‘ఆధునికత’ ముసుగులో మెట్రోల్లో కొనసాగుతున్న కుల, మత వివక్షలు -ది హిందూ


భారత దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజ్ఞానానికి రాజధానిగా భాసిల్లుతున్న బెంగుళూరు లో కుల, మతాల మూఢత్వం ‘ఆధునికత’ ముసుగులో పరిఢవిల్లుతోందని ‘ది హిందూ’ వెల్లడించింది. సామాజిక వ్యవస్ధల్లో మనుషుల మధ్య తీవ్ర వైరుధ్యాలకు కారణంగా నిలిచిన కుల, మతాలు కాల క్రమేణా బలహీనపడుతున్నాయన్న విశ్లేషణల్లో నిజం లేదని ‘ది హిందూ’ పత్రిక ప్రచురిస్తున్న పరిశోధనాత్మక కధనాల ద్వారా తెలుస్తోంది. భూస్వామ్య వ్యవస్ధ మూలాలయిన కులం, మత విద్వేషాలు ఆధునికతకు మారుపేరుగా భావించే మెట్రో నగరాల్లో బలహీనపడకపోగా యధాశక్తితో కొనసాగుతున్నాయని పత్రిక ప్రచురిస్తున్న వరుస కధనాలు వెల్లడిస్తున్నాయి. వ్యాపార ప్రయోజనాలకు ఆటంకం కావలసిన సామాజిక విద్వేషాలు సరికొత్త మార్గాల్లో ఆర్ధిక పరంగా కూడా కేంద్రీకృతం అవుతూ వర్గ విశ్లేషణకు పరీక్ష గా నిలిచాయి.

పరిశోధనలో భాగంగా ది హిందూ పత్రిక బెంగుళూరు లోని వివిధ ధనిక, పేద కాలనీల్లో సమాచార సేకరణ జరిపింది. ఇళ్ల నిర్మాణంలోనూ, అద్దెకు ఇళ్ళు దొరికే విషయంలోనూ పత్రిక ప్రధానంగా కేంద్రీకరించింది. దళితులకు, ముస్లింలకు ఇళ్ళు అద్దెకు దొరకడం బెంగుళూరులో కష్టమేనని పత్రిక పరిశీలనలో తేలింది. ‘గౌరవనీయత’, ‘వెజిటేరియన్’, ‘పరిశుభ్రత’… ఇత్యాది ముసుగుల్లో కులాధిక్యత, అస్పృశ్యత, మత వివక్ష లు కొనసాగుతున్నాయని పత్రిక పరిశీలనలో వెల్లడయింది. ధనిక దళితులకు, సంపన్న ముస్లింలకు కూడా అద్దెకు ఇళ్ళు ఇవ్వలేని బలహీనతలను అనేకమంది ప్రదర్శిస్తున్నారని వెల్లడయింది. వివక్షలకు దూరంగా ఉండవలసిన ప్రభుత్వ సంస్ధ ‘బెంగుళూరు డెవలప్ మెంట్ ఆధారిటీ’ సైతం కులాల వారీగా లే ఔట్లు రూపొందించి కాలనీలు నిర్మిస్తున్నట్లుగా స్వతంత్ర సంస్ధల అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి.

‘ది హిందూ’ ఉదాహరణలు

‘ది హిందూ’ ప్రస్తావించిన వివిధ ఉదాహరణలు ఇలా ఉన్నాయి.

ఫర్ధీన్ అహ్మద్ (పేరు మార్చబడినది) పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. ముప్ఫై యేళ్లుగా అనేక వేలమందికి ఆస్తులు సమకూర్చిన సంస్ధకు అతను యజమాని. బెంగుళూరులో తీవ్ర పోటీ ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన సంస్ధ నిలదొక్కుకున్నది. ఆయన పరోపకారి కూడా. సెక్యులర్ భావాలతో పలు అభ్యుదయ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. మతభావనల నుండి తనను తాను వేరు చేసుకున్నప్పటికీ ఆధునికత ముసుగు తొడిగిన మత వివక్షకు అతను బలికాక తప్పలేదు. 2009 వేసవి అతనికి చేదు అనుభవాలను రుచి చూపింది. ఒక ముస్లిం మతస్ధుడి అభ్యుదయం గుర్తింపుకు నోచుకోబోదని గుర్తు చేసింది.

ఫర్దీన్ 2009 లో శివాజీ నగర్ లో ఉన్న తన బంగ్లాను ఆధినీకరించాలని భావించాడు. అందుకోసం ఆయనకి తాత్కాలికంగా అద్దె ఇల్లు అవసరం అయింది. ‘గౌరవనీయులు’ నివసించే లోకాలిటీలో ఇల్లు చూసుకోవాలని భావించిన ఫర్దీన్ కి అది సాధ్యం కాలేదు. ‘గౌరవనీయులైన’ ఇంటి యజమానులకి ఫర్దీన్, ఆయన కుటుంబం మాంసం తినే ముస్లిం లుగా మాత్రమే కనిపించారు. తన వద్ద ఉన్న ఉద్యోగులను పురమాయించినా, ఎన్ని ఆర్ధిక వనరులని చేతులో ఉంచుకున్నా కొన్ని నెలల దాకా ఆయనకి మంచి ఇల్లు దొరకలేదు. తన స్టేటస్ కి తగినదిగా భావించిన లోకాలిటీల్లో ఆన స్టేటస్ ని అంగీకరించేవారు దొరకలేదు.

అవార్డు వచ్చినా ఇల్లు దొరకదు

దళిత ఫెమినిస్టు రూత్ మనోరమ కూడా చేదు అనుభవం ఎదుర్కొంది.  ‘ఆల్టర్నేట్ నోబెల్ ప్రైజ్’ గా భావించే ‘లైవ్లీ హుడ్ అవార్డ్’ ఆమెను వరించినా భారత దేశ సామాజిక వ్యవస్ధ ఆమెను ‘దళితురాలి’గానే చూస్తోంది. జయ నగర్ నాలుగవ బ్లాక్ లో ఆమె ఆఫీసు ఉంటుంది. తన ఆఫీసుని కొద్ది మీటర్ల దూరంలోని మరో విశాలమైన భవనంలోకి ఆఫీసుని మార్చాలని ఆమె భావించింది. “ఆ ఇల్లు చాలా పెద్దది. చక్కనైన, మంచి ఇంగ్లీషు మాట్లాడే బ్రాహ్మణ వృద్ధ దంపతులు ఆ ఇంటికి యజమానులు” అని రూత్ తెలిపింది. కానీ వారు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించారు. “అవార్డు వచ్చాక వార్తాపత్రికలన్నీ ఆ విషయాన్ని కవర్ చేశాయి. ఫీచర్లు ప్రచురించాయి. దానివల్ల నేను దళితురాలిననీ, క్రిస్టియన్ ని అనీ అందరికీ తెలిసిపోయింది” అని ఆమె వివరించింది.

