అంబేద్కర్ కార్టూన్ పై రేగిన ‘అప్రజాస్వామిక రగడ’ చివరికి ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకాలనుండి కార్టూన్ లనూ, వివిధ పాఠ్య భాగాలనూ పూర్తిగా తొలగించాలనే దగ్గర తేలింది. ప్రభుత్వం నియమించిన ‘ఎస్.కె.ధోరట్’ ప్యానెల్ చర్చలు చేసి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంది అనేక కార్టూన్ లను, పాఠ్య భాగాలనూ తొలగించాలని మెజారిటీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని పలువురు స్కాలర్లు నిరసిస్తున్నారు. ప్రఖ్యాత చరిత్రకారుడు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన కె.ఎన్.ఫణిక్కర్ ప్యానెల్ నిర్ణయాన్ని ‘అత్యంత దురదృష్టకరం’ అని అభివర్ణించాడు. విద్యా నిపుణులు అనేక సంవత్సరాల పాటు సాగించిన అద్భుతమైన కృషి విద్యార్ధులకు ఇంక అందుబాటులో ఉండదని వ్యాఖ్యానించాడు.
భారత దేశం లాంటి వైవిధ్య పూరితమైన ‘మల్టిపుల్ సెన్సిటివిటీస్’ ఉన్న చోట ప్రత్యామ్నాయ అవగాహనకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుందనీ, సరిగ్గా ఆ కారణం వల్లనే వివిధ పాఠ్యాంశాలు, అవగాహనలు, వ్యాఖ్యానాలు విద్యార్ధులకు అందాల్సి ఉంటుందనీ ఫణిక్కర్ వ్యాఖ్యానించాడు. కమిటీ మాత్రం అందుకు విరుద్ధంగా విద్యేతర వాదనతో వేరే నిర్ణయం తీసుకుందని అన్నాడు. మద్దతు కోల్పోతామన్న భయంతో విద్యేతర ధోరణులకు రాజకీయులు గురికావడం జరుగుతోందనీ, అకడమీషియన్లకు ఆ పరిమితులు ఉండవనీ, విద్యార్ధులకు కావలసింది కూడా పరిమితులు లేకపోవడమేననీ ఫణిక్కర్ వ్యాఖ్యానించాడు.
ఏ రంగంలో తీసుకున్నప్పటికీ ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పోయే రాజకీయ నాయకులపై విమర్శలు సర్వసాధారణం. ప్రజాస్వామిక వ్యవస్ధలకు రాజకీయ విమర్శ ప్రాణావసరం. అలాంటి విమర్శ లేని రాజకీయ శాస్త్ర పుస్తకాలు విద్యార్ధులకు బదులు రాజకీయ నాయకులకు ఇష్టంగా మారడం ఓ అభాస.
–
“ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకాలను మోసుకెళ్లడం అంటే ఆయనకి ప్రేమ. ఎందుకంటే ఆయనపై విమర్శలు లేని చోటు అదొక్కటే మరి.”
–
చివరికి ఇలా తయారు అయ్యాం. దీనిని వ్యతిరేకించక తప్పదు. ప్రస్తుతం వ్యతిరేకించి కూడా చేసేదేమీ లేదేమో.