రాష్ట్రపతి ఎన్నిక: సి.పి.ఎం సిద్ధాంతకర్త ప్రసేన్ జిత్ బహిష్కరణ


prasenjit_bose_cpmసి.పి.ఎం పార్టీ రీసెర్చ్ యూనిట్ కన్వీనర్ ప్రసేన్ జిత్ బోస్ ను ఆ పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్ధిత్వానికి సి.పి.ఎం పార్టీ మద్దతు ప్రకటించడానికి నిరసనగా ప్రసేన్ జిత్ పార్టీకి రాజీనామా చేశాడు. రాజీనామా తిరస్కరిస్తూ బహిష్కరణ నిర్ణయాన్ని సి.పి.ఎం పార్టీ తీసుకుంది. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలపై రాజకీయ పోరాటం సాగించాలని ఏప్రిల్ మహాసభల్లో నిర్ణయించిన సి.పి.ఎం పార్టీ, ఇంతలోనే కుంటి సాకులతో యు.పి.ఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించడం సైద్ధాంతిక పతనమేనని ప్రసేన్ జిత్ విమర్శించాడు. తప్పులనుండి గుణ పాఠాలు తీసుకోలేకపోవడం తీవ్ర తప్పిదమని ఆయన వ్యాఖ్యానించాడు. వామ పక్ష పార్టీల ఐక్యతను త్యాగం చేసి ప్రణబ్ ముఖర్జీ కి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించాడు.

ప్రణబ్ ముఖర్జీ కి మద్దతు ఇవ్వడం అంటే ఏప్రిల్ లో జరిగిన సి.పి.ఎం పార్టీ జాతీయ మహాసభల్లో ఆమోదించిన రాజకీయ తీర్మానాన్ని ఉల్లంఘించడమేనని తన రాజీనామా సందర్భంగా ప్రసేన్ జిత్ వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్, బి.జె.పి లపై రాజకీయ పోరాటం సాగించాలని తీర్మానం కోరిందని ఆయన గుర్తు చేశాడు. సి.పి.ఎం నిర్ణయం లెఫ్ట్ ఐక్యతను దెబ్బతీసే తీవ్ర తప్పిదమనీ చెబుతూ ఆయన 2007 నుండి పార్టీ ఒక దాని తర్వాత మరొక తప్పు చేస్తూ పోతున్నదని తెలిపాడు. పశ్చిమ బెంగాల్ లో బలవంతంగా రైతుల భూములు గుంజుకోవడం, నందిగ్రామ్ పోలీసు కాల్పులు, అణు ఒప్పందం కోసం యు.పి.ఏ-1 ప్రభుత్వం అంతర్జాతీయ అణు సంస్ధను సంప్రదించడానికి అనుమతించడం ఇవన్నీ ఘోర తప్పిదాలని ప్రసేన్ జిత్ బోస్ తెలిపాడు.

“అదే నాయకత్వం మరొక ఖరీదైన తప్పుకు పాల్పడుతోంది. గతంనుండి పాఠాలు నేర్చుకోవడానికి తిరస్కరిస్తోంది” అని ప్రసేన్ జిత్ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. సి.పి.ఎం పొలిట్ బ్యూరో ప్రసేన్ రాజీనామాను తిరస్కరించింది. పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని ఆయన లేఖాంశాలు అపఖ్యాతిపాలు చేసే విధంగా ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రసేన్ జిత్ రాజీనామా చేసిన కారణాలకు బదులివ్వకుండా ఆ కారణాలనే సి.పి.ఎం పార్టీ తప్పు పట్టడం అర్ధం కానీ విషయం. మహాసభ చేసిన రాజకీయ తీర్మానానికి వ్యతిరేకంగా పార్టీ నిర్ణయం ఉన్నదన్న ప్రసేన్ జిత్ ఆరోపణకు పార్టీ బదులివ్వవలసి ఉండగా ఆ పని చేయలేదు. కేవలం రెండు నెలల క్రితం చేసిన రాజకీయ తీర్మానానికి విరుద్ధంగా వెళ్లడమే పార్టీని అప్రతిష్టపాలు చేసేదే తప్ప ప్రసేన్ జిత్ రాజీనామా లేఖ కాజాలదు.

పార్టీలో తీవ్ర చర్చ జరిగిన తర్వాత రాష్ట్రపతి పదవి కోసం ప్రణబ్ ముఖర్జీ కి మద్దతు ఇస్తున్నట్లు సి.పి.ఎం పార్టీ గురువారం ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీ కి ‘విస్తృత మద్దతు’ ఉన్నందున ఆయనకు మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ తన మద్దతుకు కారణంగా తెలిపింది. అంటే రాష్ట్రపతి పదవి లాంటి ముఖ్యమైన పదవికి ఎన్నికలు జరుగుతున్నపుడు పార్టీ రాజకీయ సిద్ధాంతాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి బదులు ఒక వ్యక్తికి వస్తున్న ‘విస్తృత మద్దతు’ ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చన్నమాట. అనేక సంవత్సరాల పాటు ఆర్ధికమంత్రిగా పని చేసి ప్రజల వనరులను కంపెనీలకు దోచిపెట్టడంలో ముఖ్యపాత్ర పోషించిన ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వడంలో ప్రజల ప్రయోజనాలను సి.పి.ఎం పార్టీ పరిగణించదన్నమాట.

దేశంలో బూర్జువా పార్టీలన్నీ తమ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అభ్యర్ధి వెనుక వరుస కడుతున్న విషయాన్ని గుర్తించకుండా కేవలం వారి వరుసలను మాత్రమే సి.పి.ఎం పరిగణిస్తుందన్నమాట. దానికి బదులుగా ప్రణబ్ ముఖర్జీకి ఇస్తున్న మద్దతు ప్రజలకు ఏమాత్రం ప్రయోజనకరమో సి.పి.ఎం పార్టీ చెప్పినట్లయితే అది తాను అనుసరిస్తున్నానని చెబుతున్న మార్క్సిస్టు సిద్ధాంతాలకు కనీస గౌరవం ఇచ్చినట్లయినా ఉండేది. ఆ మాత్రం గౌరవం కూడా మార్క్సిస్టు సిద్ధాంతానికి సి.పి.ఎం పార్టీ ఇవ్వకపోవడం తీవ్ర అభ్యంతరకరం. టాటా, సలీం లాంటి స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీల కోసం రైతుల బతుకులను బలిపెట్టిన సి.పి.ఎం పార్టీ మార్క్సిస్టు సిద్ధాంతం పై గౌరవం ఉంటుందనుకోవడం భ్రమే కావచ్చు.

కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలలో గణనీయ పాత్ర పోషించిన ప్రణబ్ ముఖర్జీకి ఓ వైపు మద్దతు ప్రకటిస్తూ కూడా మరో పక్క ‘యు.పి.ఏ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం, దాని నయా ఉదారవాద విధానాలపై పోరాడడం  కొనసాగిస్తామనీ’ సి.పి.ఎం పార్టీ ప్రకటించడం విడ్డూరం. ఈ లెక్కన యు.పి.ఏ నయా ఉదారవాద విధానాలకూ ఆ విధానాలను అమలు చేసిన ప్రణబ్ ముఖర్జీ లాంటి బూర్జువా ప్రతినిధులకూ సంబంధాన్ని చూడడానికి సి.పి.ఎం పార్టీ తిరస్కరిస్తోంది. ప్రణబ్ లాంటి దళారీ బూర్జువాల ప్రతినిధులు అనేక ఏళ్లపాటు మంత్రి పదవులు వెలగబెడుతూ అమలు చేయకపోతే నయా ఉదారవాద ఆర్ధిక విధానాలు ఎలా అమలయ్యేవో సి.పి.ఎం చెప్పాల్సి ఉంది.

రాష్ట్రపతి ఎన్నికలలో సి.పి.ఎం విధానం ఫలితంగా లెఫ్ట్ ఫ్రంట్ నిలువునా చీలిపోయింది. ఇప్పటికే అంటీ ముట్టనట్లు ఉంటున్న సి.పి.ఐ, సి.పి.ఎం లు రాష్ట్రపతి ఎన్నిక పుణ్యమాని మరింత దూరం జరిగాయి. సి.పి.ఎం, ఫార్వర్డ్ బ్లాక్ లు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వగా, సి.పి.ఐ, ఆర్.ఎస్.పి లు రాష్ట్రపతి ఎన్నికనుండి దూరంగా ఉండాలని నిణయించాయి. సి.పి.ఐ, ఆర్.ఎస్.పి ల నిర్ణయాన్ని ప్రసేన్ జిత్ సమర్ధించాడు. యు.పి.ఏ, ఎన్.డి.ఏ లతో పోలిస్తే లెఫ్ట్ పార్టీల బలం తక్కువ అని, సొంత అభ్యర్ధిని నిలబెట్టలేమని సి.పి.ఎం భావిస్తే  ఎన్నికలకు దూరంగా ఉండడమే సహజ నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించాడు. “సి.పి.ఐ, ఆర్.ఎస్.పి లు ఆ నిర్ణయమే తీసుకున్నాయి. అది సకారణం, పారదర్శకం, సూత్రబద్ధమైనది కూడా” అని ప్రసేన్ జిత్ అన్నాడు.

“లెఫ్ట్ ఐక్యతకు భంగం కలిగిస్తూ కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వవలసిన అత్యవసరం ఏమిటి? పార్టీ మహాసభ జరిగిన మూడు నెలలలోపే పార్టీ నాయకత్వం పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని అంత నగ్నంగా ఉల్లంఘించడం నిజంగా దిగ్భ్రమ కలిగిస్తోంది. ఏప్రిల్ నుండి ఇప్పటివరకూ రాజకీయ పరిస్ధితులలో మార్పులేవన్నా వచ్చాయా, వస్తే ఏమిటా మార్పులు? అన్న వివరణ కూడా లేదు” అని ప్రసేన్ జిత్ అన్నాడని ‘ది హిందూ’ తెలిపింది.

పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ అభ్యర్దిత్వాన్ని తిరస్కరించడం, బెంగాల్ పార్టీ యూనిట్ నుండి తీవ్ర ఒత్తిడులు రావడం… ఈ కారణాల వల్లనే సి.పి.ఎం పార్టీ నిర్ణయానికి కారణమన్న సూచనలున్నాయని ‘ది హిందూ’ తెలిపింది. సి.పి.ఎం పార్టీ రాజకీయ నిర్ణయాన్ని ఒక బూర్జువా పార్టీ రాజకీయ నిర్ణయం ప్రభావితం చెయ్యడం దారుణం. తృణమూల్ లాంటి ఆధిపత్య వర్గాల పార్టీల నిర్ణయాల వెనుక బూర్జువా వర్గంలోని వివిధ సెక్షన్ల ప్రయోజనాలే ఉంటాయి తప్ప ప్రజల ప్రయోజనాలు కాదు. ప్రజా ప్రయోజనాలు పరిగణించవలసిన సి.పి.ఎం పార్టీ దానికి భిన్నంగా బూర్జువాల ప్రయోజనాలకు పెద్దపీట వేయడమే తీవ్ర అభ్యంతరకరం. యు.పి.ఏ భాగస్వామిగా కాంగ్రెస్ తో అంటకాగుతున్న తృణమూల్ పార్టీ నిర్ణయాలు ఒక కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలను ప్రభావితం చేయజాలవు. దేశ ప్రజల విస్తృత ప్రయోజనాలను పరిగణించకుండా ఒక రాష్ట్ర పార్టీ యూనిట్ కి తలొగ్గడం కూడా అభ్యంతరకరమే.

వోడాఫోన్ లాంటి బహుళజాతి కంపెనీలు భారత దేశంలో వ్యాపారం చేస్తూ లక్షల కోట్ల రూపాయల పన్నులను ఎగ్గొడుతున్నాయి. చట్టాల లొసుగులను ఉపయోగించుకుంటూ దేశ ప్రజల ఆదాయాలను గద్దల్లా తన్నుకుపోతున్నాయి. అలాంటి ఒక లొసుగును పూడ్చడానికి ప్రణబ్ ముఖర్జీ సిద్ధపడ్డాడు. వోడా ఫోన్ ఎగవేసిన లక్ష కోట్ల రూపాయల పన్నును ముక్కుపిండి వసూలు చేయడానికి ప్రణబ్ ముఖర్జీ చట్ట సవరణకి సిద్ధపడ్డాడు. వోడా ఫోన్ కంపెనీ తరపున బ్రిటన్, నార్వే దేశాలు తీవ్ర ఒత్తిడి తెచ్చినప్పటికీ ప్రణబ్ ముఖర్జీ లొంగలేదని పత్రికలు రాశాయి. దానితో ప్రణబ్ ముఖర్జీ చట్ట సవరణను తీసుకురాకముందే ఆర్ధిక మంత్రి పదవి నుండి తొలగించాలని బహుళజాతి కంపెనీలు, బ్రిటన్, నార్వేలు తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ఆ ఒత్తిడి ఫలితమే ప్రణబ్ ముఖర్జీ అకస్మాత్తుగా రాష్ట్రపతి పదవికి అభ్యర్ధిగా తేలాడు. ఆర్ధిక మంత్రిగా ఆయనని గెంటివేయాలంటే మరో పదవిని ఆయనకు ఎరవేయవలసి వచ్చింది.

