అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో రిటైల్ దుకాణాల కంపెనీ వాల్-మార్ట్ కొత్త షాపులు నెలకొల్పడానికి వ్యతిరేకంగా నగర వాసులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనేకవేలమంది ప్రజలు వాల్-మార్ట్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొన్నారని ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక తెలిపింది. శనివారం జరిగిన ప్రదర్శనల్లో ప్రజలు ‘వాల్-మార్ట్ = దరిద్రం’ అని బ్యానర్లు ప్రదర్శించారని తెలిపింది. తక్కువ వేతనాలు చెల్లిస్తూ, కార్మికులకు యూనియన్ హక్కులు వ్యతిరేకించే కంపెనీ మాకొద్దని తిరస్కరించారని తెలిపింది.
“(వాల్-మార్ట్ వల్ల) చిన్న వ్యాపారస్ధులు దెబ్బ తింటారని భావిస్తున్నాం. కొంతమంది వ్యాపారాలు మూసివేసుకోక తప్పదు. కార్మికుల తొలగింపు సర్వసామాన్యం. హృదయంగానీ, నైతిక విలువలు గానీ ఏ మాత్రం లేని వాల్-మార్ట్ ని మనం సమర్ధించలేం. చైనా టౌన్ లో మీరు అవసరం లేదు. లాస్ ఏంజిలిస్ లో మీరుండాలని కోరుకోవడం లేదు” అని వాల్-మార్ట్ కొత్త దుకాణం తెరవదలిచిన చైనా టౌన్ అభివృద్ధి కమిటీ సభ్యుడొకరు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ అన్నాడు.
లాస్ ఏంజిలిస్ సిటీ కౌన్సిల్ కూడా వాల్-మార్ట్ కంపెనీతో కుమ్మక్కు అయినట్లు ఎల్.ఏ.టైమ్స్ కధనం తెలిపింది. నగరంలో పెద్ద పెద్ద రిటైల్ దుకాణాలు నెలకొల్పడానికి వ్యతిరేకంగా గత మార్చి నెలలో లాస్ ఏంజిలిస్ సిటీ కౌన్సిల్ మారిటోరియమ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం తీసుకోవడానికి ఒక్క రోజు ముందు అది వాల్-మార్ట్ కంపెనీకి స్టోర్ నెలకొల్పడానికి అనుమతి ఇచ్చింది. తద్వారా తన నిర్ణయాన్ని తానే అపహాస్యం చేసుకుంది.
వాల్-మార్ట్ స్టోర్ నెలకొల్పడానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి కంపెనీ కుట్రలకు కూడా పాల్పడింది. పబ్లిక్ రిలేషన్స్ కోసం వాల్-మార్ట్, ఒక కంపెనీ ని మాట్లాడుకుంది. వాల్-మార్ట్ విమర్శకులు ఏర్పరిచిన సమావేశానికి సదరు పబ్లిక్ రిలేషన్స్ కంపెనీ ఉద్యోగి విలేఖరిగా చెప్పుకుంటూ హాజరయిన సంగతి వెల్లడయింది. ప్రజాభిప్రాయాన్ని కుట్రపూరితంగా తనకు అనుకూలంగా ఉందని చెప్పుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని విమర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు తీవ్రం కావడంతో పబ్లిక్ రిలేషన్స్ కంపెనీతో కుదుర్చుకున్న కాంట్రాక్టును వాల్-మార్ట్ రద్దు చేసుకుంది. తద్వారా పరోక్షంగా తన కుట్ర బుద్ధులను అంగీకరించింది.
వాల్-మార్ట్ కంపెనీ అనేక దేశాల్లో అవినీతికి పాల్పడినట్లు అనేకసార్లు వెల్లడయింది. దాని అనుబంధ కంపెనీ ఒకటి మెక్సికోలో తీవ్ర అవినీతికి పాల్పడిందని ఇటీవలి కాలంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ మెక్సికోలో కంపెనీ పెద్ద ఎత్తున లాభాలు సంపాదించింది. ఇలాంటి కంపెనీల కోసమే భారత దేశ రిటైల్ రంగాన్ని బార్లా తెరవడానికి భారత పాలకులు కాచుకుని ఉన్నారు. రిటైల్ రంగ ప్రవేటీకరణ బిల్లుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ, యు.పి.ఏ కూటమి పార్టీలే తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరి నిమిషాల్లో బిల్లుని ఉపసంహరించుకుంది. అలా వ్యతిరేకించిన పార్టీల్లో తృణమూల కాంగ్రెస్ కూడా ఉంది. దానితో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ వాల్-మార్ట్ కంపెనీ తరపున తృణమూల్ నాయకురాలు మమత బెనర్జీ తో రాయబారం నెరిపింది. తమ చర్చల్లో రిటైల్ రంగ ప్రవేటీకరణ అంశం కూడా ఉందని హిల్లరీ, సమావేశం ముందు చెప్పినప్పటికీ, సమావేశం అనంతరం తమ మధ్య రిటైల్ బిల్లే చర్చకు రాలేదని మమత విలేఖరులకు చెప్పి తప్పించుకుంది.
కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించి లాభాలు గుంజుకోవడంలో వాల్-మార్ట్ గొప్ప పేరు సంపాదించింది. చెప్పా పెట్టకుండా వర్కర్లను తొలగించడం, ఆరోగ్య సదుపాయాలు కల్పించకపోవడం, ప్రభుత్వంలోని అధికారులకు, రాజకీయ నాయకులకు లంచాలు మేపి తన దురన్యాయాలనుండి బయటపడడం లాంటి దారుణాలకు వాల్-మార్ట్ చిరునామా గా అనేకసార్లు వెల్లడయింది. అయినప్పటికీ ప్రభుత్వాల కుమ్మక్కుతో వాల్-మార్ట్ దురన్యాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్మిక హక్కులతో పాటు మానవ హక్కులను ఉల్లంఘించడంలో కూడా వాల్-మార్ట్ ఆరోపణలు ఎదుర్కొంది. ముఖ్యంగా స్త్రీ-పురుషుల మధ్య వేతనాల వ్యత్యాసం పాటిస్తూ మిలియన్లు కూడబెట్టిందని ఆరోపణలు ఉన్నాయి.