గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నిజ స్వరూపాన్ని ఆయన పార్టీ నాయకులే విప్పి చూపుతున్నారు. మోడి చెబుతున్న అభివృద్ధి పారిశ్రామికవేత్తలదే తప్ప ప్రజలది కాదన్న వాస్తవాన్ని వెల్లడిస్తున్నారు. అబద్ధాలు చెప్పడాన్ని మోడీ గుత్తకు తీసుకున్నాడని, ఆయన సద్భావన మిషన్ పెద్ద మోసమనీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బి.జె.పి నాయకుడు కేశూభాయ్ పటేల్ అసలు వాస్తవాన్ని వెల్లడించాడు. తద్వారా మోడీ కేంద్రంగా ఉబ్బిపోతున్న గాలి బుడగను ‘టప్పున’ బద్దలు కొట్టాడు.
“ప్రజలకు అబద్ధాలు చెప్పి తప్పుదారి పట్టించడాన్ని ఒక వ్యక్తి గుత్తకు తీసుకున్నాడు. ఆయన ఎవరో మీకు బాగానే తెలుసు” అని కేశూభాయ్ పటేల్ ఆదివారం వ్యాఖ్యానించాడు. ‘టోటల్ సిస్టమ్ ఛేంజ్ ఫోరం’ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన “నర్మదా నీరు తెచ్చానని మోడి చెబుతున్నాడు. కానీ అదొక అబద్ధం. గత 45 సంవత్సరాలలో ఏ ప్రభుత్వమూ ఒక్క ఇల్లైనా కట్టనట్లు తానే ఇళ్ళు కట్టించినట్లు చెప్పుకుంటున్నాడు” అని అన్నాడు.
మోడి తలపెట్టిన ‘సద్భావన మిషన్’ వ్యక్తిగత ఎన్నికల జిమ్మిక్కు గా కేశూభాయ్ కొట్టిపారేశాడు. “మోడి కొత్తగా మొదలు పెట్టిన ‘సద్భావన మిషన్’ సాధారణ ప్రజల కోసం కాదు. లేనట్లయితే ఈ మాట మనం 2002 కూడా వినివుండేవాళ్లం” అని ఆయన విమర్శించాడు. 2002 లో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష మద్దతుతో ముస్లిం ప్రజలపై జరిగిన మారణకాండను ఉద్దేశిస్తూ కేశూభాయ్ ఈ మాటలన్నాడన్నది స్పష్టమే.
“మంచి పాలన ప్రేమ, భయరాహిత్యం లపై ఆధారపడి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ, గుజరాత్ లో ప్రేమ అనేది లేకుండా పోయింది. ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు” అని కేశూభాయ్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించాడు. గుజరాత్ లో అవినీతి విచ్చలవిడిగా పరిగిపోయిందనీ, నల్లడబ్బు విస్తృత వ్యాప్తిలో ఉన్నదనీ చెబుతూ ఆయన “ప్రస్తుత పాలనను మార్చకపోయినట్లయితే రాష్ట్రంలో సామాజిక వ్యవస్ధ కూలిపోయే అవకాశాలున్నాయి” అని హెచ్చరించాడు.
మోడి ప్రభుత్వం ‘పారిశ్రామికవేత్తల ప్రభుత్వం’ గా కేశూభాయ్ అభివర్ణించాడు. గత ఎనిమిది సంవత్సరాలలో మోడి ప్రభుత్వం గ్రామీణ మేత భూములన్నీ పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పిందని ఆయన వెల్లడించాడు. ఫలితంగా 6,000 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తుకున్నారని కూడా ఆయన వెల్లడి చేశాడు. క్షీణదశలో ఉన్న పాలననుండి ప్రజల దృష్టి మళ్లించడానికి వారిని పండగల్లో ముంచెత్తే విధానాన్ని మోడి అనుసరిస్తున్నాడని మరో మాజీ ముఖ్యమంత్రి సురేష్ మెహతా వ్యాఖ్యానించాడని ‘ది హిందూ’ తెలిపింది.
నరేంద్ర మోడి గుజరాత్ ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నాడనీ, అవినీతిని సహించడనీ అన్నా హజారే లాంటి అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు. కేశూభాయ్ లాంటి బి.జె.పి నాయకుల మాటలద్వారానైనా వారు నిజం గ్రహించవలసి ఉంది. అభివృద్ధి అనేది మారు మూల పల్లె ప్రజలకు కూడా చేరినప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుందనీ, డబ్బు మూటలలో మునిగి ఉండే పారేశ్రామికవేత్తలకు మరిన్ని మూటలు పోగేసుకునే అవకాశాలు పెంచితే అది ధనికుల అభివృద్ధి అవుతుందేతప్ప ప్రజల అభివృద్ధి కాదనీ గ్రహించవలసి ఉంది.