రూత్ చెప్పిన దంపతులు సామాన్యులు కారు. రిటైర్డ్ శాస్త్రవేత్తలు. వారి పుత్రుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు.  మాంసాహారులకు తాము ఇల్లు అద్దెకు ఇవ్వలేమని వారు తమ కారణం చెప్పారు. “నేను ఆఫీసుకి ఇల్లు అడిగాను. ఆ ఇంటిని బిర్యానీ హోటల్ గా మార్చాలనేమీ అనుకోలేదు” అని ఆమె చెప్పింది. మాంసాహారాన్ని కారణంగా చెప్పినప్పటికీ అసలు కారణం రూత్ మనోరమ దళితురాలు కావడమేనని చెప్పడానికి సామాజికవేత్తలే కానవసరం లేదు. శాస్త్రవేత్తలుగా పని చేసిన అనుభవజ్ఞులు మాంసాహారాన్నాయినా కారణంగా చూపి ఇల్లు ఇవ్వడానికి నిరాకరిస్తారని మామూలుగానైతే ఊహించలేని విషయం. కులాలు లేని పశ్చిమ దేశాల్లో మాంసాహారం కారణంగా ఆఫీసులకి అద్దెకు దొరకని ఇళ్ళు ఉంటాయా?

కవైతేనేం, దళితుడేగా?

దళిత కవి సిద్ద లింగయ్య ది మరో చేదు అనుభవం. ‘కన్నడ బుక్ ఆధారిటీ’ కి ఛైర్మన్ కూడా అయిన సిద్ద లింగయ్య కు, అగ్ర కులస్ధులకు, ధనిక వర్గాలకూ కూడా నిలయమైన  సౌత్ బెంగుళూరు లో ఇల్లు దొరకడం గగనమని తెలిసి వచ్చింది. “నా పేరు కారణంగా అనేకమంది ఇంటి యజమానులు నన్ను (సో కాల్డ్) అగ్రకులమైన లింగాయత్ కులానికి చెందినవాడినని భావించారు. కానీ నల్లగా ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. నా కులం అడగడానికి వారేమీ సిగ్గుపడలేదు. నేను దళితుడినని చెప్పుకోవడానికి నేనూ సిగ్గుపడలేదు” అని సిద్ధ లింగయ్య తెలిపాడు. తన కులం తెలిసినవెంటనే అప్పటివరకూ సజావుగా సాగుతున్న చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోవడం రివాజు అయింది.

ఈశాన్య ప్రజలపై వివక్ష

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నాగా విద్యార్ధులకి కావలసినన్ని అనుభవాలు. వారి రూపమే ఒక టాబూ. “చాలామంది ఇంటి యజమానులకి మేము కుక్క మాంసం తినేవాళ్లం, వ్యభిచర వృత్తి చేసేవారం, లేదా డ్రగ్స్ కి అలవాటు పడ్డవాళ్లం” అని నాగా స్టూడెంట్స్ యూనియన్ నాయకుడొకరు చెప్పారు. పేరు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. ఏప్రిల్ నెలలో నాగా విద్యార్ధి ‘రిచర్డ్ లోయితమ్’ హత్యకు గురయ్యాడు. విద్వేషమే ఆయన హత్యకు కారణమని చెబుతూ వందలమంది ఈశాన్య రాష్ట్రాల విద్యార్ధులు బెంగుళూరు లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమను అంతా విదేశీయులుగా పరిగణిస్తారని అనేకమంది విద్యార్ధులు చెప్పినట్లు అప్పట్లో ‘ది హిందూ’ కధనం ప్రచురించింది. వారికి ఇల్లు అద్దెకి ఉవ్వడానికి చాలామంది ముందుకు రారని కూడా వారు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ సంస్ధల సాక్షిగా

‘సెవెన్ రాజ్ ఎస్టేట్ ఏజన్సీ’ అనే రియల్ ఎస్టేట్ సంస్ధకి సెవెన్ రాజ్ యజమాని. ఆయన ప్రకారం బెంగుళూరులో కుల, మత వివక్షలు సర్వ సాధారణం. “ఇక్కడ అవన్నీ స్పష్టంగా ఉన్నాయి. కానీ సాధ్యమైనంతవరకూ ‘కమ్యూనల్-మైండెడ్’ జనంతో నేను వ్యాపారం చేయను” అని సెవెన్ రాజ్ వివరించాడు. తనకే మతమూ లేదనీ, తన క్లయింట్లను కూడా ఎప్పుడూ అడగననీ ఆయన చెప్పాడు. సెవెన్ రాజ్ ప్రకారం నగరంలో మంచి సౌకర్యాలున్న ప్రాంతాలన్నింటిలో వివక్షను పాటిస్తున్నారు. జయా నగర్, బసవంగుడి, మల్లేశ్వరం, సదాశివ నగర్, ఇందిరా నగర్, రాజాజీ నగర్, అప్పర్ పాలెస్ ఆర్కర్డ్స్, కోరమంగళ, జె.పి.నగర్ లాంటి పోష్ లోకాలిటీలు అత్యంత హీనమైన వివక్షలను పాటిస్తున్నాయి.

“ఈ లోకాలిటీల్లో తక్కువ కులం వారికి గానీ, మైనారిటీ మతస్ధూలకు గానీ ఎవరైనా ఇల్లు అద్దెకు ఇస్తే వారికి వ్యతిరేకంగా ఇరుగు, పొరుగు వారంతా ముఠాలు కట్టేస్తారు.” ఈ మాటలన్నది ఒక కార్పొరేటర్. ‘బృహత్ బెంగుళూర్ మహానగర్ పాలిక” కార్పొరేటర్ ఏం.పారి ప్రకారం కులాల ఏకాంతవాసానికి ‘బెంగుళూరు డెవలప్ మెంట్ ఆధారిటీ’ (బి.డి.ఎ) లాంటి సంస్ధలు కూడా బాధ్య్లులు. “బి.డి.ఎ రూపొందించిన కొన్ని నివాస లే ఔట్లను కులపరంగా సర్వే చేస్తే తేలిందేమంటే, ప్రధాన ప్లాట్లన్నీ అగ్రకులాల దరఖాస్తుదారులకే కేటాయించారు. దళితులకి గానీ, ముస్లిం లకి గానీ ఇ.డబ్ల్యూ.ఎస్ (ఎకనమికల్లీ వీకర్ సెక్షన్) కాలనీల్లోనే కేటాయింపులు జరిగాయి” అని పారి వివరించాడు.

2004-05 లో ‘జన సహయోగ్’ అనే ఎన్.జి.ఓ సంస్ధ చేసిన సర్వేను పారీ ఉద్దేశించాడు. ‘ఆంత్రోపోలాజికల్ స్టడీ ఆఫ్ స్లమ్స్ ఇన్ బెంగుళూర్’ అని ఈ సర్వేకి పేరు పెట్టారు. “కన్నడ మాట్లాడే మురికివాడల నివాసుల్లో 85 శాతం మంది  అస్పృశ్యులుగా చెప్పబడే కులాలకు చెందినవారే. కన్నడేతర భాషలు మాట్లాడేవారిలో 65 శాతం మంది అస్పృశ్య కులాలుగా భావిస్తున్నవాటికి చెందినవారు” అని సర్వే గురించి తెలిసిన ఐజాక్ అరుల్ సెల్వ తెలిపాడు.

