బ్యాంకులు కంపెనీల కోసం ఇ.సి.బి ఉదారం, వడ్డీ రేటు 0.75% కి తగ్గింపు


ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారకులయిన బహుళ జాతి వాల్ స్ట్రీట్ బ్యాంకులు, కంపెనీల కోసం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మరోసారి యధా శక్తి ఉదారతను ప్రదర్శించింది. ఇప్పటికే హీన స్ధాయిలో 1 శాతం వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించి 0.75 శాతానికి చేర్చింది. 2007 ఆర్ధిక సంక్షోభం నుండి అత్యంత తక్కువ స్ధాయి 0.25 శాతం వద్ద వడ్డీ రేటు కొనసాగిస్తున్న అమెరికన్ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ కంటే ఇది కేవలం అర శాతమే తక్కువ. వడ్డీ రేటు తగ్గింపుతో బ్యాంకులకు, కంపెనీలకూ మరింత ప్రభుత్వ నిధులు మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయి.

ప్రజల పన్నుల డబ్బును సెంట్రల్ బ్యాంకు అప్పుల రూపంలో కంపెనీలు, బ్యాంకులు మేసి మరిన్ని ఆర్ధిక కార్యకలాపాలకు సిద్ధపడతాయని ప్రభుత్వ ఆలోచన. ఆర్ధిక కార్యకలాపాలు పెరిగితే కంపెనీల లాభాలు పెరగడంతో పాటు ఉద్యోగాలు ఇస్తాయని ఆలోచన. ఈ ఆలోచనతోటే ఇ.సి.బి ఇన్నాళ్లూ 1 శాతం వద్ద వడ్డీ రేటు కొనసాగించింది. ఈ ఆలోచన తోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ అయిదేళ్లుగా 0.25 శాతం వద్ద వడ్డీ రేట్లు కొనసాగిస్తోంది. కానీ ఈ అయిదేళ్లుగా ప్రజల పన్నుల డబ్బును మేసిన కంపెనీలు, బ్యాంకులు తమ తమ ఆదాయాలను, లాభాలనూ పెంచుకున్నాయే తప్ప తమ ఆదాయాలను ప్రజలకు ఉద్యోగాల రూపంలో కొద్దిగాయినా తరలించిన పాపాన పోలేదు. అయినప్పటికీ మరింతగా వడ్డీ రేట్లు తగ్గించడం అంటే మరింత ప్రజాధనాన్ని ప్రవేటు వ్యాపారులకు, కంపెనీలకు ధారాదత్తం చేయడమే.

గత వారం యూరో జోన్ నాయకులు సమావేశమై ‘గ్రోత్-ఫ్రెండ్లీ’ విధానాలు అమలు చేయాలని నిర్ణయించిన సంగతి విదితమే. మార్కెట్ల నమ్మకాన్ని (ప్రజల నమ్మకాన్ని కాదు) శక్తివంతం చేసే దిశలో కొత్త చర్యలు తీసుకోవడానికి ఈ సమావేశం నిర్ణయించింది. అందుకోసం 17 దేశాల బ్యాంకుల పర్యవేక్షణకు ఒకే ఒక సూపర్ వైజరీ వ్యవస్ధ ఏర్పరచాలనీ, ఋణ సంక్షోభ బాధిత దేశాలకు తేలికగా అప్పులు ఇవ్వాలనీ నిర్ణయించారు. ఈ నిర్ణయాల తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్లు (ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు, వివిధ రకాల ఫండ్లు, వ్యక్తిగత సంస్ధాగత మదుపుదారులు మొ.) శాంతించారని పత్రికలు తెలిపాయి. ఈ నిర్ణయాలకు అనుసరణగా ఇ.సి.బి కూడా మరిన్ని నిర్ణయాలు చేస్తుందని అవి ఎదురు చూసాయనీ తెలిపాయి. వారి ఎదురు చూపుల ఫలితమే ఇ.సి.బి వడ్డీ రేటు తగ్గింపు. అంటే కంపెనీలు, బ్యాంకుల ఎదురు చూపులంటే కేవలం రోజులు లేదా వారాలు మాత్రమే. అదే ప్రజల ఎదురు చూపులయితే దశాబ్దాలు గడిచినా ముగింపుకు నోచుకోవు.

