పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు


అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ పై విధించిన ఆయిల్ ఆంక్షలు జులై 3 నుండి అమలులోకి రావడంతో ఇరాన్ ప్రతిఘటన చర్యలను ప్రారంభించింది. ప్రపంచంలోని ఆయిల్ రవాణాలో 20 శాతం రవాణా అయ్యే ‘హోర్ముజ్ ద్వీపకల్పం’ వద్ద పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆయిల్ రవాణా ట్యాంకర్లు వెళ్లకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టింది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడానికి వీలుగా ఇరాన్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. దీనితో ప్రపంచవ్యాపితంగా క్రూడాయిల్ ధరలు మళ్ళీ కొండెక్కనున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి.

ఇరాన్ ఆయిల్ వనరులను పశ్చిమ దేశాల కంపెనీలకు అప్పగించేలా ఇరాన్ పై ఒత్తిడిని పెంచడానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ అణ్వాయుద్ధం పేరుతో దశాబ్దాలుగా నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం జనవరి 1 న అమెరికా ప్రకటించిన ఆయిల్ ఆంక్షలకు తోడు యూరోపియన్ యూనియన్ కూడా స్వంత ఆంక్షలు ప్రకటించింది. ఇవన్నీ జులై 3 నుండి అమలులోకి వచ్చాయి. ఆంక్షలు అమలులోకి వచ్చిన ఒక్క రోజులోనే ఇరాన్ పార్లమెంటు దేశ ప్రయోజనాల రక్షణకు రంగంలోకి దిగింది. ఇరాన్ పార్లమెంటు కి చెందిన ‘నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ కమిషన్’  హోర్ముజ్ ద్వీపకల్పం గుండా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి అప్పగించే బిల్లును రూపొందించింది.

“ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పై యూరోపియన్ యూనియన్ (ఇ.యు) విధించిన ఆయిల్ ఆంక్షలకు సమాధానంగానే ఈ బిల్లు రూపొందించాం” అని ఇరానియన్ పార్లమెంటు సభ్యులు అఘా-మొహమ్మది చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ప్రపంచ క్రూడాయిల్ రవాణాలో 20 శాతం హోర్ముజ్ గుండా జరుగుతున్నందున ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకున్నట్లయితే ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందని పత్రిక విశ్లేషించింది.

ఆయిల్ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశాల్లో అత్యధికంగా ఆయిల్ ఉత్పత్తి చేసే దేశం సౌదీ అరేబియా తర్వాత ఇరానే. ఇ.యు ఆంక్షలు పూర్తిగా అమలులోకి వచ్చినట్లయితే ప్రపంచ దేశాలకు రోజుకు 10 లక్షల బ్యారేళ్ళ క్రూడాయిల్ సరఫరా ఆగిపోతుందని ప్యారిస్ లోని ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ’ చెబుతూ వచ్చింది. ప్రపంచ ఆయిల్ మార్కెట్లో ఆయిల్ ధరలు అమాంతం పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. ఆయిల్ మార్కెట్ ను రాజకీయం చేసిన ఫలితంగా ఇప్పటికే ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఇ.యు యే గరిశంగా దుష్ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుందని ఒపెక్ లో ఇరాన్ ప్రతినిధి మహమ్మద్ ఆలీ ఖటీబీ హెచ్చరించాడు.

ఆంక్షలు ప్రకటించినప్పటి నుండీ యూరోపేతర దేశాలకు ఇరానియన్ ఆయిల్ రవాణా చేసే ట్యాంకర్లకు ఇన్సూరెన్స్ కల్పించడానికి పశ్చిమ దేశాల ఇన్సూరెన్స్ కంపెనీలు నిరాకరిస్తున్నాయి. దీనివల్ల కూడా క్రూడాయిల్ ధరలపై ప్రభావం పడుతోంది. ఇన్సూరెన్స్ కంపెనీలు భీమా సౌకర్యం ఎత్తివేయడం వల్ల అధికంగా ప్రభావితమయ్యే దేశాలలో ఇండియా కూడా ఉంది. ఇండియాతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు జరిగే ఆయిల్ రవాణా పై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది.

ఇరాన్ ఆర్ధిక బాగుకు ఆసియా మార్కెట్లు కీలకంగా ఉన్నాయి. దానివల్ల ఇరాన్ కూడా ప్రత్యామ్న్యాయ సౌకర్యాలు కల్పించడానికి ముందుకు వస్తోంది. పశ్చిమ దేశాల కంపెనీల ఇన్సూరెన్స్ తో పని లేకుండా తమ సొంత ట్యాంకర్లతో ఆయిల్ రవాణా చేస్తామని ఆ దేశం దక్షిణ కొరియాకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కొరియా ఆమోదం చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇరాన్ పై పశ్చిమ దేశాల ఆంక్షల ఫలితంగా ఇప్పటికే ప్రపంచ ప్రజానీకానికి, ముఖ్యంగా ఆసియా ప్రజానీకానికి పెట్రోల్ ఖరీదైపోయింది. ఇరాన్ ప్రతిఘటన చర్యలతో రానున్న రోజుల్లో హోర్ముజ్ ద్వీపకల్పం కేంద్రంగా క్రూడాయిల్ రాజకీయాలు వేడెక్కి, ఆయిల్ ధరలు ఇంకా పై పైకి పాకనున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s