వాతావరణ మార్పులు వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు స్వామినాధన్ హెచ్చరించాడు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్ధితులు ఏర్పడనున్నట్లు ఇప్పటికే సూచనలు అందుతున్నాయనీ, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ విమర్శించారు. కొద్ది ప్రాంతాల్లో అధిక వర్షాలు, మరి కొన్ని చోట్ల ఎన్నడూ లేనంతగా కరువు ఏర్పడుతుందనీ తెలిపాడు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ‘పోస్ట్ మార్టం’ చర్యలకే అలవాటుపడ్డ ప్రభుత్వాలు ధోరణి మార్చుకోవాలని కోరారు.
“వ్యవసాయం పై వాతావరణ మార్పుల ప్రభావాలతో వ్యవహరించడానికి మనం సిద్ధంగా లేము. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఏర్పడిన దుర్భిక్ష పరిస్ధితుల నిర్వహణలో అది ప్రతిబింబిస్తోంది” అని స్వామినాధన్ అన్నాడు. 2012 సంవత్సరానికి గాను ఋతుపవన వర్షపాతం 99 శాతం ఉంటుందని చెప్పిన ‘భారత వాతావరణ విభాగం’ (ఇండియన్ మెటీయోరోలాజికల్ డిపార్ట్ మెంట్ – ఐ.ఎం.డి) మే నెలలో దానిని 96 శాతానికి తగ్గించడం గమనార్హం.
ఐ.ఎం.డి ప్రమాణాల ప్రకారం జూన్ నుండి నాలుగు నెలలపాటు కురిసే ఋతుపవన వర్షంలో గత 50 యేళ్లలో సగటు వర్షపాతం అయిన 89 సెంటీ మీటర్లలో 96 నుండి 104 శాతం వర్షపాతం నమోదయితే దానిని ‘సాధారణ ఋతుపవన వర్షపాతం’ గా పరిగణిస్తారు. సగటులో 90 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయితే కరువు తధ్యం.
ఋతుపవనాల వర్షంలో లోటు ఉంటుందని ఇప్పటివరకూ చెప్పకపోయినా ఇప్పటివరకూ వర్షాలు పెద్దగా పడలేదు. దేశంలోకి ప్రవేశించడంతోనే ఋతుపవనాలు బలహీనంగా ప్రవేశించాయి. కేరణలో ప్రవేశించాక పశ్చిమ తీరం వెంబడి ఉత్తర భారతానికి వెళ్ళిపోవడమే తప్ప దక్షిణ భారతం అంతా కనీసం బలంగా విస్తరించడం జరగలేదు. ఫలితంగా తొలకరి పడి దాదాపు నెల రోజులు కావస్తున్నా రైతులు ఉత్సాహంగా లేరు. అనేక చోట్ల ప్రాధమిక వ్యవసాయ కార్యక్రమాలు మొదలు కానేలేదు. ఈ పరిస్ధితిని ‘కరువులాంటి పరిస్ధితులు’ గా పత్రికలు, చానెళ్లు చెబుతున్నాయి. అంటే ఈ పరిస్ధితి మరి కొన్ని రోజులు కొనసాగితే ఇక కరువే మిగులుతుంది. వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణమని స్వామినాధన్ ప్రకటన స్పష్టం చేస్తోంది.
‘కరువులాంటి పరిస్ధితుల’ వలన ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ‘ది హిందూ’ తెలిపింది. మహారాష్ట్ర లో పత్తి బాగా పండించే విదర్భ ప్రాంతంలో ఈ సంవత్సరం మే నల లోపు 332 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ‘విదర్భ జనాందోళన్ సమితి’ అనే రైతు సంఘం తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2011-12 లో ఫిబ్రవరి వరకు ఆంధ్ర ప్రదేశ్ లో 109 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఇంకా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆత్మహత్యలు నమోదయ్యాయని ‘ది హిందూ’ తెలిపింది. తక్కువ వర్షపాతం వల్ల పంటలు చేతికి రాకపోవడం, అప్పులు చెల్లించలేకపోవడం ఆత్మహత్యలకు కారణాలుగా తెలుస్తోంది.
