పోలీసులు చంపిన 23 మందీ గిరిజనులే, నక్సలైట్లు కాదు -పత్రికలు


ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బసగూడ వద్ద సి.ఆర్.పి.ఎఫ్ జరిపిన ఎన్ కౌంటర్ లో చనిపోయినవారంతా అమాయక గిరిజనులేనని వారిలో ఎవరూ నక్సలైట్లు లేరనీ పత్రికలు, చానెళ్ళు వెల్లడి చేశాయి. చనిపోయినవారిలో ఎవరూ మావోయిస్టులు లేరని మావోయిస్టు నాయకుడు ఉసెండి తమ కార్యాలాయానికి ప్రకటన పంపినట్లు ఎ.బి.ఎన్ టి.వి చానెల్ తెలియజేయగా, చనిపోయినవారిలో ఎక్కువమంది గిరిజనులే అయి ఉండవచ్చని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. చనిపోయినవారిలో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారనీ బాలికలను పోలీసులు లైంగికంగా హింసించారనీ గ్రామస్ధులు ఆరోపించారు.

చనిపోయినవారు నక్సలైట్లయితే సాధారణంగా శవాలను వారి సంబంధీకులకు అప్పగించడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు తరచుగా విఫలమై వారే  దహనం లేదా ఖననం చేయడం ఆనవాయితీ. కాగా బసగూడ ఎన్ కౌంటర్ లో మరణించినవారిని స్ధానిక గిరిజనులే అంతిమ సంస్కారం చేయడం బట్టి మృతులంతా స్ధానిక గ్రామస్ధులేనని అర్ధం చేసుకోవచ్చు.

దారుణం జరిగిన సర్కేగూడ, కొత్తేగూడ, రాజపెట్ట గ్రామాల్లో హృదయవిదారక దృశ్యాలు నెలకొన్నాయని ది హిందూ తెలిపింది. “అంతమంది శవాలకు అంత్యక్రియలు జరపడానికి సరిపోయినంతమంది జనం లేరు. అందువల్ల ఒకరి తర్వాత మరొకరికి అంత్యక్రియలు జరపవలసి వస్తోంది. కొంతమందిని పూడ్చిపెట్టాలి. కానీ అంతమందికి సమాధులు ఎవరు తవ్వుతారు? కొంతమందిని దహనం చెయ్యాల్సిందే, కానీ అంతమందికీ కట్టెలు సేకరించాల్సిందే కదా” అని గ్రామస్ద్ధుడైన సంగం రవి ‘ది హిందూ’ కి తెలిపాడు.

బసగూడ వద్ద జరిగిన హోరాహోరీ ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టులను చంపేశామని సి.ఆర్.పి.ఎఫ్ శనివారం ప్రకటించింది. ఆ తర్వాత మృతుల సంఖ్య 23 కి పెరిగింది. ఆరుగురు జవాన్లు కూడా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. నక్సలైట్లు సమావేశం అయ్యారని సమాచారం అందడంతో తాము మూడువైపుల నుండి చుట్టుముట్టామనీ ఇంతలో తమపై కాల్పులు జరగడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు సాగించామని పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసుల కధనాన్ని గ్రామస్తులైన గిరిజనులు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. గ్రామస్ధులు శాంతియుతంగా జర్పుతుకుంటున్న సమావేశంపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారనీ, కాల్పుల్లో 20 మంది అక్కడికక్కడే చనిపోయారనీ వారు తెలిపారు. 12-15 సంవత్సరాల మధ్య వయసు ఉన్న నలుగురు పిల్లల్ని కూడా పోలీసులు కాల్చి చంపారని తెలిపారు. ఎన్ కౌంటర్ సందర్భంగా నలుగురు మైనర్ బాలికలపై పోలీసులు లైంగికంగా దాడి చేశారనీ తెలిపారు.

