రుతుపవనాలు సిక్కింలోని ప్రకృతికి అద్దిన అందాలను ఈ ఫొటోలు అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. అర్జెంటుగా ఈ ఫొటోలు తీసిన గ్యాంగ్ టక్ కి పరిగెత్తుకెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఫొటోగ్రఫీని మనమూ హాబీగా ఎందుకు చేసుకోకూడదు? అని కూడా అనిపిస్తోంది.
ఫొటోల్లోని మూడ్ చూస్తే మత్తుగా, మంగుగా, బద్ధకంగా కనిపిస్తున్నప్పటికీ వర్షం కురిసి వెలిసినప్పటి చురుకుదనం ఆ మత్తుని తరిమికొడతానని సవాలు చేస్తున్నట్లుగా ఉంది. విద్యుత్ దీపాల కృత్రిమ వెలుగులకి సహజత్వాన్ని ఇస్తూ, రాత్రి దుప్పటిలోకి కూడా చొరబడి తానున్నానని గుర్తు చేస్తూ, పసిపాపల నిష్కళంకత్వానికి పరిశుభ్రతని జోడిస్తూ, పగటి ధిక్కారాన్ని గేలి చేసే చీకటి గాని చీకట్లని అలుముతూ, కొండ కోనల్లోని చెట్ల పచ్చదనం తనదేనని తలెగరేస్తూ, జంట ముచ్చట్ల కువ కువలు విని ముసి ముసి నవ్వులు నవ్వుతున్నట్లుగా ఉంది. అనేకత్వంలో ఏకాంతాన్నిస్తున్న మంచు తెరలూ తనవేనని చెబుతున్నట్లుగా కూడా ఉంది.
రుతుపవనాలు భారత దేశ ప్రజలకు జీవ ధార. నూటికి అరవై ఐదు మంది వ్యవసాయం పై బతికే దేశంలో ఋతుపవనాలు కాస్త ఆలస్యం అయినా, ఆశించిన స్ధాయిలో నీటి మబ్బుల్ని మోసుకు రాకపోయినా ప్రజల జీవధార సైతం బలహీనపడుతుంది. ఇప్పటివరకూ ఋతుపవనాలు దేశం మొత్తం మీద 23 శాతం తక్కువ వర్షపాతం ఇచ్చాయని వాతావరణ శాఖ ఈ రోజు చెప్పింది. ప్రకృతిని లొంగదీసుకున్న మానవుడు స్వార్ధ బుద్ధితో సాటి మనుషుల్ని దోచుకోవడమే కాక ప్రకృతి వనరులని కూడా ఆబగా వాటేస్తున్నాడు. ఫలితంగా భూమి వేడెక్కి ప్రాకృతిక ఋతుపవన చక్రం అస్తవ్యస్తం అయిపోయింది. పచ్చనాకు ఎండిపోయి నిరంతర ప్రవాహం కావలసిన జీవధార బొట్టు బొట్టుగా కొడిగట్టింది.
–
ఫొటోలన్నీ అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయ్… దీటుగా మీ వ్యాఖ్యానం!
రోడ్లు చూడడానికి అందంగానే ఉన్నాయి. సిక్కిం వెళ్ళే పర్యాటకుల సంఖ్య పెరిగితే అక్కడ కూడా చెత్త కవర్లూ, వాటర్ బాటిలూ పేరుకుపోయి, రోడ్ల అందం తగ్గిపోతుంది. ఊటీలో అదే జరిగింది.
విశేఖర్ గారూ,
నిజంగా రుతుపవనాలు స్పర్శించిన సిక్కిం ప్రకృతి సౌందర్యం జిగేల్మంటోది. కాని వర్షంతో తడిసినప్పుడు మా ఊరు దాని వీధులపక్క ఉండే బాటమల్లి, మందార పూల సౌందర్యం మరింత బాగా ఉంటుందనిపిస్తుంది. కాని వర్షం పడ్డ తర్వాత పల్లె నేల భీభత్సంగా ఉంటుంది నీటి పారుదల ద్వారా వచ్చిపడే చెత్తా చెదారంతో. కాని చెట్లమీద వర్షపు నీరు, వడగళ్లతో తడిసిన వాన, చెరువు చుట్టూ పచ్చదనపు జిగేలు చూడాలంటే పల్లె బాట పట్టాల్సిందే..
ప్రవీణ్ గారూ,
మీరు చాలా ఎక్కువగా పర్యటనలు, పర్యాటక యాత్రలు చేస్తున్నారనిపిస్తోంది. మీకంత సమయం ఎలా దొరకుతోందసలు. నాకయితే నాకంటూ సమయం కేటాయించుకుని చెన్నయ్‌లో వండలూరు జూ కి వెళ్లడం, విశాఖపట్నంలో ఉన్నప్పుడు 2003లో అరకులోయకు వెళ్లటం, తిరుపతికి పక్కన తలకోనకు వెళ్లి మలేరియాతో తిరిగిరావడం ఇదే నా పర్యాటక చరిత్ర. మలేరియా మహమ్మారి మాటున దాగి ఉండే అటవీ సౌందర్యం మాత్రం చాలా బాగా తెలుసు. ఏమైనా “అదృష్టవంతులు” మీరు…
మన రాష్ట్రంలోని పర్యాటక క్షేత్రాలలో నేను చూసినవి విశాఖపట్నం & అరకు మాత్రమే. ఊటీ, కొడైకనాల్లకి నేను 2002లో వెళ్ళాను.