వార్తా పత్రికల ‘ప్రకటనలు మాత్రమే’ పేజీల్లోని ఆస్తులు, రియల్ ఎస్టేట్ సెక్షన్లు లోపలి దృశ్యాన్ని స్పష్టంగా చెబుతాయి. ‘వెజిటేరియన్లకు మాత్రమే’ అంటూ కనపడే ప్రకటనలు ప్రధానంగా జయనగర్, బసవంగుడి, మల్లేశ్వరం లాంటి లోకాలిటీలనుండి వచ్చేవే. అలాంటి ప్రకటనల నిజమైన అర్ధం సదరు యజమానులతో ‘ది హిందూ’ విలేఖరి (సుదీప్తో మండల్) మాట్లాడినప్పుడు వెల్లడయింది. “ఇది బ్రాహ్మణుల లే ఔట్. ఎస్.సి/ఎస్.టి లెవరూ మాకు అవసరం లేదు” అని ఒక మహిళ విసురుగా చెప్పి ఫోన్ పెట్టేసింది. “కాశ్మీర్ ముస్లింలు వద్దు. ఇతర ముస్లింలయితే ఫర్వాలేదు” అని హెచ్.ఆర్.బి.ఆర్ లే ఔట్ లోని ఒక యజమాని చెప్పాడు. “ముస్లింలయినా ఫర్వాలేదు. కానీ శుభ్రమైన ముస్లింలు అయి ఉండాలి” అని హెచ్.ఎస్.ఆర్ లే ఔట్ నుండి మరొకరు చెప్పారు.

లాయర్ ఎన్.జగదీశ ఇలా అంటున్నాడు. “వెజిటేరియన్లు మాత్రమే అనడం ‘బ్రాహణులు మాత్రమే’ అని చెప్పడానికి కోడ్ మాత్రమే. వారు నిజంగా చెప్పదలుచుకున్నది చెబితే ఐ.పి.సి లోని ఎస్.సి/ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టొచ్చు.” వివక్షను వదలలేనప్పుడు చట్టాలను మభ్యపెట్టడానికి కొత్త కొత్త పదజాలాన్ని సృష్టించుకోవడం గౌరవనీయులకు పెద్ద పనేమీ కాదు, తరతరాల సంస్కృత వేద జ్ఞానం వారికే సొంతం కనుక.

అర్ధ భూస్వామ్య వ్యవస్ధలో కులం దానంతటదే బలహీనపడుతుందా?

భారత సామాజిక వ్యవస్ధలో కులాల పట్టు బలహీనపడుతోందన్న వాదనను జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ వాదనల సారాంశం ఏమిటంటే ‘కాల క్రమేణా’ కులాల పట్టింపులు, వివక్షలు బలహీనపడుతున్నాయని. పరిశ్రమల్లో, ఆఫీసుల్లో, బస్సుల్లో, రైళ్లలో కలిసి పని చేస్తున్నారు కనుక, కలిసి కూర్చుంటున్నారు గనక ఆ మేరకు కులం బలహీనపడినట్లేనని ఈ వాదనలు చెబుతున్నాయి. కార్యాలయాల్లో, పరిశ్రమల్లో ఆర్ధిక అవసరం రీత్యా కలిసి పని చేస్తే, బస్సుల్లో, రైళ్లలో ప్రయాణ అవసరం రీత్యా కలిసి ప్రయాణిస్తే కులం బలహీనపడిందని విశ్లేషించగలిగితే మరి అవే కార్యాలయాల్లో, అవే పరిశ్రమల్లోని కార్మిక సంఘాల్లో కులాల ఏకీకరణని కులం బలపడుతోందనో లేదా కొనసాగుతోందనో విశ్లేషించవలసిన అవసరం లేదా? పరిశ్రమలో, ఆఫీసులో కలిసి పనిచేసిన వ్యక్తి తన ఇంటిని దళితుడికి అద్దెకు ఎందుకు ఇవ్వడు? కార్మిక సంఘంలో దళితులతో కలిసి ఒకే యూనియన్ లో ఉండే అగ్రకుల వ్యక్తులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ, రెడ్డి ఇత్యాదిగా గల సంక్షేమ సంఘాలలో క్రియాశీలకంగా ఎందుకు ఉంటున్నారు? దళిత సంపన్నులకు కూడా స్ధానం ఇవ్వవలసిన పోష్ లోకాలిటీలు వివిధ పేర్లతో లే ఔట్లలో స్ధానం ఎందుకు ఇవ్వరు? వర్గ ఐక్యత చూపవలసిన పోష్ లోకాలిటీలు కుల వివక్షను పాటించడం ఏమిటి?

నిజానికి కాల క్రమేణా కుల, మతాలు బలహీనపడుతున్నాయి అన్న వాదనకు వర్గ విశ్లేషణలో స్ధానం లేదు. కులాలు బలహీనపడతాయన్న వాదనకు సైద్ధాంతీక వివరణ ఇవ్వాలి. భారత దేశ సామాజిక వ్యవస్ధ ‘అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్ధ’ అన్న వర్గీకరణను అంగీకరించినట్లయితే కులాలు బలహీనపడుతున్నాయన్న వాదనకు కూడా ఆ వర్గీకరణ పరిధిలో వివరణ ఉండాలి. దేశంలో అర్ధ భూస్వామ్య వ్యవస్ధ కులం ఆధారంగా మనుతోందని ముందు గ్రహించాలి. కులం, అర్ధ భూస్వామ్యం ఒకదానికొకటి సహకరించుకుంటూ తమ అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నాయని గ్రహించాలి. భూస్వామ్య దోపిడీ సాధనం ప్రధానంగా ‘కుల వ్యవస్ధ’ గనుక, ‘కాల క్రమేణా’ కులాలు బలహీనపడడం అంటే ‘కాల క్రమేణా’ అర్ధ భూస్వామ్యం బలహీనపడుతోందని కూడా అర్ధం. అర్ధ భూస్వామ్యం బలహీనపడడం అంటే, భూస్వామ్య వ్యవస్ధ పునాదులు బలహీనపడుతున్నాయని అర్ధం. వర్గ విశ్లేషణలో అది సాధ్యమేనా? ఆర్ధిక పునాది అయిన భూస్వామ్య వ్యవస్ధ వర్గ ఘర్షణ లేకుండా, దోపిడీ ని అంతం చెయ్యకుండా బలహీనపడుతుందా? భూస్వామ్య వ్యవస్ధను బలహీనపరచవలసిన వ్యవసాయక విప్లవం లేకుండా ఆ వ్యవస్ధకు ఆదరువుగా ఉన్న కులం ఎలా బలహీనపడుతుంది? 

భారత దేశ విప్లవోద్యమానికి అత్యంత ప్రధాన సమస్య భూమి సమస్య. దేశంలో ఇప్పటికీ 65 శాతం గ్రామాల్లో నివసిస్తున్నారు. దళితులు, బి.సీలు, ముస్లింలు లాంటి బడుగు వర్గాలకు చెందిన ప్రజలు ఇంకా భూములతో సావాసం కోసం పరితపిస్తున్నారు. ఎ చిన్న అవకాశం దొరికినా భూములను ఆశిస్తున్నారు. వ్యవసాయంలో అత్యధిక భాగం వర్షాధారమే తప్ప నీటి పారుదల సౌకర్యాలు లేవు. భూముల సమస్య పాలకపవర్గాలకు సమస్యగా మారినపుడో, లేక తమలో తమకు వైరుధ్యాలు తలెత్తినపుడో ఒకరి గుట్టు మట్లు మరొకరు బయటపెట్టుకునే చర్యల్లో భాగంగా ఎన్నెన్ని వేల, లక్షల ఎకరాలు భూస్వాముల ఆక్రమణల్లో, ఎమ్మెల్యేల అనుభవాల్లో ఉన్నాయో రింగు రోడ్డు రాజకీయాల ద్వారా, రాజధాని ఆశల ద్వారా, ప్రాంతీయ ఆకాంక్షల ద్వారా వెల్లడి అవుతున్న సంగతి పత్రికలు చెబుతున్నాయి. అలాంటి భూమి సమస్య ప్రధానంగా ఉన్న భూస్వామ్య వ్యవస్ధ కు పట్టుగొమ్మ గా ఉన్నది ‘కుల వ్యవస్ధే’. అలాంటి కుల వ్యవస్ధ కాల క్రమేణా బలహీనపడుతున్నదని చెప్పడానికి బస్సు, రైలు ప్రయాణాలను, ఆఫీసు, పరిశ్రమల పనులను నిదర్శనంగా చూపడం కుల సమస్యపై చేయవలసిన కృషిని పక్కకు మళ్ళించడమే.