ఈ విధంగా బహుళజాతి కంపెనీల నుండీ, సామ్రాజ్యవాద దేశాల నుండి వచ్చిన ఒత్తిడికి భారత పాలకులు తలఒగ్గి ప్రణబ్ ముఖర్జీ ని ఆర్ధిక మంత్రి పదవినుండి గెంటివేయడానికి సిద్ధపడ్డాయి. అలాంటి నిర్ణయానికి సి.పి.ఎం తగుదునమ్మా అంటూ మద్దతు ప్రకటించడం ఆ పార్టీ ప్రయోజనాలు ఎవరితో ఉన్నాయో స్పష్టం అవుతోంది. ప్రజలకు ఇస్తున్న సబ్సిడీల వల్ల ప్రభుత్వంపై ఆర్ధిక భారం పెరుగుతోందనీ, బడ్జెట్ లోటు తీవ్రంగా ఉందనీ, బడ్జెట్ లోటు వల్ల విదేశీ పెట్టుబడులు రావడం లేదనీ ప్రభుత్వ పెద్దలు సంవత్సరాలుగా ఘోష పెడుతున్నారు. బహుశజాతి కంపెనీలు లక్షల కోట్ల పన్నులు ఎగవేస్తున్నా అనుమతిస్తూ ప్రజలకు నామమాత్రంగా ఇస్తున్న కొద్ది పాటి సబ్సిడీలను రద్దు చేయడానికి పాలకులు సిద్ధపడుతున్నారు. అలాంటి పాలకవర్గ రాజకీయాల్లో సి.పి.ఎం పార్టీ తలదూర్చడమే కాక భాగస్వామిగా కూడా మారిందని రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మారోసారి రుజువయ్యింది.

22 thoughts on “రాష్ట్రపతి ఎన్నిక: సి.పి.ఎం సిద్ధాంతకర్త ప్రసేన్ జిత్ బహిష్కరణ

 1. విశేఖర్ గారూ,
  దాదాపు ఒకటన్నర నెలరోజుల పైగా విరామం తర్వాత బ్లాగుల్లోకి వస్తున్నాను. సిబిఎస్ఇ పుస్తకాల అనువాదం పనిలో కూరుకుపోవడమే కారణం.
  ఈ వార్తను ఉదయం దినపత్రికలలో చూసినప్పటినుంచి మధన పడుతూనే ఉన్నాను. ఇదేం కమ్యూనిజం. ఇదే రకం రాజకీయ కార్యాచరణ అన్నది మనసును దొలుస్తూనే ఉంది.

  “కాంగ్రెస్, బి.జె.పి పార్టీలపై రాజకీయ పోరాటం సాగించాలని ఏప్రిల్ మహాసభల్లో నిర్ణయించిన సి.పి.ఎం పార్టీ” తన నిర్ణయాన్ని తనే తుంగలో తొక్కుతూ ఆ పార్టీ పాలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రసేన్ జిత్ రాజీనామా ప్రకటించటమే ఒక షాక్ కాగా, ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి రాజీనామాను తిరస్కరించిన పార్టీ, అతడిని పార్టీ నుంచే బహిష్కరించడం మరో షాక్. పార్టీ మౌలిక నిర్ణయంతో విభేదిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడటమే సంప్రదాయంగా ఉన్న పార్టీ నిర్మాణంలో అందుకు భిన్నంగా ఆయన రాజీనామా చేయడం, దానికి ఫలితంగా బహిష్కరణకు గురవడం… ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో ఎక్కడైనా ఇలాంటి ఘటన జరిగిందేమో నాకయితే తెలీదు.

  సరిగ్గా నెలరోజుల క్రితం అనుకుంటాను. తెలుగుదేశంలో సీనియర్ నేతగా ఉన్న మైసూరారెడ్డి ఏ కారణం వల్లైనా కావచ్చు పార్టీకి రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ రాజీనామాను కూడా పక్కనబెట్టి బహిష్కరించినట్లు గుర్తు. ఇది నిజమే అయితే ఒక పాలకవర్గ పార్టీకి, ఒక కమ్యూనిస్టు పార్టీగా చెప్పుకుంటున్న పార్టీకి తన సభ్యుడి అసమ్మతిని, ధిక్కారస్వరాన్ని అంచనా వేయడంలో, తీర్పు చెప్పడంలో ఏమాత్రం తేడా లేనట్లే కనిపిస్తోంది.

  పైగా “పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని ఆయన లేఖాంశాలు అపఖ్యాతిపాలు చేసే విధంగా ఉన్నాయని” ప్రసేన్ జిత్ బహిష్కరణకు సాకులు వెతకడం కూడా సిపిఎంకే చెల్లనుకుంటాను. ఒక కమ్యూనిస్ట్ పార్టీ -?- మూడునెలల క్రితం ఆమోదించిన రాజకీయ తీర్మానానికి -కాంగ్రెస్, బిజెపి రెండింటిపై రాజకీయ పోరాటం సాగించాలనే తీర్మానానికి- భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కనీసం తన పార్టీ సభ్యుల అవగాహన కోసమైనా ముందస్తు వివరణ ప్రత్రికా ముఖంగా ఇవ్వవలిసిన బాధ్యత ఆ పార్టీకి లేదా అనేది ఒక ప్రశ్న. పరుపు, ప్రతిష్ట అనే పదాలకు అర్థం ఉందనుకుంటే, వాటికి గత కొన్నేళ్లుగా తూట్లు పొడుస్తూ కూడా -బలవంతంగా రైతుల భూములు గుంజుకోవడం, నందిగ్రామ్ పోలీసు కాల్పులు వగైరా- పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని ప్రసేన్ లేఖాంశాలు అపఖ్యాతిపాలు చేసే విధంగా ఉన్నాయని సిపియమ్మే ఆరోపించడం అంటే దొంగే దొంగ అని ఆరోపించినట్లుంది.

  దీనికి రాజకీయ కమ్యూనిజం ఆచరణ చరిత్రలోనే మూలం ఉందేమో మరి. వేళ్లతో లెక్కించగలిగినంత తక్కువ మంది సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరో, పార్టీ రాజకీయ ఆచరణ సర్వస్వాన్ని నిర్ణయించగలిగే అపరిమితాధికారాలను గుప్పిట్లో పెట్టుకోవడం మొదలయ్యాకే ఇలాంటి భ్రష్టాచారాలు కమ్యూనిస్టు పార్టీలకు తగులుకున్నాయనుకుంటాను. పార్టీని వేలెత్తి చూపితే వ్యతిరేక పంధాగా, పంథాను తప్పు పట్టినంతమాత్రానే విమర్శించినంతమాత్రానే ఎంతటి ఘనాపాటీల చరిత్ర అయినా సరే ప్రజా ద్రోహ చరిత్ర’గా మారిపోవడం 1930ల తర్వాతనే మొదలయిందనుకుంటాను. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ల కాలం నాటి కమ్యూనిస్టు ఆచరణలలో భిన్నాభిప్రాయాన్ని ఏమాత్రం సహించలేని ధోరణులను నేనయితే చదవలేదు. వినలేదు కూడా.

