ముంబై టెర్రరిస్టు దాడుల్లో పాకిస్ధాన్ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు ధృవ పడిందని భారత హోమ్ మంత్రి పి.చిదంబరం తేల్చి చెప్పాడు. ‘అబు జిందాల్’ అలియాస్ ‘జబియుద్దీన్ అన్సారీ’ అరెస్టు తర్వాత అతను వెల్లడి చేసిన వివరాలు దాడుల్లో పాక్ పాత్ర ఉందన్న అనుమానాలు నిజమేనని తేలిందని చెప్పాడు. పాక్ ప్రభుత్వ మద్దతుతో ఒక క్రమ పద్ధతిలో టెర్రరిస్టు దాడులు జరిగాయని ఆయన తెలిపాడు. అయితే చిదంబరం వాదనను పాక్ హోమ్ మంత్రి రెహ్మాన్మ్ మాలిక్ తిరస్కరించాడు. ఇండియా నుండే ‘స్టింగ్ ఆపరేషన్’ ఎందుకు జరిగి ఉండకూడదని ప్రశ్నించాడు. ఐ.ఎస్.ఐ పై దుష్ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించాడు.
తిరువనంతపురం లో పత్రికల సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ ఈ విషయం తెలిపాడని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. పాక్ ప్రభుత్వంతో సంబంధం లేనివారు ముంబై టెర్రరిస్టు దాడులకు పాల్పడ్డారన్న వాదనకు ఇప్పుదిక విలువలేదని చిదంబరం వ్యాఖ్యానించాడు. “నిర్ధిష్ట ఏజన్సీ అంటూ దేనినీ నేను నొక్కి చెప్పడం లేదు. కానీ ప్రభుత్వ మద్దతు మాత్రం ఉంది” అని చిదంబరం అన్నాడు. సౌదీ అరేబియా తో గత ఐదు నెలలుగా చర్చలు సాగించిన అనంతరం మహారాష్ట్ర వాసి ‘జబియుద్దీన్ అన్సారీ’ అలియాస్ ‘అబు జిందాల్’ ను ఆ దేశం ఇండియాకు పంపేసిన సంగతి తెలిసిందే.
“జిందాల్ ను సంవత్సరంనుండీ అనుసరిస్తున్నాం. జిందాల్ అన్నది మారు పేరు. సంవత్సరం క్రితం అతన్ని గుర్తించాం. అతని వెంటపడి, ఆచూకీ కనుక్కుని, పట్టుకున్నాం. ముంబై దాడి వెనుక ఉన్న 26 మంది ‘మాస్టర్ మైండ్’ ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం.” అని చిదంబరం తెలిపాడు. దాడులు చేసినవారిని కనిపెట్టడం కోసం ఇండియా ఓపికతో చేసిన ప్రయత్నాలు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుందనీ, పాకిస్ధాన్ సహకారం మాత్రం అల్పస్ధాయిలో ఉందనీ చిదంబరం తెలిపాడు.
జిందాల్ గురించిన సమాచారాన్ని పంచుకోవాలని పాక్ హోమ్ మంత్రి రెహ్మాన్ మాలిక్ నుండి నోట్ అందిందనీ చిదంబరం తెలిపాడు. పద్ధతుల ప్రకారం తామా పని చేస్తానని, అయితే మాస్టర్ మైండ్ లుగా భావిస్తున్నవారి వాయిస్ శాంపిల్స్ ఇస్తామన్న హామీని పాక్ నిలుపుకోవాలనీ ఆయన కోరాడు.
చ్డంబరం ఆరోపణలను పాక్ హోమ్ మంత్రి రెహ్మాన్ మాలిక్ ఖండించాడు. ఐ.ఎస్.ఐ పైన దుష్ప్రచారం జరుగుతోందని వాపోయాడు. పాకిస్ధాన్ ప్రభుత్వ, ప్రభుత్వేతరుల పాత్ర ముంబై దాడుల్లో ఉన్నదన్న ఆరోపణలను ఆయన పదే పదే తిరస్కరించాడని ‘ది హిందూ’ తెలిపింది.
“ఇప్పుడు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఇండియా నుండే ఎవరైనా ‘స్టింగ్ ఆపరేషన్’ జరిపారేమో ఎవరికి తెలుసు?” అని రెహ్మాన్ ప్రశ్నించాడు. స్టింగ్ ఆపరేషన్ ఆరోపణ గురించి మరేమీ వివరాలూ ఆయన చెప్పలేదు. “ముగ్గురూ పాకిస్ధాన్ గనక రాగలిగితే వారిక్కడి ప్రజలతో కలిసిపోతారు. ఇక్కడ వనరులను తయారు చేసుకుని వెనక్కి వెళ్తారు. ఇంక ముంబై దాడులు జరుగుతాయి. కనుక సరిగా పరిశోధించేవారెవరైనా ఆలోచించక తప్పదు” అని రెహ్మాన్ అన్నాడు.
అన్సారీ గురించిన వివరణాత్మక సమాచారం ఇచ్చినట్లయితే తాము చర్యలు తీసుకుంటామని రెహ్మాన్ తెలిపాడు. “జబీయుద్దీన్ భారతీయుడు. అతన్ని ఇండియాలో పట్టుకున్నారు. పాకిస్ధాన్ ని ఎందుకు తప్పు పడుతున్నారు. ఆయన మీ పౌరుడే. దానర్ధం మీ పౌరులను నియంత్రించడంలో మీ ఏజన్సీలు విఫలం అయ్యాయి. మీ వ్యవస్ధను కూడా ఓసారి చూసుకోండి” అని రెహ్మాన్ అన్నాడు.
ఇండియా, పాక్ ప్రభుత్వాలు ‘బ్లేమ్ గేమ్’ పక్కన బెట్టి నిజాయితీగా కృషి చేసినట్లయితే ముంబై టెర్రరిస్టు దాడులకు పాల్పడిన వారిని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.