శుక్రవారం భారత షేర్ మార్కెట్లు అత్యధిక లాభాలతో ముగియగా, రూపాయి బాగా కోలుకుంది. బి.ఎస్.ఇ సెన్సెక్స్ రికార్డు స్ధాయిలో 2.59 శాతం (439 పాయింట్లు) లాభ పడగా డాలరుతో రూపాయి మారకం విలువ దశాబ్ధంలోనే రికార్డు స్ధాయిలో 119 పైసలు పెరిగింది. ఇటలీ, స్పెయిన్ దేశాలకు ఋణాల రేట్లు తగ్గించడానికి యూరోపియన్ దేశాల సమావేశం నిర్ణయాత్మక చర్యలు ప్రకటించడమే భారత మార్కెట్ల ఉత్సాహానికి కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ విశ్లేషించగా, ప్రణబ్ సవరణపై (GAAR) ఆర్ధిక శాఖ ‘డ్రాఫ్ట్ గైడ్ లైన్స్’ ప్రకటించడం వల్లనే మార్కెట్లు లాభపడ్డాయని ‘ది హిందూ’ విశ్లేషించింది.
రాయిటర్స్, ది హిందూ లు విశ్లేషించిన కారణాలు దాదాపు ఒకటే అయినప్పటికీ రెండింటి ప్రాధాన్యతలో తేడా వ్యక్తం అయింది. స్పెయిన్, ఇటలీ లకు రుణాల ఖరీదు తగ్గిస్తూ, యూరో జోన్ బ్యాంకులకు ఏకైక పర్యవేక్షక వ్యవస్ధను ఏర్పరిచేలా 17 దేశాల ‘యూరో జోన్’ నాయకుల సమావేశం నిర్ణయించడం, వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు అయిన ‘మోర్గాన్ స్టాన్లీ’ భారత ఈక్విటీల రేటింగ్ ను ‘అండర్ వెయిట్’ నుండి ‘ఈక్వల్ వెయిట్’ కు అప్ గ్రేడ్ చెయ్యడం, ప్రణబ్ సవరణలపై ఆర్ధిక శాఖ వివరణలు ఇస్తూ ప్రకటన చేయడం… ఈ కారణాలన్నీ రెండింటి విశ్లేషణల్లోనూ చోటు చేసుకున్నాయి. అయితే యూరో జోన్ నాయకుల నిర్ణయాన్ని రాయిటర్స్ ప్రధాన కారణంగా నొక్కి చెప్పగా, ‘ది హిందూ’ మాత్రం ప్రణబ్ సవరణ పైన కంపెనీల భయాలను దూరం చేస్తూ ఇచ్చిన వివరణపైన (డ్రాఫ్ట్ గైడ్ లైన్స్) కేంద్రీకరించింది. ఇరు పత్రికలూ వివిధ విశ్లేషకులను ఉటంకించడం గమనార్హం.
17 దేశాల యూరో జోన్ నాయకులు రాత్రంతా సమావేశాలు జరిపి రెండు ప్రధాన నిర్ణయాలు ప్రకటించారు. ఒకటి: యూరో జోన్ రక్షణ నిధిని సభ్య దేశాల (ముఖ్యంగా స్పెయిన్, ఇటలీ) అప్పులను కొనుగోలు చేయడానికి వినియోగించడానికి అంగీకరించడం. దీని వల్ల స్పెయిన్, ఇటలీలతో పాటు ఋణ సంక్షోభంలో ఉన్న యూరో సభ్య దేశాలకు తక్కువ వడ్డీ రేట్లకే అప్పులు ఇవ్వవచ్చు. అలా తక్కువ వడ్డీ రేట్లకు అప్పులు ఇవ్వడానికి యూరో జోన్ రక్షణ నిధిని వినియోగిస్తారు. రెండు: యూరో జోన్ దేశాల బ్యాంకులను పర్యవేక్షించడానికి ఒకే ఒక పర్యవేక్షక సంస్ధను ఏర్పాటు చేయడం. దీనివల్ల యూరో జోన్ సభ్య దేశాల ప్రభుత్వాలకు తమ బ్యాంకులపై కొంతమేరకైనా పర్యవేక్షణ తగ్గిపోయి కొత్త సంస్ధకు ఆ అధికారాలు అప్పగించబడతాయి. మరో విధంగా చెప్పాలంటే సభ్య దేశాల ప్రభుత్వాల సార్వభౌమత్వాన్ని ఆ మేరకు హరించడమే. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ చాలా కాలంగా ఇలాంటి చర్యలను ప్రతిపాదిస్తోంది. ఋణ సంక్షోభం నుండి బయటికి రావాలంటే ఆయా దేశాలు తమ సార్వభౌమత్వాన్ని త్యాగం చేయాల్సిందేనని ఆవిడ గట్టిగా చెబుతూ వచ్చింది. ఆ ప్రతిపాదన ఈ రూపంలో ఆచరణలోకి వస్తున్నదన్నమాట.