22 thoughts on “‘ఆధునికత’ ముసుగులో మెట్రోల్లో కొనసాగుతున్న కుల, మత వివక్షలు -ది హిందూ

 1. నేను forward caste కాని బెంగుళూరు లో మేము ఇల్లు అద్దెకి వెతికేటప్పుడు , చాల మంది vegetarians కి మాత్రమే ఇస్తామని చెప్పేవాళ్ళు. ఇంత వివక్ష ఉందంటే నమ్మలేకపోతున్నాను.
  హైదరాబాద్ లో కూడా ఇవి విన్నాను. కాని మేము అంత ప్రాబ్లం పేస్ చేయలేదు. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇంత వివక్ష పేస్ చేయలేదు, వాళ్ళు backward caste కాని మేము మాట్లాడుకునేటప్పుడు ఇవేమి మేము చర్చిన్చుకోలేదు. ఎక్కడో ఒకచోట వివక్ష ఉండవచ్చు, I strongly believe its very less , కానీ అది highlight చేసి, వివక్ష లేనివి వదిలేయడం భావ్యం కాదు.చదివే వాళ్లలో ఎవరైనా backward caste ఉంటె అది ఎలాంటి మెసేజ్ వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. actual ga వాళ్ళకి ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ ఇది చదివి వాళ్ళు ముందే ఒక అభిప్రయనకి వచ్చేస్తారు. అలా ఒక అభిప్రాయనకి వచ్చిన తరువాత, చిన్న చిన్న విషయాలు కూడా చాల పెద్దవి గ కనపడతాయి. ఇల్లు అద్దెకి ఇవ్వడం, ఇవ్వకపోవడం, వాళ్ళ ఇష్టం, ఇవ్వకపోవడానికి కులం కాకుండా , ఇంకా చాల reasons ఉంటాయి. డబ్బులు ఎక్కువ గా ఆశించడం, ఒంటరిగా ఉన్దేవాల్లకి ఇవ్వకపోవడం, కాశ్మీరి ముస్లిమ్స్ కి ఇవ్వకపోవడం, అనేది వాళ్ళ భయం అవ్వచ్చు .
  రక రకాల కారణాలు ఉంటాయి, కులమే ప్రధానం అంటే నమ్మలేకపోతున్నాను.
  మీ బ్లాగ్ లో పాజిటివ్ న్యూస్ ఎందుకు రాదు. కొంచెం పాజిటివ్ గా ఉండేవి కూడా రాయొచ్చు కదా.

 2. కులాలు లేవు అని ఎంత చెప్పినా, అలా చెప్పేవాళ్ళు వ్యక్తిగతంగా ఆచరించేది కులాన్నే. నేను గిరిజనుణ్ణని మా వీధిలో చాలా మందికి తెలియదు. కానీ పెళ్ళి సంబంధం మాట్లాడినప్పుడు నేను గిరిజనుణ్ణని తెలిస్తే ‘మాకు గిరిజనుడు అవసరం లేదు‌’ అని డైరెక్ట్‌గా చెప్పకుండా ‘మా క్యాస్ట్‌లో మా స్టేటస్‌కి తగినవాళ్ళు చాలా మంది ఉన్నారు‌’ అనో, ఇంకో కారణమో చెప్పగలరు. మేము 1996లో శ్రీకాకుళం పట్టణంలో సొంత ఇల్లు కట్టుకున్నాం. 1994లో మేము ఇక్కడ అద్దె ఇల్లు కోసం వెతుకుతున్నప్పుడు “మేము తెలిసినవాళ్ళకే అద్దెకి ఇస్తాం” అని మా నాన్నగారికి కొంత మంది చెప్పారు. కేవలం తెలిసినవాళ్ళకే ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకుంటే అద్దెకి దిగేవాళ్ళు దొరికే అవకాశాలు ఎంత వరకు అని నాకు డౌట్ వచ్చింది. ఆ తరువాత అర్థమైంది “తెలిసినవాళ్ళకైతే కులం పేరు అడగొచ్చు కానీ తెలియనివాళ్ళకి కులం పేరు అడగలేము కదా” అని.

 3. ఇంకో విషయం. కుల వివక్షని పాటించేవాళ్ళని ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల చట్టం (1955) ప్రకారం కూడా అరెస్ట్ చెయ్యొచ్చు. కానీ కులం అనేది వ్యక్తిగత విశ్వాసం అని చెప్పి, దాన్ని పాటించేవాళ్ళని అరెస్ట్ చెయ్యరు.

 4. విశెఖర్ గారూ. భుస్వామ్య వ్యవస్త బలహీనపడిందంటె నా అర్దమేమిటంటె భావజాలంలొనూ, కొంతవరకు ఆచరణలొనూ, మార్పు వచ్చిందని ఆ మార్పుకుడా పాక్షికంగా వచ్చిందని మాత్రమే మౌలికంగా ఒకరి కులంలొ మరొకరు పెళ్ళిచేసుకునేంత కాదు.

  గతంలొ స్త్రీ, పురుషుల శ్రమ విభజన స్త్రీలకు అవిద్య ,సతీసహగమనం, భాల్య వివాహాలు, ఇంకా అనేక సాంఘీక దురాశారాలు వుండేవి. మరి ఇప్పుడొ!!. స్త్రీలు దాదాపు అన్ని రంగాలలొ పురుషులతొ సమానంగా వున్నారు( మొత్తం స్త్రీలంతా వున్నారని నా వుద్దేశం కాదు.) గతంలొ దళితులు అగ్రకులం వుండే వూళ్ళలొకి రావాలంటే చెప్పులు చంకనపెట్టుకొని రావాలి వాళ్ళను తాకితే మైలపడినామని నీళ్ళు చల్లేవాళ్ళు.ఇంకా అలాంటివి చాలా వున్నాయి. ఇప్పుడు పరిస్తితి చాలా వరకు మారింది వాళ్ళతొ ఇంటిపనులు చేయించుకుంటున్నారు. అంట్లు తొమడం ,బట్టలు వుతకడం లాంటివి .

  ఇవన్నీ ఎలా సాద్యం అయినాయని నేనునుకుంటున్నానంటె పెట్టుబడిదారీ సమాజం భుస్వామ్య వ్యవస్త మీద పట్టు సాధించడం వల్ల. ఇప్పుడు ఎక్కడా భుస్వామ్య పద్దతిలొ ఉత్పత్తి జరగటం లేదు. పెట్టుబడిదారీ విదానం ప్రతిరంగంలొనూ పట్టు సాధించడం వల్ల. వాళ్ళతొ పొటీపడలేక చాలావరకు దివాళా తీసినారు.చేతి వౄత్తులు చాలావరకు ద్వంసం అయినాయి. ఈకారణానన్నింటి చేతా భుస్వామ్య వ్యవస్త బలహీనపడిందని అంటున్నాను.

