జనం అంటే తనకు చిరాకని కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం తన నోటితోనే చాటుకున్నాడు. ప్రజల ఈతి బాధలని గ్రహించి దూరం చేయవలసిన బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి వర్యులు ఐస్ క్రీమ్ పై మక్కువనీ, బియ్యం ధరల పెరుగుదలపై వ్యతిరేకతనూ పోల్చి తన ‘వర్గ బుద్ధి’ ప్రదర్శించుకున్నాడు. మీడియా సాక్షిగా తన బుద్ధి సక్రమం కాదనీ, గిరిజనుల సంపద దోచే కంపెనీలకు వత్తాసు పలకడమే కాక సాధారణ మధ్యతరగతి ప్రజల కష్టాలపై కూడా సరైన అవగాహన, కష్టాలను తీర్చడంలో అభిరుచి లేదనీ తెలియజేసుకున్నాడు.
బెంగుళూరులో పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చిదంబరం ప్రజల అవసరాల విషయంలో తన నిజ స్వరూపం చూపాడు. “దానివైపు (ధరల పెరుగుదల) కేవలం మధ్య తరగతి దృష్టితోనే చూడలేము. ఇంకా అనేక ఇతర సెక్షన్లు ఉన్నాయి… కొన్నిసార్లు మనం వాటర్ బాటిల్ కోసం రు. 15 రూపాయలు ఖర్చుపెడతాం, కానీ బియ్యం ధరో, గోధుమల ధరో ఒక్క రూపాయి పెరిగినా భరించలేము. ఐస్ క్రీమ్ కోన్ కోసం రు.20 చెల్లించడానికి సిద్ధంగా ఉంటాం కానీ కిలో బియ్యం కోసమో, గోధుమల కోసం ఒక్క రూపాయి ఎక్కువ పెట్టలేం.”
శుభ్రమైన తాగు నీటిని తాగాలన్న ప్రజల ఆరోగ్యపరమైన కోరిక పట్లా, ఐస్ క్రీమ్ తిందామన్న చిన్న పిల్లల ఉబలాటం తీర్చడంలో మధ్యతరగతికి ఉండే మక్కువ పట్లా ఏ మంత్రయినా ఇలాంటి క్రూరమైన హాస్యం ఆడతాడనీ, సున్నితత్వం లేని మొరటుతనంతో వ్యాఖ్యానిస్తాడని ఊహించలేని విషయం. పెరుగుతున్న ధరలను అరికట్టే ఉపాయాలు వెతకడమో, ప్రజల ఆదాయాలు పెంచడానికి మార్గాలు చూపడమో మాని ఇంత అసహ్యకరమైన అభిరుచిని ఒక బాధ్యతాయుత మంత్రి వ్యక్తపరుస్తాడని భావించడం కష్ట సాధ్యం.
చిదంబరం ప్రకారం మధ్యతరగతి జనం ఐస్ క్రీమ్ లు, వాటర్ బాటిళ్ళు కొనడం మాని పెరిగే ధరలతో కొండెక్కుతున్న బియ్యం, గోధుమలకే ఆదాయ వనరులన్నీ ధారపోయాలన్నమాట. కడుపు నింపుకోవడం తప్ప ప్రజలకు సంబంధించి మరే అవసరమూ తీరనవసరం లేదన్నమాట. వీళ్ళకి ఎప్పటికీ తరగని బ్యాంకు బాలెన్సు లు కావాలి. అడుగు అడుగుకీ తీవాచీలు కావాలి. నిల్చున్నా, కూర్చున్నా తమ చుట్టూ ఉన్న గాలినీ, ఊపిరినీ నిశ్శబ్దంగా చల్లబరిచే ఎ.సి మిషన్లు కావాలి. అలసట వచ్చి నడుం వాల్చితే, ఒక్క చర్మ కణానికి కూడా ఒత్తిడి తెలియని సుకుమారమైన పరుపులు, వాటర్ బెడ్లూ కావాలి. లక్షల కోట్లు నోల్లుకోవడానికి ప్రతేడూ ఓ కుంభకోణం కూడా కావాలి వీళ్ళకి. మధ్య తరగతి జనానికి మాత్రం తినడానికి బియ్యమో, గోధుమలో ఉంటే సరిపోతుంది. తాగేందుకు శుభ్రమైన నీరు కూడా అవసరం లేదు.