యూరో జోన్ దేశాలు ప్రకటించిన ఈ రెండు చర్యల వల్ల కంపెనీలకు నమ్మకం పెరిగి డాలర్లలో, యూరోలలో దాచి పెట్టుకున్న సొమ్ముని భారత షేర్ మార్కెట్లలోకి ప్రవహింపజేశాయనీ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇక్కడ కంపెనీలంటే నిర్దిష్టంగా చెప్పుకోవాలంటే ఎఫ్.ఐ.ఐ లు (ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) అని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క రోజే ఎఫ్.ఐ.ఐ లు 3,000 కోట్లు భారత షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారని ‘ది హిందూ’ తెలిపింది. అంటే ఈ మేరకు డాలర్లు భారత షేర్ మార్కెట్ల పెట్టుబడుల ద్వారా రూపాయిల్లోకి ప్రవహించాయన్నమాట. ఫలితంగా రూపాయి విలువ 119 పైసలు పెరిగింది. గతంలో 2003 తర్వాత రెండు సార్లు మాత్రమే ఈ స్ధాయిలో రూపాయి విలువ పెరిగింది. సెప్టెంబర్ 22, 2011 న 124 పైసలు పెరగ్గా, నవంబర్ 22, 2008 న ఈ రోజు లాగే 119 పైసలు పెరిగింది.
ది హిందూ ప్రకారం గురువారం రాత్రి పొద్దు పోయాక ఆర్ధిక శాఖ అధికారులు ప్రణబ్ ప్రతిపాదించిన ఆదాయ పన్ను చట్ట సవరణపై వివరణలు ఇచ్చారు. వివరణలకు గైడ్ లైన్స్ (డ్రాఫ్ట్) గా వారు పేర్కొన్నారు. వీటి ద్వారా స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకు (ముఖ్యంగా స్వదేశీ ప్రవేటు కంపెనీలకు) కొన్ని అనుమానాలు తీరాయి. ముఖ్యంగా స్వదేశీ ప్రవేటు కంపెనీలు అని అనడం ఎందుకంటే, విదేశీ కంపెనీలు సమాధాన పడలేదని రాయిటర్స్ కధనం ద్వారా తెలుస్తోంది. రాయిటర్స్ ప్రకారం విదేశీ ప్రవేటు కంపెనీలకు సవరణపై ఇంకా ఆగ్రహంగానే ఉన్నాయి. యూరో జోన్ సమావేశ నిర్ణయాలు మాత్రమే వారి ఉత్సాహానికి కారణం. అయితే ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్ధిక శాఖ చేపట్టినందున కూడా మార్కెట్ల సెంటిమెంట్ ను ఉద్దీపింపజేసిందని రాయిటర్స్ తెలిపింది. సంస్కరణల పట్లా, విదేశీ కంపెనీల అనుకూల విధానాల పట్లా అధిక ఆసక్తి కనబరిచే మన్మోహన్ చేతికి ఆర్ధిక శాఖ వస్తే విదేశీ కంపెనీలు ఉత్సాహం పొందడంలో ఆశ్చర్యం లేదు.
భారత పాలకుల వల్ల భారత దేశ రైతులకూ, కూలీలకూ, మధ్య తరగతి వర్గానికీ, కార్మికులకూ, జాతీయ పెట్టుబడిదారులకూ ఎన్నడూ ఉత్సాహం కలగకపోవడమే అసలు విషయం.
ఇందాకే కరెన్సీ కన్వర్టర్‌లో రూపాయి విలువ చూసాను. 56 రూపాయలు ఉంది. కరెన్సీ విలువ కేవలం రూపాయి పెరిగితే ఎంత, పెరగకపోతే ఎంత. 1969లో ఒక డాలర్ విలువ పన్నెండు రూపాయలు ఉండేది. ఇప్పుడు డాలర్ విలువ 56 రూపాయలు. గ్లోబలైజేషన్ వల్ల పెరిగినది సామ్రాజ్యవాద దేశాల కరెన్సీ విలువే కదా.
“భారత పాలకుల వల్ల భారత దేశ రైతులకూ, కూలీలకూ, మధ్య తరగతి వర్గానికీ, కార్మికులకూ, జాతీయ పెట్టుబడిదారులకూ ఎన్నడూ ఉత్సాహం కలగకపోవడమే అసలు విషయం.”
కథనం మొత్తంలో మెరపు వాక్యమిది విశేఖర్ గారూ. స్టాక్ మార్కెట్ పెరగడానికి యూరో జోన్ నిర్ణయాలు ప్రధాన కారణం కాగా మన్మోహన్ ఆర్థికశాఖను చేపట్టడంతో మార్కెట్ మళ్లీ మెరుస్తోందంటూ దాదాపు అన్ని పత్రికలూ ఈరోజు వార్తలేశాయి. మన్మోహనిజం చుట్టూ మళ్లీ ఒక ‘మాయ’ సృష్టించబడుతోంది.
దీనర్థం.. ప్రజల వీపులపై మరొక బడితపూజకు రంగం సిద్ధమవుతున్నట్లేనా?
కరెన్సీ విలువ కేవలం రూపాయి పెరిగితేనే మన బూర్జువా పత్రికలు అదో గొప్ప విషయమని అనుకుంటున్నాయి. 1969లో ఒక డాలర్ విలువ పన్నెండు రూపాయలు ఉండేది అని ఒక గ్లోబలైజేషన్‌వాదితో చెపితే అతను ఇలా సమాధానం చెప్పాదు “అభివృద్ధిని సూచించడానికి కరెన్సీ విలువ ప్రామాణికం కాదు” అని. అలాగైతే కరెన్సీ విలువ రూపాయి పెరిగినా దాని గురించి పత్రికలు గొప్పగా ఎందుకు వ్రాస్తున్నట్టో?