–
అచంగ గారి సవాలు ‘ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వ్యాపించలేద’ని. ఆయన తన ఆర్టికల్ లో ఇలా రాశారు.
“ఎక్కడా ఫుకుషిమా అణుధార్మికత ఇతరదేశాలకు విస్తరించినట్టు శాస్త్రీయ ఆధారాలు ఇంతవరకూ లేవు”
నా ఆర్టికల్ కింద వ్యాఖ్యలో ఇంకా ఇలా అన్నారు.
“మీరిచ్చిన ఆధారాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం ఇప్పటివరకూ శాస్త్రీయంగా నిరూపించబడలేదని ఢంకా బజాయించి చెప్పగలను.”
నిజానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. కాకపోతే శాస్త్రీయ ఆధారాలను ఉన్నది ఉన్నట్లు చూడకుండా ఆధారాలని ట్విస్ట్ చేసి పాఠకులను తప్పుదారి పట్టించడంలో అచంగ గారిది “అందె వేసిన చెయ్యి”. వాస్తవాలు చెప్పడానికి ఉపయోగపెట్టవలసిన తన ఎకాలజీ పరిజ్ఞానాన్ని అచంగ వాస్తవాలకు ‘మసి పూయడానికే’ వినియోగించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు అక్కడి పాలల్లో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్నామంటూ ఇచ్చిన నివేదికలో తన అసంబద్ధ వాదనకు పనికొచ్చే కొద్ది భాగాన్ని మాత్రమే ఎత్తిరాసి పాఠకులను ఎంత ఘోరంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారో గత ఆర్టికల్ లో చూశాం.
అది కాక ఫిన్నిష్ అడవుల్లో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్నారని అక్కడి టి.వి చానెల్ చెపితే ఆ వార్తపై మరింత సమాచారం సేకరించడానికి బదులు కొట్టిపారేయడానికే అచంగ ఆసక్తి ప్రదర్శించారు. లిధువేనియా లో రేడియేషన్ కనపడిందన్న వార్త చూపితే అసలు చెర్నోబిల్ రేడియేషనే అక్కడికి వెళ్లలేదు ఇక ఫుకుషిమా నుండి ఎలా వెళ్తుంది అని కొట్టిపారేశారు. ఆధారాలు నిజమేనని అంగీకరిస్తే సవాలును వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది గనక వాటిని కొట్టిపారేయడానికే ఆయన రంధి అంతా.
నిజానికి చెర్నోబిల్ (ఉక్రెయిన్, పాత యు.ఎస్.ఎస్.ఆర్) అణు ప్రమాదం నుండి కూడా రేడియేషన్ లిధువేనియా కి వ్యాపించింది. ఇంకా చెప్పాలంటే లిధువేనియాకి వచ్చిన ఫుకుషిమా రేడియేషన్ కంటే చెర్నోబిల్ రేడియేషన్ నాలుగు రేట్లు అధికమని అమెరికాలోని ‘పబ్ మెడ్’ అనే సైంటిఫిక్ డేటా బేస్ సంస్ధ ప్రచురించిన పరిశోధనా నివేదిక వెల్లడి చేసింది. ఆ నివేదికలోని భాగాన్ని నా బ్లాగ్ లోనే ప్రచురించాను. లిధువేనియాతో పాటు, ఇటలీ, గ్రీసులకు కూడా రేడియేషన్ వ్యాపించిందని తెలియజేసే శాస్త్రీయ నివేదికలను అందులో ప్రస్తావించాను. ఆ ఆర్టికల్ ని కింద లింక్ లో చూడవచ్చు.
లిధుయేనియా, గ్రీసు, ఇటలీ లలో ఫుకుషిమా రేడియేషన్
ఇదే కాక మరికొన్ని శాస్త్రీయ ఆధారాలని నేను బ్లాగ్ లో ప్రచురించాను.
