బ్యాంక్సీ, వీధి చిత్రాలకు చిరునామా అని పాఠకులకు తెలిసిన విషయమే. కులీన వర్గాల ‘అధారిటేరినియనిజం’ పై చాచి కొట్టేలా ఉండే బ్యాంక్సీ వీధి చిత్రాలకు ప్రపంచ వ్యాపితంగా, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో, లెక్కకు మిక్కిలిగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ టపాలో ఇస్తున్నవి బ్యాంక్సీ వీధి చిత్రాలు కావు గానీ, వాటికి ఏ మాత్రం తగ్గనివి. కాసిన్ని గీతల్లో, స్టెన్సిల్ టెక్నిక్ తో అధికార మదానికి బ్యాంక్సీ ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్, అపహాస్యం, సునిశిత విమర్శ ఈ పెయింటింగ్స్ లో కూడా స్పష్టంగా చూడవచ్చు.
ఈ పెయింటింగ్స్ ఒక్కోటీ ఒక్కో సందేశాన్ని అందిస్తున్నాయి. కులీన స్త్రీ పెయింటింగ్ లో ఎంగిలి పళ్ళేన్ని చిత్రీకరించడాన్ని అరిస్టోక్రటిక్ జీవన శైలి ఆరాధనను తిరస్కరించడంగా చూడవచ్చు. పూలకుండిని చిత్రించినపుడు ఎవరైనా పూలు కళకళలాడుతూ నిండు యవ్వనంలో ఉన్నట్లు చూపిస్తారు. బ్యాంక్సి అందుకు పూర్తి విరుద్ధంగా వడలిపోయి, వాలిపోయిన పూలను చిత్రించడం అత్యధిక సంఖ్యాక ప్రజల జీవితాలు వాడిపోయి ఉన్నాయని చెప్పడానికి కావచ్చు.
బురఖా ధరించిన స్త్రీ, బికినీ తొడుగును ధరించడం పశ్చిమ దేశాల స్త్రీలకు ఆ దేశాల వికృత సంస్కృతి ఆపాదించిన ‘విచ్చలవిడితనం’ పై తీవ్ర విమర్శ. బురఖా తొడుగును తప్పు పట్టే పశ్చిమ దేశాల సో కాల్డ్ స్త్రీ స్వేచ్ఛా ప్రబోధకులు తమ దేశాల స్త్ర్తీలను బికినీ తొడుగులో బంధించారని ఈ పెయింటింగ్ గొప్ప సందేశం ఇస్తోంది. ఈ పెయింటింగ్ కి బ్యాంక్సీ ఇచ్చిన టైటిల్ ‘Hou Do You Like Your Eggs’.
అనేక కోతులు సమావేశం అయినట్లున్న పెయింటింగ్ బ్రిటిష్ పార్లమెంటును ఉద్దేశిస్తూ గీసినది. సాధారణంగా చిత్రాల్లో వివరణ జోలికి పోని బ్యాంక్సీ ఈ పెయింటింగ్ లో ప్రతి అంగుళాన్ని శ్రద్ధతో పెయింట్ చేసినట్లు గమనించవచ్చు. ‘రవి అస్తమించని’ సామ్రాజ్యాన్ని ఏలిన పెద్దలను బ్యాంక్సీ ఇలా చిత్రీకరించాడు. బ్రిటిష్ పార్లమెంటు పై బ్యాంక్సికి ఉన్న అభిప్రాయానికి ఈ పెయింటింగ్ నిలువెత్తు అద్దం.
‘పేంటొమైమ్ గార్డ్’ టైటిల్ తో గీసిన మరొక పెయింటింగ్ బాగా ప్రసిద్ధి కెక్కింది. మాటల్లేకుండా తీవ్ర స్ధాయి సైగలతో భావాలను వ్యక్తీకరించే మైమ్ కళను గార్డుకి బ్యాంక్సీ ఇలా ఆపాదించాడు. బ్రిటిష్ రాచరిక చరిత్రలో ‘హార్స్ గార్డ్స్ పెరేడ్’ కి ఉన్న ప్రాముఖ్యతను ఈ పెయింటింగ్ లో గేలి చేసినట్లు కనిపిస్తోంది. ‘బెలూన్ గర్ల్’ తో ఉన్న చిత్రం వాస్తవానికి వీధి చిత్రం. ఆడ పిల్లలకు సమాజంలో ప్రేమ సరైన అర్ధంలో అందని పరిస్ధితికి ఈ చిత్రం అద్దం పడుతోంది. చివర ఉన్నది కొన్ని వీధి చిత్రాలతో బ్యాంక్సీ రూపొందించిన పోస్టు కార్డు. పోస్టు కార్డుకి ఉండవలసిన స్టాంపు స్ధానంలో బ్రిటిష్ రాణి మాస్కు ధరించి ఉన్న చిత్రాన్ని బ్యాంక్సీ ఉంచాడు.
బ్యాంక్సీ వీధిచిత్రాల్లాగానే ఈ పెయింటింగులు కూడా ఘాటు విమర్శ, అధిక్షేపం, వ్యంగ్యం కలగలిసి కనపడుతున్నాయి. ముఖ్యంగా బ్రిటిష్ పార్లమెంటులో మర్కటాల సమావేశపు బొమ్మ గొప్పగా ఉంది.