మధ్య తరగతి జనం పైనే ఇంత చీదర ఉంటే కూలీ నాలీ జనంపై ఈయనకి ఉండే అభిప్రాయాలూ తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అందుకే కాబోలు. మా తమలపాకు తోటలు మాకు కావాలని కోరుతున్న పోస్కో కంపెనీ బాధిత ఒడిశా గిరిజనుల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చడానికి పారామిలట్రీ బలగాల్నీ, కేంద్ర అదనపు బలగాల్నీ దింపింది. ఛత్తీస్ ఘడ్ గిరిజనానికి ఉచిత వైధ్యం చేసే నిస్వార్ధ డాక్టర్ బినాయక్ సేన్ ని తప్పుడు కేసులు పెట్టి ఖైదు చేయించిందీ అందుకే కావచ్చు. గిరిజనుల సమస్యలని పరిష్కరించకుండా వారి ఆస్తి హక్కులని గౌరవించకుండా వారి పాదాల కింద ఉన్న బాక్సైట్, ఇనుము గనుల కోసం, నల్ల చట్టాలు ప్రయోగించి అడవులనుండి వారిని తరిమేస్తున్నదీ అందుకే కావచ్చు. పేదలే కదా, రోడ్డు మీదికి ఈడ్చినా అడుక్కునైనా బతుకుతారు, లేదా ఆకలేసి ఛస్తారు. వారు బతికి ఏ కుంభకోణాలు చేయాలి గనక?
దాహం వేసినప్పుడు దారిలో మునిసిపాలిటీ కొలాయి కూడా లేకపోతే పేదవాడైనా వాటర్ బాటిల్ పదిహేను రూపాయలకి కొంటాడు. బస్సులలో ప్రయాణించేవాళ్ళకి ఇది అనుభవమే. విమానాలలో ప్రయాణించే చిదంబరానికే ఈ విషయం తెలియదు. బీర్ తాగనివాళ్ళకి కూడా బీర్ ధరని టికెట్ ధరలో కలిపేసి టికెట్‌లని అమ్ముతాయి మన విమానయాన కంపెనీలు. బీరే చవక అనుకునేవాళ్ళకి మంచినీళ్ళ విలువ ఏమి తెలుస్తుంది?
ఇలాంటి వాళ్ళను కొద్ది రోజులు ఆదిలాబాద్ అడవులలో ఉండే గిరిజన తెగల తన్దాలలో ఉంచాలి. అప్పుడు గానీ వాళ్ళు మనుష్యులను మనుష్యులుగా చూడటం నేర్చుకుంటారు.
____________________________________________
Visit http://bookforyou1nly.blogspot.in/
for books.
తన మనసులో మాట చెప్పినందుకు చిదంబరాన్ని అభినంధిస్తున్నాను. ఆయన అభిప్రాయం వ్యక్తిగతం అనుకోను. ఇది ప్రభుత్వ అభిప్రాయం. అన్ని ప్రభుత్వాలు ఇదే విధంగా ‘లోపలి’ మాటలు బయటకి చెప్పేస్తే ప్రజలు చెయ్యాల్సింది చేస్తారు. థాంక్యూ చిదంబరం!
రమణ గారూ మీరన్నది నిజం. జనం సొమ్ము దిగమింగి సుఖాలు మరిగినవారి తరపున వాదించే తత్వవేత్తలు కూడా దాదాపు ఇలాంటివే చెబుతుంటారు. ప్రభుత్వాలూ ధనికులవే గనక వాటివీ అవే అభిప్రాయాలు. కాకపోతే చిదంబరం పైకి చెప్పాడు, మీరన్నట్లు.
అన్నం తినకుండా వారం రోజులు ఉండొచ్చు (దొంగ నిరాహార దీక్షలు చేసేవాళ్ళలాగ). కానీ దాహం వేసినప్పుడు నీళ్ళు తాగకుండా గంటైనా ఉండగలమా? ఈమాత్రం అనుభవపూర్వక సత్యాలు చిదంబరానికి తెలియవా? చిదంబరం ప్రజలని నామాలు పెట్టుకునేవాళ్ళని చూసినట్టు చూస్తున్నాడు.