  మీరేమనుకుంటున్నారంటె వ్యవసాయక విప్లవం జరిగి వుంటే భుమి పంపకం జరిగి దాని ద్వారా కుల నిర్ములన జరిగుండేదని . అలా జరగలేదు కనుక కులాలు పొవడం అసాద్యంగా కనిపిస్తుంది. ఎసమాజంలొనైనా మార్పు అనేది సహజం భుమి పంపకం జరగలేదు కనుక కులాలు అలాగే గడ్డకట్టుకుని పొవు. కార్మిక వర్గం తిరగబడినప్పుడు అన్ని దురాశాలతొపాటు ఈ దురాశారంకుడా పొతుంది.

  ” ఆర్దిక పునాది అయిన భుస్వామ్య వ్యవస్త వర్గఘర్షణ లేకుండా దొపిడీని అంతంచెయ్యకుండా బలహీనపడుతుందా?”

  భుస్వామే ఇప్పుడు పెట్టుబడిదారుడిగా మారాడు కాబట్టి ఇప్పుడు ఆర్దిక పునాది భుస్వామి చేతులొ లేదు వుండేది పెట్టుబడిదారీ వర్గమే.

  “దేశంలొ అర్ద భుస్వామ్య వ్యవస్త కులం ఆదారంగా ముతొందని గ్రహించాలి”

  భుస్వామ్య వ్యవస్త ద్వారానే కులం మనుతొంది కులం ద్వారా భుస్వామ్య వ్యవస్త కాదు. దీనర్దం భుస్వామ్య వ్యవస్త వుందికాబట్టి కులం వుంది కులం వుందికాబట్టి భుస్వామ్య వ్యవస్త కాదు. వర్గ విశ్లెషణ ద్వారానే దేనైనా పట్టుకొగలం దాన్ని వదిలేస్తె ఎదీ అర్దం కాదు.

 5. ” భుస్వామ్య దొపిడీ సాదనం ప్రదానంగా కులవ్యవస్త కనుక కాలక్రమేనా కులాలు బలహీనపడం అంటే కాలక్రమేణా అర్ద భుస్వామ్యం బలహీనపడుతుందని కుడా అర్దం అర్ద భుస్వామ్యం పునాదులుకుడా బలహీనపడుతున్నాయని అర్దం వర్గ విశ్లేషణలొ అది సాద్యమేనా ?

  అవును బలహీనపడింది. దీనర్దం భుమి పంపకం అయిందని కాదు. భుస్వామ్య వ్యవస్త లక్షణాలు బలహీనపడిందని దీనర్దం . దాని ఉత్పత్తి ద్వెయం మారిందని అర్దం మీ బ్లాగ్ అంతా వర్గ విశ్లెషణతొనేకదావుంది కులం విషయంలొ ఆ అనుమానం ఎందుకువచ్చింది?

 6. భూస్వామ్య వ్యవస్ధ బలహీనపడకుండా దాని లక్షణాలు వాటంతట అవే బలహీనపడడం సాధ్యమనడం కొత్త విషయం. ఆర్ధిక సంబంధాలు మారకుండా అర్ధిక సంబంధాల లక్షణాలు బలహీనపడతాయన్న ఈ సూచనను వివరించవచ్చేమో చూడండి.

  భూస్వామ్య వ్యవస్ధ నుండి దాని లక్షణాలను వేరు చేయడం అర్ధం కాని విషయం. వ్యవస్ధ లక్షణాలు దానితో ముడి పడి ఉంటాయి తప్ప వేరుగా ఉంటూ స్వతంత్రంగా మార్పు చెందే స్ధితిలో ఉండవు. అలా ఉంటే అవి ఇంకేమన్నా కావచ్చేమో గాని లక్షణాలు కాజాలవు.

  “మీ బ్లాగ్ అంతా వర్గ విశ్లెషణతొనేకదావుంది కులం విషయంలొ ఆ అనుమానం ఎందుకువచ్చింది?”

  ఇది నాకు అర్ధం కాలేదు.

 7. శెఖర్ గారూ దీనికన్నా ముందు ఒక కామెంట్ రాసినాను అది ప్రచురించలేదు చుడండి

 8. విశేఖర్ గారూ,

  హిందూలో వ్యాసం ద్వారా మీరు తేనె తుట్టెను మళ్లీ కదిపారనే భావిస్తున్నాను. అద్దె గృహాల విషయంలో మీరు ప్రచురించిన ఈ కథనం గృహ సమస్యకు సంబంధించినది కూడా. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గృహ పెట్టుబడిదారుడితో సమస్య.

  150 సంవత్సరాలు పైగా ప్రపంచాన్ని గృహసమస్య వెంటాడుతూనే ఉంది. వర్గానికి కులం కూడా జతకలిసిన మన భారతదేశంలో గృహసమస్యకు కులాల అంటుతో కూడిన కొత్త విషయం కూడా వచ్చి చేరింది.

  మీ ఈ కథనంపై కాస్సేపయ్యాక స్పందిస్తాను.

  కుల సమస్య పై మరింత విశ్లేషణతో రంగనాయకమ్మగారు గతంలో రాసిన రెండు కథనాల లింకులను
  “మాయావతి అవినీతి కేసు కొట్టివేత, సి.బి.ఐ అతి చేసిందని సుప్రీం వ్యాఖ్య” అనే మీ గత వ్యాసంలో వ్యాఖ్య రూపంలో ఇస్తున్నాను. అక్కడ నేను అందించిన కులసమస్యపై లింకులలో భాగంగా వీటిని కూడా చదివితే బాగుంటుంది.

 9. రామమోహన్ గారు, ఆఫీస్‌లో కులం పేరు అడగడం లేదని చెప్పి కుల వివక్ష మాయమైపోయిందని వాదించేవాళ్ళు ఉన్నారు. ఆఫీస్‌లో కులం పేరు అడగరు కానీ వ్యక్తిగత పరిచయం ఉన్నవాళ్ళకి కులం పేరు అడుగుతారు కదా. ఆఫీస్‌లో దాసరి కులం నుంచో, జంగం కులం నుంచో వచ్చిన వ్యక్తితో కలిసి పని చెయ్యడానికి అభ్యంతరం ఉండదు. అటువంటి కులం నుంచి వచ్చిన వ్యక్తి వ్యక్తిగతంగా పరిచయమైతే ఆ పరిచయాన్ని స్నేహంగా లేదా స్నేహాన్ని ప్రేమగా/పెళ్ళిగా మార్చుకోవడానికైతే అభ్యంతరం ఉంటుంది.

 10. రామ్మోహన్ గారూ, ఆర్టికల్ లో చెప్పినట్లు, భూస్వామ్య వ్యవస్ధ భావాజాలంలోనూ, కొంతవరకు ఆచరణలోనూ మార్పు చెందింది అనడానికి సైద్ధాంతిక వివరణ ఉండాలి. వర్గ సిద్ధాంతంలో వివరణ లేకుండా ఇలా ఆర్ధిక వ్యవస్ధల లక్షణాలు బలహీనపడతాయి అని స్వతంత్రించి చెప్పలేము.

