కలాం నిజం చెప్పడం లేదు -సుబ్రమణ్య స్వామి


ప్రధాన మంత్రి గా సోనియా గాంధీ నియామకం విషయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిజాలు చెప్పడం లేదని జనతా పార్టీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఆరోపించాడు. ప్రధాని పదవికి సోనియా నియామకం జరగదని కలాం ఒక లేఖ కూడా సోనియాకి రాశాడనీ, తీరా ఇప్పుడు అందుకు విరుద్ధంగా చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. ఇటలీ పౌరసత్వం రద్దు చేసుకోకుండా భారత పౌరసత్వం పొందినందున సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడానికి నాయపరమైన సమస్యలున్నాయని తాను కలాంకి వివరించాననీ, అందువల్లనే సోనియాకి వ్యతిరేకంగా కలాం నిర్ణయం తీసుకున్నాడనీ స్వామి వివరించాడని ఫస్ట్ పోస్ట్ తెలిపింది.

2004 లో సోనియా గాంధీ ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించినవారిలో సుబ్రమణ్య స్వామి ఒకరు. సోనియా అభ్యర్ధిత్వం వల్ల ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను తెలుసుకోవడానికి కలాం తనను ఆహ్వానించాడని స్వామి తెలిపాడు. మే 17, 2004 తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు తాను రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను కలిశానని ఆయన తెలిపాడు. చట్టపరమైన చిక్కుల గురించి తాను కలాం కు వివరించాననీ తెలిపాడు. “ఆయనను 12:30 గంటలకు నేను కలిసి చట్టపరమైన అడ్డంకి ఉందని వివరించాను. ఫలితంగా సాయంత్రం 5 గంటలకు సోనియా గాంధీకి ఇచ్చిన అపాయింటుమెంటును రద్దు చేస్తూ ఆయన లేఖ రాశాడని నాకు తెలిసింది” అని స్వామి ఫస్ట్ పోస్ట్ కు వివరించాడు.

5 గంటలకు ఇవ్వబడిన అపాయింట్ మెంట్ లో యు.పి.ఏ కూటమి పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని సోనియా కోరుతుందని అప్పట్లో అంతా భావించగా, అనూహ్యంగా, మన్మోహన్ సింగ్ తెరపైకి వచ్చాడు. సోనియా గాంధీని ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఆహ్వానిస్తూ లేఖను తయారు చేసిన పరిస్ధితిలో ఆమె మన్మోహన్ పేరు చెప్పడంతో ఆశ్చర్యపోయానని కలాం తన పుస్తకం ‘టర్నింగ్ పాయింట్స్’ లో రాసుకున్నాడు. ఇది నిజం కాదని ఫస్ట్ పోస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామి ఆరోపిస్తున్నాడు.

తాను 12:30 గంటలకు రాష్ట్రపతి కలాంను కలిశాక సాయంత్రం 3:30 గంటలకు సోనియా అపాయింట్ మెంట్ ను రద్దు చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుండి లేఖ వెళ్లిందని స్వామి చెబుతున్నాడు. ఆ లేఖను బయటపెట్టాలని కూడా స్వామి కోరుతున్నాడు. లేఖను వెల్లడించినట్లయితే అబ్దుల్ కలాం విశ్వసనీయత పెరుగుతుందని ఆయన సూచించాడు. “ఆ లేఖను అబ్దుల్ కలాం ప్రచురించనట్లయితే చరిత్ర పట్ల ఆయన వాస్తవ వైఖరితో లేడని నేను భావించవలసి ఉంటుంది” అని స్వామి అన్నాడు. లేఖ విషయం మన్మోహన్ సింగ్, నట్వర్ సింగ్ లకు కూడా తెలుసని స్వామి తెలిపాడు. తాను రాష్ట్రపతి వద్ద ఉండగా సోనియా గాంధీ నుండి వచ్చిన లేఖను కూడా తాను చూశాననీ, తనను తాను ప్రధానమంత్రి గా ఆ లేఖలో ఆమె ప్రతిపాదించుకుందనీ స్వామి వివరించాడు. ప్రధానమంత్రి పదవిని సోనియా త్యాగం చేసిందని కాంగ్రెస్ పదే పదే చెప్పుకుంటున్నది వాస్తవం కాదని ఈ వెల్లడి ద్వారా స్వామి చెప్పినట్లయింది.

మొత్తం మీద ప్రజలకు సంబంధం లేని ఒక ‘బ్లేమ్ గేమ్’ రాజకీయ రంగంలో మొదలయింది. ఈ ఆటలోకి ఒక్కొక్కరూ వచ్చి చేరుతున్నారు. ఎదుటివారి కంటే తామే నీతిమంతులమని చెప్పుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. నిజానికి ప్రధాన మంత్రి పదవికి మన్మోహన్ సింగ్ నియమించబడడంలో దేశంలోని పార్టీల, నాయకుల పాత్ర కంటే విదేశీ కంపెనీల పాత్రే అధికమని అనేకసార్లు విశ్లేషకులు వివరించారు. ప్రభుత్వరంగాన్ని అంటిపెట్టుకుని ఉన్న పాత దళారీ పెట్టుబడిదారీ వర్గానికీ, విచ్చలవిడి వనరుల దోపిడితో విదేశీ సామ్రాజ్యవాద కంపెనీలతో అంటకాగుతున్న కొత్త బిచ్చగాళ్ళకీ మధ్య రగులున్న వైరుధ్యమే కాంగ్రెస్ పార్టీలో సోనియా, మన్మోహన్ ముఠాల మధ్య తగాదాకు తెరతీసిందన్నది అసలు వాస్తవం.

