కంపల్సరీ లైసెన్స్ ఫలితం, 2.8 లక్షల కేన్సర్ ఔషధం ఇప్పుడు 9 వేలే


ప్రపంచ మార్కెట్ లో 2.8 లక్షల రూపాయల ఖరీదు చేసే ఔషధాన్ని కేవలం 9 వేల రూపాయలకే భారత దేశ కంపెనీ ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధ లో భాగమైన ట్రిప్స్ (Trade Related Intellectual Property Rights) ఒప్పందం ప్రకారం ఒక కంపెనీ పేటెంటు పొందిన ఔషధాన్ని మరొక కంపెనీ తయారు చేయరాదు. ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ ఖరీదుకు మందులు తయారు చేయగలిగినా ట్రిప్స్ ఒప్పందం దానిని నిషేధిస్తుంది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి ‘కంపల్సరీ లైసెన్సింగ్‘ అనే చిన్న అవకాశాన్ని వినియోగించుకోవడానికి భారత ప్రభుత్వం ధైర్యం చేయడంతో ‘నెక్సావార్’ అనే కేన్సర్ ఔషధాన్ని 30 రెట్లు తక్కువ ఖరీదుకు హైద్రాబాద్ ఔషధ కంపెనీ ‘నాట్కో ఫార్మా’ తయారు చేయగలిగింది. కంపెనీల వ్యాపార ప్రయోజనాలను పక్కకు నెట్టినా, దేశీయ కంపెనీల ప్రయోజనాలను ప్రధమ స్ధానంలో నిలిపినా భారత ప్రజలకు ఎంత ఉపయోగమో ‘నెక్సావార్’ వ్యవహారం నిరూపిస్తున్నది.

‘నెక్సావార్’ ఔషధంపై జర్మనీ ఔషధ కంపెనీ బేయర్ కార్పొరేషన్ కు పేటెంటు ఉంది. 120 గుళికలు (టాబ్లెట్స్) కలిగిన డోసు ను ఆ కంపెనీ 2.8 లక్షల రూపాయలకు అమ్ముతుంది. ఈ మందుకు గల జెనెరిక్ కాపీని కేవలం తొమ్మిది వెలకే తయారు చేస్తానని హైద్రాబాద్ ఫార్మా కంపెనీ ‘నాట్కో ఫార్మా’ నాలుగు సంవత్సరాల క్రితం 2008 లో దరఖాస్తు చేసుకుంది. ట్రిప్స్ ఒప్పందం ప్రకారం ఉత్పత్తుల పేటెంట్ ఉల్లంఘన నేరం. అయితే ఔషధ ఉత్పత్తులకు ‘కంపల్సరీ లైసెన్స్’ లు ఇచ్చే సౌకర్యం ఒప్పందంలో కల్పించబడింది. పేరుకు సౌకర్యం ఉన్నప్పటికీ దానిని వినియోగించకుండా ఉండేందుకు పశ్చిమ దేశాల కంపెనీలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తమ ప్రభుత్వాల ద్వారా ఒత్తిడి తేవడంలో సఫలం అవుతున్నాయి.

నిబంధనల ప్రకారం దేశీయ అవసరాల కోసం అంతర్జాతీయ పేటెంట్లను పక్కన బెట్టి ఔషధాలను తక్కువ ఖరీదుకు ఏ దేశమైనా తయారు చేసుకోవచ్చు. అయితే అలా తయారు చేసుకున్నప్పటికీ పేటెంట్ హక్కుదారుకు కొంత మొత్తంలో రాయితీ చెల్లించవలసి ఉంటుంది. తక్కువ ఖరీదుకు మందులు తయారు చేస్తే ఆ మేరకు రాయితీ కూడా తగ్గిపోతుంది. పైగా 30 రెట్లు తక్కువ ఖరీదు కు తయారు చేయడం అంటే పెద్ద మొత్తంలో కంపెనీ లాభం కోల్పోతుంది. ఈ నేపధ్యంలో ట్రిప్స్ ఒప్పందంలోని అవకాశాన్ని వినియోగించుకోకుండా బడా కంపెనీలు భారత్ లాంటి దేశాలపై ఒత్తిడి తేవడంలో విజయవంతం అయ్యాయి.

అంతర్జాతీయ పేటెంట్ ను పక్కన పెట్టడానికి భారత ప్రభుత్వం దేశీయ కంపెనీకి ‘కంపల్సరీ లైసెన్స్’ జారీ చేయవలసి ఉంటుంది. ‘నాట్కో ఫార్మా’ కు కంపల్సరీ లైసెన్సు ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ దానిని అడ్డుకోవడానికి బేయర్ కార్పొరేషన్ శతవిధాలా ప్రయత్నించింది. తనకు కంపల్సరీ లైసెన్స్ ఇచ్చే విషయంలో బేయర్స్ కార్పొరేషన్ కి అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అది స్పందించలేదు. నిబంధన ప్రకారం పేటెంట్ కంపెనీ అనుమతి కోరినప్పటికీ నాలుగేళ్లుగా స్పందించలేదు. దానితో ప్రభుత్వమే స్వతంత్రించి నాట్కో కు ‘కంపల్సరీ లైసెన్స్’ ను మంజూరు చేసింది.

