ఈజిప్టులో అధికార కుమ్ములాటలు తీవ్రం, అధ్యక్షుడి డిక్రీ రద్దు చేసిన కోర్టు


మంగళవారం సమావేశమైన ఈజిప్టు పార్లమెంటు

ఈజిప్టులో పాత, కొత్త అధికార వర్గాల మధ్య ఘర్షణలు మరో అంకానికి చేరాయి. కోర్టు రద్దు చేసిన పార్లమెంటును పునరుద్ధరిస్తూ అధ్యక్షుడు ముర్సి జారీ చేసిన డిక్రీ ని కోర్టు కొట్టివేసిందని బి.బి.సి తెలిపింది. ముప్ఫై యేళ్ళుగా ఈజిప్టును తన కబంధ హస్తాల్లో బంధించిన మిలట్రీ నియంతృత్వ పాలకుల ప్రయోజనాలకు ప్రతినిధిగా భావిస్తున్న ‘సుప్రీం కాన్సిటిట్యూషనల్ కోర్టు’ పార్లమెంటును రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజా తిరుగుబాటు ఫలితంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గిన పార్లమెంటుకు మిలట్రీ పాలకుల చేతిలో చివరికి ఆగతి పట్టింది. ప్రజలకు అధికారం అప్పజెప్పేది లేదనీ, ప్రత్యర్ధి ఆధిపత్య వర్గాలతో అధికారం పంచుకునేది కూడా ఇచ్చేదీ రాజ్యాంగ కోర్టు తీర్పు ద్వారా మిలట్రీ మరోసారి తేల్చి చెప్పింది.

ఈజిప్టు ప్రజల చారిత్రాత్మక తిరుగుబాటు ఫలితంగా మిలట్రీ నియంత హోస్నీ ముబారక్ పాలనకు తెరపడింది. అనంతరం ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వాలను ఏర్పరుస్తామని హామీ ఇచ్చి మిలట్రీ అధికారం చేపట్టింది. అమెరికా, యూరప్ దేశాల ప్రశంసల మధ్య పార్లమెంటుకు ఎన్నికలు జరిపింది. ఆ ఎన్నికల్లో దశాబ్దాలుగా మిలట్రీ నియంతృత్వంతో తలపడ్డ ‘ముస్లిం బ్రదర్ హుడ్’ మద్దతుతో ‘ఫ్రీడం అండ్ జస్టిస్ పార్టీ’ (ఎఫ్.జె.పి) అత్యధిక స్ధానాలు గెలుచుకుంది. గత నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఎఫ్.జె.పి అభ్యర్ధి మహమ్మద్ ముర్సి విజయం సాధించాడు. అయితే, తమ ప్రత్యర్ధి ‘ముస్లిం బ్రదర్ హుడ్’ గుప్పిట్లో ఉన్న పార్లమెంటుకి, అధ్యక్షుడికి  అధికారాన్ని అప్పగించడానికి మిలట్రీ  సిద్ధపడలేదు.

అధ్యక్ష ఎన్నికల్లో పశ్చిమ దేశాల ప్రాపకంలో తాము నిలబెట్టిన అహ్మద్ షఫీక్ పై ముర్సి గెలుపొందనున్నట్లు అర్ధం కావడంతో మిలట్రీ సంస్ధ ‘సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్’ (ఎస్.సి.ఏ.ఎఫ్ -స్కాఫ్) ముందే జాగ్రత్త పడింది. అధ్యక్షుడికి ఇవ్వజూపిన అధికారాలను పూర్తిగా కత్తిరిస్తూ అర్జెంటుగా ఉత్తర్వులు జారీ చేసింది. కాన్స్టిట్యూషనల్ కోర్టును పురమాయించి పార్లమెంటు ఎన్నిక చెల్లదని తీర్పు ఇప్పించింది. అధ్యక్షుడికి ఇవ్వజూపిన అధికారాలన్నింటినీ తిరిగి లాక్కుని అధ్యక్షుడిని నామ మాత్రం చేసింది. ఆ తర్వాత మాత్రమే ముర్సీ అధ్యక్షుడుగా ఎన్నికయినట్లు ప్రకటించింది. ఆ విధంగా ప్రజాస్వామిక ఆకాంక్షలతో త్యాగాలకు ఓర్చి ప్రజలు సాగించిన తిరుగుబాటుకు వెన్నుపోటు పొడిచింది.

అనంతరం అధ్యక్షుడు ముర్సీ రాజ్యాంగ కోర్టు రద్దు చేసిన పార్లమెంటును పునరుద్ధరిస్తూ డిక్రీ జారీ చేశాడు. సదరు డిక్రీ ద్వారా మిలట్రీతో ఘర్షణకు సిద్ధం అన్న సందేశం ఇచ్చాడని అంతా భావించారు. అధ్యక్షుడి డిక్రీ ని అమలు చేసే ఉద్దేశ్యంతో మంగళవారం పార్లమెంటు కొద్ది నిమిషాల సేపు సమావేశం అయింది. పార్లమెంటు సమావేశాల్లో తాము కోర్టు నిర్ణయాలను తిరస్కరించడం లేదనీ, కోర్టు నిర్ణయాన్ని ఎలా అమలు చేయాలన్నదే తాము పరిశీలిస్తున్నామనీ పార్లమెంటు స్పీకర్ ప్రకటించాడు. తద్వారా తిరిగి ప్రజల మద్దతుతో ప్రజా తిరుగుబాటు ఫలితాలను నిలబెట్టుకునేందుకు నిర్ణయాత్మక పోరాటం చేసే పరిస్ధితిలో తాము లేమని పార్లమెంటు చెప్పినట్లయింది.

పార్లమెంటు రద్దుతో శాసన అధికారాలన్నీ తిరిగి మిలట్రీ చేతిలోకి వెళ్లిపోయాయి. రాజ్యాంగం ఏదీ ఆమోదం పొందకుండానే అధ్యక్ష ఎన్నికలు జరగడంతో అధ్యక్షుడికి రాజ్యాంగ బద్ధ విశ్వసనీయత, చట్టబద్ధత లేకుండా పోయింది. మొట్టమొదటి ఈజిప్టు ప్రజాస్వామిక ఎన్నికలంటూ ప్రపంచ దేశాల పత్రికలు కీర్తించిన అధ్యక్ష ఎన్నికలను మిలట్రీ ఆ విధంగా అపహాస్యం చేసింది. అధ్యక్షుడు పునరుద్ధరించిన పార్లమెంటును మరోసారి కోర్టు ద్వారా రద్దు చేయించి ప్రజల ఆకాంక్షల పట్ల తనకు గౌరవం లేదని ప్రకటించింది.

హై అప్పీలు కోర్టు కు వెళ్ళి సుప్రీం కాన్స్టిట్యూషనల్ కోర్టు తీర్పును అమలు చేయడంపై సలహా కోరాలన్న స్పీకర్ ప్రతిపాదనను పార్లమెంటు మంగళవారం ఆమోదించింది. పార్లమెంటు పన్నెండు నిమిషాలు మాత్రమే సమావేశం అయిందని ‘ది హిందూ’ తెలిపింది. మరో వైపు కోర్టు తీర్పుని ధిక్కరించి పార్లమెంటును సమావేశ పరచడంపై ముర్సీ పై ఇతర పార్టీలు విమర్శలు కురిపించాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం ఏమిటని ప్రశ్నించాయి. మిలట్రీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఐక్యత కనబరచవలసిన రాజకీయ పార్టీలు అందుకు భిన్నంగా తమలో తాము కొట్టుకోవడం మిలట్రీకి మరింత బలం చేకూరుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s