ఆయిల్ రాజకీయాల ఫలితం, ముంబై దాడుల అనుమానితుడి అరెస్టు


LEOPOLD, Mumbai terror strikes first here26/11 ముంబై టెర్రరిస్టు దాడులకు బాధ్యులుగా భావిస్తున్నవారిలో ముఖ్యమైన అనుమానితుడు జబీయుద్దీన్ అన్సారీ ని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. అన్సారీ మహారాష్ట్ర వాసి అయినప్పటికీ టెర్రరిస్టు దాడులు జరుగుతుండగా పాకిస్ధాన్ లో ఉన్న కంట్రోల్ రూమ్ నుండి ఆదేశాలిచ్చిన వారిలో ఉన్నాడని భారత ప్రభుత్వం భావిస్తోంది. సౌదీ అరేబియా నుండి విమానంలో దిగిన అన్సారీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సౌదీ అరేబియాతో నెలల తరబడి సాగించిన దౌత్యం ఫలితంగా అన్సారీ అరెస్టు సాధ్యం అయిందని ‘ది హిందూ’ తెలిపింది. అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ నుండి చౌక ఆయిల్ దిగుమతులను తగ్గించుకుని, సౌదీ అరేబియా నుండి ఖరీదైన ఆయిల్ ను దిగుమతులకు ఇండియా అంగీకరించిన ఫలితంగానే అన్సారీ భారత్ చేతికి చిక్కాడని ‘ది హిందూ’ కధనం ద్వారా తెలుస్తోంది.

కరాచీలో లష్కర్-ఎ-తోయిబా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి ముంబైలో దాడులు నిర్వహించిన పాకిస్ధానీ టెర్రరిస్టులకు ఆదేశాలు అందిన సంగతి తెలిసిందే. కంట్రోల్ రూం నుండి టెర్రరిస్టులతో జరిగిన సంభాషణలు కొన్నింటిని భారత భద్రతా సంస్ధలు రికార్డు చేశాయి. రికార్డు చేసిన సంభాషణలను ‘ది హిందూ’ పత్రిక తన వెబ్ సైట్ లో ప్రచురింధింది. సంభాషణల టేపును ఆ పత్రిక ఫిబ్రవరి 2010 లో సంపాదించింది. ఆ టేపును కూడా పత్రిక ప్రచురించింది. దానిని ఇక్కడ చూడ(విన)వచ్చు. అన్సారీ మాటలు ముంబై యాసతో ఉన్నాయని పత్రిక తెలిపింది.

బందీలను చంపేయ్యమని చెప్పడం, కనపడిన ప్రతి ఒక్కరినీ చంపేయ్యమని ఆదేశాలివ్వడం, తాము హైద్రాబాద్ తోలి చౌక్ నుండి వచ్చామని పత్రికలకు చెప్పాలని ఆదేశం ఇవ్వడం (ఇది చెప్పింది అన్సారీ యే), తాము ఎంతమందిమి ఉన్నామో పత్రికలకు చెప్పవద్దని సలహా ఇవ్వడం ఇవన్నీ టేప్ లో రికార్డయి ఉన్నాయి. సంభాషణలను ‘ది హిందూ’ ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించింది. అయితే ప్రచురించిన సంభాషణ మొత్తం టేపు లో ఉన్నట్లు లేదు. ఈ సంభాషణలను పత్రిక ఫిబ్రవరి 2010 లో ప్రచురించింది. టేపు ను అందుబాటులో ఉంచడం ఇదే మొదటిదారి.

ఈ సంవత్సరం ఆరంభంలో అన్సారీ ని సౌదీ అరేబియా అదుపులోకి తీసుకుంది. రియాసత్ ఆలీ పేరుతో పాకిస్ధాన్ పాస్ పోర్టు తో ఆయన సౌదీ వెళ్ళాడు. అన్సారీ ని తమకు అప్పగించాలని భారత్ జులై 2011 లో పాకిస్ధాన్ ను కోరింది. భారత్ అప్పగించాలని కోరిన 50 మందిలో అన్సారీ ఒకరు. ప్రమాదం ఊహించి అన్సారీ సౌదీ వెళ్ళినట్లు కనిపిస్తోంది. అన్సారీయే వెళ్లాడా లేక పంపబడ్డాడా అన్నది అనుమానాస్పదం. సౌదీ అరేబియాతో నెలల తరబడి ఓపికతో సాగించిన దౌత్యం ఫలితంగా అన్సారీ అరెస్టు సాధ్యమయిందని అత్యున్నత అధికారులను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. ఈ కాలంలో భారత ‘ఇంటలిజెన్స్ బ్యూరో’ (ఐ.బి), సౌదీ ఇంటలిజెన్స్ సంస్ధ ‘రియాసత్ ఆల్-ఇస్తిఖ్ బరాత్ ఆల్-అమాహ్’ లు పరస్పరం సహకరించుకున్నాయని అన్సారీ సౌదీలో సాగించిన ఫోన్ సంభాషణల ద్వారా అతనిని గుర్తించారనీ అధికారులు తెలిపారు.