పాత, కొత్త దళారీ పెట్టుబడిదారీ వర్గాల మధ్య తగాదాయే సోనియా పౌరసత్వం వివాదాన్ని ప్రముఖంగా ముందుకు తెచ్చింది. విదేశీ కంపెనీల దోపిడీకి ఒక్కుమ్మడిగా గేట్లు తెరవడానికి సోనియా వర్గం అంగీకరించినట్లయితే ఆమె పౌరసత్వం ఎవరికైనా, చివరికి కాషాయ పార్టీలకైనా, అంగీకారమే. ఒకేసారి కాకుండా నెమ్మదిగా గేట్లు తెరుద్దామన్న (నమ్మించి గొంతు కోద్దామన్న) వాదనతో విచ్చలవిడి ప్రవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ లకు కాస్తంత ప్రతిఘటన ఇచ్చినందుకే సోనియా పౌరసత్వం పెద్ద వివాదంగా ముందుకొచ్చింది. ఈ వివాదంలో మన్మోహన్, సోనియా, సుబ్రమణ్య స్వామి, అబ్దుల్ కలాం తదితరులంతా కేవలం పాత్రధారులే తప్ప సూత్రధారులు కాదు. స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ కంపెనీలూ వారి వెనుక ఉన్న పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలే అసలు సూత్రధారులు.

5 thoughts on “కలాం నిజం చెప్పడం లేదు -సుబ్రమణ్య స్వామి

 1. *విదేశీ కంపెనీల దోపిడీకి ఒక్కుమ్మడిగా గేట్లు తెరవడానికి సోనియా వర్గం అంగీకరించినట్లయితే ఆమె పౌరసత్వం ఎవరికైనా, చివరికి కాషాయ పార్టీలకైనా, అంగీకారమే*
  అయ్యా,
  మీరు రాసే అనాలిసిస్ చదివితే ఆవు వ్యాసం గుర్తుకొస్తున్నాది. ప్రతిదానికి పాత,కొత్త పెట్టుబడి దారుల మధ్య గర్షణా అని ముక్తాయిస్తున్నారు. కాషాయ పార్టిలకు అంగీకారమని వాళ్లు ఎప్పుడు, ఎక్కడ చెప్పారో? యుట్యుబ్ లో స్వామి స్పిచులు, ఆయన జనతా పార్టి వెబ్సైట్లో ఎవిడేన్స్లు ఎన్నో, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన మొదటి నుంచి వొంటరి పోరాటం చేస్తునే ఉన్నాడు. నీకు తెలియకపోతే ….

 2. ఇంకొక చిన్న విషయం భారతదేశ ప్రజలు ఎక్కువగా చదువుకోకపోయినా, తెలివితేటలు, ఇంగితజ్ణానం పుష్కలంగా ఉంది. ఇది చాలా దేశాలు చూసిన తరువాత నాకు అర్థమైన విషయం. ప్రతిదానిని ఇడియాలజి కోణంలో చూసే మీలాంటివారు, అనుమానాలు రేక్కితి ప్రజలను గందరగోళం చేయాలనుకొనే మీడీయా మొద|| వారందరు ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా, సుబ్రమణ్య స్వామి చెప్పిన విషలాయాలను మాత్రమే నమ్ముతారు. అతను ఇప్పటివరకు ఎది చెప్పాడొ అది చేశాడు, చట్టప్రకారం ఆధారలల్తో పోరాడాడు. ఆయనని మీడీయా ఏమాత్రం పట్టించుకోకపోయినా, నిర్లక్షం చేసినా, ఐ.ఐ.టి., ఐ.ఐ.యం. లు, పెద్ద యునివర్సిటిలలో ఎంతో మంది విద్యార్దులు ఆయన విడియోలను సబ్ స్చ్రైబ్ చేసుకొని ప్రతివిషయాన్ని తెలుసుకొంట్టుంటారు. ఆయనని తీసుకొచ్చి ఉపన్యాసాలు ఇప్పించుకొంటారు. అతను భావితరార మేధావులను ఇంస్పైర్ ఇప్పటికి చేస్తున్నాడు.

 3. అయ్యా ‘శ్రీ’ని గారూ భారత దేశ ప్రజల ఇంగిత జ్ఞానం గురించి మీరు చెప్పినదానితో నాకు ఏకీభావం ఉంది. ఎన్ని సార్లు పేర్లు మార్చుకున్నా రాతల్ని బట్టి మీలాంటి ముసుగు వీరుల్ని ఇట్టే గుర్తు పట్టేస్తారు.