  జర్మనీ కార్మిక వర్గ నాయకురాలు రోజా లగ్జెంబర్గ్, విప్లవానంతరం శైశవదశలోని సోవియట్ రష్యా కమ్యూనిస్ట పార్టీ నిర్మాణంలో పొడసూపుతున్న అప్రజాస్వామిక లక్షణాలను ఎత్తి చూపుతూ సోవియట్ తరహా కమ్యూనిజం అతి త్వరలోనే శ్రామిక వర్గ నియంతృత్వం పేరిట ప్రజారాసుల సమిష్టి కార్యాచరణల అమలుకు భిన్నంగా పోలిట్ బ్యూరో నియంతృత్వాన్ని నెలకొల్పే ప్రమాదకరమైన నియంతృత్వ ధోరణుల్లోకి ప్రయాణించనుందని తీవ్రంగా విమర్శించారు. లెనిన్ బతికి ఉన్నప్పుడే ఆమె చేసిన ఈ విమర్శను తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం పెడచెవిన పెట్టింది లేదా సాయుధ బలంతో రాజ్యాధికారంలోకి వచ్చాక, ఇక కమ్యూనిజానికి, పార్టీకి తిరుగులేదని భ్రమిసిపోయి, రాజకీయాధికారపు గర్వాంధకారంలో కన్నుమిన్నూ గానకుండా వ్యవహరించింది.

  దాని ఫలితాలను గత 80 ఏళ్లుగా అందరం చూస్తూనే ఉన్నాం…

  పొలిట్‌బ్యూరో అనే పార్టీనిర్మాణానికి అందరూ గంపగుత్తగా చేతులెత్తేస్తూ ఏకగ్రీవతీర్మానాలు అమలయిపోయే భ్రష్ట ధోరణులు ఉనికిలోకి వచ్చేశాక ఇలాంటి ఏకశిలాసదృశ -మోనోలితిక్- నిర్మాణాలకు ఎదురునిల్చి పోరాడటం ప్రసేన్ జిత్ లాంటి వ్యక్తులకు సాధ్యమయ్యే పనేనా?

  అందుకే ఆయన రాజీనామా ఇచ్చినట్లుంది. దానికి కూడా సహించలేక ప్రసేన్‌జిత్‌ను బహిష్కరణ వేటుతో చంపేశారు. ఈ బహిష్కరణతో, సిపిఎం పార్టీలో నిన్న గాక మొన్న చేరిన బుడ్డాపకీరు కూడా ఇక ఆయన ముఖం చూడడు.

  ఆహా -రాజకీయ- కమ్యూనిజమా!

  ఇలాంటి కమ్యూనిజాన్ని ఎవరూ కోరుకోకూడదు. మన ఖర్మ ఏమంటే భారతదేశంలో అన్ని రకాల కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాలూ ఇలాగే ఏడుస్తున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను ఇలాగే ఉద్ధరిస్తున్నాయి. ఉద్యమ నిర్మాణాలలో ఇన్ని లోపాలు పెట్టుకుని, కమ్యూనిస్టు సిద్ధాంత వ్యతిరేకులు కమ్యూనిస్టు పార్టీల దౌర్భాగ్య ఆచరణను సాకుగా చూపి కమ్యూనిజాన్నివిమర్శిస్తున్నారంటే మనం ఉలికిపాటుకు గురికావలసిన పని లేదేమో మరి. దీనర్థం ఇక మనందరం కమ్యూనిజం అనే ఆదర్శాన్ని తోసిపారేయాలని కాదులెండి.

  కొండలరావు గారూ మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఉంది.

  విశేఖర్ గారూ,

  ఈ విషయంపై ఉదయం వార్తలు చూసిన వెంటనే నా ఏదో ఒక బ్లాగులో నా స్పందనను ప్రచురించాలనుకున్నాను. ఈ లోపల మీరే దీనిపై కథనం వ్రాయడంతో ముందుగా ఇక్కడే వ్యాఖ్యరూపంలో పెడుతున్నాను.

 2. రాజశేఖర్ గారు, మీరు లేని ఈ నెలన్నర రోజులలో చాలానే జరిగాయి. కులవ్యవస్థని బహిరంగంగా సమర్థించిన & కమ్యూనిజంని బహిరంగంగా వ్యతిరేకించిన గాంధీ చేసిన పనులని కేవలం వర్గపరమైన పరిమితులుగా చూపించడానికి తెలకపల్లి రవి గారు ప్రయత్నించారు. దానికి కొండలరావు గారు వంత పాడారు. దాంతో రవి గారి బ్లాగ్‌లోనో పెద్ద గొడవ జరిగి నా వ్యాఖ్యలూ, రామమోహన్ గారి వ్యాఖలూ ఆయన డిలీట్ చేశారు. http://gandhi.mlmedia.net.in/2012/06/mahatma-gandhi-was-dedicated-anti.html గాంధీ కమ్యూనిజంని ఒక బూచిగా చూపించడానికి ప్రయత్నించాడు అని మేము చెప్పినా తెలకపల్లి రవి గారు అదంతా గాంధీకి ఉన్న వర్గపరమైన పరిమితుల వల్ల మాత్రమే అని అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడం లేదా వ్యాఖ్యలు డిలీట్ చెయ్యడం చేశారు. కమ్యూనిజం ముసుగు వేసుకుని రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళకి మనం ఏమి చెప్పినా అర్థం కాదు.

 3. ” ప్రణబ్ ముఖర్జికి విసౄత మద్దతు వున్నందున ఆయనకు మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ తెలిపింది”

  తెలకపల్లి రవి ఆలొచిస్తున్నట్లే cpm పార్టీ కుడా ఆలొచిస్తున్నట్లు వుంది. ఎందుకంటే ఆయనకుడా జ్వొతిష్యం అనేకమంది నమ్ముతున్నారు కాబట్టి దాన్ని తప్పుపటాల్సిన పని లేదన్నారు. అలాగే సుంధరయ్యను అనేక మంది అనేక యెళ్ళుగా గాందిగా సంబొదిస్తున్నారు కనుక అందులొ అబ్యంతరం ఏమీ లేదన్నారు. 100కి 99 మందికి మార్కిజం తెలియదు ఆ పార్టీని చుసి అదే కమ్యుసిజం అనుకొంటుంటున్నారు.దాని ఫలితంగా మార్కిజాన్ని కుడా విమశిస్తున్నారు. మీరు అప్పుడప్పుడు ఆంద్రజ్వొతి లాంటి పేపర్లకు వ్యాసాలు పంపించవచ్చు కదా?

