన కాల్పులు జరపవలసిన అవసరమే లేడక్కడ” అని కుమరేశన్ వివరించాడు. కాల్పులు జరిపిన చోటు దుబాయ్ తీరానికి 48 కి.మీ దూరంలో అంతర్జాతీయ జలాల్లో ఉన్నదని అమెరికా చెబుతోంది. అయితే జాలర్లు చెప్పినాదాన్ని బట్టి అది కూడా అబద్ధమేనని స్పష్టం అవుతోంది. హార్బర్ కి సమీపంలోనే కాల్పులు జరగడంతో చాలా త్వరగా గాయపడినవారిని ఆసుపత్రిలో చేర్చడం సాధ్యమయింది.
అమెరికాదే తప్పు :యు.ఏ.ఇ
“పడవ సరైన మార్గంలోనే వెళుతోందనీ, ఎటువంటి ప్రమాదాన్ని కనబరచలేదనీ ప్రాధమిక విచారణలో తేలింది. కాల్పులు తప్పేనని స్పష్టంగా అర్ధమవుతోంది” అని దుబాయ్ పోలీస్ చీఫ్ దహీ ఖల్ఫన్ తమీమ్ చెప్పినట్లు యు.ఏ.ఇ పత్రిక ‘ది నేషనల్’ ని ఉటంకిస్తూ ది హిందూ తెలిపింది. దుబాయ్ కి నైరుతి దేశలో 48 కి.మీ దూరంలో సంఘటన జరిగిందని అమెరికా చెబుతుండగా ఆ వాదనను యు.ఎ.ఇ గట్టిగా తిరస్కరించింది. తమ జెబెల్ అలీ పోర్టు ముఖద్వారంలో కేవలం 16 కి.మీ దూరంలోనే సంఘటన జరిగిందని ఆ దేశం స్పష్టం చేస్తోంది.
అసలే లేని అణు బాంబు గురించి సంవత్సరాలుగా పచ్చి అబద్ధాలు చెప్పి ప్రపంచాన్ని మోసగిస్తున్న అమెరికాకు వాస్తవాలను తారుమారు చేయడం, తిమ్మిని బమ్మిని చేయడంతో పాటు నిమిషాల్లో మాట మార్చడం చాలా తేలిక. వేల కిలోమీటర్ల దూరం నుండి దిగబడి ఆయిల్ వనరుల కోసం పశ్చిమాసియాలో అల్లకల్లోలం సృష్టించ గలిగినప్పుడు జాతీయ జలాలా, అంతర్జాతీయ జలాలా అని పట్టించుకుని మరీ కాల్పులు జరిపి అమాయకులను చంపుతుందనుకోవడమే పెద్ద భ్రమ.
అమెరికా కంపెనీలను చొరనీయని ఇరాన్ ను లొంగదీసుకోవడానికే పర్షియన్ సముద్రాన్ని యుద్ధరంగంగా అమెరికా మార్చివేసింది. శతాబ్దాలుగా గల్ఫ్ దేశాలతోనూ, పశ్చిమాసియా దేశాలతోనూ, వ్యాపార సంబంధాలతో పాటు సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నందుకు భారత దేశం కూడా మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఇరాన్ పై అమెరికా ప్రారంభించిన ప్రాక్సీ మరియు ప్రత్యక్ష యుద్ధంలో మొట్టమొదటి క్షతగాత్రుడు భారతీయుడే కావడం గమనార్హం. ముంచుకురానున్న ‘పర్షియన్ యుద్ధం’ లో భారత దేశం కూడా ఏదో ఒక రూపంలో అనివార్యంగా స్పందించవలసిన అవసరాన్ని భారతీయ జాలరి మరణం ఎత్తి చూపుతోంది.