కాలిఫోర్నియా సముద్ర తీరంలో విస్తృతంగా వ్యాపించి ఉండే ‘కెల్ప్’ అనే ఫంగై మొక్కల్లో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్నామని ‘కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ’ తన నివేదికలో తెలిపింది. సదరు నివేదిక గురించి నేను రాసిన ఆర్టికల్ ని కింద చూడవచ్చు. దానితో పాటు కాలిఫోర్నియా సముద్ర తీరంలో పట్టిన ‘బ్లూఫినా’ చేపల్లో కూడా రేడియేషన్ కనుగొన్నట్లు ‘స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ’ ప్రొఫెసర్ల పరిశోధన ద్వారా తెలిసింది. ఆ విషయంపై నేను రాసిన ఆర్టికల్ ను కూడా కింద లింక్ లో చూడవచ్చు.
కాలిఫోర్నియా సముద్ర మొక్కల్లో ఫుకుషిమా రేడియేషన్
కాలిఫోర్నియా చేపల్లో ఫుకుషిమా రేడియేషన్
ఇవన్నీ అచంగ గారు కోరిన శాస్త్రబద్ధ ఆధారాలే. నేనిచ్చిన ఆధారాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటివరకూ శాస్త్రీయంగా నిరూపించబడలేదని ఢంకా బజాయించిన అచంగ గారు ఈ ఆధారాలపై ఎందుకో ఇంతవరకూ మాట్లాడలేదు. పోనీ పనుల్లో బిజీగా ఉన్నారనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే పై ఆర్టికల్స్ రాశాక కూడా ఆయన నాబ్లాగ్ లోకి వచ్చారు. మే 23 న ఆయనని ఉద్దేశిస్తూ రాసిన వ్యాఖ్యకి జూన్ 14 న సమాధానం ఇచ్చారు. (పై ఆర్టికల్స్ అన్నీ ఆ తేదీకు ముందు రాసినవే.) ఆ సమాధానంలో మరోసారి నేనిచ్చిన ఆధారాలని ‘గాలివార్తలనీ, పుకార్లనీ’ ముద్రవేశారు. బ్లాగర్లను, పాఠకులనూ తప్పుదారి పట్టిస్తూ తాను రాసిన అపసవ్య రాతలనూ, వ్యక్తిగత విద్వేషాన్నీ, ఎగతాళినీ “శాస్త్రీయత ముసుగు వేసుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగట్టడంగా” డబ్బా కొట్టుకున్నారు. ఆయన బజాయించిన ఢంకా ‘ఓటి’దని అర్ధం అయినా బింకాన్ని ప్రదర్శించారు.
కానీ అచంగ గారు ‘ఒట్టి’ అచంగ కాదు. ఆయన ‘ఎకాలజిస్టు’ అచంగ. శాస్త్రాలు చదివిన ఎకాలజిస్టులు వాస్తవాలు చెప్పడానికి బాధ్యత తీసుకోవాలి తప్ప అబద్ధాలు చెప్పడానికి కాదు. అందువల్ల ఆయన ముందుకు రావాలి. నేను చూపిన ఆధారాలు శాస్త్రబద్ధమైనవేనని అంగీకరించాలి. లేదా శాస్త్రబద్ధమైనవి ఎందుకు కాదో చెప్పాలి. అయితే, మరోసారి పాఠకులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చెయ్యరని ఆశించడంలో తప్పులేదనుకుంటాను.