ఆ రోజు రాత్రి గ్రామం వద్ద మావోయిస్టులు ఎవరూ లేరని రాజ్ పెట్ట గ్రామస్ధుడు మడకం గణపత్ తెలిపాడు. “రాబోయే విత్తనాల పండగ గురించి మాట్లాడుకోవడానికి మేము కూడాము. ప్రతి సంవత్సరం విత్తనాలు జల్లడానికి ముందు ఇలా సమావేశం కావడం మామూలే” అని గణపత్ తెలిపాడు. కొన్ని గంటలపాటు సమావేశం జరిగిందనీ ఇంతలో పెద్ద ఎత్తున పోలీసులు తమను చుట్టుముట్టారనీ ఆయన తెలిపాడు. “వచ్చిన వెంటనే వాళ్ళు కాల్పులు జరిపారు. మేమంతా పరిగెత్తడానికి ప్రయత్నించాం. కానీ చాలామందికి కాళ్ళల్లో, వీపులో, గుండెల్లో కాల్చారు” అని తెలిపాడు. కాకా సరస్వతి కూడా చనిపోయినవారిలో ఒకరు. “ఆ పిల్ల వయసు కేవలం 12 సంవత్సరాలే” అని సరస్వతి తల్లి కాకా సినక్క తెలిపింది.

తాను చూసిన చాలా శవాలకు బుల్లెట్లు శరీరం మధ్య భాగంలోనూ, మెడపైనా దిగబడ్డాయని ది హిందూ విలేఖరి తెలిపాడు. 17 సంవత్సరాల సబ్కా మిటు గొంతు పదునైన ఆయుధంతో కోసినట్లుందని ఆయన తెలిపాడు. ఇంకా అనేక శవాలను కత్తితోనో, గొడ్డలితోనో చీల్చిన గాయాలున్నాయని తెలిపాడు. తుపాకులతో కాల్పులు జరపడమే కాక దగ్గర్నుండి కత్తి లేదా గొడ్డలితో కోయడమో, నరకడమో జరిగిందని దీన్ని బట్టి తెలుస్తోంది. గణపత్ తో పాటు అనేక మంది గ్రామస్ధులు సైతం సమావేశంలో మావోయిస్టులెవరూ లేరని ది హిందూ విలేఖరికి తెలిపారు.

అయితే పోలీసులు ఎలా గాయపడిందీ అర్ధం కాలేదు. పొరబాటున పరస్పరం గాయపరుచుకుని ఉండవచ్చని కొందరు గ్రామస్ధులు సూచించారు. నలువైపుల నుండి చుట్టుముట్టడం వల్ల అలాంటి అవకాశం ఏర్పడింది. “బలగాలు మమ్మల్ని చుట్టుముట్టాయి. ప్రమాదవశాత్తూ వారు ఒకరినొకరు కాల్చుకుని ఉండవచ్చు” అని గణపత్ తెలిపాడు. గ్రామస్ధుల ప్రకారం కాల్పులు అనేక నిమిషాలపాటు జరిగాయి. అనంతరం పోలీసులు ఒక ట్రాక్టర్ ని తెప్పించి శవాలను తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా పోలీసులు గ్రామంలో తిష్టవేసి స్త్రీలను, బాలికలను వేధించారనీ గ్రామస్ధులు తెలిపారు.

“ఆ తర్వాత పోలీసులు గ్రామంలో తిష్టవేశారు. నన్ను పొలాల్లోకి ఈడ్చుకెళ్లారు. నేలకేసి నన్ను తోసి కొట్టడం మొదలు పెట్టారు. కొట్టారు, తన్నారు, నా బట్టల్ని చింపేశారు. నన్ను రేప్ చేస్తామని బెదిరించారు” అని 14 సంవత్సరాల దేవి (పేరు మార్చబడింది) చెప్పినట్లు పత్రిక తెలిపింది. మరో నలుగురు అమ్మాయిలను ఇలాగే హింసించారని తెలుస్తోంది.