  మొదట విస్మరించిన మీ వ్యాఖ్యలో మీరు ఆ వివరణ ఇచ్చారు. ఇలా:

  “ఇవన్నీ ఎలా సాద్యం అయినాయని నేనునుకుంటున్నానంటె పెట్టుబడిదారీ సమాజం భుస్వామ్య వ్యవస్త మీద పట్టు సాధించడం వల్ల. ఇప్పుడు ఎక్కడా భుస్వామ్య పద్దతిలొ ఉత్పత్తి జరగటం లేదు. పెట్టుబడిదారీ విదానం ప్రతిరంగంలొనూ పట్టు సాధించడం వల్ల. వాళ్ళతొ పొటీపడలేక చాలావరకు దివాళా తీసినారు.చేతి వౄత్తులు చాలావరకు ద్వంసం అయినాయి. ఈకారణానన్నింటి చేతా భుస్వామ్య వ్యవస్త బలహీనపడిందని అంటున్నాను.”

  భారత దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్ధ, భూస్వామ్య వ్యవస్ధ పై పట్టు సాధించింది అని ఇంతవరకు మార్క్సిస్టు-లెనినిస్టు విశ్లేషకులు చెప్పలేదు. (సి.పి.ఐ, సి.పి.ఎం ల విశ్లేషణలో ఇది పరోక్షంగా వ్యక్తం అవుతుంది.) ఇక్కడ భూస్వామ్య వ్యవస్ధపైన వలస పాలన రుద్దబడింది. వలస పాలకుల ప్రాపకంలోనే గ్రామాల్లోని భూస్వాములు పట్టణాల్లో పెట్టుబడిదారులుగా కూడా అభివృద్ధి చెందారు. అయితే వీరు వలస ఆధిపత్యాన్ని తిరస్కరించి దానితో ఘర్షణ పడి స్వతంత్రంగా ఎదగడానికి బదులు వారికి దళారీలుగా స్ధిరపడ్డారు. వీరికి భూస్వాముల తో కూడా ఘర్షణ లేదు. భూస్వాములే తమ మిగులు పెట్టుబడితో పరిశ్రమలు పెట్టి పెట్టుబడిదారులుగా కూడా మారడంతో భూస్వాములు, పెట్టుబడిదారుల మధ్య కుమ్మక్కే ప్రధానంగా ఉంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఘర్షణ పడినా అంతిమ పరిశీలనలో వారి మధ్య ఐక్యతే కనిపిస్తుంది.

  భూస్వామ్య ఉత్పత్తి విధానం పూర్తి స్వరూపంలో కాకుండా సామ్రాజ్యవాద పాలకుల కింద అణిగిమణిగి ఉన్న పెట్టుబడిదారులతో కుమ్మక్కు అయినందున అర్ధ భూస్వామ్య వ్యవస్ధ అయింది. భూస్వామ్య వ్యవస్ధ లో మార్పు వచ్చింది అని అభిప్రాయం కలిగిస్తున్న పరిణామాలు దళారీ పెట్టుబడి ప్రభావం. అది స్వతంత్ర పెట్టుబడి అయివుండి జాతీయ ప్రయోజనాలను కలిగి ఉన్నట్లయితే ఇటు భూస్వామ్య వ్యవస్ధతో చివారికంటా ఘర్షణ పడడమే కాక సామ్రాజ్యవాదంతో కూడా పోరాడుతుంది.

  భూస్వామ్య వ్యవస్ధపై పోరాడి విజయం సాధిస్తే భూస్వామ్య ఉత్పత్తి విధానం నశించి అన్నింటా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం నడిచేది. ఇప్పుడు ఎక్కడా భూస్వామ్య పద్ధతిలో ఉత్పత్తి జరగడం లేదన్నది నిజం కాదు. భ్యూస్వామ్య ఉత్పత్తి లేకపోతే భూములు ఎవరి కింద ఉన్నట్లు? దళారీ పెట్టుబడిదారులు, వారి యజమానులయిన సామ్రాజ్యవాదుల ఆధ్వర్యంలో నడుస్తున్న పారిశ్రామిక కార్యకలాపాలు పెట్టుబడిదారీ విధానానికి నిదర్శనం కాదు.

  మీకు గుర్తున్నట్లయితే వై.ఎస్.ఆర్ సి.ఏం గా ఉన్నపుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి మిత్రులు, అనుచరుల ఆధీనంలో లక్షల ఎకరాలు ఉన్నట్లు బయటపడింది. సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీల కృషి ద్వారా కూడా ఈ భూ ఆక్రమణలు బట్టబయలయ్యాయి. నూతన ఆర్ధిక విధానాల వలన చిన్న, మధ్య తరగతి రైతుల నుండి భూములను ప్రభుత్వాలు బలవంతంగా గుంజుకోవడం పెరిగింది. 65 శాతం ప్రజలు గ్రామాల్లో ఉంటే, వారంతా వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటే వారు ఏ ఉత్పత్తి విధానం కింద ఉన్నట్లు? పెట్టుబడిదారీ వ్యవసాయం కిందైతే లేరు గదా? అక్కడక్కడా బడా పెట్టుబడిదారుల ఆధ్వర్యంలో తప్ప పెట్టుబడిదారీ వ్యవసాయం భారత దేశంలో ఉన్నదని ఏ మార్క్సిస్టు-లెనినిస్టు విశ్లేషకులూ చెప్పలేదు.

  భూస్వాములు దివాళా తీయడం అంటే ఏమిటి? వారిపైన పెట్టుబడిదారులు విజయం సాధించారన్నది మీ సూచన. అదే నిజమైతే పెట్టుబడిదారీ వర్గం భూస్వామ్య వర్గంపై పోరాడి ‘ప్రజాతంత్ర విప్లవాన్ని’ విజయవంతం చేసి ఉండాలి. కానీ అలాంటి విప్లవం ఏదీ భారత దేశంలో జరగలేదు. ఆగస్టు 15 నిజమైన స్వాతంత్ర్యమని అంగీకరిస్తే అదే ప్రజాతంత్ర విప్లవం అయి ఉండాలి. ఆగస్టు 15 అధికార మార్పిడి ప్రజాతంత్ర విప్లవం అన్నది మార్క్సిస్టు-లేనిస్టు విశ్లేషణకు విరుద్ధం.

  చేతి వృత్తుల విధ్వంసం, వలస పాలనలోనే విస్తృతంగా జరిగింది. చేతి వృత్తులను విధ్వంసం చేసి బ్రిటిష్ వాళ్ళు భారత దేశాన్ని తమ ఉత్పత్తులకు మార్కెట్ గానూ, ముడి పదార్ధాల సరఫరా చేసే దేశంగానూ మార్చుకున్నారు. అదేమీ కొత్త పరిణామం కాదు. సామ్రాజ్య వాద దేశాలకు భారత దేశం మార్కెట్టుగా మారే ప్రక్రియలో భాగంగా చేతివృత్తుల విధ్వంసాన్ని చూడాలి తప్ప అర్ధ భూస్వామ్య వ్యవస్ధ మార్పు గా కాదు. అదే కాకుండా భూస్వామ్య వ్యవస్ధ అర్ధ భూస్వామ్య వ్యవస్ధ గా మారే క్రమంగా కూడా చేతి వృత్తుల విధ్వంసాన్ని చూడాలి. అర్ధ భూస్వామ్య వ్యవస్ధలో జరిగే బాధారకరమైన పరిమాణాత్మక మార్పులను ఆ వ్యవస్ధ పునాదిలో జరుగుతున్న మార్పులుగా చూడడం సరికాదు.