ఆయన తన వ్యాఖ్యలో ఇంకా ఏమంటారంటే, “యూరోపుదాకా వెళ్ళిన అణుధార్మికత భారతదేశాన్నెందుకు వదిలేసిందో, అసలు పక్కనే ఉన్న చైనాని, కొరియానీ ఎందుకని వదిలేసిందో!” అని. ఇదెక్కడి చోద్యం? యూరోప్ దాకా వెళ్ళిన రేడియేషన్ భారత దేశం, చైనా, కొరియాలని ఎందుకు వదిలేసిందో ఈ ఎకాలజిస్టు గారు నన్ను అడగడం ఏమిటి? కారణాలేమిటో ‘ఎకాలజిస్టు’ కి తెలియకపోవడం ఏమిటీ? దీనివల్ల అచంగ గారు తనగురించి మరిన్ని వివరాలు చెప్పవలసిన అవసరం తలెత్తింది. ఎకాలజిస్టుగా ఎక్కడ పని చేస్తున్నారు? తన అనుభవం ఏమిటి? పరిశోధనలేవన్నా చేశారా? అధ్యయనాలు ఏమన్నా జరిపారా? ఎకాలజిస్టులకి అవేమీ అవసరం లేదా? ఇవన్నీ చెప్పకుండా ‘నేను వృత్తి రీత్యా ఎకాలజిస్టును’ అంటూ కేవలం డిగ్రీ, పి.జి చెప్పి ఊరుకుంటే పాఠకులకు ఏమీ అర్ధం కాదు.
అచంగ విన్యాసాలు
అచంగ గారి మరికొన్ని విన్యాసాలు చెప్పుకోవాలంటే, ఈయనకి “కమ్యూనిస్టులమనో లేదా కమ్యూనిస్టు సానుభూతిపరులమనో చెప్పుకునేవారి వాదనలు వింటూంటే పొట్టచెక్కలయ్యేలా నవ్వొస్తుంది”ట. ఈ లెక్కన ఈయన పొట్ట ఎన్నిసార్లు చెక్కలయ్యిందో మరి.
ఎందుకంటే పెట్టుబడిదారీ విధానం పైన కారల్ మార్క్స్ చేసిన విశ్లేషణను చదవకుండా వాల్ స్ట్రీట్ పండితులకి 2008 నాటి ‘ప్రపంచ ఆర్ధిక సంక్షోభం’ గురించి అంతుబట్టలేదని అమెరికా పత్రికలే రాశాయి. ‘డాక్టర్ డూమ్’ గా పేరుపడిన (ఆర్ధిక సంక్షోభాన్ని ముందే ఊహించినందుకు ఈయనకి ఆ పేరు పెట్టారు) అమెరికన్ పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త ‘నౌరియెల్ రౌబిని’ కూడా “కారల్ మార్క్స్ సరిగ్గా గ్రహించాడు. పెట్టుబడిదారీ విధానం ఒకానొక దశలో తనను తానే నాశనం చేసుకుంటుంది. మార్కెట్లు పని చేశాయనుకున్నాం. కానీ అవి పని చేయడం లేదు.” (Karl Marx got it right, at some point capitalism can destroy itself. We thought markets worked. They’re not working) అని అనక తప్పలేదు.
అంతే కాదు 2005 లో బి.బి.సి జరిపిన ఆన్ లైన్ సర్వేలో ‘మన కాలంలో గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఎవరని’ అడిగితే, 28 శాతం మంది కారల్ మార్క్స్ అనే చెప్పారు. మొదటి స్ధానం ఆయనదే. రెండో స్ధానంలో వచ్చినాయన్ని మార్క్స్ ని ఆమోధించిన వారిలో సగం మంది కూడా ఆమోదించలేదు. ‘ది గార్డియన్’ ‘ది ఇండిపెండెంట్’ లాంటి పత్రికలు కట్టగట్టుకుని ఇతరుల తరపున ప్రచారం చేసినా మార్క్స్ ప్రభావాన్ని అడ్డుకోలేకపోయాయి. అందువల్ల అచంగ గారూ సరిగా (తననుతాను పక్కదారి, తప్పుదారి పట్టించుకోకుండా) రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిణామాలను ఫాలో అవుతున్నట్లయితే కొన్ని కోట్ల సార్లు పొట్ట చెక్కలు చేసుకోవాల్సి ఉంటుంది.