ఆ తర్వాత రోజు ఉదయం వరకు బలగాలు గ్రామంలో కొనసాగాయని మరో గ్రామస్ధుడు ఇర్ప రాజు తెలిపాడు. “మా అబ్బాయి రమేశ్ టాయిలేట్ కి వెళ్లడానికి ఇంటినుండి బైటికి వెళ్ళాడు. పోలీసులు అతన్ని కూడా కాల్చారు. ‘అమ్మా అమ్మా’ అంటూ రమేష్ ఇంట్లోకి పెరుగెట్టుకొచ్చాడు. కానీ పోలీసులు అతని వెంటపడి మా ఇంట్లోకి దూరి కా కళ్ళముందే కాల్చి  చంపారు” అని రాజు ఏడుస్తూ చెప్పాడు. కంటి ముందే ఎదిగోచ్చిన కొడుకుని కళ్ళముందే కాల్చి చంపడమే కాక కుండలు పగల గొట్టి తాము దాచిపెట్టుకున్న 5,000 రూపాయలు కూడా పోలీసులు దోచుకెళ్లారని రాజు తెలిపాడు.

పిల్లాడి వెంటపడి ఇంటిలో దూరి మరీ చంపేయ్యడం, అమ్మాయిల్ని లాక్కొచ్చి బట్టలు చింపేసి రేప్ చేస్తామని బెదిరించడం, 300 మంది బలగాలతో వెళ్ళి 20 మంది అమాయక పౌరుల్ని ఊచకోత కొయ్యడం వీరోచిత కార్యంగా కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం జబ్బలు చరుచుకున్నాడు. “ఈ ఘటనలో సి.ఆర్.పి.ఎఫ్, భద్రతా బలగాలు ధైర్యంతో వ్యవహరించాయి. గొప్ప సాహసాన్నీ, నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. ముఖ్యమైన నాయకుల్ని చంపేశామని కూడా ఆయన ప్రకటించాడు. 45 మంది తీవ్రవాదులు సమావేశం కాగా సి.ఆర్.పి.ఎఫ్, రాష్ట్ర బలగాలు పధకం ప్రకారం ఆపరేషన్ నిర్వహించాయని తెలిపాడు. కానీ మొదటి కాల్పు మాత్రం మావోయిస్టులే చేశారనీ, భారీ కాల్పులు ఎదురుకావడంతో బలగాలు స్పందించాయనీ తెలిపాడు. భద్రతా బలగాల దళంపై 45 మంది తీవ్రవాదులు మాటుకాచి దాడి చేశారని (ambush) తెలిపాడు.  (ఔట్ లుక్)

చిదంబరం కధనం ప్రకారం 45 మంది మావోయిస్టు తీవ్రవాదులు మాటు కాచి ‘పధకం ప్రకారం వెళ్ళిన భద్రతా బలగాలపై’ చేసిన దాడిలో కేవలం ఆరుగురు బలగాలు ‘గాయపడగా’, 300 మంది బలగాలు ఆత్మ రక్షణ కోసం చేసిన ప్రతిదాడిలో 20 మంది ‘ఊచకోత కోయబడ్డారు’. కాంగ్రెస్ పార్టీకి చెందిన హోమ్ మంత్రి సాహోసపేతమైన దాడిగా అభివర్ణించిన ‘గిరిజనుల ఊచకోత’, బూటకపు ఎన్ కౌంటర్ మాత్రమే అని ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ విభాగం ప్రకటించింది (ఈ టీవి). బూటకపు ఎన్ కౌంటర్ అనేందుకు తమ వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని వారు ప్రకటించారు.