నిజానికి కంపల్సరీ లైసెన్స్ ఇవ్వడానికి, రాయితీ చెల్లిస్తున్నంతవరకూ, ట్రిప్స్ ఒప్పందం ప్రకారం ఎవరి అనుమతి అవసరం లేదు. దేశీయ అవసరాల కోసం పరిమిత స్ధాయిలో ఎగుమతి చేసే హక్కులతో సహా, జెనెరిక్ ఔషధాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని పశ్చిమ దేశాలు ఎప్పటినుండో విస్తృతంగా వినియోగించు కుంటున్నాయి. కానీ వర్ధమాన దేశాలకు మాత్రం వివిధ ఒత్తిడిల ద్వారా ఈ అవకాశాన్ని నిరాకరిస్తూ వచ్చాయి. ‘నెక్సావార్’ విషయంలో కూడా భారత ప్రభుత్వం అటు బహుళజాతి కంపెనీలతో పాటు విదేశీ ప్రభుత్వాలకు కూడా సమాధానం చెప్పుకోవలసిన అవసరం తలెత్తడాన్ని బట్టి అంతర్జాతీయ ఒప్పందాలలోని చిన్న అవకాశాలు కూడా పేద దేశాలకు దూరంగా ఉన్నాయని అర్ధం అవుతోంది.

దేశీయ కంపెనీకి ‘కంపల్సరీ లైసెన్స్’ ఇచ్చిన అనంతరం భారత దేశ వాణిజ్య మంత్రి దానికి మంగళవారం వివరణ ఇచ్చుకున్నాడు. చట్ట విరుద్ధంగా తామేమీ వ్యవహరించలేదని ఆయన అంతర్జాతీయ విమర్శలకు సమాధానం చెప్పాడు. తాము ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదనీ, నాలుగేళ్లుగా భారత కంపెనీ పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్ లోనే ఉన్నదనీ, ఎటువంటి నిర్ణయమూ జర్మనీ కంపెనీ చెప్పని పరిస్ధితిలోనే ‘కంపల్సరీ లైసెన్స్’ ఇచ్చామనీ తెలిపాడు. అయితే బేయర్ కార్పొరేషన్ మాత్రం భారత్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియాలో పేటెంట్ కార్యాలయంలో కేసు దాఖలు చేసింది. భారత్ నిర్ణయం శాస్త్ర పరిశోధనకు ఆటంకం అని వితండవాదన చేసింది. పరిశోధన ద్వారా ఔషధాలను ప్రజలకు చేరువకు తీసుకురావడానికి బదులు ఆటంకం కలిగిస్తూ వ్యాపార లాభాలే పరమావధిగా చేసుకోవడాన్ని ఇన్నోవేషన్ పేరుతో సమర్ధించుకుంది.

అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగానే తాము కంపల్సరీ లైసెన్స్ ఇచ్చామని వాస్తవానికి ఈ సౌకర్యం అభివృద్ధి చెందుతున్న దేశాలను దృష్టిలో పెట్టుకుని కల్పించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా దానిని వినియోగించాయని ఆనంద్ శర్మ గుర్తు చేశాడు. “అమెరికా దానిని వినియోగించుకుంది. యూరప్ దేశాలూ వినియోగించుకున్నాయి. కేన్సర్ నివారణ ఔషధాల కోసం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా దానిని వినియోగించుకున్నాయి” అని చెబుతూ ఆయన నిబంధనల ప్రాకారం బేయర్ కు రాయల్టీ చెల్లిస్తామని తెలిపాడు.

ట్రిప్స్ ఒప్పందం పై సంతకం చేయక ముందు భారత దేశంలో ఉత్పత్తులపై పేటెంట్ ఇచ్చేవారు కాదు. కేవలం ఉత్పత్తుల తయారీ విధానంపై మాత్రమే పేటెంట్ ఇచ్చేవారు. తద్వారా ఒకే ఔషధాన్ని అనేక ఇతర విధానాల ద్వారా తయారు చేసి ఔషధాల ధరలు తగ్గించడానికి అవకాశం ఉండేది. అభివృద్ధి చెందిన దేశాలు ట్రిప్స్ ఒప్పందాన్ని ప్రపంచంపై రుద్దడంతో ఈ అవకాశం పూర్తిగా రద్దయింది. పేద దేశాల కోసం ఒప్పందంలో ‘ఫ్లెక్సిబిలిటీ’ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ‘కంపల్సరీ లైసెన్సింగ్’ విధానాన్ని చిన్న అవకాశంగా ప్రవేశ పెట్టారు. అలాంటి చిన్న అవకాశం ద్వారానే 30 రెట్లు తక్కువకు ఔషధాన్ని అందించగలిగిన భారత కంపెనీలకు పూర్తి అవకాశాలు భారత ప్రభుత్వం ఇవ్వగలిగితే అనేక ఔషధాలను అత్యంత తక్కువ ధరలకు ప్రజల వద్దకు తేవడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. కానీ నూతన ఆర్ధిక విధానాలలో భాగంగా ప్రజా వ్యతిరేక ‘మేధో హక్కుల ఒప్పందం’ పై సంతకం చేసిన భారత పాలకులకు ఆ సంసిద్ధత లేకపోవడమే అసలు సమస్య.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s