టర్నింగ్ పాయింట్స్: సోనియా ప్రధాని పదవికి తగునని భావించిన కలాం


2004 లో విస్తృతంగా జరిగిన మీడియా ప్రచారానికి విరుద్ధంగా సోనియా కోరినట్లయితే ఆమెను ప్రధానిగా అవకాశం ఇవ్వడానికి తాను సిద్ధపడినట్లు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన ‘టర్నింగ్ పాయింట్స్’ పుస్తకంలో వెల్లడి చేశాడు. సోనియాను ప్రధానిని చేయడానికి వ్యతిరేకంగా అనేకమంది రాజకీయ నాయకులు, పార్టీలు తీవ్ర స్ధాయిలో ఒత్తిడి తెచ్చినప్పటికీ, ‘రాజ్యాంగబద్ధంగా సమర్ధనీయమైన’ ఏకైక అవకాశం అదే అయినందున ఆమెను ప్రధానిని చేయడం తప్ప తనకు మరొక మార్గం లేదని కలాం తన పుస్తకంలో వివరించాడు. 2002 మారణకాండ తర్వాత గుజరాత్ సందర్శన, బీహార్ అసెంబ్లీ రద్దు అంశాలపై కూడా కలాం తన పుస్తకంలో ప్రస్తావించాడు.

బి.జె.పి నాయకత్వంలోని ఎన్.డి.ఏ కూటమి ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ చేసిన ప్రచారాన్ని భారత ప్రజలు తిరస్కరించడంతో 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఏ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించిన సంగతి విదితమే. అయితే యు.పి.ఏ తరపున ప్రధాని అభ్యర్ధి ఎవరన్న విషయంలో దేశంలో ఉత్కంఠ ఏర్పడింది. ఇటలీ పౌరసత్వం కూడా ఉన్న సోనియా గాంధీ భారత దేశానికి ప్రధాని పదవికి తగదని వివిధ రాజకీయ పార్టీలు ముమ్మరంగా వ్యతిరేక ప్రచారం చేయడంతో సోనియా ఏమి చేయనున్నదన్న విషయంలో అనేక ఊహాగానాలు సాగాయి. అనూహ్యంగా మన్మోహన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కాంగ్రెస్ సిద్ధపడడంతో విమర్శకులంతా హతాశులయ్యారు. సర్వత్రా పెద్ద పెట్టున మౌనం రాజ్యమేలింది. కాంగ్రెస్ (సోనియా) నిర్ణయాన్ని ‘మాస్టర్ స్ట్రోక్’ గా కొన్ని పత్రికలు, విశ్లేషకులు అప్పట్లో అభివర్ణించారు.

ఈ పరిస్ధితుల్లో సోనియాను ప్రధానిగా నియమించడానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా సిద్ధంగా లేడనీ, ప్రధాని మంత్రి పదవిని సోనియా గాంధీ కోరకుండా నివారించాడనీ కూడా బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కాషాయ కూటమి వర్గాలు ఇప్పటికీ ఈ విషయం నమ్ముతున్నారని ‘ది హిందూ’ అభివర్ణించింది. అయితే కాషాయ వర్గాల ప్రచారం పుకారే తప్ప నిజం కాదని అబ్దుల్ కలాం తాజా పుస్తకం ద్వారా స్పష్టమయింది. ‘టర్నింగ్ పాయింట్స్’ పుస్తకం ప్రకారం సోనియా గాంధీ ప్రధాన మంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ను ఆహ్వానిస్తూ రాష్ట్రపతి కార్యాలయం లేఖను సిద్ధం చేసింది. అయితే మన్మోహన్ సింగ్ ను ప్రధాన మంత్రిగా ఎంపిక చేయడం ద్వారా సోనియా గాంధీ రాష్ట్రపతి కలాంను ఆశ్చర్యపరిచింది. “ఇది నిశ్చయంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనివల్ల ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ ను ఆహ్వానిస్తూ రాష్ట్రపతి సెక్రటేరియట్ మళ్ళీ లేఖను తయారు చేయవలసి వచ్చింది” అని కలాం తన పుస్తకంలో తెలిపాడు.

“సోనియా గాంధీని ప్రధాన మంత్రి పదవికి అంగీకరించవద్దంటూ అనేకమంది వ్యక్తులు, సంస్ధలు, పార్టీల నుండి ఈ మెయిళ్ళు, లేఖలు నన్ను ముంచెత్తాయి. వీటిపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వంలోని వివిధ ఏజన్సీలకు ఫార్వర్డ్ చేశాను” అని కలాం తన పుస్తకంలో తెలిపాడు. తనను సందర్శించిన రాజకీయ నాయకులు తనపై ఒత్తిడిని ఇంకా పెంచారని తెలిపాడు. కానీ ఈ డిమాండ్లన్నీ రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యమైనవి కావని ఆయన వ్యాఖ్యానించాడు. “సోనియా గాంధీ తనంతట తాను ముందుకు వస్తే, ఆమెను నియమించడం తప్ప నాకు మరొక అవకాశం లేదు” అని తెలిపాడు.