  బాధాకరమైన పరిమాణాత్మక మార్పులు అని ఎందుకు అంటున్నానంటే అవి కార్మికులు, కూలీల జీవితాలను మరింత విధ్వంసం కావిస్తూ ఆధిపత్య వర్గాలైన భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు మరింత మిగులును సమకూర్చిపెడతాయి. ప్రజల బ్రతుకులను మరింత దుర్భరం చేస్తాయి. ఈ ప్రక్రియలో పెట్టి బూర్జువాలైన మధ్య తరగతి వర్గం, ధనిక మధ్య తరగతి వర్గం కూడా తాత్కాలిక లబ్ది పొందుతుంది. కానీ సామ్రాజ్యవాదం, దళారీ పెట్టుబడిదారీ వర్గం మరింత సంక్షోభంలో కూరుకుపోయే కొద్దీ (అదనపు విలువ వైరుధ్యం దానికే దారి తీస్తుంది) పెట్టి బూర్జువా కూడా కార్మికులుగానో, కూలీలుగానో అదీ కాకపోతే లంపెన్లుగానో, ఆధిపత్య వర్గాలకు సేవకులుగానో మారిపోతారు. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, ఈజిప్టు, లిబియా లలో స్ధానిక దళారీ పెట్టుబదుదారుల సహకారంతో (లొంగుబాటుతో) సామ్రాజ్యవాదులు సాగించిన విధ్వంసం ఆ పరిణామాలకే దారి తీసింది.

  ఇండియాలో కూడా అమెరికా జోక్యం తీవ్రం అవుతోంది. పశ్చిమ దేశాల కంపెనీల దోపిడీ తీవ్రం అవుతోంది. అమెరికా, ఇండియాలు మరింత దగ్గరవుతున్నాయని పత్రికలు వివిధ ఉదాహరణలతో విశ్లేషిస్తున్నాయి. సామ్రాజ్య వాద కంపెనీల కోసం, గిరిజనుల తరిమి కొట్టి వారి స్వాధీనంలోని భూములను ఆక్రమించి బాక్సైట్, ఐరన్, నీరు తదితర సహజ వనరులను కొల్లగొడుతున్న పరిస్ధితిని చూస్తూనే ఉన్నాం. అమెరికా, యూరప్ లు సంక్షోభం నుండి బైటికి రావడానికి ఆసియా-పసిఫిక్ ప్రాంతంపై కేంద్రీకరించారు. ఆఫ్ఘనిస్ధాన్, సిరియా, ఇరాన్ కేంద్రంగా దురాక్రమణ యుద్ధాలు సాగించి మధ్య ప్రాచ్యంలోని వనరులను కొల్లగొట్టే కృషిలో అమెరికా ఇండియాను మిత్రుడుగా స్వీకరించింది. అమెరికా మిత్రుడు అంటే ఆ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా దేశ వనరులను నేరుగా వినియోగ పెట్టడం. అమెరికా స్నేహం చిక్కనయ్యే కొద్దీ ప్రజలపై ఆర్ధిక, సామాజిక దాడులు తీవ్రం అవుతాయి. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా లేనివన్నీ, అవి జాతీయ ప్రయోజనాలైనా సరే, చట్ట వ్యతిరేకంగా ముద్రవేయబడతాయి. ఆ దాడులకు తీవ్రవాదం అణచివేత అనో, నక్సలైటు సమస్య అనో ముసుగు వేస్తారు. దానిలో భాగంగానే తిరగబడుతున్న జనాన్ని అణిచివేయడానికి మరిన్ని క్రూర చట్టాలను రాష్ట్రాలు, కేంద్రాలు తెస్తున్నాయి.

  ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సామ్రాజ్య వాదం ప్రభావం పల్లెల వరకూ ఎలా చొచ్చుకు వస్తుందో చెప్పడానికి. మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజల మూలుగలు పిప్పి చేస్తున్న కంపెనీల్లో వాల్ స్ట్రీట్ కంపెనీల పెట్టుబడులు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. సామాన్యులు మిగుల్చుకున్న పదో పరకో మిగులును కూడా మైక్రో ఫైనాన్స్ కంపెనీల ద్వారా వాల్ స్ట్రీట్ కంపెనీలు దోచుకుంటున్నాయి. వారిచ్చిన అప్పుల వసూలుకు పల్లెల్లో కుటుంబాల్లో చిచ్చు రగిలిస్తున్నాయి. చెప్పి మరీ ఆత్మహత్యలకు పురికొల్పుతున్నాయి. సామ్రాజ్యవాదులకు, దళారీ పెట్టుబడుదారులకూ, భూస్వామ్య పెత్తందారులకు అభివృద్ధి చెందుతున్న కుమ్మక్కు కొన్ని ఉపరితల మార్పులకు దారితీస్తే అది అంతవరకే చూడాలి తప్ప వ్యవస్ధలో వస్తున్న మౌలిక మార్పులుగా అంచనా వేయరాదు. మీరు ఉపయోగించిన పదజాలం మౌలిక మార్పులనే సూచిస్తున్నాయి.

  సామ్రాజ్య వాద ప్రయోజనాలకు దళారీ పెట్టుబడిదారులూ, భూస్వాములూ సేవకులు. వారు స్వంతంత్రులు కారు. సేవకులు ఒకరిపై మరొకరు పట్టు సాధించడం ఏదీ ఉండదు. ఉన్నా అది తాత్కాలిక ప్రయోజనాలకే తప్ప వ్యవస్ధాగత మార్పులకు అది దారి తీయదు.

  నేను ఉటంకించిన మీ వ్యాఖ్య లోని వ్యాక్యాలు నాలుగైదే అయినా దానికి విస్తృత అర్ధం ఉంది. ఆ అర్ధం పూర్తిగా మీ దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు గానీ, నేనిక్కడ ఇచ్చిన వివరణ కూడా పూర్తి వివరణ అని నేను భావించడం లేదు. అనేక సామాజిక, ఆర్ధిక పరిణామాలను వివరిస్తూ తేల్చవలసిన వివరణను క్లుప్తంగా మాత్రమే ఇస్తున్నాను. వ్యవస్ధల మార్పులకు సంబంధించిన కొన్ని మౌలిక సిద్ధాంత అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భ్యూస్వామ్య వ్యవస్ధలో వచ్చాయంటూ మీరు చెప్పిన విషయం సి.పి.ఎం అవగాహనకు దగ్గరగా ఉంది. అంతిమ పరిశీలనలో సి.పి.ఎం అనుసరిస్తున్న రాజకీయ అవగానను అది ఆమోదిస్తుంది. తస్మాత్ జాగ్రత్త.

  సి.పి.ఎం, విప్లవ పార్టీల ‘కార్యక్రమం’ డాక్యుమెంట్లను అధ్యయనం చేస్తే మరిన్ని విషయాలు తెలియవచ్చు.

 11. రామ్మోహన్ గారూ, పైన ఇచ్చిన వివరణను కొంత రిఫైన్ చేసి (సంబోధనా అవీ తీసేసి) పోస్టుగా మార్చుతాను. మీ ఆమోదంతో.