పరిస్ధితి ఇలా ఉన్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోవడానికి బదులు పోస్ట్ మార్టం కే అవి అలవాటు పడ్డాయని నిపుణులు సైతం నిందిస్తున్నారు. “ప్రతిసారీ పోస్ట్ మార్టం చర్యలకే పరిమితం కావడానికి బదులు ముందస్తుగా ప్రణాళిక వేసుకోవలసిన అవసరం ఉంది. ఉదాహరణకి మిగులు వర్షపాతం నమోదయిన సంవత్సరాల్లో దానిని బాగా ఉపయోగపెట్టుకోవచ్చు. అదనపు ఉత్పత్తిని నిలవ చేసుకోవడం, వర్షాలు కురిసేటపుడు సహజ నీటి నిలవలను, భూగర్భ జలాలనూ ఛార్జి చేసుకోవడం లాంటివి చెయ్యాలి. దానివల్ల వర్షపాతం తక్కువగా వచ్చిన సంవత్సరాల్లో దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు” అని స్వామినాధన్ వివరించాడు.
హైద్రాబాద్ లోని ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్’ సంస్ధ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ జి.వి.రామాంజనేయులు ప్రకారం మొత్తంగా వర్షపాతం ఆధార ప్రాంతాలకు ప్రణాళిక లేకపోవడమే అసలు సమస్య. కాలవలు, చెరువులు లాంటి నీటిపారుదల సౌకర్యాలు లేకుండా పూర్రిగ్తా వర్షాలపైనే ఆధారపడ్డ ప్రాంతాలను ‘వర్షపాత ఆధార ప్రాంతాలు’ అని అంటారని తెలిసిందే. వ్యవసాయ విభాగం ప్రకారం భారత దేశంలో 60 శాతం వ్యవసాయ భూములు వర్షంపై ఆధారపడ్డవే. “ప్రతి సంవత్సరం దుర్భిక్షం ఎదుర్కొనే ప్రాంతాలున్నాయి. అయినా ఆకస్మిక పధకం ఏదీ లేదు” అని రామాంజనేయులు వివరించాడు. “ప్లాన్ ఎలా ఉండాలంటే, ఉదాహరణకి, 15 రోజుల పాటు వర్షం ఆలస్యం అయితే ‘ప్లాన్ బి’ ఏమిటి? 30 రోజులు ఆలస్యం అయితే ‘ప్లాన్ సి’ ఏమిటి?” అని ఆయన వివరించాడు.
హరిత విప్లవం తర్వాత నీటి పారుదల ప్రాంతాలపై ఒత్తిడి తీవ్రంగా పెరగడం, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం లేకపోవడం కారణాలు సమస్యను పెంచాయని రామాంజనేయులు వివరించాడు. “దుర్భిక్షం ఎదుర్కొనే ప్రాంతాలు నిర్ధిస్థ పంటల తరహాను (క్రాపింగ్ పాటర్న్) కలిగి ఉన్నాయి. నీరు తక్కువగా అవసరం అయే ముతక బియ్యం, జొన్న లాంటివి ఇక్కడ పండుతాయి. కానీ ఈ పంటలను ప్రోతహించరు. ఇంకా చెప్పాలంటే రసాయన ఎరువులు, పురుగు మందులతో చేసే వ్యవసాయం కంటే సేంద్రీయ వ్యవసాయానికి తక్కువ నీరు సరిపోతుంది. కానీ దానికి సబ్సిడీ ఉండదు” అని ఆయన వివరించాడు.
వ్యవసాయం పై నియమించిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కి సి.పి.ఎం ఎం.పి బసుదేబ్ ఆచార్య ఛైర్మన్ గా ఉన్నాడు. ప్రణాళికలో లోపాలున్నాయని ఆయన అంగీకరించాడని పత్రిక తెలిపింది. “స్టాండింగ్ కమిటీ లో మేము దీనిని స్వీకరిస్తాం” అని ఆయన అన్నాడు. “ప్రతి సంవత్సరం వరదలు, దుర్భిక్షం వస్తున్నాయనీ అయినా ఇంకా చాలా చేయవలసి ఉన్నదనీ ప్రభుత్వానికి సలహా ఇస్తాం” అని అన్నాడు. వ్యవసాయం పై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని గత సంవత్సరం కొందరు ఎం.పి లు డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై ఇంకా ఏమీ చెప్పలేదు. స్వామినాధన్ హెచ్చరికనైనా పట్టించుకుంటుందన్న గ్యారంటీ కూడా లేదు.