జాలర్ల ఆగ్రహం
అమెరికా సైనికుల కాల్పుల్లో చనిపోయిన శేఖర్ (27) రామనాధపురం జిల్లాలోని తోప్పువలసై అనే తీర గ్రామ నివాసి. అతని కుటుంబంలో ఏకైక సంపాదనపరుడు అతనే. కొడుకు మరణవార్త విన్న శేఖర్ తల్లి గుండె నొప్పితో ఆసుపత్రి పాలయ్యింది. ఆమె షాక్ నుండి ఇంకా కోలుకోలేదు. మోయలేని వడ్డీ రేటుకి లక్ష రూపాయలు అప్పు తీసుకుని శేఖర్ 10 నెలల క్రితమే దుబాయ్ వెళ్ళాడు. లక్ష అప్పు ఇంకా తీరనే లేదు. సంపాదించి కుటుంబాన్ని సాకుతాడనుకున్న కొడుకు తనకేమాత్రం తెలియని అంతర్జాతీయ రాజకీయాలకు, అగ్రరాజ్య యుద్ధోన్మాదానికి బలైపోయాడు. తమకు పని ఇచ్చినవారితో అసంతృప్తితో ఉన్న శేఖర్ కొద్ది రోజుల క్రితమే తల్లికి ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించింది కూడా. ఇంతలోనే శేఖర్ తల్లి నాగవల్లి బ్రతుకు దుర్భరంగా మారింది.
శేఖర్ మరణ వార్త తెలిసిన తర్వాత తీర ప్రాంతంలోని జాలర్లు గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలాయాల వద్దకు వచ్చి తమ నిరసన తెలియజేశారు. వేగంగా వస్తోందన్న ఒకే ఒక్క కారణంతో ఒక చిన్న పడవ పై అమెరికా భద్రతా బలగాలు కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం దారుణమని జాలర్ల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒబామా కొత్త యుద్ధానికి ప్రధమ బాధితుడు
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తలపెట్టిన కొత్త యుద్ధానికి భారత జాలరి శేఖర్ మొదటి బాధితుడని ‘ది హిందూ’ పత్రిక బుధవారం ఎడిటోరియల్ లో వ్యాఖ్యానించింది. జనవరి 2012 నుండి ఇరాన్ చుట్టూ అమెరికా మిలట్రీ బలగాల కేంద్రీకరణ స్ధిరంగా పెరుగుతూ వచ్చిన ఫలితంగానే భారతీయ జాలర్లు మరణించడం, గాయపడడం జరిగిందని వ్యాఖ్యానించింది. మరిన్ని ఫైటర్ విమానాలను అమెరికా పశ్చిమాసియాకు పంపిందనీ, మైన్ స్వీపర్లు, ఉభయచర రవాణా వాహనాలు, డాకింగ్ నౌకలతో పర్స్ధీయన్ గల్ఫ్ లో తిష్ట వేసిందని తెలిపింది. అలాంటి నౌకలోని భద్రతా సిబ్బందే భారతీయ జాలరిని కాల్చి చంపారని తెలిపింది. అమెరికా వాదనలు ఏమైనప్పటికీ అసలు నిజానికి ఏమి జరిగిందో ఎప్పటికీ తెలియకపోవచ్చని వ్యాఖ్యానించింది.
ఇరాన్ పై ఐక్యరాజ్య సమితి విధించిన అన్నీ ఆంక్షలను ఇండియా అమలు చేసిందనీ, అమెరికా, యూరప్ లు స్వయంగా విధించిన ఆంక్షల విషయంలో తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇండియా పీకులాడుతోందని ఎడిటోరియల్ వ్యాఖ్యానించింది. ఇరాన్ క్రూడాయిల్ వాణిజ్యంపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించకపోయినా అమెరికా సొంత ఆంక్షలు విధించి వాటి అమలుకి భారత్ పై ఒత్తిడి తెచ్చిందనీ ఫలితంగా ఆయిల్ దిగుమతులు ఇండియా తగ్గించుకుందనీ తెలిపింది. పశ్చిమాసియాలో అరవై లక్షల మంది భారతీయులు జీవనం సాగిస్తున్న నేపధ్యంలో శేఖర్ మరణంతోనైనా భారత్ కళ్ళు తెరవాలని కోరింది. క్రియారహితంగా ఉండడం మానేసి పశ్చిమాసియా ప్రాంతంలో మరో యుద్ధం జరగకుండా భారత్ రాయబార ప్రయత్నాలు ముమ్మరం చేయాలనీ భారత్ ప్రయోజనాల రీత్యా అది అవసరమనీ వ్యాఖ్యానించింది.