మార్క్స్ భావజాలాన్ని కేవలం కమ్యూనిస్టు పార్టీలే కాదు, బూర్జువా పార్టీలు కూడా వల్లిస్తాయి. జనం కోసం ఉన్నట్లు నటించాలంటే వారికది తప్పడం లేదు. అనేక దేశాల్లో సోషలిస్టు, సోషల్ డెమొక్రాట్, గ్రీన్ ఇత్యాది టైటిళ్లతో ఉన్న పార్టీలన్నీ ఏదో రూపంలో మార్క్స్ భావజాలాన్ని వల్లిస్తాయి. అప్పులిచ్చి షరతులతో పెట్టుబడిదారీ కంపెనీలకి ప్రపంచ దేశాలను తాకట్టు పెట్టించే ఐ.ఎం.ఎఫ్ కి ఎం.డి గా చేసిన స్ట్రాస్ కాన్ కూడా తాను ‘సోషలిస్టు’ నని చెప్పుకుంటాడు. అమెరికా నిధులతో ఈజిప్టు విప్లవంలో జనాన్ని ఆర్గనైజ్ చేసిన ‘ఏప్రిల్ 4 మూవ్ మెంట్’ ని పత్రికలన్నీ లెఫ్టిస్ట్ సంస్ధగా చెబుతాయి. గ్రీసు ప్రజల ఆదాయాలని వాల్ స్ట్రీట్ బ్యాంకులకు అమ్మేసిన జార్జి పపాండ్రూ సోషలిస్టే మరి. ఈ రకంగా పెట్టుబడిదారీ పార్టీలు కూడా కమ్యూనిస్టు భావజాలం లేకుండా గడపలేవని అర్ధం కావడం లేదా? మార్క్సిజానికి ఉన్న సార్వజనీనతే దానికి కారణం. అది తెలుసుకోకుండా ‘పొట్ట చెక్కలు చేసుకుంటే’ దానికిక అంతూపోంతూ ఉండదు.
అచంగ గారు ప్రదర్శించిన విన్యాసాల్లో ఒకటి ‘కొట్టిపారేయడం’. తన వాదనకి, నమ్మకానికి వ్యతిరేకంగా ఉన్న ఏదైనా కొట్టిపారేయడమే ఈయన లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే ENENEWS వెబ్ సైట్ ‘తాడూ బొంగరం లేదంటూ’ ఎకసక్కెం చేశేసారు. దానికాయన చూపిన కారణం వెబ్ సైట్ నిర్వాహకులు చెప్పుకున్న ఈ వాక్యం. “I’m not a lawyer trying to sue, nor am I affiliated with anyone involved with nuclear power.” వెబ్ సైట్ నిర్వహిస్తున్న వ్యక్తి ‘About’ పేజీలో రాసిన వాక్యం ఇది. దీనికంటే ముందు ఒక వాక్యం ఉంది. అది “Enenews.com is dedicated to providing the latest information pertaining to the Fukushima nuclear crisis.” మొదటి వాక్యాన్ని వదిలేసిన అచంగ తన ఎకసక్కేనికి అనుకూలంగా ఉన్న రెండో వాక్యాన్ని ఎత్తిరాశారు. అంటే ఫుకుషిమా ప్రమాదం గురించి వివరిస్తున్న ఒక వెబ్ సైట్ గురించి కూడా తప్పుదారి పట్టించడం అన్నమాట.
ENENEWS నిర్వాహకులు ఇంకా ఇలా చెప్పుకున్నారు. “I’m someone who thought the coverage of Fukushima and its consequences was not being given the attention it deserved, so I started a website with my own time, money, and effort.” చెప్పిన విధంగానే వెబ్ సైట్ నిర్వాహకుడు అద్భుతమైన కృషి సాగిస్తున్నాడు. ఆయన చేస్తున్న పనంతా ఫుకుషిమా ప్రమాదం గురించి వివిధ వార్తా సంస్ధలు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, యూనివర్సిటీలు, ఎకాలజిస్టులు వెల్లడిస్తున్న వివరాలను ఒక చోటికి చేర్చడం. ఫుకుషిమా ప్రమాదం గురించి వివిధ కోణాల్లోని వివరాలు ఎవరికైనా కావాలంటే ఈ వెబ్ సైట్ సందర్శిస్తే చాలా సమాచారం దొరుకుంది. నేను ప్రస్తావించిన శాస్త్రీయ పరిశోధనలు, నివేదికలు ఈ వెబ్ సైట్ ద్వారానే నాకు లభించాయి. అలాంటి వెబ్ సైట్ ని నెట్ వర్క్ లేదని, రీచ్ లేదంటూ కొట్టిపారేయడం తగునా? శాస్త్రీయ ఆధారాల పేరుతో పాఠకులను పక్కదారి పట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న అచంగ గారికి తగుతుందేమో తెలియదు.
