ఉత్తర కొరియా నుండి ఊహించని వార్త వెలువడింది. మిలటరీ చీఫ్ ‘రి యాంగ్-హో’ ను అనారోగ్య కారణాల రీత్యా పదవి నుండీ, ఇతర అన్ని అధికార పదవులనుండీ తొలగించినట్లు ప్రభుత్వ వార్తా సంస్ధ కె.సి.ఎన్.ఎ ప్రకటించింది. సెంట్రల్ మిలటరీ కమిషన్ కు వైస్ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న రీ, అధికార పార్టీ వర్కర్స్ పార్టీలోనూ అనేక పదవులు నిర్వహించిన సీనియర్ నాయకుడు. రీ తొలగింపు ‘అసాధారణం’ గా దక్షిణ కొరియా కొరియాల ‘ఏకీకరణ మంత్రిత్వ శాఖ’ ప్రతినిధి అభివర్ణించగా తొలగింపు కారణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని బి.బి.సి తెలిపింది.
వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో ఆదివారం సమావేశమైన అనంతరం తొలగింపు ప్రకటించింది. రీ వారసుడు ఎవరన్నదీ ఇంకా ప్రకటించలేదు. మూడేళ్ళ క్రితం ఆర్మీ చీఫ్ పదవి చేపట్టిన రీ యాంగ్-హో, దేశ యువ అధ్యక్షుడు ‘కిమ్ జోంగ్-ఉన్’ ను దివంగత ‘కిమ్ జోంగ్-ఇల్’ కు వారసుడిగా ప్రతిష్టించడంలో కీలక పాత్ర పోషించినట్లు పత్రికలు చెబుతున్నాయి. కిమ్ జోంగ్-ఇల్ గత డిసెంబర్ లో హఠాత్తుగా మరణించిన అనంతరం అత్యంత పిన్న వయస్కుడైన ‘కిమ్ జోంగ్-ఉన్’ సర్వాధ్యక్ష పదవిని చేపట్టాడు. కిమ్ అంతిమ యాత్ర కు నాయకత్వం వహించినవారిలో రీ కూడా ఒకరు. అలాంటి వ్యక్తిని కేవలం అనారోగ్య కారణాలతో తొలగించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
యువ నాయకుడు కిమ్ ఉన్ కు ఆంతరంగిక సభ్యులలో రీ కీలక వ్యక్తిగా కూడా దక్షిణ కొరియా వర్గాలు చెబుతున్నాయి. గత ఆరేడు నెలలుగా కిమ్ ఉన్ అధికారాన్ని సుస్థిరం చేయడంలోనూ రీ ప్రముఖ పాత్ర నిర్వహించినట్లు తెలుస్తోంది. రీ తొలగింపు ద్వారా ఉత్తర కొరియాను కిమ్ ఉన్ తీసుకెళ్లే దిశకు సంబంధించి ఏమన్నా సూచనలు ఉన్నాయేమో అని విశ్లేషకులు వెతుకుతున్నారు. అమెరికా తన శక్తులను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కేంద్రీకరిస్తూ చైనాను చుట్టుముట్టిన నేపధ్యంలో కీలక దక్షిణ చైనా సముద్రం లో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఉత్తర కొరియా లో జరుగుతున్న పరిణామాలు పశ్చిమ దేశాలకు పరమ ఆసక్తికరం.
రీ యాంగ్ కు గత ఏప్రిల్ నెలలో ప్రమోషన్ కి రావలసి ఉండగా అది దక్కలేదనీ అప్పుడే ఆయన భవిష్యత్తుపై అనుమానాలు వచ్చాయని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ తెలిపింది. అంతే కాకుండా అదే నెలలో పలువురు ధనికులైన యువ ఆర్మీ ఆఫీసర్లను ఆర్మీలో ఉన్నత స్ధానాలకు కిమ్ ఉన్ ప్రమోట్ చేశాడని ఆ సంస్ధ తెలిపింది. ఇదంతా పాలనా వ్యవస్ధపై తనదైన ముద్ర వేసి ఆర్ధిక వ్యవస్ధకు తను భావిస్తున్న రీతిలో పునరుత్తేజం చేయడానికే కావచ్చని ఉత్తర కొరియా విశ్లేషకులను ఉటంకిస్తూ ఎ.పి తెలిపింది.
యువ నాయకుడు కిమ్ ఉన్, కీలక ప్రభుత్వ సంస్ధలైన వర్కర్స్ పార్టీ లో గానీ, ఆర్మీ లో గానీ ఎటువంటి బాధ్యతా నిర్వహించకుండానే నేరుగా దేశాధ్యక్ష పదవిని చేపట్టాడు. ఆర్మీ ఉన్నతాధికారులతో పెద్దగా సాన్నిహిత్యం లేని కిమ్ ఉన్ పదవిని సుస్థిరం చేసుకునే కృషిలో భాగంగా పలు మార్పులు చేపడుతున్నట్లు భావిస్తున్నారు. త్వరలో మరి కొంతమంది వృద్ధ నాయకులు కూడా పదవీ వియోగం పొందవచ్చని వారు భావిస్తున్నారు. కిమ్ ఉన్ నేతృత్వంలోనే ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా ఒక రాకెట్ ను పరీక్షించింది. వాస్తవానికి అది దీర్ఘ కాళిక లక్ష్యం కలిగిన మిస్సైల్ గా పలువురు అనుమానించారు.