 12. కొన్నేళ్ళ క్రితం నా స్నేహితురాలికీ, నాకూ మధ్య యాహూ గ్రూప్స్‌లో చర్చ జరిగింది. “ఇస్లామిక్ దేశాలలో కొనసాగుతున్న హిజబ్ (ముసుగు వేసుకోవడం) లాంటి దురాచారాల గురించి వ్రాయడానికి సామ్రాజ్యవాద అనుకూల మీడియాలు ఉత్సాహం చూపుతాయి కానీ ఇండియాలో ఉన్న కుల వ్యవస్థ, భర్త చనిపోయిన స్త్రీలకి పసుపు కుంకుమలు తీసివెయ్యించడం లాంటి దురాచారాల గురించి ఆ మీడియాలు వ్రాయవు. ఒక దేశం అమెరికాకి అనుకూలంగా ఉన్నంత వరకు ఆ దేశంలో ఎన్ని సాంఘిక దురాచారాలు కొనసాగినా సామ్రాజ్యవాద అనుకూల మీడియాలు పట్టించుకోవు” అని ఆమె చెప్పింది.

  ఆధునికత విషయానికొస్తే అది పైకి చెప్పుకునే కబుర్లలో మాత్రమే ఉంటుంది. విలియమ్ షేక్స్‌పియేర్ తన కంటే ఎనిమిదేళ్ళు పెద్దదైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు కనుక పురుషుడు తన కంటే వయసులో పెద్దదైన స్త్రీని పెళ్ళి చేసుకోవడం తప్పు కాదు అని ఇక్కడ చెపితే మన యువకులు దాన్ని అంగీకరించరు. అమ్మాయిలతో కలిసి పబ్‌లలో బీర్ తాగడానికి లేదా పెళ్ళికి ముందు సెక్స్ పేరుతో తెగించి తిరగడానికి అయితే ఆధునికత పేరు చెప్పుకుంటారు. కానీ విధవా వివాహాలు, వయసు పట్టింపు లేని వివాహాలు చేసుకోమంటే మాత్రం ఒప్పుకోరు. అటువంటి విషయాలలో తమకి ఆధునికత అవసరం లేదు అన్నట్టే మాట్లాడుతారు.

 13. “ఆధునికత విషయానికొస్తే అది పైకి చెప్పుకునే కబుర్లలో మాత్రమే ఉంటుంది… …అమ్మాయిలతో కలిసి పబ్‌లలో బీర్ తాగడానికి లేదా పెళ్ళికి ముందు సెక్స్ పేరుతో తెగించి తిరగడానికి అయితే ఆధునికత పేరు చెప్పుకుంటారు. కానీ విధవా వివాహాలు, వయసు పట్టింపు లేని వివాహాలు చేసుకోమంటే మాత్రం ఒప్పుకోరు. అటువంటి విషయాలలో తమకి ఆధునికత అవసరం లేదు అన్నట్టే మాట్లాడుతారు.”

  మంచి పరిశీలన, ప్రవీణ్.

 14. పరిస్థితి అన్ని చోట్ల ఒకేలాగ లేదు. మా పట్టణంలో అయితే వ్యక్తిగతంగా తెలిసినవాళ్ళకే కులం పేరు అడుగుతారు. ఇక్కడ కొత్తగా పరిచయమైనవాళ్ళకి కులం పేరు అడగరు. నిత్య జీవితంలో ఏవో పనులలో ఉండేవాళ్ళకి కులం గురించి అంతగా పట్టించుకునే సమయం ఉండదు. “Pure vegetarians colony” అనగానే బ్రాహ్మణులు అధిక ధరలకి ప్లాట్‌లు కొంటారనుకుని రియల్ ఎస్టేట్స్ వ్యాపారులే ఆ పోకడని ప్రోత్సహించి ఉండొచ్చు.

 15. కులం గురించి అంతగా పట్టించుకుంటున్నారంటే వాళ్ళు శరీరంలో కొవ్వు ఎక్కువైన వాళ్ళు అయ్యుండాలి. నిజ జీవితంలో ఎందుకూ పనికిరాని కులం గురించి అంతగా పట్టించుకోవడం (అది కూడా ఇల్లు అద్దెకి ఇవ్వడం, స్థలాలు అమ్మడం లాంటి వ్యాపార విషయాలలో) నిజంగా అసాధారణ విషయమే.

 16. “కులం గురించి అంతగా పట్టించుకుంటున్నారంటే వాళ్ళు శరీరంలో కొవ్వు ఎక్కువైన వాళ్ళు అయ్యుండాలి”

  కులం గురించి పట్టించుకుంటున్న వారు కొవ్వు ఎక్కువైన వాళ్లు అని జనరలైజ్ చేయడం వినడానికి చాలా కష్టంగా ఉంటుంది. వర్గ పరిశీలనకు లేదా వర్గ-కుల పరిశీలనకు కూడా ఈ కొవ్వెక్కిన వాళ్లు తరహా పదబంధాలు కలిసిన విమర్శ ఏ మాత్రం తగదు, పైగా భావ్యం కాదేమో కూడా. కుల వ్యవస్థ ఘనీభవించి పోయిన వ్యవస్థలో కులం గురించి పట్టించుకోవడం చాలా మందికి చాలా సహజం. ఇళ్లు అద్దెకు ఇవ్వడంలో కులం పట్టింపు మాత్రమే లేదు. చాలా విషయాలు దీంట్లో కలుస్తున్నాయి.

 17. ఇల్లు అద్దెకి ఇవ్వడం విషయంలో కులం గురించి పట్టించుకునేవాళ్ళు తమకి అద్దె ఇల్లు అవసరమైనప్పుడు ఓనర్ కులం పేరు అడగరు. జీవితంలో అన్ని వేళలా కులాన్ని పట్టుకుని వేలాడడం సాధ్యం కాదు కదా. రియల్ ఎస్టేట్స్ వ్యాపారం విషయంలో కులాన్ని పట్టించుకోవడమే శరీరం కొవ్వినవాళ్ళు చేసే పనిలా అనిపించింది. మనిషిని భావం కంటే భౌతికతే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని మార్క్సిస్ట్‌లందరికీ తెలుసు. వ్యాపార విషయాలలో కుల పట్టింపులు అనవసరం అనేది సాధారణ వ్యక్తులకి తెలిసిన లోకజ్ఞానమే కదా. నేను కూడా కొంత కాలం వ్యాపారం చేశాను, వ్యాపారుల మధ్య అంతర్గత పోటీ లేకుండా చెయ్యడానికి ఏర్పడిన వ్యాపార సిండికేట్‌లో కూడా ఉన్నాను. వ్యాపారం విషయంలో కులం గురించి పట్టించుకునేవాళ్ళని నా జీవితంలో ఇంత వరకు చూడలేదు. అందుకే వ్యాపారం విషయంలో కుల పట్టింపులు ఉన్నవాళ్ళ గురించి విన్నప్పుడు అది కొవ్వు బలిసినవాళ్ళు చేసే పని అనిపించింది.

 18. ఇంకో విషయం, ‘వర్గ స్పృహ లేకుండా కుల వ్యవస్థని కేవలం మూర్ఖులు సృష్టించినటువంటిదిగా తేల్చిపారెయ్యడం’ అనేది నాస్తికులు చేసే పని. అది మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్‌లు చేసే పని కాదు. ఈ విషయం నాకు తెలుసు. కానీ వ్యాపారం విషయంలో కులాన్ని చూడడం మరీ చాదస్తం అనిపించి, దాన్ని ఒళ్ళు కొవ్వడంతో పోల్చాను, అంతే.

 19. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశంలో కుల వ్యవస్థ బలపడింది కానీ బలహీనపడలేదు. ఈ రోజుల్లో కులాలు లేవనీ, అందరూ కులాలు మరచిపోతున్నారనీ వాదించేవాళ్ళకి కూడా ఇది రుచించని నిజమే, ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/Zs4u7kc5Spx

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s