తుఫానొస్తే అమెరికాలోనూ రోజులపాటు కరెంటు కష్టాలు తప్పవు


భారత దేశంలో తుఫానొచ్చి గట్టిగా గాలి వీస్తే విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయి రోజుల తరబడి చీకట్లో మగ్గవలసి రావడం పరిపాటి. మనిషి అభివృద్ధి చేసుకున్న ఆధునిక సాధనాలు ప్రకృతిపై మనిషి పై చేయి సాధించేందుకు దోహదం చేశాయి. అయితే ప్రకృతి విలయతాండవానికి తెగిస్తే అమలాపురం అయినా అమెరికా అయినా ఒకటేననీ సాక్షాత్తూ అమెరికా రాజధాని వాషింగ్టన్ తో పాటు ఇంకా అనేక నగరాల కష్టాలే చెబుతున్నాయి. పెను తుఫాను ధాటికి 18 మంది మరణించడమే కాక నాలుగురోజులుగా విద్యుత్ లేక, అధిక ఉష్ణోగ్రతలో జనం సతమతమవుతున్నారు. ఇరవై లక్షల ఇళ్లకు, వ్యాపార సంస్ధలకు ఇప్పుడు విద్యుత్ లేదు.

గ్లోబల్ వార్మింగ్ దుష్ప్రభావం వల్ల ప్రతికూల వాతావరణ మార్పులు సంభవించి అమెరికాలో అనేక చోట్ల వేడిగాలులు వ్యాపించాయి. ఆదివారం అమెరికా వ్యాపితంగా 288 చోట్ల రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని రాయిటర్స్ తెలిపింది. దానికి తోడు దక్షిణ ఇల్లినాయిస్, కెంటకీ, టెన్నేస్సే, మేరీ లాండ్, ఒహియో, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, వాషింగ్టన్ ప్రాంతాలను ‘సూపర్ డెరెకో’ పెను తుఫాను ఊపేసింది. తీవ్ర ఉరుములు, శక్తివంతమైన గాలులు, వడగళ్ళతో పెను తుఫాను విలయం సృష్టించిందని వార్తా సంస్ధ తెలిపింది. దానితో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి, విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపింది.

ఉత్తర మైదాన ప్రాంతాల నుండి మధ్య అట్లాంటిక్ వరకూ విశాల ప్రాంతాల్లో మరికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి” అని ‘నేషనల్ వెదర్ సర్వే’  (ఎన్.డబ్ల్యూ.ఎస్) తెలిపింది. మరో పక్క ఇంకా చాలా రోజుల పాటు విద్యుత్ పునరుద్ధరణ పూర్తిగా సాధ్యం కాకపోవచ్చని పవర్ కంపెనీలు ప్రకటించాయి. మధ్య మిసిసిపి లోయలోనూ, దక్షిణాది రాష్ట్రాలలోనూ అధిక ఉష్ణోగ్రతల హెచ్చరికలు, అడ్వైజరీలు ఇంకా ఉపసంహరించుకోలేదని ఎన్.డబ్ల్యూ.ఎస్ తెలిపింది. పెను తుఫాను నష్టం వల్ల మేరీ ల్యాండ్, ఓహియో, వర్జీనియా, పశ్చిమ వర్జీనియా, వాషింగ్టన్ లలో ఎమర్జెన్సీ ప్రకటించారు. మిడ్ వెస్ట్ నుండి అట్లాంటిక్ సముద్రం వరకూ 700 మైళ్ళ దూరం మేరకు పెను తుఫాను గాలులు ఊపేశాయని రాయిటర్స్ తెలిపింది.

ఇల్లినాయిస్ నుండి న్యూజెర్సీ వరకూ 20 లక్షలకు పైగా ఇళ్లకూ, వ్యాపారాలకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేని ఇళ్ళు అత్యధికంగా వాషింగ్టన్ లోనే ఉన్నాయి. విద్యుత్ లేకపోవడం వల్ల సోమ, మంగళవారాల్లో వాషింగ్టన్ ఉద్యోగులకు అనధికారికంగా సెలవు ప్రకటించారు. ఆస్తులను ఇన్సూరెన్స్ చేసే అతి పెద్ద కంపెనీలయిన యు.ఎస్.ఎ.ఎ, నేషన్ వైడ్ ల వద్దకు ఇప్పటికే 12,000 కు పైగా తుఫాను పీడిత క్లెయింలు వచ్చి చేరాయి. ఇందులో అత్యధికంగా ఇళ్ళు నష్టపోయినందుకే వచ్చాయని తెలుస్తోంది. డల్లాస్ లో వడగళ్ళ తుఫాను వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల నష్టాలు ఎదుర్కొంటున్నాయనీ, పెనుతుఫాను తో ఈ నష్టం ఇంకా పెరగనున్నది.