రాజీనామాకు సిద్ధపడ్డ కలాం

బీహార్ అసెంబ్లీ రద్దు విషయంలో రాజీనామాకు సిద్ధపడిన విషయాన్ని కలాం తన పుస్తకంలో వెల్లడించాడు. మే 23, 2005 తేదీన సుప్రీం కోర్టు తీర్పు ప్రకటిస్తూ అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధం అని తెలిపింది. తాను రాజీనామా చేసినట్లయితే ఆ తర్వాత తలెత్తే కల్లోలం వల్ల ప్రభుత్వం పడిపోతుందని ప్రధాని మంత్రి చెబుతూ రాజీనామా వద్దని విజ్ఞప్తి చేయడంతో తాను ముందుకు వెళ్లలేకపోయానని కలాం తెలిపాడు.

అప్పటికి బీహార్ అసెంబ్లీ ఆరునెలలుగా సుషుప్త చేతనావస్తలో కొనసాగుతోంది. బీహార్ గవర్నర్ సిఫారసు మేరకు అసెంబ్లీ రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే సమయానికి రాష్ట్రపతి కలాం మాస్కో పర్యటనలో ఉన్నాడు. ప్రధాని మన్మోహన్ ఆయనకు రెండు సార్లు ఫోన్ చేసి బీహార్ అసెంబ్లీ రద్దు చేయాలన్న కేబినెట్ నిర్ణయాన్ని తెలియజేశాడు. ఆరు నెలలుగా సస్పెన్షన్ లో ఉన్న అసెంబ్లీని అంత అర్జెంటుగా రద్దు చేయవలసిన అవసరం ఏమిటని తాను ప్రధానిని ప్రశ్నించినట్లు కాలం తెలిపాడు. అయితే కేంద్ర ప్రభుత్వం అప్పటికే అంతిమ నిర్ణయం తీసుకున్నందున సంతకం చేయడానికే మొగ్గు చూపానని తెలిపాడు. కానీ తాను స్పష్టంగా కోరినప్పటికీ ప్రభుత్వం కోర్టులో రాష్ట్రపతి చర్యకు సమర్ధనగా సమర్ధవంతంగా వాదించలేకపోయిందని కలాం తెలిపాడు. ఫలితంగా కేబినెట్ పై కోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసిందనీ, ఆ వ్యాఖ్యలు నిజానికి ‘తనకే వర్తిస్తాయి. నేనే బాధ్యత వహించాలి’ అని కలాం వివరించాడు.

గుజరాత్ వెళ్ళడం అంత అవసరమా? -వాజ్ పేయ్

గోధ్రా రైలు దహనం అనంతరం అనంతరం గుజరాత్ లో ముస్లింలపై మారణకాండ జరిగిన తర్వాత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అధికారికంగా రాష్ట్ర పర్యటన తలపెట్టాడు. కలాం నిర్ణయం అప్పటి ప్రధాని వాజ్ పేయ్ ను అసౌకర్యానికి గురిచేసినట్లు కలాం పుస్తకం ద్వారా తెలుస్తోంది. “ఈ సమయంలో గుజరాత్ వెళ్ళడం మీకు అంత అవసరంగా కనిపిస్తోండా?” అని వాజ్ పేయ్ తనను అడిగాడని కలాం తెలిపాడు. గుజరాత్ పర్యటించాలన్న తన నిర్ణయంపై అనేక ప్రశ్నలు తాను ఎదుర్కొన్నానని ఆయన తెలిపాడు. ఆ నిర్దిష్ట సమయంలో గుజరాత్ వెళ్ళే ఆలోచన మానుకోవాలని మంత్రిత్వ స్ధాయిలోనూ, బ్యూరోక్రటిక్ స్ధాయిలోనూ తనకు సలహాలు అందాయనీ తెలిపాడు. “ఇతరుల అభిప్రాయాల పట్ల పెరిగిపోతున్న అసహనం, ఇతరుల మతం పట్లా, జీవన విధానం పట్లా పెరుగుతున్న తిరస్కారం, ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి విభేదాలను చట్ట వ్యతిరేక హింస ద్వారా ప్రకటించడం… ఇవన్నీ ఏ సందర్భంలోనూ సమర్ధనీయం కావు” అని కలాం తన పుస్తకంలో అభిప్రాయపడ్డాడు.

అయితే 2002 లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నప్పటి పత్రికల వార్తలను పరిశీలించినట్లయితే కొంత భిన్నమైన పరిస్ధితిని గమనించవచ్చు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి స్వయంగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను ఆహ్వానించిన తర్వాత మాత్రమే గుజరాత్ పర్యటన కు కలాం నిశ్చయించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తను బట్టి తెలుస్తోంది. అప్పటికి గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని మోడి, బి.జె.పి లు భావిస్తున్నారు. ఆ నేపధ్యంలో రాష్ట్రపతి గుజరాత్ సందర్శించినట్లయితే రాష్ట్రంలో సాధారణ పరిస్ధితి ఏర్పడిందన్న సందేశాన్ని బైటికి పంపవచ్చనీ భావించారు. అంటే కలాం గుజరాత్ సందర్శన మోడి తిరిగి ముఖ్యమంత్రి గా ఎన్నికకావడానికీ, గుజరాత్ లో హత్యాకాండకి బలయిన ముస్లింలు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పటికీ అంతా బాగుందన్న సందేశాన్ని పంపడానికీ మాత్రమే ఉద్దేశించిందని భావించవలసి వస్తున్నది. అలాంటి సందర్శనను పలువురు వ్యతిరేకించినట్లు మాజీ రాష్ట్రపతి తాజాగా తెలియజేయడమే అర్ధం కాని విషయం.

One thought on “టర్నింగ్ పాయింట్స్: సోనియా ప్రధాని పదవికి తగునని భావించిన కలాం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s