అన్సారీ వాయిస్ పై ఎన్.ఐ.ఎ (నేషనల్ ఇంటలిజెన్స్ ఏజన్సీ) అధికారులు మరోసారి ఎలెక్ట్రానిక్ పరీక్షలు జరుపుతారని తెలుస్తోంది. తద్వారా టేప్ లో ఉన్న వాయిస్ తో అన్సారీ వాయిస్ ని సరిపోల్చి కంట్రోల్ రూం లో ఉన్నది ఆయనో కాదో తేల్చనున్నారు. అన్సారీ అరెస్టుతో భారత భద్రతాధికారులు మొదటిసారిగా ముంబై దాడులకు సంబంధించి ‘ఫస్ట్ హేండ్’ సమాచారాన్ని పొందనున్నారు. ఇన్నాళ్లూ అమెరికాకి ‘డేవిడ్ హేడ్లీ’ ఇచ్చిన సాక్ష్యం పైనే ఇండియా ఆధారపడి పరిశోధన జరిపింది. టెర్రరిస్టు దాడులకు ముందు హేడ్లీ అనేకసార్లు ఇండియా పర్యటించి దాడులకు అవసరమైన ఏర్పాట్లు చేశాడు. ముంబైలో వివిధ ప్రదేశాల సమాచారాన్ని ఫోటోల తో సహా హేడ్లీ టెర్రరిస్టులకు సమకూర్చాడు. అయితే హేడ్లీ స్వయంగా దాడుల్లో పాల్గొనలేదు గనక అతనిచ్చిన సమాచారం ‘ఫస్ట్ హేండ్’ కాదు.

హేడ్లీ సమకూర్చిన గూఢచార సమాచారం ఆధారంగా పది మంది టెర్రరిస్టుల బృందం తమ టార్గెట్ ఏరియాలను సునాయాసంగా చేరుకోగలిగారు. కంట్రోల్ రూం నుండి ఆదేశాలిచ్చినవారిలో సాజీద్ మిర్ ఒకరని హేడ్లీ తెలిపాడు. ఎల్.ఇ.టి  ట్రాన్స్ నేషనల్ మిలట్రీ ఆపరేషన్స్ కు సాజీద్ కంట్రోలర్ అని హేడ్లీ తెలిపాడు. ఆ విధంగా ముంబై దాడులకు ముందస్తు ఏర్పాట్లు చేసిన హెడ్లీ, వాస్తవానికి సి.ఐ.ఎ ఇన్ఫార్మర్. సి.ఐ.ఎ కోసం పని చేసిన హేడ్లీ అనంతరం ఐ.ఎస్.ఐ కోసం పని చేసి ఎల్.ఇ.టి టెర్రరిస్టు సంస్ధకు గూఢచార సమాచారం సేకరించాడు. సి.ఐ.ఎ, ఐ.ఎస్.ఐ ల బంధం దీని ద్వారా స్పష్టమవుతోంది. హేడ్లీ ని ఇండియాకి అప్పగించడానికి, కనీసం పూర్తి స్ధాయిలో విచారించడానికి సైతం అమెరికా నిరాకరించడం వెనుక కారణాలు కూడా దీని ద్వారా స్పష్టమవుతున్నాయి.

అన్సారీ అరెస్టు వెనుక పరిశీలించవలసిన ముఖ్యమైన కోణం అమెరికా ఆయిల్ రాజకీయాలు. అమెరికా ఆయిల్ రాజకీయాలంటే మధ్య ప్రాచ్యం (Middle East) లో ఆయిల్ వనరులపై పూర్తి నియంత్రణ కోసం అమెరికా సాగిస్తున్న మారణహోమమే. మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా తో సహా అరబ్ దేశాలన్నీ అమెరికాకి సాగిలపడగా ఇరాక్, ఇరాన్, సిరియాలు మాత్రం అమెరికా అధిపత్యాన్ని తీవ్ర స్ధాయిలో ప్రతిఘటించాయి. ఫలితంగా సౌదీ అరేబియా తర్వాత అపార ఆయిల్ నిల్వలున్న ఇరాన్ లోని నాణ్యమైన ఆయిల్ అమెరికాకి దూరమైపోయింది. సెక్యులర్ బాత్ పార్టీ ఆధ్వర్యంలో ఇరాక్ లో సద్దాం హుస్సేన్, సిరియాలో బషర్ అస్సాద్ లు తమ దేశాల ఆయిల్ నిల్వలను తమ ప్రజలకోసమే వినియోగపెట్టారు. తద్వారా తమ ప్రజల జీవన స్ధాయిని అరబ్ దేశాల్లోనే అత్యున్నత స్ధాయిలో నిలిపారు. కానీ అమెరికా కంపెనీల ప్రయోజనాలను తిరస్కరించిణందుకు వారిపై అమెరికా కత్తి కట్టింది. ఇరాక్ ను దశాబ్దం పాటు వేధించి సద్దాం ను చంపింది. ఇప్పుడు సిరియా అధ్యక్షుడు బాషర్ ను చంపడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అనంతరం అమెరికా టార్గెట్ ఇరానే.