విలయతాండవం

ఆదివారం మధ్యాహ్నం నార్త్ కరోలినా పిడుగులతో కూడిన తుఫాను తో దద్దరిల్లిందని రాయిటర్స్ తెలిపింది. వినాశకర తుఫాను, వేడిగాలులతో అప్పటికే 15 మంది మరణించగా నార్త్ కరోలినాలో మరో ముగ్గురు చనిపోయారు. ఉత్తర ఇల్లినాయిస్ లో 93,000 మందికి పైగా కష్టమర్లు విద్యుత్ సరఫరా కోల్పోయారు. ఇక్కడ గంటకు 90 మైళ్ళ వేగంతో గాలులు వీచాయి. ఓహియో, వర్జీనియా, మేరీ ల్యాండ్ లలో తమ పవర్ గ్రిడ్ లు వినాశకరమైన నష్టాన్ని ఎదుర్కొన్నాయని విద్యుత్ కంపెనీల యుటిలిటీలు తెలిపాయి. ఓహియో నుండి వెస్ట్ వర్జీనియా వరకూ ఉన్న ఫస్ట్ ఎనర్జీ యుటిలిటీల నష్టం వల్ల 194,400 కష్టమర్లకు విద్యుత్ నిలిచిపోయింది.

వాషింగ్టన్, మేరీల్యాండ్, వర్జీనియాలకు విద్యుత్ అందించే పెప్కో నష్టం వల్ల 201,900 కష్టమర్లకు విద్యుత్ లేదు. బాల్టిమోర్ గ్యాస్ అండ్ ఎలెక్ట్రిక్ యుటిలిటీ తమ నష్టం వల్ల 213,000 మందికి విద్యుత్ సరఫరా లేదని తెలిపింది. వర్జీనియాలో తుఫాను వల్ల ఆరుగురు చనిపోగా పది లక్షల కస్టమర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూ జెర్సీ లో చెట్టు కూలి ఇద్దరు సోదరులు (వయసు 2, 7 సం.లు) చనిపోయారు. టెన్నేస్సే లో 41 డిగ్రీల వేడి గాలులకు 3, 5 సంవత్సరాల ఇద్దరు పిల్లలు చనిపోయారు. సెయింట్ లూయిస్ లో వేడి గాలుల వల్ల, ఎ.సీలు పని చేయక ముగ్గురు ముసలివాళ్లు చనిపోయారు.

పంటలకూ నష్టమే

అమెరికాలోని మిడ్ వెస్ట్ ప్రాంతంలో వాతావరణ మార్పుల వల్ల వేడి గాలులు తీవ్రమై తేమ నశించడంతో సోయా బీన్, మొక్క జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని వార్తా సంస్ధ తెలిపింది. మొక్క జొన్న పంట పునరుత్పత్తి శక్తి సంతరించుకునే కీలక దశలో ఉండడం వల్ల నష్టం తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. మరో పది రోజుల పాటు సగటు కంటే తక్కువ వర్షాలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పెను తుఫాను ‘సూపర్ డెరెకో’ 700 మైళ్ళ దూరాన్ని (1260 కి.మీ) 12 గంటల్లోనే చుట్టేసి పెను నష్టం సృష్టించిందని మరో వాతావరణ సంస్ధ తెలిపింది.

డెరెకో అంటే స్పానిష్ భాషలో straight అని అర్ధం. శక్తివంతమైన డెరెకో ను సూపర్ డెరెకో అని పిలుస్తారు. తుఫాను, పెను తుఫాను లకు సముద్ర జలాల్లోని పీడనాలు జన్మనిస్తే డెరెకో కు జన్మనిచ్చేసి భూ వాతావరణమే. భూవాతావరణంలోని వేడి, తేమ లలో తీవ్ర హెచ్చుతగ్గుల వలన విస్తృత ప్రాంతంలో ఎక్కువ కాలం పాటు వేగంగా కదిలే పిడుగులు, గాలి తుఫాను, వర్షం సంభవించడాన్ని డెరికో అంటారని తెలుస్తోంది.

అమెరికాలో తుఫానుల ప్రభావం తెలుసుకోవడానికి రాయిటర్స్ అందించిన ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

4 thoughts on “తుఫానొస్తే అమెరికాలోనూ రోజులపాటు కరెంటు కష్టాలు తప్పవు

  1. గ్లోబల్ వార్మింగ్ పాపం(లో) అమెరికాదే ఎక్కువ పాత్ర. ప్లాన్‌డ్ ఎకానమీకీ , అన్ ప్లాన్‌డ్ ఎకానమీకి ఉండే తేడా ఇదే. సామ్రాజ్యవాద అహంకారానికి సమిష్టితత్వం తలకెక్కదు.

  2. కొండలరావు గారూ, అవును. ఫొసిల్ ఫ్యూయిల్స్ ని గరిష్ట స్ధాయిలో వినియోగించకుండా అమెరికా, యూరప్ ల అభివృద్ధి లేదు. తీరా మూడో ప్రపంచ దేశాలు ఒక స్ధాయికి వచ్చి బొగ్గు, పెట్రోల్ వినియోగంలోకి తెచ్చుకోబోయేసరికి గ్లోబల్ వార్మింగ్ వచ్చిపడింది.

  3. ఈ తుఫాన్ వల్ల మేరీలాండ్ లో ఇంకా కొన్ని ఇళ్ళకు కరెంటు రాలేదు ….. తూఫాన్ వచ్చి 4 రోజులు అయ్యాక కూడా. Baltimore gas comapny is saying it may take one more week to restore the power….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s