జపాన్ ప్రభుత్వం అణు కంపెనీల లాబీ తెచ్చిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయింది. రెండు నెలల పాటు అణు విద్యుత్ అనేదే లేకుండా గడిపగలిగినప్పటికీ ప్రజల ప్రయోజనాల కంటె అణు కంపెనీల ప్రయోజనానే ముఖ్యమని భావించింది. ఫుకుయి లో ‘కాన్సాయ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ’ కి చెందిన ‘ఒయి న్యూక్లియర్ పవర్ ప్లాంటు’ ను ఆదివారం తిరిగి తెరిచింది. తద్వారా ఫుకుషిమా ప్రమాదం తర్వాత కూడా పాఠాలు నేర్చుకోవడానికి తిరస్కరించింది. సంవత్సర కాలంగా జపాన్ ప్రజల నిరసనలను బేఖాతరు చేస్తూ ఒయి కర్మాగారంలోని అటామికి రియాక్టర్ లో రీఫైరింగ్ మొదలు పెట్టింది. ప్రభుత్వము, టెప్కో కంపెనీ, రెగ్యులేటరీ సంస్ధ కుమ్మక్కయిన ఫలితమే ఫుకుషిమా విపత్తు అన్న జపాన్ పార్లమెంటరీ కమిటీ వెలువడడానికి కొద్ది రోజుల ముందే జాగ్రత్తపడుతూ అణు విద్యుత్ కర్మాగారాలను తిరిగి తెరవాలన్న నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది.
జపాన్ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా జపాన్ ప్రజలు నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఎదురుగా బైఠాయింపులు జరిపి తమ వ్యతిరేకతను తీవ్ర స్ధాయిలో తెలియజేస్తున్నారు. వేలాది జపనీయులు ఈ ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. జపాన్ ప్రజల నిరసనలపై ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రిక అందించిన ఫొటోలు ఇక్కడ చూడవచ్చు.