అచంగ గారు ప్రజాస్వామ్యం గురించి కూడా బోధించారు. “జపానులో ప్రజాస్వామ్యం ఉండబట్టే ఇలాంటి రాతలు ఎంచక్కా రాసుకోగలుగుతున్నారని మర్చిపోవద్దు!” అని. అచంగ గారు తెలుసుకోవలసింది విషయం ఏమిటంటే స్వతంత్ర పరిశోధకులు ఎన్ని రాసినా, ప్రజలు ఎంతగా ఆందోళన చేసినా అవేవీ జపాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి కావలసింది కంపెనీల ప్రజాస్వామ్యం (కంపెనీ స్వామ్యం) తప్ప ప్రజల ప్రజాస్వామ్యం కాదు. ఫుకుషిమా ప్రమాదం గురించి టేప్కో కంపెనీ గానీ, జపాన్ ప్రభుత్వం గానీ ప్రజలకు నిజాలు చెప్పకుండా దాచి పెట్టాయని గత సంవత్సరంలో ‘ది ఇండిపెండెంట్’ పత్రిక సంచలానాత్మక కధనాన్ని ప్రచురించింది. ఆ విషయాలు వివరంగా ఒక ఆర్టికల్ లో రాశాను కూడా. రెండు భాగాలుగా రాసిన ఆర్టికల్ ని ఇక్కడ, ఇక్కడచూడవచ్చు. గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే బ్రిటన్ ప్రభుత్వం కూడా ‘ఫుకుషిమా ప్రమాదం’ గురించి వాస్తవాలు కప్పి పుచ్చడానికి ఎందుకు ప్రయత్నించింది? ‘న్యూక్లియర్ ఇండస్ట్రీ అసోసియేషన్’ తో కలిసి బ్రిటన్ ప్రభుత్వం చేసిన కుట్రలను ది గార్డియన్ వార్తా సంస్ధ వెల్లడి చేసిన విషయం కూడా నా బ్లాగ్ లో చూడవచ్చు. దీని ప్రకారం భూకంపం వచ్చాక సునామీ రాక మునుపే రియాక్టర్లలో ‘మెల్ట్ డౌన్’ మొదలయింది. ఆ సంగతి తెలిస్తే ఇతర అణు కర్మాగారాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కంపెనీతో పాటు జపాన్ ప్రభుత్వం కూడా దాచిపెట్టింది. మరి జపాన్ ప్రజా స్వామ్యం అంత గొప్పదయితే ప్రజలకు ఈ అబద్ధాలు చెప్పడం ఎందుకు? రియాక్టర్ల వద్దకు జర్నలిస్టులను, పరిశోధకులను, బయటి శాస్త్రవేత్తలను రాకుండా ప్రభుత్వం, కంపెనీ ఎందుకు అడ్డుకుంటున్నాయి? అయిదేళ్ళకో, నాలుగేళ్ళకో ఎన్నికల్లో ప్రజల చేత ఓట్లు వేయించుకుని అధికారంలో ఉన్నన్నాళ్లూ కంపెనీల కోసం పని చేస్తే అది ప్రజాస్వామ్యం అయిపోతుందా?
