సిరియా విషయంలో రష్యా, చైనా లు తగిన మూల్యం చెల్లించక తప్పదన్న అమెరికా హెచ్చరికను చైనా తిరస్కరించింది. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ విమర్శ తమకు ఆమోదయోగ్యం కాదని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లియు వీమిన్ శనివారం ప్రకటించాడు. “సిరియా సమస్యల పరిష్కారాన్ని తాము అడ్డుకోవడం లేదని” లియు విలేఖరుల సమావేశంలో అన్నాడని ప్రెస్ టి.వి తెలిపింది.
జులై 6 తేదీన పారిస్ లో జరిగిన ‘ఫ్రెండ్స్ ఆఫ్ రష్యా’ దేశాల సమావేశాల సందర్భంగా హిల్లరీ క్లింటన్ రష్యా, చైనాలకు నేరుగా హెచ్చరిక జారీ చేసింది. “రష్యా, చైనాలు మూల్యం చెల్లిస్తాయని ఇక్కడ ప్రాతినిధ్యం ఉన్న దేశాలన్నీ నేరుగా, అత్యవసరంగా స్పష్టం చెయ్యడమే పరిస్ధితిలో మార్పు తెచ్చే ఏకైక మార్గం” అని క్లింటన్ ప్రకటించింది. పారిస్ సమావేశాన్ని రష్యా, చైనా లు బహిష్కరించాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జెనీవాలో సమావేశం జరిగి తీర్మానం ఆమోదించాక మరో ప్రవేటు సమావేశం అవసరం లేదని చెబుతూ అవి పారిస్ సమావేశానికి హాజరు కాలేదు.
క్లింటన్ హెచ్చరికను చైనా ఖండించింది. “ప్రాంతీయ సుస్ధీరతకు, శాంతికి చైనా ప్రముఖంగా దోహదపడింది. సిరియా ప్రజల మౌలిక ప్రయోజనాలకూ, సిరియా సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనడానికీ చైనా దోహదపడింది” అని లియు పేర్కొన్నాడు.
సిరియాను సైనికంగా కబళించి తమ కంపెనీల ప్రయోజనాలను అడ్డుకుంటున్న సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను కూల్చివేయాలని అమెరికా, యూరప్ లు చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను చైనా, రష్యాలు అడ్డుకుంటున్నాయి. వీటో హక్కు ని వినియోగించి సిరియాపై దురాక్రమణ దాడి చేయడానికి దారి తీసే తీర్మానాలను అడ్డుకుంటున్నాయి. దానితో ఆ దేశాలను నేరుగా హెచ్చరించడానికి సైతం అమెరికా సిద్ధపడింది. గడాఫీ విషయంలో చూపిన మెతకదనంతో తమ ప్రయోజనాలకే ఎసరు వచ్చిన పరిస్ధితిని ఎదుర్కొన్నా చైనా, రష్యాలు సిరియాలో జాగ్రత్తపడడానికి ప్రయత్నిస్తున్నాయి.
జూన్ 30 తేదీన సిరియా విషయం పైనే జెనీవాలో ఐక్యరాజ్యసమితి, అరబ్ లీగ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సిరియాలో పాలక, ప్రతిపక్షాలన్నింటితో కలిసి ‘ట్రాన్సిషనల్ గవర్న్ మెంట్’ ఏర్పాటు చేయాలని ఆ సమావేశం ఆమోదించిన తీర్మానం పిలుపునిచ్చింది. అధ్యక్షుడు బషర్ ను తొలగించాలని పరోక్షంగా చెప్పే పదజాలాన్ని తీర్మానం నుండి తొలగించేలా చైనా, రష్యా లు ఒత్తిడి తెచ్చి సఫలం అయ్యాయి. దానితో అమెరికా, యూరప్ లు తమ టైనాతీ అరబ్ దేశాలతో కలిసి పారిస్ లో మరో సమావేశం ఏర్పాటు చేసి రష్యా, చైనాలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నించాయి. కానీ ఆ సమావేశాన్ని రష్యా, చైనాలు బహిష్కరించడంతో ‘మూల్యం చెల్లించక తప్పదని’ అమెరికా బెదిరింపులకు సైతం దిగింది.
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జెనీవాలో సమావేశం notes from Prajasakti
సిరియాలో జరుగుతున్న హింసాకాండపై అక్కడి బషర్ – అల్ – అసద్ ప్రభుత్వాన్నే బాధ్యురాలిని చేస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రతిపాదించిన తీర్మానానికి వ్యతిరేకంగా రష్యా, చైనా, క్యూబా ఓటు వేశాయి. మండలిలో అమెరికా ప్రతిపాదించిన ఈ తీర్మానం ‘సిరియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, హింసాకాండ, కొనసాగుతున్న వేధింపులు, అత్యాచారాలు, సాధారణ పౌరులను టార్గెట్ చేస్తూ అక్కడి ప్రభుత్వ దళాలు కొనసాగిస్తున్న దమనకాండ’ను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. హింసాకాండ ఏ రూపంలో కొనసాగుతున్నా దానికి వెంటనే తెరదించాలని ఈ తీర్మానం స్పష్టం చేసింది. అయితే ప్రతిపక్ష తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులు కొనసాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రస్తావించటంలో ఈ తీర్మానం విఫలం కావటం విశేషం. ఈ తీర్మానంలో చేర్చేందుకు ‘సిరియాలో జరుగుతున్న ఉగ్రవాద చర్యలన్నింటినీ గట్టిగా ఖండిస్తున్నామంటూ రష్యా ప్రతిపాదించిన వాక్యానికి ఐరాస మానవ హక్కుల మండలి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 41 సభ్య దేశాలు ఓటు వేయగా భారత్, ఫిలిప్పీన్స్, ఉగాండా ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ప్రస్తుతం మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు సిరియాలో దర్యాప్తు జరుపుతున్న స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్ అందజేసే తుది నివేదిక వచ్చే సెప్టెంబర్ 10 నుండి 28 వరకూ జరగనున్న మండలి 21వ సమావేశాల్లో పరిశీలనకు వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
యు.ఎన్ మానవహక్కుల సంస్ధ ఏర్పాటులో అమెరికా సంతకం చేయలేదు. కాని సంస్ధ మాత్రం అమెరికా చెప్పుచేతుల్లో ఉండడం ఇక్కడ ఘోరమైన సంగతి. యు.ఎన్ ని అడ్డం పెట్టుకుని సంతకందారు కాకపోయినా, నిరంతరం మానవహక్కుల హరణలో బిజీగా ఉండే అమెరికా దారుణాలు చేస్తూ యు.ఎన్ మానవ హక్కుల సంస్ధ స్క్రూటినీ నుండి తప్పించుకుంటోంది.
సిరియాలో కిరాయి తిరుగుబాటుదారుల్ని దింపి లేని తిరుగుబాటుని రెచ్చగొట్టిందే అమెరికా. కిరాయి గాళ్లకి ఆయుధాలు, డబ్బు, శిక్షణ ఇస్తున్నదే అమెరికా. దాని దాష్టీకాలకి సిరియా ప్రభుత్వం ఇస్తున్న స్పందన మాత్రం మానవ హక్కుల ఉల్లంఘనగా మారిపోయింది. అమెరికా సామ్రాజ్యవాద దుర్మార్గాలకి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది?
అశోక్ గారూ, మీ అప్ డేట్ కి ధన్యవాదాలు.