కంపెనీలను ఏమీ చేయలేక సాధారణ వినియోగదారులకు ఇంటర్నెట్ ఛార్జీలు పెంచిన వైనం ఇది. బడా ఐ.ఎస్.పి (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) కంపెనీలకు అనేక లైసెన్సులు ఉంటాయి. ప్రభుత్వం, ఐ.ఎస్.పి ల ఒప్పందం ప్రకారం రెవిన్యూను పరస్పరం పంచుకోవాలి. డిఫరెన్షియల్ రెవిన్యూ షేరింగ్ గా పిలిచే ఈ పద్ధతి ప్రకారం పిండి కొద్దీ రొట్టె ముక్కను ప్రభుత్వానికి కంపెనీలు ఇవ్వాలి. ప్రభుత్వ వాటా వివిధ స్ధాయిల లైసెన్సులను బట్టి ఉంటుంది. కొన్ని లైసెన్సుల కింద వచ్చే ఆదాయంలో 6 నుండి 10 శాతం వరకూ ప్రభుత్వానికి చెల్లించాలి. మరికొన్ని లైసెన్సుల కింద సమకూరే ఆదాయంపై అంతకంటే తక్కువ భాగం ప్రభుత్వానికి చెల్లిస్తే సరిపోతుంది. ఈ తేడాను కంపెనీలు ఎక్స్ ప్లాయిట్ చేస్తూ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని తక్కువ భాగం చెల్లించాల్సి ఉండే లైసెన్సుల కింద ఆదాయంగా చూపిస్తున్నాయి. దానితో ప్రభుత్వం ఆదాయం పడిపోతున్నది. దీన్ని అరికట్టడానికి కంపెనీల పై చర్యలు తీసుకోవడానికి బదులు ప్రభుత్వం తేలిక మార్గాన్ని ఎంచుకుంది. తక్కువ స్ధాయి రేట్లు ఉన్న లైసెన్సులకు కూడా అధిక రేట్లు బనాయించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంటర్నెట్ వాడకం పెరిగే కొద్దీ జి.డి.పి వృద్ధి కూడా పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు, మెకిన్సే అండ్ కో, బూజ్ అలెన్ తదితర సంస్ధల అధ్యయనంలో తేలింది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులు 10 శాతం పెరిగితే జి.డి.పి లో 1.4 నుండి 2 శాతం వరకూ అదనపు వృద్ధి సాధ్యమవుతుందని అవి తెలిపాయి. బ్రాడ్ బ్యాండ్ ద్వారా సరుకులు, సేవల వ్యాపారం జరిగి వ్యాపారాభివృద్ధి జరుగుతుందనీ, అది అంతిమంగా దేశ స్ధూల జాతీయోత్పత్తి పెరగడానికి దారి తీస్తుందనీ అవి తెలిపాయి. ఈ నేపధ్యంలో 2012 లోపు 40 మిలియన్ల (4 కోట్లు) మందికి బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికీ 14 మిలియన్లు మాత్రమే సాధించింది. ఈ పరిస్ధితిలో బ్రాడ్ బ్యాండ్ సేవలను మరింత చౌకగా వినియోగదారులకు చేర్చే లక్ష్యాన్ని మరిచిపోయి రెవిన్యూ పెంచుకునే పనిలో ప్రభుత్వం తలమునకలైంది. అది కూడా కంపెనీల ‘ఆర్బిట్రేజ్’ ను అడ్డుకులోలేక జనం పై వాలడం ఇంకా దారుణం. అయిదేళ్లుగా కంపెనీలు చేస్తున్న మోసానికి విరుగుడుగా ‘ప్రజలపై బాదుడు’ నే ప్రభుత్వం ఎంచుకోవడం గర్హనీయం.
కార్టూన్: ది హిందూ
hello sir,
saadharana viniyogadaarudi meeda prathyakshanga yela extra charge vasulu chestaro inka koncham vivarana unte bagundedi…
కిరణ్ గారూ, కంపెనీల నుండి ప్రభుత్వం వసూలు చేసే అదనపు రెవిన్యూని కంపెనీలు తమ ఆదాయం నుండి చెల్లించవు. దానిని నేరుగా వినియోగదారుల మీదికి తరలిస్తాయి. అది వెంటనే జరగకపోవచ్చు. టారిఫ్ రేట్ల పెంపుదల పేరుతో పాత బాకీలు కూడా కలిపి వసూలు చేసుకుంటాయి. కొత్త ప్యాకేజీలు ప్రకటించి ఆ ముసుగులో వసూలు చేసుకోవచ్చు. స్పీడ్ లో స్లాబ్ లను పునర్నిర్వచించవచ్చు. అల్ప, అధికాదాయ వర్గాలంటూ కబుర్లు చెప్పి పెంచవచ్చు. జనానికి తెలియకుండా బాదే పద్ధతుల్ని కంపెనీలు, ప్రభుత్వాలు చాలా కనిపెట్టాయి.