ఇ.సి.బి పావు శాతం వడ్డీ రేటు తగ్గించడం వల్ల బ్యాంకులకు, వ్యాపారాలకూ, వినియోగదారులకూ చౌకగా అప్పులు దొరకాలన్నది సిద్ధాంతం. ఆచరణలో సాధారణ వినియోగదారులకు తగ్గింపేమీ చేరదు. పెరిగిన ద్రవ్య చెలామణీతో బహుళజాతి కంపెనీలు మరిన్ని జూదాలకు దిగుతాయి. కరెన్సీల మార్కెట్లలో పందేల జోరు పెంచుతాయి. ప్రపంచ వ్యాపితంగా సావరిన్ అప్పు మార్కెట్లతో కూడా జూదం ఆడతాయి. వారి జూదాల జోరు మేరకు వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ప్రభావితం అవుతాయి. కరెన్సీల విలువలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అవన్నీ కంపెనీల ఆదాయాలకూ, లాభాలకూ లోబడి ఉంటాయే తప్ప ఆర్ధిక వ్యవస్ధల మెరుగుదలకు అనుకూలంగా ఉంటాయన్న గ్యారంటీ యేమీ లేదు. అలాంటి గ్యారంటీ ఉంటే అయిదేళ్లుగా 0.25 % వద్దా, 1 % వద్దా వడ్డీ రేట్లు కొనసాగించిన ఫెడరల్ రిజర్వ్, ఇ.సి.బి ల విధానాల ఫలితం కనపడాలి. అదేమీ లేనందున, ప్రజల ఆదాయాలు మరింత పడిపోయిన నేపధ్యంలో, నిరుద్యోగం మరింత తీవ్రమైన నేపధ్యంలో వడ్డీ రేటు విధానాలు కంపెనీల కోసమేనని తేలికగానే అర్ధం చేసుకోవచ్చు.

ఇ.సి.బి మరో వడ్డీ రేటు కూడా తగ్గించింది. యూరో జోన్ దేశాల బ్యాంకులు తన (ఇ.సి.బి) వద్ద చేసే డిపాజిట్లకు ఇచ్చే వడ్డీని 0 (అవును సున్నే) శాతానికి తగ్గించింది. అంటే బ్యాంకులు ఇ.సి.బి వద్ద డిపాజిట్ చేసే అవసరం లేదని చెప్పడమే. బ్యాంకులు ఇక ఇ.సి.బి ని వదిలేసి తమలో తాము అప్పులు ఇచ్చుకుంటూ గడుపుతాయి. ఆపత్సమయాల్లో వినియోగించడానికి ఇ.సి.బి వద్ద అందుబాటులో ఉండవలసిన నిధులు ఆ విధంగా తగ్గిపోతాయి. అయితే తమలో తాము రుణాలు ఇచ్చుకుంటే మళ్ళీ తిరిగి వస్తాయా లేదా అన్న అనుమానంతో ఇ.సి.బి వద్ద డిపాజిట్ చేసే పనికి బ్యాంకులు సిద్ధపడవచ్చు. ఇదొక్కటే ఊరట అయినా అది కూడా ఆర్ధిక వ్యవస్ధలకు ఊతం ఇస్తుందా లేదా అన్నది అనుమానమే.

రుణ కార్యకాలాపాలు మందగించినందునే ఇ.సి.బి వడ్డీ రేటు తగ్గించిందన్నది ఒక వివరణ. ఆర్ధిక వ్యవస్ధల వృద్ధి ఆశావాహంగా లేనందున రుణాల జోలికి వ్యాపార వ్యవస్ధలు రుణాల జోలికి పోవడం లేదు. గ్రీసు త్వరలో యూరో జోన్ వదిలి పోతుందనీ (ఉమ్మడి కరెన్సీ గా యూరో ను త్యజించి సొంత కరెన్సీని పునరుద్ధరించుకుంటుందని), స్పెయిన్, ఇటలీ లాంటి ఋణ సంక్షుభిత దేశాలు ఇంకా బెయిలౌట్లు కోరుతాయనీ (పెద్ద ఆర్ధిక వ్యవస్ధలైన ఈ దేశాలకు బెయిలౌట్లు ఇస్తే ఇ.సి.బి రెస్క్యూ ఫండ్స్ నిండుకుంటాయన్నది భయం) వ్యాపార వ్యవస్ధలు భయపడడంతో అవి ఇలా రుణాల జోలికి పోవడం లేదన్నది ప్రధాన అవగాహన. వారి వద్ద ఎన్ని నిధులు గుట్టలు గుట్టలుగా పేరుకున్నా, వాటన్నింటినీ అట్టే పెట్టుకునేలా అనుమతిస్తూ, ప్రజల సొమ్మును అదనపు అప్పులుగా మంజూరు చేయడానికి ప్రభుత్వాలు లేదా ఇ.సి.బి సిద్ధపడిందని ఇక్కడ అర్ధం చేసుకోవాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s