రిటైల్ అమ్మకాలు లాంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు భారత దేశం అడ్డుపడుతోందన్న ఒబామా ఆరోపణను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలు చేసే బదులు ‘ప్రొటెక్షనిజం’ ను అరికట్టడంలో ఒబామా తన నాయకత్వ ప్రతిభ కనబరచాలని కోరింది. భారత దేశంలో విదేశీ రిటైల్ పెట్టుబడులు వాస్తవంగా పెరుగుతున్నాయనీ రిటైల్ పెట్టుబడులకు ఇండియాలో ఆటంకాలు లేవనడానికి అదే సాక్ష్యమని భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ వివరించాడు. సంస్కరణలు అమలు చేయడంలో, సరళీకరణ విధానాలు చేపట్టడంలో ఇండియా వాస్తవానికి వేగంగా దూసుకుపోతోందని ఆనంద్ శర్మ తెలిపాడు.
ఆదివారం పి.టి.ఐ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒబామా ఇండియా పై ఆరోపణలు సంధించాడు. మరీ ఎక్కువ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఇండియా నిషేధించిందని ఆయన ఆరోపించాడు. మరో ఆర్ధిక సంస్కరణల వెల్లువను భారత్ చేపట్టాలని కోరాడు. “ఇండియాలో పెట్టుబడి పెట్టడం ఇంకా చాలా కష్టంగా ఉంది. రిటైల్ లాంటి అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులపై పరిమితి విధించడమో నిషేధించడమో చేస్తోంది. ఇండియా ఆర్ధిక వృద్ధి కొనసాగాలంటే విదేశీ పెట్టుబడుల అవసరం చాలా ఉంది” అని అమెరికా అధ్యక్షుడు పి.టి.ఐ తో అన్నాడు.
ఒబామా ఆరోపణలకు ఆనంద్ శర్మ స్పందించాడు. “ఈ పరిశీలనను మేము గమనించాం. వాస్తవానికి, ఊహలకు (perception) ఎప్పుడూ తేడా ఉంటుంది. విదేశీ పెట్టుబడిదారులకు ఇండియా ఆకర్షణీయమైన లక్ష్యంగా ఇప్పటికీ ఉంది. యు.ఎన్.సి.టి.ఏ.డి ఇటీవలి నివేదిక ప్రకారం విదేశీ పెట్టుబడులకు మొదటి మూడు లక్ష్యాల్లో ఇండియా ఒకటి. జపాన్ అంతర్జాతీయ సహకార బ్యాంకు ప్రకారం ఇండియా రెండో స్ధానంలో ఉంది. దీర్ఘకాలిక లక్ష్యాల్లో మొదటి స్ధానంలో ఉంది. కీర్నే కన్సల్టెంట్ ప్రకారం ఇండియా రెండో స్ధానంలో ఉంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రకారం దక్షిణాసియాలో ఐదింట నాలుగు వంతుల విదేశీ పెట్టుబడులు ఇండియాకే వస్తున్నాయి. గత మూడేళ్లలో ఆర్ధిక సంస్కరణలు, సరళీకరణ లకు సంబంధించి ఎఫ్.డి.ఐ విధానంలో ఇండియా వరుస మార్పులు తెచ్చింది” అని ఆనంద్ శర్మ న్యూఢిల్లీలో విలేఖరులకు తెలిపాడు.
“ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను చూస్తే అమెరికా అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. నాయకత్వాన్ని కనబరచాలని మేము అమెరికాను కోరుతున్నాం. అడ్డంకులను తొలగించడంలోనూ, పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడంలోనూ నాయకత్వం చూపాలి. అది ప్రతి ఆర్ధిక వ్యవస్ధకూ మంచిది. ‘ప్రొటెక్షనిజం’ కు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి అమెరికా నాయకత్వం వహించాలి. ఆగిపోయిన (డబ్ల్యూ.టి.ఓ) దోహా వాణిజ్య చర్చలను ముందుకు తీసుకెళ్లాలి. వాటికి అర్ధవంతమైన ముగింపు ఇవ్వాలి” అని ఆనంద్ శర్మ కోరాడు.