 4. ప్రవీణ్ గారూ,
  నిజంగా చాలా విషయాలు మిస్సయ్యాను. గాంధీజీ కమ్యూనిజాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన దానికంటే ఎక్కువ ప్రమాదం ఆయన కులవ్యవస్థను బహిరంగంగా సమర్థించడం ద్వారా జరిగిందేమో. అంబేద్కర్‌ని నేరుగా ఎదుర్కొనలేక నిరాహారదీక్షతో అంబేద్కర్ పోరాటాన్ని ఆయన నీరుగార్చడం అందరికీ తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టిన హరిజన్ అనే పదబంధం అగ్రకులాల చేతికి దేవుడి బిడ్డలు అనే అపహాస్య పదాన్ని ఇచ్చి దశాబ్దాలుగా దళితుల అవమానాన్ని పెంచి పోషించడం కూడా తెలిసిందే. గాంధీజీ వ్యక్తిగత మంచితనం వెనుక భావజాల సారాంశం ప్రజలకు మేలు చేయలేదనే చెప్పాలి. ‘స్వాతంత్ర్యం’ వచ్చిన సంవత్సరంలోపే కాంగ్రెస్‌ పార్టీలో, నాయకత్వంలో ఎన్నెన్ని అవలక్షణాలు బయలుదేరిపోయాయో అప్పటినుంచి బయటపడుతున్న స్కామ్‌లు చెబుతూనే ఉన్నాయి.

  ఇక మీరు ప్రస్తావించిన వర్గపరమైన పరిమితులు అనే భావనను సిపిఐ, సిపిఎమ్‌లు పార్లమెంటరీ పంధాలోకి వెళ్లాక ఆ రెండు పార్టీలకు అంటిన భావజాల పరిమితులుగా గుర్తిస్తే బాగుంటుందనుకుంటాను.

 5. రాజశేఖర్ గారు, అసలు వర్గ పరిమితులు అంటే ఏమిటి? కుమ్మరివాళ్ళు కుండలు చేసే వృత్తిలోనే, కంచరివాళ్ళు రాగి పాత్రలు చేసే వృత్తిలోనే, ఇలా ఏ కులాలవాళ్ళు ఆయా కులవృత్తులలోనే ఎటర్నల్‌గా ఉండిపోవాలని ప్రవచించిన గాంధీ కేవలం వర్గపరమైన పరిమితుల వల్ల అలా ప్రవచించాడని అనుకోవాలా? లేదా కుల వ్యవస్థ యొక్క సహజ స్వభావం అదే కనుక ఆ సహజ స్వభావం వల్లే గాంధీ అలా ప్రవచించాడని అనుకోవాలా? సహజ స్వభావం మారాల్సిన అవసరం లేదు అని అనుకుంటే ఇక గతితార్కిక-చారిత్రక భౌతికవాదం చదివి ఏమి లాభం?

  విశేఖర్ గారు, “ఇలా మిగిలేం” పుస్తకంలో చలసాని గారు ఇవే విషయాలు వ్రాసారు. మన దేశంలోని ఉభయచర కమ్యూనిస్ట్‌లు గత నలభై-యాభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్‌తో వర్గ సహకారం చెయ్యడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వర్గ సహకారం ద్వారా ఏమి సాధించారు అని అడిగితే సమాధానం దాటవేసి, కాంగ్రెస్‌తో వర్గ సహకారం సరిగా చెయ్యకపోవడం వల్లే ఇలా జరిగిందని సమాధానాలు చెపుతున్నారు.

 6. రాజశేఖర్ గారు, మీరు గమనించాల్సిన ఒక విషయం ఉంది. మాయావతి గాంధీని బహిరంగంగా తిడుతుంది. గాంధీ దళిత వ్యతిరేకి కాబట్టి మాయావతి గాంధీని తిట్టడంలో విచిత్రం లేదు. మాయావతి గాంధీని ఇంత బహిరంగంగా తిడుతుంది అని తెలిసినా గాంధేయవాద పార్టీ అయిన కాంగ్రెస్ దళితుల వోట్ల కోసం ఈమెతో పొత్తు పెట్టుకుంటుంది. CPM నాయకులు గాంధీని విమర్శిస్తే కాంగ్రెస్ నాయకులు మీతో పొత్తు మాకు అవసరం లేదు అని డైరెక్ట్‌గా చెప్పేస్తారు. కాంగ్రెస్ నాయకులు ఎలాగూ కోట్లకి కోట్ల ఆస్తులు సంపాదించినవాళ్ళే కనుక ప్రైవేట్ ఆస్తిని రద్దు చెయ్యాలని అడ్వొకేట్ చేసే కమ్యూనిజంతో వాళ్ళకి పని ఉండదు. వాళ్ళకి పని ఉండేది వాళ్ళకి నాలుగు వోట్లు రాల్చగల సెక్యులరిజం, దళిత అస్తిత్వవాదం లాంటివాటితోనే. అలాగని CPM నాయకులు గాంధేయవాదాన్ని విమర్శించకుండా నోరు మూసుకుని కూర్చుంటే వాళ్ళు కాంగ్రెస్‌తో సహకారం కోసం తాపత్రయపడుతున్నారని అర్థమవుతుంది.

 7. ప్రణబ్ ముఖర్జి ప్రజల ఆస్తిని ఉదారంగా దొచిపెట్టిన వ్యక్తి బుర్జువా వర్గానికి అన్ని విషయాలలొనూ వెన్ను దున్నుగా నిలసిన వ్యక్తి వొడా పొన్ విషయంలొ అంతఖఠినంగా ఎందుకు వున్నాడు? అదీ ఆ పార్టీ నాయకత్వాన్ని ఎదిరించి!!! ప్రణబ్ ముఖర్జిని ఆ ఒక్క కారణం తొ మారుస్తున్నారంటే నమ్మలేకుండా వున్నాను. దానితొ పాటు వేరే వేరే కారణాలు వుండి వుంటాయి. ప్రదానిని సొనియాను కాదని తను స్వంతంగా నిర్నయాలు తీసుకూగలడా??

 8. వోడాఫోన్ కంపెనీ నుంచి అతనికి లంచాలు రాలేదనేమో, అందువల్లే ఆ కంపెనీ విషయంలో కఠినంగా ఉండి ఉండొచ్చు.

 9. రాజశేఖర రాజు గారికి ! రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గతం లో సీ.పీ.ఎం లక్ష్మీసెహగల్ ను సమర్ధించిన అనుభవంతో ఈసారి తీసుకున్న స్టాండ్ పై ఈ పోస్టులో వచ్చిన అభిప్రాయాలపై నా బ్లాగులొ ఆర్టికల్ వ్రాసే ప్రయత్నం చేస్తాను .