ఈ నేపధ్యంలో ఇరాన్ ను ఒంటరి చేయడానికి అమెరికా, యూరప్ లు ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆర్ధికంగా, వాణిజ్యపరంగా ఏకాకిని చేయడానికి తమ చేతుల్లో ఉన్న ఐక్యరాజ్య సమితి చేత ఆంక్షలు విధింపజేశాయి. అంతటితో సంతృప్తి పడక తాము స్వయంగా అక్రమ ఆంక్షలు విధించాయి. అక్రమ ఆంక్షలను అమలు చేయించడానికి అమెరికా ఇండియాపై కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చింది. అందుకోసమే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇండియా పర్యటించి వెళ్లింది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గింపజేయడానికే తాను వచ్చానని కూడా ఆమె నిస్సిగ్గుగా ప్రకటించింది.

ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవడం అంటే సౌదీ అరేబియా నుండి ఆయిల్ దిగుమతులు పెంచుకోవడమే. భారత ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ప్రధానంగా ఇరాన్ ఆయిల్ ను రిఫైన్ చేయడానికి నెలకొల్పినవి. సౌదీ ఆయిల్ కోసం రిఫైనరీలపై ఇండియా అదనపు ఖర్చు చేయాల్సి ఉంటూంది. ఆ భారం మళ్ళీ ప్రజలపైనే. ఇరాన్ తో భారత్ కి ఉన్న వాణిజ్య ప్రయోజనాలను వదులుకుని సౌదీ అరేబియా ఆయిల్ దిగుమతులు పెంచుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధపడింది. ఇందుకోసం సౌదీ, ఇండియాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందడానికి అమెరికా ఈ సంవత్సరం మొదటినుండే కృషి చేసింది. సౌదీ-ఇండియా-అమెరికాల మధ్య విడతలు విడతలుగా దౌత్యపరంగా చర్చోపచర్చలు సాగాయి. ఫలితంగా ‘జబీయుద్దీన్ అన్సారీ’ అరెస్టు రంగం మీదికి వచ్చింది. అరెస్టు కోసమే అన్సారీ సౌదీ కి పంపబడ్డాడన్నా ఆశ్చర్యం లేదు. అయితే ఆ సంగతి అన్సారీ, ఎల్.ఇ.టి లకు తెలియవలసిన అవసరం లేదు.

మధ్య ప్రాచ్యంలో అమెరికా ఆధిపత్య రాజకీయాలు నెరవేరే బృహత్ప్రయోజనంలో భాగంగా ఇండియా-ఇరాన్ ల మధ్య దూరం పెరగడానికీ, ఇండియా-సౌదీ ల మధ్య దూరం తగ్గడానికి ముంబై టెర్రరిస్టుల నిందితుడు ‘జబీయుద్దీన్ అన్సారీ’ తురుపు ముక్కగా ఉపయోగపడ్డాడని అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలో విధ్వంసం సృష్టించడానికి పాక్ ఐ.ఎస్.ఐ తో సహకరించడానికి సిద్ధపడ్డ అన్సారీ లాంటి ముస్లిం యువకులు ఈ సందర్భంగా గుణపాఠం నేర్చుకోవలసి ఉంది. ముస్లిం యువకుల రాజకీయ లక్ష్యాలు ఏవైనా అవి సాధించడానికి ఆధారపడవలసింది ప్రజలపైనే తప్ప టెర్రరిజం పై కాదని వారు గ్రహించాలి. ప్రపంచంలో ఏ మూల చూసినా టెర్రరిజం ను ప్రోత్సహిస్తున్నది అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలే. ప్రభుత్వాలను కూల్చడానీకీ, పాలకులపై టెర్రరిస్టు ముద్రలు వేయడానికీ, తద్వారా రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు సాధించడానీకీ టెర్రరిస్టు సంస్ధలను అవి పెంచి పోషిస్తున్నాయి.