అమెరికా నాయకత్వంలోని అభివృద్ధి చెందిన దేశాలు డబ్ల్యూ.టి.ఓ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవసాయ రంగం పై చర్చల నుండి ఉపసంహరించుకోవడంతో పదేళ్ళ క్రితం దోహా రౌండ్ చర్చలు శాశ్వతంగా ఆగిపోయాయి. అమెరికా కంపెనీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండడంతో ఆ చర్చలు ఇక ముందుకు సాగలేదు. ఆనంద్ శర్మ ఆ విషయాన్నే ఒబామా ని ఎత్తిపొడుస్తూ ప్రస్తావిస్తున్నాడు. అమెరికా, యూరప్ ల పెత్తనం పెద్దగా సాగనీ యు.ఎన్.సి.టి.ఏ.డి నివేదికను ఆయన ప్రస్తావించడం కూడా అందుకే.
ఆనంద్ శర్మ ప్రకారం గత సంవత్సరం భారత దేశంలోకి 50 బిలియన్ డాలర్ల (2.75 లక్షల కోట్ల రూపాయలు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకు ముందు సంవత్సరం కంటే ఇది 35 శాతం ఎక్కువ. అలాంటప్పుడు ఈ ఊహలు ఎందుకో తనకు అర్ధం కాలేదని శర్మ ప్రశ్నించాడు. “ఎఫ్.డి.ఐ లు బాగా తగ్గితే అనుకోవచ్చు. 34-35 శాతం పెరుగుదల ఉంటే అలాంటి ఊహల్లో ఎక్కడో తప్పుందని గుర్తించాలి” అని ఆనంద్ శర్మ అన్నాడు. తన అంచనాలను తెలిపే హక్కు ఒబామాకు ఉందనీ అయితే విధాన నిర్ణయం భారత దేశ సార్వభౌమ హక్కు అనీ శర్మ చెప్పాడు. భారత దేశం పెట్టుబడులకు స్నేడుతురాలు కూడానని ఆయన నొక్కి చెప్పాడు. సంస్కరణల అమలుకు నిర్ద్వంద్వంగా కట్టుబడి ఉన్నామని ఆనంద్ శర్మ ఒట్టు పెట్టాడు.
ఆనంద్ శర్మ దూకుడుగా ఇచ్చిన ప్రకటన ద్వారా భారత ప్రభుత్వానికి విదేశీ పెట్టుబడులతో ఎంత స్నేహామో అర్ధం అవుతోంది. ఒబామా కోరుకున్న వేగంతో దేశాన్ని విదేశీ పెట్టుబడులకు తాకట్టు పెట్టడం లేదు గానీ అసలైతే తాకట్టే పెడుతున్నాం కదా అని అమెరికా మాస్టర్లకు ఆయన చెప్పుకుంటున్నాడు. పైకి కనపడకపోయినా, పత్రికలకు చెప్పకపోయినా వరుస చర్యలు తీసుకుంటూ ఆర్ధిక సంస్కరణలు అమలు చేస్తున్నామనీ, భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను కాపాడే చట్టాలను సరళీకరిస్తున్నామనీ చెప్పుకున్నాడు. అధ్యక్షుడు ఒబామా నుండి విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ మీదుగా ఛోటా మోటా అమెరికా నాయకులంతా ఆత్రపడుతున్న రిటైల్ రంగ ప్రవేటీకరణ పండేరం త్వరలోనే ఉంటుందనీ, రిటైల్ రంగంపై ఆధారపడిన కోటి కుటుంబాల భవిష్యత్తు, ఆర్ధిక జీవనం తమకసలు లెక్కే కాదనీ విదేశీ పెట్టుబడులే తమకు ప్రధానమనీ కాకపోతే నిరసనలు తలెత్తకుండా లెక్క ప్రకారం ఆపని సాధిస్తామనీ విన్నవించుకున్నాడు. అమెరికాకు చేసుకున్నా విన్నపాలకు ‘సార్వభౌమత్వం’ అంటూ బడాయి పోవడమే ఆనంద్ శర్మ గారి పోకడలోని ప్రత్యేకత. నిజానికి ఇది భారత పాలకుల ట్రేడ్ మార్క్ ప్రత్యేకత కూడా.
నిజానికి మీరు పెట్టుబడులకు వ్యతిరేకా లేకపొతే భారతీయులు పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే వ్యతిరేకా?
రూపాయిలు కొనడం పెరిగితే Dollar విలువ పెరిగి విదేశాల నుంచీ దిగుమతి చేస్తున్న ఎరువుల ధరలు పెరుగుతాయి, మళ్ళీ నష్టపోయేది రైతే
ఫణీంద్ర గారూ, ఈ ఆర్టికల్ పరిధి వరకూ చూస్తే విదేశీ పెట్టుబడుల నిలువు దోపిడీకి, వాటికి సలాం చేస్తూ దేశీయ వనరులను అప్పజెబుతున్న విధానాలకూ వ్యతిరేకిని.