 10. దేశంలో సిపిఎం అనుసరిస్తున్న విధానాలు అర్థం చేసుకున్న వారు ఎవరైనా ప్రసేన్ జిత్ బోస్ బహిష్కరణని సరిగానే అర్థం చేసుకుంటారని అనుకుంటాను. కేవలం సిపిఎంని విమర్షించడానికి మాత్రమే ఉన్నవారి విమర్షలకు జవాబు అవసరం లేదు. విషయానికి వస్తే బ్లాగ్ లోనే చెప్పారు. తీవ్రమై చర్చ జరిగిన మీదటనే ప్రణబ్ కు మద్దత్తు ప్రకటించింది సిపిఎం. ఇక ఆచర్చలో తన అభిప్రాయాలను కూడా బోస్ చెప్పి ఉంటారు. ఆయన అభిప్రాయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకున్న తదుపరి మాత్రమే పొలిట్ బ్యూరో పార్టీ విధానాన్ని ప్రకటించి ఉండవచ్చు. చర్చలలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికి పొలిట్ బ్యూరోలో చర్చించి చేసిన నిర్ణయాలను సభ్యులందరు తప్పక అంగీకరించవలసినదే. కాని అందుకు భిన్నంగా బోస్ గారు తన స్వంత అభిప్రాయాలను బయటకు చెప్పడం సరిఅయినది కాదు. అది పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించడమే. అందుకు అతనిని బహిష్కరించడం సరిఅయిన నిర్నయమే అవుతుంది.
  రాష్ట్రపతి ఎన్నిక విషయంలో సిపిఎం అవగాహనలో కూడా తప్పేమీ కనిపించదు. ఇది ఏప్రిల్ లో జరిగిన సి.పి.ఎం పార్టీ జాతీయ మహాసభల్లో ఆమోదించిన రాజకీయ తీర్మానాన్ని ఉల్లంఘించడం కాదు. సిపిఎం మొదటినుండి బిజెపి అభ్యర్థులను తిరస్కరిస్తూ వస్తోంది. అలాంటపుడు ప్రణబ్ కు మద్దతు ఈయక బిజెపి అభ్యర్థి సంగ్మాని ఎలా బలపరచగలదు. తన స్వంత పార్టీ మద్దతు కూడా లేని (ఒక రకంగా తాడూ బొంగరం లేని) సంగ్మాని బలపరచడం ఎలా కుదురుతుంది. అలా చేసినపుడు మళ్ళీ సిపిఎం బిజెపి వైపు మొగ్గింది అనేవారు కాదా? తన స్వంత బలంతో ఒక వ్యక్తిని బరిలోకి దింపి ఎన్నికలలో పోటీచేయలేపుడు ఉన్న ఇద్దరిలో ఎవరికి మద్దత్తు ఇవ్వాలనే ప్రశ్న వస్తుంది. అప్పుడు ప్రణబ్ కు తప్పకుండా మద్దత్తు ఇవ్వవలసినదే. ఆయనకు మద్దత్తు ఇచ్చి ఆయననుండి ఆశించేది కూడా ఏదీ లేదు. యుపిఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్వతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఏవిధమైన మార్పు ఉండదని సిపిఎం తన ప్రకటనలోనే చెప్పింది.
  ఎన్నికల బహిష్కరణకే ప్రాముఖ్యతనిచ్చే కమ్యునిస్టు పార్టీలు ఎన్నికలలో పాల్గొనకుండా ఉంటూ అనుసరించే విధానానికి ఇది నచ్చదు. కాని పార్లమెంట్ వేదికను కూడా పోరాటాలకు వేదికగా వాడుకోవాలనుకునే సిపిఎంకు సరిఅయినదే.
  అనవసరంగా బోస్ గారు పార్టీకి దూరమయ్యారు కాని పార్టీ చేసిన పొరపాటు ఏదీ లేదని నేను భావిస్తున్నాను. పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకం గా పని చేస్తున్న వారిని బహిష్కరించకుండా పార్టీ ఎలా ఉండగలదు. ఇంకొక విషయం ప్రసేన్ జిత్ పార్టీ సిద్దాంత కర్త కాదు, ఒక సభ్యుడు మాత్రమే. సిద్దాంత కర్తలు అంటూ ఎవరూ ఉండరు. పార్టీ మహాసభ ఆమోదించిందే సిద్దాంతం. రాష్ట్రపతి ఎన్నిక దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశం కాదు. ప్రణబ్ కు మద్దతు ఇచ్చినందుకే పార్టీకి రాజీనామా చేయవలసిన అవసరం ఏ మాత్రం లేదు. కాని బోస్ గారు తొందర పడినారని మాత్రమే అనుకోవలసి వస్తుంది.
  ఇక ప్రణబ్ కు మద్దత్తు ఇవ్వడం వలన లెఫ్ట్ ఫ్రంటు నిలువునా చీలిపోయిందనడం కూడా సరిఅయినది కాదు. ఆ విషయానికి వస్తే ఫ్రంటులో ఉన్న నాలుగు పార్టీలలో అభిప్రాయ బేధాలు అనేకం ఉన్నాయి. ఈ విషయం ఫ్రంటులో పార్టీల మధ్య దూరాన్ని పెంచుతుందని అనుకోవలసిన అవసరం లేదు. ఇది లెఫ్ట్ ఐక్యతకు భంగం కలిగిస్తుందనే వారు ఫ్రంటు బయటివారు మాత్రమే కాని, ఫ్రంటులోని వారు ఆ మాట ఎక్కడా అనలేదు. ఎవరి అభిప్రాయాలు వారివి అనుకున్నారు తప్ప విడిపోతున్నామని ఆ నాలుగు పార్టీలు భావించడం లేదు. బయటి వారు అనుకునే దానికి ఆలోచించవలసిన అవసరం లేదు.

 11. సోక్రటీస్ చెప్పిన సత్యం
  – ఎ.కృష్ణారావు
  andhrajyothy
  నిజానికి పార్టీ తనను బహిష్కరించకముందే ఆయన రాజీనామా చేశారు. కారణం ఆయన ఎంతో పరిశోధించిన తర్వాత సిపిఐ(ఎం) పార్టీ ఈ ఏప్రిల్‌లో తమ మహాసభల్లో చేసిన తీర్మానాన్ని ఉల్లంఘించిందని కనిపెట్టి పార్టీకి లేఖ రాశారు. కాంగ్రెస్, బిజెపిలకు సమానమైన దూరం పాటించాలని, వాటితో రాజకీయ పోరాటం చేయాలని సిపిఐ(ఎం) ఈ మహాసభల్లో నిర్ణయించింది.

  ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని తీర్మానించింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని సమర్థించడం ఈ తీర్మానాన్ని ఉల్లంఘించడమే కదా? ఒక మహాసభ చేసిన నిర్ణయాన్ని పోలిట్‌బ్యూరో ఎలా కాలరాస్తుంది? అని ఆయన అమాయకంగా ప్రశ్నించారు. బహుశా ఇదే ప్రజాస్వామ్యమని ఆయనకు తెలియకపోవచ్చు.