  పోతే, పాత కొత్త పెట్టుబడిదారులేనా, ఇంకా చాలా సంగతులు నా ముక్తాయింపుల్లో ఉన్నాయి. తమరు కూడా వాటిని చర్చిస్తూనే ఉన్నారు. అయినా తమరికెందుకో గుర్తుకొస్తున్నట్లు లేదు.

  భారత దేశ ప్రజలు మీరు చెప్పిన ఐ.ఐ.ఎం, ఐ.ఐ.టి, పెద్ద యూనివర్సిటీలల్లో లేరని మీరు గుర్తించాల్సి ఉంది. వాళ్ళు సుబ్రంమణ్య స్వామి చేత ఇన్స్ పైర్ అయి వాల్ స్ట్రీట్ కంపెనీలకి అంకితమై పోతున్నారు. భారత దేశం ముఖం కూడా చూడ్డం లేదు. ఒకవేళ చూసినా కంపెనీలకే వారి జీవితాలు అంకితం. అసలు జనం రైతులుగా, కూలీలుగా, కార్మికులుగా, ఉద్యోగులుగా, స్వేదం చిందిస్తూ దేశాన్ని నిర్మిస్తున్నారు. స్వామి లాంటి వారి ఉపన్యాసాలు విని గందరగోళానికి గురికాకపోవడం వల్ల వారింకా దేశంలోనే ఉంటూ దేశాన్ని నిర్మించుకుంటున్నారని గుర్తించగలరా మీరెప్పటికైనా?

 4. Mr Srini,
  సోనియా విదేశీయురాలా, స్వదేశీయురాలా అనేది దోపిడీ వర్గంవాళ్ళకి అంత ఇంపార్టెంట్ విషయం కాదు. విదేశీ సంస్కృతిని తిడుతూనే అదే నాలుకతో విదేశీ సామ్రాజ్యవాదులకి ప్రయోజనం కలిగించే గ్లోబలైజేషన్‌ని పొగిడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ సంస్కృతి ప్రధానం కాదు, ఆర్థిక అంశాలు ప్రధానం. మనవాళ్ళకి విదేశీ సంస్కృతి అవసరం లేదు కానీ ‘విదేశీ సామ్రాజ్యవాదులు మన ఐటి కంపెనీల యజమానులకి ఔట్‌సోర్సింగ్ కోసం ఇచ్చే డబ్బులు మాత్రం’ అవసరం అనిపిస్తాయి. ఎందుకంటే ఆ డబ్బులు వస్తేనే మన ఐటి కంపెనీల ఉద్యోగులకి జీతాలు ఎక్కువగా వస్తాయి. గ్లోబలైజేషన్ వచ్చిన తరువాత మన దేశంలో స్వదేశీ పరిశ్రమలు ఎన్ని మూతపడ్డాయి అనే విషయం కూడా కన్వీనియంట్‌గా మర్చిపోతారు, ‘ఐటి కంపెనీలు విదేశీయుల దగ్గర డబ్బులు తీసుకుని, అందులో చిన్న వాటాగా తమకి ఇచ్చే ఐదంకెల(five digits) జీతం కోసం’.

  సంస్కృతి అనేది పైపై కబుర్ల కోసం చెప్పుకునేది. ఆర్థిక అంశాల ముందు అది సెకండరీ విషయం. ఆముదాలవలస పట్టణంలో ఒక అమ్మాయికి భర్త చనిపోయాడు. ఆమె తల్లితండ్రులు ఆమెని పోషించలేక ఆమెకి రెండో పెళ్ళి చేసి పంపించారు. అప్పుడు మన సంస్కృతీ పరిరక్షకులు ‘కలికాలం వచ్చేసిందనీ, ఆముదాలవలస కూడా అమెరికాలాగ మారిపోయిందనీ’ ఏడుస్తారు. తమ బంధువుల అబ్బాయికి ‘విదేశీయుల దగ్గర డబ్బులు తీసుకునే & రూపాయి విలువ తగ్గింపు వల్ల లాభం పొందే’ ఐటి కంపెనీలో ఉద్యోగం దొరికినప్పుడు మాత్రం స్వదేశీయతా, విదేశీయతా గురించి ఆలోచించరు. తమ కుర్రాడికి ఐదంకెల జీతం వచ్చిందా, లేదా అనే విషయం మాత్రమే ఆలోచిస్తారు. ఆర్థికత అనే ప్రాథమిక అంశం ముందు స్వదేశీయత, విదేశీయత లాంటి విషయాలన్నీ సెకండరీ విషయాలుగా కూడా పని చెయ్యని పనికి రాని అంశాలే.

 5. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పెళ్ళి అనేది వ్యక్తిగత విషయమైనా, ఆ విషయంలో మూఢ నమ్మకాలని నమ్మేవాళ్ళు నమ్ముతూనే ఉన్నారు. కానీ డబ్బు విషయానికొచ్చేసరికి ఎవరైనా పచ్చి భౌతికవాదులలాగానే ఆలోచిస్తారు. సోనియా విదేశీయతని వ్యతిరేకిస్తూనే సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక విధానాలని సమర్థించేవాళ్ళు ఆలోచించేది ఇలాగనే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s