కనుక టెర్రరిజాన్ని ఆశ్రయించడం అంటే నేరుగా పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాలకు పావులుగా పని చేయడనైకి సిద్ధపడడమే అని వారు గ్రహించాలి. ప్రజల మద్దతు లేనట్లయితే తమ రాజకీయాలలో ఉన్న లోపాలు గుర్తించడమే మిగిలి ఉంటుంది తప్ప టెర్రరిస్టు చర్యల ద్వారా తమ రాజకీయాలను బలవంతంగా అమలు చేయబూనుకోవడం ఆత్మహత్యా సదృశమేనని అన్సారీ ఉదంతం ద్వారా గ్రహించాలి. రాజకీయ లక్ష్యాల సాధనకు ప్రజలను ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదని గ్రహించాలి.

3 thoughts on “ఆయిల్ రాజకీయాల ఫలితం, ముంబై దాడుల అనుమానితుడి అరెస్టు

  1. విశేఖర్ గారూ,

    ”ఇండియాలో విధ్వంసం సృష్టించడానికి పాక్ ఐ.ఎస్.ఐ తో సహకరించడానికి సిద్ధపడ్డ అన్సారీ లాంటి ముస్లిం యువకులు ఈ సందర్భంగా గుణపాఠం నేర్చుకోవలసి ఉంది. ముస్లిం యువకుల రాజకీయ లక్ష్యాలు ఏవైనా అవి సాధించడానికి ఆధారపడవలసింది ప్రజలపైనే తప్ప టెర్రరిజం పై కాదని వారు గ్రహించాలి. ప్రపంచంలో ఏ మూల చూసినా టెర్రరిజం ను ప్రోత్సహిస్తున్నది అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలే. ప్రభుత్వాలను కూల్చడానీకీ, పాలకులపై టెర్రరిస్టు ముద్రలు వేయడానికీ, తద్వారా రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు సాధించడానీకీ టెర్రరిస్టు సంస్ధలను అవి పెంచి పోషిస్తున్నాయి.

    కనుక టెర్రరిజాన్ని ఆశ్రయించడం అంటే నేరుగా పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాలకు పావులుగా పని చేయడనైకి సిద్ధపడడమే అని వారు గ్రహించాలి. ప్రజల మద్దతు లేనట్లయితే తమ రాజకీయాలలో ఉన్న లోపాలు గుర్తించడమే మిగిలి ఉంటుంది తప్ప టెర్రరిస్టు చర్యల ద్వారా తమ రాజకీయాలను బలవంతంగా అమలు చేయబూనుకోవడం ఆత్మహత్యా సదృశమేనని అన్సారీ ఉదంతం ద్వారా గ్రహించాలి. రాజకీయ లక్ష్యాల సాధనకు ప్రజలను ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదని గ్రహించాలి.”

    చాన్నాళ్ల తర్వాత మీనుండి అత్యంత స్పష్టమైన ప్రకటన వింటున్నాను. ఐఎస్ఐ ప్రేరేపిత, అమెరికా ప్రేరేపిత టెర్రరిజం పైకి ఎన్ని మెరుపులు కురిపించినా అంతిమంగా అది ప్రజారాసులనుండి దూరం కాక తప్పదనే విషయాన్ని సూటిగా చెబుతున్నారు మీరు. నిజంగా ముస్లి యువతకు కనువిప్పు కావాల్సిందేనని అన్సారీ ఉదంతం చాటి చెబుతోంది.

    చాలా మంచి ప్రకటన చేశారు.

    ధన్యవాదాలు.

  2. ప్రవీణ్ గారూ, క్యాచీ కామెంట్.

    పాముల్ని పట్టుకోవడానికి ఇండియా… అమెరికా సహాయం తీసుకున్నా తీసుకోకపోయినా విశేఖర్ గారు తమ కథనంలో రాసినట్లుగా ‘ముస్లి యువత తీసుకోవలసిన గుణపాఠం’ కాని, ‘టెర్రరిస్టు చర్యల ద్వారా తమ రాజకీయాలను బలవంతంగా అమలు చేయబూనుకోవడం ఆత్మహత్యా సదృశమేనని’ గ్రహించడం కాని తమ ప్రాధాన్యత కోల్పోవు కదా..!

    ఇంతింత గొప్ప పోరాటాలు, ఉద్యమాలు, సాయుధ చర్యలు అమెరికా పావుల్లాగా మారిపోవడంలోని ప్రమాదం గురించే తను హెచ్చరించారు కదా. దాన్ని గుర్తించడంలో, గ్రహించడంలో మనం విభేదించనవలసిన పనిలేదనుకుంటాను.

    పోతే మీ తక్షణ స్పందన ఏకవాక్యంలో బాగుంది. .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s