అమెరికా ఆర్ధిక ‘రికవరీ’ ఏమంత ప్రోత్సాహకరంగా లేదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పేర్కొంది. 2012 సంవత్సరానికి అమెరికా జి.డి.పి వృద్ధి రేటు అంచనాని 2.1 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. యూరో జోన్ ఋణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధలోని అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత ప్రమాదకరంగా మార్చాయని తెలిపింది. అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టే లోపు అప్పు పరిమితిని మరోసారి పెంచాల్సి ఉందని హెచ్చరించింది.
2012 సంవత్సరానికి గాను అమెరికా ఆర్ధిక వ్యవస్ధ 2.9 శాతం వృద్ధి చెందుతుందని అమెరికన్ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ ప్రారంభంలో అంచనా వేసింది. కానీ ఈ అంచనాను ఫెడరల్ రిజర్వే గత నెలలో భారీగా 2.4 శాతానికి తగ్గించుకుంది. ఈ నేపధ్యంలో వెలువడిన ఐ.ఎం.ఎఫ్ నివేదిక పరిస్ధితి తీవ్రతను మరోసారి హెచ్చరించినట్లయిం ది.
అప్పు పరిమితి
నవంబరు లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా దేశీయ విధానాలలో అనిశ్చితి నెలకొందని ఐ.ఎం.ఎఫ్ పేర్కొంది. అమెరికా అప్పు పరిమితి ప్రస్తుతం 16.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ పరిమితి ఈ సంవత్సరాంతానికి పూర్తయిపోతుందని ఐ.ఎం.ఎఫ్ అంచనా వేస్తోంది. అంటే ఎన్నికలు జరిగాక కొత్త అధ్యక్షుడు పదవి చేపట్టే లోపు అప్పు పరిమితిని పెంచవలసిన అవసరం ఏర్పడుతుంది. అప్పటివరకూ ఆగినట్లయితే విధాన నిర్ణయాలు తీసుకునే పరిస్ధితిలో ప్రభుత్వం ఉండనందున ఆర్ధికంగా అనిశ్చితి ఏర్పడుతుందన్నది ఐ.ఎం.ఎఫ్ హెచ్చరిస్తోంది. కనుక ఎన్నికల లోపుగానో లేదా మరో రకంగానో అప్పు పరిమితిని పెంచాలని ఐ.ఎం.ఎఫ్ కోరుతోంది.
అప్పు పరిమితిని పెంచే అధికారం అమెరికా పార్లమెంటుకు మాత్రమే ఉంది. అప్పు పరిమితి చేరుకున్నట్లయితే మరింత అప్పు చేయడానికి రాజ్యాంగపరంగా అడ్డంకులు ఏర్పడతాయి. రోజువారీ అవసరాలు తీర్చేందుకు కూడా వనరులు మృగ్యం అవుతాయి. అటువంటి పరిస్ధితి జాతీయంగానే కాక, అంతర్జాతీయంగా కూడా సమస్యలు సృష్టిస్తుంది. అందుకే ఐ.ఎం.ఎఫ్ ఆందోళన.
ఆర్ధిక వృద్ధి, పొదుపు
యూరప్ కి పొదుపు విధానాలు ప్రతిపాదించిన ఐ.ఎం.ఎఫ్ అమెరికాకి మాత్రం ఆర్ధిక వృద్ధికి ప్రోత్సాహకరంగా ఉండే విధానాలను ప్రతిపాదిస్తోంది. యూరప్ దేశాలు పొదుపు విధానాలు పాటించడం వల్ల ప్రజల ఆదాయాలు పడిపోయాయి. ఫలితంగా కొనుగోళ్ళు పడిపోయి, ఉత్పత్తి తగ్గిపోయి ఆర్ధిక వృద్ధి కూడా తగ్గిపోయింది. పొదుపు విధానాలు అంటే కార్మికులు, ఉద్యోగుల వేతనాల భాగాన్ని తగ్గించి దానిని కంపెనీల లాభాలకు తరలించడం. దానివల్ల వినియోగం పడిపోయి అనివార్యంగా ఆర్ధిక వృద్ధి కూడా తగ్గిపోతుంది.
అమెరికాకి ఐ.ఎం.ఎఫ్ ఈ విధానాలు ప్రతిపాదిస్తున్నట్లుగా కనిపించడం లేదు. బి.బి.సి వార్తా సంస్ధ కధనం ప్రకారం అమెరికా ‘గ్రోత్-ఫ్రెండ్లీ’ విధానాలు అనుసరించాలని ఐ.ఎం.ఎఫ్ చెబుతోంది. ‘గ్రోత్-ఫ్రెండ్లీ’ అంటే మరిన్ని అప్పులు తెచ్చి మరింత ఖర్చు చేయడం. మరిన్ని అప్పులు తెచ్చి మౌలిక నిర్మాణాలు, శిక్షణ, గృహ నిర్మాణం, ఎమర్జెన్సీ నిరుద్యోగ సదుపాయాల విస్తరణ లాంటి రంగాల్లో ఖర్చు చేయాలని ఐ.ఎం.ఎఫ్ చెప్పినట్లు బి.బి.సి తెలిపింది.
ఇటీవలి కాలంలో జర్మనీ ఒత్తిడిని స్వల్పంగా ప్రతిఘటించి ఇతర యూరప్ దేశాలు, మరీ అంత తీవ్రంగా పొదుపు విధానాలు పాటించనవసరం లేదనీ, దానికి బదులు ‘గ్రోత్-ఫ్రెండ్లీ’ విధానాలు కూడా కొంత చేపట్టాలనీ నిర్ణయించినట్లు పత్రికలు తెలిపాయి. తీవ్రమైన పొదుపు విధానాల వల్ల కంపెనీల లాభాలకు ఎసరు తెస్తుండడంతో జర్మనీ కూడా అందుకు తలూపినట్లు అవి తెలిపాయి. కానీ పొదుపు విధానాల ద్వారా ప్రజల వేతనాలను తగ్గించి కంపెనీలకు తరలించే విధానంలో మౌలికంగా మాత్రం తేడా రాలేదు.
అమెరికాను శాసించే సీను ఐ.ఎం.ఎఫ్ కు ఉండదు. ఇటువంటివి సాకుగా చూపి ముఖ్యం గా కొందరు మేధావుల ద్వారా ప్రజలను మభ్య పెట్టేందుకు అప్పుడప్పుడు ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు. అవసరమైతే కొన్ని చర్యలు కూడా చేపడతారు.