  ఇదే ప్రజాస్వామ్యం కాకపోతే సిపిఐ(ఎం) ప్రణబ్ ముఖర్జీని సమర్థించడంలో ఔచిత్యం ఏమిటి? యుపిఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఆర్థిక విధానాలను సిపిఐ(ఎం) వ్యతిరేకించింది. అణు ఒప్పందాన్ని వ్యతిరేకించింది. ఈ రెండింటికీ సూత్రధారుడు ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ నేతృత్వంలో ఏర్పర్చిన సమన్వయ కమిటీయే అణు ఒప్పందంపై వామపక్షాలతో చర్చించింది. అప్పుడు ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించినందుకే వారు ఈ కమిటీనుంచి వైదొలగి, చివరకు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.

  తర్వాత ఆర్థిక మంత్రిగా ప్రణబ్ హయాంలో దేశం తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. వాటిపై వామపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. ప్రణబ్ కేవలం ఒక వ్యక్తి కాదు. వామపక్షాలు వ్యతిరేకిస్తున్న సిద్ధాంతాలకు ప్రతినిధి. అయినప్పటికీ సిపిఐ(ఎం) ప్రణబ్‌ను ఒక వ్యక్తిగా, బెంగాలీగా మాత్రమే చూసింది. వామపక్షీయులకు ప్రాంతీయ తత్వం, సంకుచిత భావాలుంటాయా? బెంగాలీలకు ప్రాంతీయ తత్వం ఉన్నప్పుడు తెలంగాణ వారికి ఎందుకు ఉండకూడదు? అయినా సిపిఐ(ఎం) భ్రమ కావచ్చు కాని ప్రణబ్ ముఖర్జీ బెంగాలీ అయినందుకు సమర్థిస్తే బెంగాలీలంతా సిపిఐ(ఎం)కు ఓటు వేస్తారా? మన్మోహన్ సింగ్ మూలంగా పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు అయినా వచ్చిందా?

  ఆయన ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది కదా? అదే విధంగా ప్రణబ్ ముఖర్జీ వల్ల బెంగాల్‌లో ఎన్ని ఓట్లు వస్తాయి? ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీలను మమతా బెనర్జీ వ్యతిరేకించినందుకు తాము మద్దతునిస్తున్నామని చేస్తున్న వాదన హాస్యాస్పదం కాదా? మమత మనసు మార్చుకుని మళ్లీ ప్రణబ్‌ను సమర్థిస్తే సిపిఐ(ఎం) మనసు మార్చుకుంటుందా? ఒక సైద్ధాంతిక పార్టీ వ్యక్తుల నిర్ణయాల ప్రకారం మారే పార్టీలను బట్టి తమ వైఖరిని నిర్ణయించుకోవడం సరైనదైనా, వ్యక్తుల కోసం వామపక్ష ఐక్యతను కూడా బలిపెడుతుందా అన్న ప్రశ్నలు వేయకూడదు. ఎందుకంటే తర్కం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.

  నన్ను విమర్శించిన వారినైనా సహిస్తాను కాని ద్రోహులను సహించను.. అని ఇందిరాగాంధీ అనేవారట. కాని సిపిఐ(ఎం) ఇందిరను మించిపోయినట్లు కనిపిస్తున్నది. ప్రణబ్ ముఖర్జీని సమర్థించడం సైద్దాంతికంగా ఎంత తప్పో చెప్పిన పార్టీ పరిశోధక విభాగం కన్వీనర్‌ను పిలిచి నచ్చచెప్పే సంప్రదాయం ఆ పార్టీలో లేనట్లున్నది. అందుకే ఆయన చేసిన రాజీనామాను కూడా తిరస్కరించి ఏకంగా పార్టీనుంచే బహిష్కరించింది. ఇలాంటి నియంతృత్వ వైఖరి వల్లనే కేరళలో పార్టీ నేతలు ఎన్నో అడుగులు ముందుకు వేసి తమ ప్రత్యర్థులను శిరఛ్చేదం చేసేంతవరకూ వెళ్లారు.

  సిపిఐ(ఎం) సిద్ధాంతాలను వ్యతిరేకించి, పార్టీకి దూరంగా వెళ్లి మరో పార్టీని స్థాపించి ప్రజల్లో ఆదరణ పొందిన చంద్రశేఖర్ అనే నేతను రెండునెలల క్రితం కన్నూరు జిల్లాలో హత్య చేసిన విషయం తెలిసిందే. తాము హత్య చేయాల్సిన 13 మంది జాబితా రూపొందించామని ఒక నేత బహిరంగంగా ప్రకటిస్తే చంద్రశేఖర్‌ను తల నరికి చంపుతామని మరో నేత రెండేళ్లక్రితమే ప్రకటించిన విషయం తాజాగా బయటపడింది.

  మరి ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొని ఎన్నికల ద్వారా అధికారంలోకి రావడంపై నమ్మకం పెట్టుకున్న సిపిఐ(ఎం) ఎందుకిలా మావోయిస్టుల్లా ప్రవర్తిస్తోంది? నిజానికి మావోయిస్టులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడినట్లు వార్తలు ఇటీవలి కాలంలో రావడం లేదు. బహుశా హత్యాకాండ ప్రజాస్వామ్యమనే జన జీవన స్రవంతిలో మరింత భాగమైనట్లు కనిపిస్తోంది.

 12. కొండలరావుగారూ, తప్పకుండా రాయండి. మీ స్పందనకోసం ఎదురుచూస్తున్నాను. నా వ్యాఖ్యలో ఉన్న మిగతా అన్ని విషయాలను పక్కనపెట్టి ఒక విషయంలో మాత్రం నాకు తీవ్ర అసమ్మతి ఉంది.

  ఒక వ్యక్తి పార్టీ వైఖరిని, లేదా పంధాను వ్యతిరేకించో లేదా పదే పదే పార్టీ వైఖరిలో లోపాలు చూసి విసిగిపోయో తన సభ్యత్వానికి రాజీనామా చేస్తే కనీసం అలా రాజీనామా చేసే హక్కు కూడా ఆ వ్యక్తికి లేదా అనేది నా ప్రశ్న. రాజీనామా చేసిన వ్యక్తిని ‘నువ్వెవరు చేయడానికి మేమే పంపిస్తాం’ అనే రీతిలో అటు బూర్జువా పార్టీ, ఇటు కమ్యూనిజాన్ని ఆచరిస్తున్నానని చెప్పుకునే పార్టీ రెండూ ఒకేరీతిలో బహిష్కరణతో వేటు వేస్తే దీంట్లో కనీస న్యాయం ఉందా అన్నదే నా బాధ.