అచంగ గారు తన ఆర్టికల్ లో చేసిన మరో విన్యాసం ‘రేడియేషన్ ఎంతయితే ప్రమాదం’ అంటూ లెక్కలు ఇవ్వడం. చర్చ జరుగుతున్నది ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ లకి వచ్చిందా లేదా అనయితే ఈ లెక్కలు ఇవ్వడం ఏమిటి? అలాంటి లెక్కలు ఇవ్వదలిస్తే వేరే సందర్భం చూసుకోవచ్చు. అడగని సమాచారం ఇవ్వడం ద్వారా అసలు చర్చాంశాన్ని పక్కకు మళ్లించడం ఈయన లక్ష్యం గనకనే లెక్కల్లోకి దిగారు. అంతేకాకుండా రేడియేషన్ తక్కువయితే ప్రమాదం లేదని కూడా ఆయన చెబుతున్నారు. నిజానికి రేడియేషన్ మనిషికి ఎంత సోకినా ప్రమాదమే. కాకపోతే డోసు ను బట్టి ప్రమాద తీవ్రత మారుతుంది. అమెరికాకి చెందిన ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ నుండి ‘ఫిజిషియన్స్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ (పి.ఎస్.ఆర్) వారు ఉటంకింకించిన ఈ వాక్యం చూడండి. “According to the National Academy of Sciences, there are no safe doses of radiation. Decades of research show clearly that any dose of radiation increases an individual’s risk for the development of cancer.”
అంతే కాదు. శరీరం బయట ఉన్నపుడు రేడియో ధార్మిక పదార్ధం తక్కువగా ఉన్నా శరీరంలోకి వెళ్ళాక దాని వల్ల ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. పి.ఎస్.ఆర్ వాళ్ళు చెప్పిన ఈ సంగతి చూడండి.
“Consuming food containing radionuclides is particularly dangerous. If an individual ingests or inhales a radioactive particle, it continues to irradiate the body as long as it remains radioactive and stays in the body,”said Alan H. Lockwood, MD, a member of the Board of Physicians for Social Responsibility.”
రేడియో ధార్మిక పదార్ధం ఉన్న ఆహారం తింటే అది లోపలికి వెళ్ళాక అంతర్గత శరీర భాగాలకి అతి దగ్గరగా ఉంటుంది గనక ప్రమాద తీవ్రత అనేక రెట్లు పెరుగుతుందని పి.ఎస్.ఆర్ శాస్త్రవేత్తలు చెప్పారు. (ఈ విషయాలపై కూడా నేను ఆర్టికల్ రాశాను. అది ఇక్కడ చూడవచ్చు.) ఈ విషయాలన్నీ మన ఎకాలజిస్టు గారు వదిలేసి ‘చెర్నోబిల్ ప్రమాదం కంటే ఫుకుషిమా నుండి రేడియేషన్ తక్కువే విడుదలయింది. కనుక ప్రమాదం లేదు. అసలు మనిషి శరీరంలోనే రేడియేషన్ ఉంటుంది.’ అంటూ Voodoo సైన్స్ ప్రబోధించారు.
ఇన్ని అవాస్తవాలతో ఎకాలజిస్టు అచంగ గారు పాఠకులను తప్పుదారి పట్టించడానికి ఎందుకు పూనుకున్నట్లు? ఆ సంగతి ఆయన ఆర్టికల్ టైటిల్ చెబుతుంది. కమ్యూనిస్టులమనో, కమ్యూనిస్టు అభిమానులమనో చెప్పుకునే వారిపైన ఈయనకి తగని ద్వేషం. కమ్యూనిజం తప్పని భావిస్తే ఆ సంగతి భేషుగ్గా చెప్పొచ్చు. కాకపోతే ఎందుకు తప్పో చెప్పాలి. ‘కమ్యూనిజం’ శాస్త్రీయ సిద్ధాంతం గనుక అది ఆయనకి ఎలాగూ సాధ్యం కాదు. కాబట్టి తన ఎకాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎగతాళి చెయ్యొచ్చనీ, కించపరచొచ్చనీ నమ్మారు. పోనీ ఎకాలజీ పరిజ్ఞానాన్నయినా తిన్నగా చెప్పారా అంటే అదీ లేదు. తన అసంబద్ధ వాదనకు అనుకూలంగా ఉన్న ఒకటో రెండో వాక్యాల్ని ఎత్తిరాస్తే పనయిపోతుందని భావించారు. కానీ ఆయన లెక్క తప్పింది.