“మేము గ్రెనేడ్లు గానీ, రాకెట్ లాంచర్లు గానీ ఉపయోగించలేదు. నిజంగా అలా చేయదలిస్తే మేము గ్రామం మొత్తాన్ని తగలబెట్టి ఉండేవాళ్లం” అని సి.ఆర్.పి.ఎఫ్ బలగంలోని ఒక సభ్యుడు చెప్పాడని ది హిందూ పత్రిక తెలిపింది. గ్రామం మొత్తాన్ని తగలబెట్టకుండా ఓ ఇరవై మందిని చంపి ఊరుకున్నాం సంతోషించండి అన్నట్లుంది ఆ సభ్యుడి వ్యాఖ్యానం. నక్సలైట్ల ఎరివేత పేరుతో గ్రామాలకు గ్రామాలే విచక్షణా రహితంగా తగలబెట్టిన చరిత్ర పోలీసులకు చాలానే ఉంది. అలా చేయకుండా సంయమనం పాటించినందుకు గిరిజనులు, పత్రికలు, ఆ మాటకొస్తే దేశం మొత్తం సంతోషించి మిన్నకుండాలన్నదే పారామిలట్రీ బలగాల సందేశం.

చనిపోయినవారిలో చాలామంది పౌరులయి ఉండవచ్చు అని ఒక అధికారి వ్యాఖ్యానించాడని ది హిందూ తెలిపింది. “సాధ్యమైనంత సంయమాన్ని మేము పాటించాము. ఒక గ్రామ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్న స్పృహ ఉంది” అని అధికారి తెలిపాడు. ఆ స్పృహే ఉన్నట్లయితే పిల్లల్ని సైతం కాల్చి చంపడం ఎలా సాధ్యం? పిల్లవాడి వెంటపడి, గుడిసె లోకి దూరిమరీ కాల్చి చంపడం, దాచి పెట్టుకున్న కష్టార్జితాన్ని కూడా దోపిడీ చెయ్యడం ఎలా సాధ్యం? పొలాల్లో తిష్టవేసి బాలికల్ని కొట్టడం, బట్టల్ని చింపేయడం, రేప్  చేస్తామంటూ బెదిరించడం లాంటి లైంగిక దాడుల్ని చెయ్యడం ఎలా సాధ్యం? మావోయిస్టుల ఎరివేత పేరుతో అమాయక గిరిజన ప్రజల్ని ఊచకోత కొయ్యడం ఎలా సాధ్యం?

One thought on “పోలీసులు చంపిన 23 మందీ గిరిజనులే, నక్సలైట్లు కాదు -పత్రికలు

 1. “ఈ ఘటనలో సి.ఆర్.పి.ఎఫ్, భద్రతా బలగాలు ధైర్యంతో వ్యవహరించాయి. గొప్ప సాహసాన్నీ, నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. ముఖ్యమైన నాయకుల్ని చంపేశామని”

  పచ్చి అబద్దాన్ని కూడా ఇంత సాహసోపేతంగా ప్రకటించినందుకు ఈ సామ్రాజ్యవాద ఏజెంటుకు, సామాన్య ఆదివాసీలను చంపేసి, నిజం నిలకడమీదే తెలుస్తుందన్న సిఆర్ఫీఎఫ్ హెడ్డుకు పద్మశ్రీ అవార్డ్ ఇచ్చినా సరిపోదేమో.

  కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం ఒక చోట కూడటంలో కూడా, ఘనత వహించిన పాలకవర్గానికి నక్సలైట్లు కనిపించారంటే ఇంతకు మించిన దారుణం లేదు.

  పైగా ‘భద్రతా బలగాల దళంపై 45 మంది తీవ్రవాదులు మాటుకాచి దాడి చేశారని’ ముక్తాయింపు కూడా. వాళ్లే నిజంగా దాడి చేసినప్పుడు ఏం జరిగిందో, జరుగుతుందో అందరికీ తెలుసు.

  ఎంత సిగ్గులోని పౌరుష ప్రకటనలు వీరోచిత కార్యాలో ఇవి. సిఆర్‌ఫిఎప్ శిక్షణ ఆయుధాలను ధరించని ప్రజలను చంపడంలోనే తరిస్తోందనుకుంటా.

  భారత సైనిక శక్తి నాణ్యత ఇంత హీనంగా ఉందన్నమాట.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s