ఎంత గొప్ప చదువు చదివిన వారైనా సామాజిక విషయాలలొ ఎమీ తెలియనివారిగా వుండి పొతున్నారు. ఇది నా వ్యక్తి గత అనుభవం ద్వారా చెపుతున్నాను. అసలు అలాంటి విషయాల పైన ఆసక్తి కుడా వుండదు. నా కన్నా చదువులొచాలాఎక్కువ అమెరికా కు కుడా వెళ్ళెరు . కాని సమాజిక విషయాలలొ నిల్ మా ఇంటిలొ కుడా వున్నారు చదువుల పరంగా భాగానే . కాపిటల్ లాంటి పుస్తకాలు ఎప్పుడూ కళ్ళ ముండే వుంటాయి. కాని వాటిని ముట్టుకున్న పాపాన పొలేదు. కేవలం మార్కుల కొసం బట్టీ పట్టి చదువుతున్నారు. కాపిటల్ చదివితే మార్కులు ఇస్తామంటే ఈ పాటికి వంద సార్లు చదివేవాళ్ళు అచంగ గారి లాటి వారు లెక్కకు మించి వున్నారు.
Heresy has nothing to do with evidences. So, ignore him.
Well, You will get the response very soon….
Here you go Mr Visekhar…..
http://tinyurl.com/btv3yus
విశేఖర్ గారు, వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు నేను ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు ప్రచురించిన ఒక పత్రిక చదివాను. ఆ పత్రికలో ఒక మాజీ పోలీస్ అధికారి చేత కమ్యూనిజంకి వ్యతిరేకంగా ఒక వ్యాసం వ్రాయించారు. అది ఆవు వ్యాసం లాంటిదే అనుకోండి. ఆ మాజీ పోలీస్ అధికారి కాలేజ్‌లో చదివే రోజుల్లో కమ్యూనిస్ట్ అట, కమ్యూనిస్ట్‌లు అతని మతాన్ని విమర్శించడం వల్ల క్యాపిటలిస్ట్‌గా మారిపోయాడట! యూరోప్‌లో కమ్యూనిజంని వ్యతిరేకించే వర్గం వాళ్ళందరూ తాము ప్రైవేట్ ఆస్తి కోసమే కమ్యూనిజంని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటోంటే ఇండియాలో కమ్యూనిజంని వ్యతిరేకించే వర్గంవాళ్ళు ఇంకా మతం పేరు చెప్పుకునే స్థితిలో ఉన్నారు. మతం లాంటి ఊహాజనిత నమ్మకాల కోసం ఎవరూ రాజకీయ అభిప్రాయాలు మార్చుకోరు. రష్యాలో విప్లవం రాకముందు తజికిస్తాన్‌లో అనేక మంది ముస్లింలు కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన చరిత్ర అతనికి తెలిసినట్టు లేదు. హిందువులలో చాలా మంది మత గ్రంథాలు చదవరు కానీ ముస్లింలు ఖురాన్ తప్పకుండా చదువుతారు. అయినా తజికిస్తాన్ ముస్లింలు మతం కంటే వర్గ పోరాటమే ముఖ్యమని ఎందుకు అనుకున్నారు? ———- భూలోక భీమన్నల అరిగిపోయిన రికార్డ్‌లకి సమాధానాలు చెపితే ఏమీ రాదు.
ప్రవీణ్, మీరు రాసిన రెండు వ్యాఖ్యలను ప్రచురించడం లేదు. అన్యధా భావించవలదు. మీరు చెప్పిన లాంటివారి ప్రసక్తి ఇక్కడ అనవసరం కనుక ప్రచురించలేదు.