  తీవ్రంగా విభేదిస్తున్న పరిస్థితుల్లో కూడా పార్టీ వేదికలో చర్చించి ఒక అభిప్రాయానికి రావాలనడం ఏ పార్టీకయినా సాధారణ పరిస్థిత్తుల్లో సహజమైన విషయమే. కాని బహిరంగంగా, నేరుగా పార్టీకి రాజీనామా చేసేవరకు ఇక్కడ వ్యవహారం వెళ్లిపోయింది. ఇక్కడ ప్రసేన్ జిత్ అంత తీవ్ర స్థాయి నిర్ణయానికి సాహసించారంటే మైసూరారెడ్డి ఉదంతంలో వలె తనకు ఇతర రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని నాకనిపించడం లేదు.

  పైగా ఇలా రాజీనామా చేసి బయటకు వెళ్లే సందర్భంలో సంబంధిత పార్టీలే అతడి లేదా ఆమె రాజీనామాను అంగీకరించడం కాకుండా బహిష్కరించి వేటు వేయడం అనేది చూసినప్పుడల్లా నాకు ఆవేదన, ఏవగింపు రెండూ కలుగుతాయి.

  దీనికన్నా నిఖార్సయిన వ్యవహారం ఏమిటంటే ఆ రాజీనామాను అవుట్‌రైట్‌గా అంగీరిస్తూనే, రాజీనామా చేసిన వ్యక్తితో తాము ఎక్కడ విభేదిస్తున్నామో, రాజీనామా చర్య ఎలా సరైనది కాదు అనే అంశాలపై పార్టీ వివరణ ఇస్తూ అటు ప్రజలకూ, ఇటు కేడర్‌కూ కూడా ప్రకటన పంపితే చాలా హుందాగానూ ఉండేది. ఆ రాజీనామాతో అశేష ప్రజారాసులకు తక్షణం జరిగిపోయే ప్రమాదం, విద్రోహం అంటూ కూడా లేవు. ఒక మంచి వ్యక్తి, ప్రతిభావంతుడు పార్టీకి దూరం కావటం తప్పితే.

  బూర్జువా పార్టీ విధానాలకూ కమ్యూనిస్టు పార్టీలకు లేదా పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలకూ తేడా లేకుండా ఇలాంటి చర్యలు జరగటాన్ని జీర్ణం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది.

  ప్రసేన్ జిత్ గారికి, సిపిఎమ్ పార్టీ అధినాయకత్వానికి మధ్యన కొంత కాలంగా ఏం జరుగుతోంది అనే విషయాలు కూడా నాకయితే తెలీవు. కాని ఏం జరిగినా, జరగకున్నా, సమస్య ఇలాంటి పరిష్కారంతో ముగియడం బాధాకరం.

  పైగా ఇలా బహిష్కరణ ముద్ర వేయించుకుని బయటకి వెళ్లిన ప్రతి వ్యక్తి ఇక ‘అస్పృశ్యుడే’ అయిపోతాడు. అన్ని చోట్లా అన్ని నిర్మాణాల్లో జరిగేదిదే. ఒక అపసవ్య ధోరణికి మరొక అవసవ్య ధోరణి తోడవడం తప్ప ఒరిగేదేమీ లేదు ఇలాంటి పరిణామాలతో…

  ‘ఈ బహిష్కరణతో, సిపిఎం పార్టీలో నిన్న గాక మొన్న చేరిన బుడ్డాపకీరు కూడా ఇక ఆయన ముఖం చూడడు. ‘ అని నా తొలి వ్యాఖ్యలో రాశాను. బుడ్డ్డా పకీరు అని పదప్రయోగం చేయడం ద్వారా కొత్తగా చేరిన కేడర్‌ను కించపరుస్తున్నానని, అవమానిస్తున్నానని అనుకోకండి. పార్టీ నిర్మాణాల్లో చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలను ఎత్తి చూపడానికే ఈ పదాన్ని సింబాలిక్‌గా వాడానంతే.

  నా వ్యాఖ్య సారంశంతో మీరు హర్ట్ కాలేదని, కావద్దని అభ్యర్థిస్తున్నాను.

  మరొకందుకు క్షమించాలి. మీ బ్లాగ్ యుఆర్ఎల్ దయచేసి నాకు పంపండి. నా వద్ద ఇది యాడ్ అయినట్లు లేదు.

 13. కొండలరావుగారూ,
  ఇప్పుడే చూశాను. ఈరోజు -బుధవారం- ఆంద్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలోని కింది ప్రధాన వ్యాసాన్ని తప్పక చూడండి. మీ తదుపరి వివరణకు ఇది తప్పక ఉపయోగపడుతుంది. ఆద్యంతం వ్యాసాన్ని చదవండి.

  సోక్రటీస్ చెప్పిన సత్యం
  https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/jun/27/edit/27edit2&more=2012/jun/27/edit/editpagemain1&date=6/27/2012

  ఈ లింక్ వ్యాసం చివరలో ఒక తాత్విక ముక్తాయింపు కూడా ఇచ్చారు. కింద చూడండి.

  “ఇందుకు జవాబును వేల ఏళ్ల క్రితం గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ ఎప్పుడో చెప్పారు. ప్రజలు గొర్రెల్లాంటివారు.. తెలివైన గొర్రెల కాపరి ఉంటే సరైన దారిలో వారిని తీసుకువెళతాడు అని సోక్రటీస్ అన్నారు. ప్రజాస్వామ్యానికి పురిటిగడ్డ అయిన గ్రీస్‌లో జన్మించిన సోక్రటీస్‌కు ఆనాడే ప్రజాస్వామ్యంలోని బూటకత్వం తెలిసినట్లున్నది.”

  ఆంధ్రజ్యోతి వ్యాస సారాంశంతో మీరు ఏకీభవిస్తున్నారో లేదా విభేదిస్తున్నారో తెలుసుకోవాలనుంది.
  వేచి ఉంటాను.

 14. మావోయిస్ట్‌లు పాలక వర్గానికి చెందినవాళ్ళని & వాళ్ళ ఇన్‌ఫార్మర్‌లని చంపుతారు కానీ వ్యక్తిగత హత్యలు చెయ్యరు. తెలకపల్లి రవి అనే ఒక CPM నాయకుడు మావో జెడాంగ్‌ని మహాశయుడు అని అంటూనే మన దేశంలోని మావోయిస్ట్‌లని సంఘ విద్రోహశక్తులు అని అంటుంటాడు. మావోయిస్ట్‌ల విషయంలో CPM పార్టీ విధానం అదే కదా. కనుక CPM నాయకులని మావోయిస్ట్‌లతో పోల్చి మావోయిస్ట్‌లని అవమానించొద్దు అని మనవి.

 15. కొంత ఇతరత్రా పనుల్లో ఉన్నందున పై వ్యాఖ్యలకి సమయానికి స్పందించలేకపోయాను.

  అశోక్ గారు చేసిన వాదనలకు సమాధానాలు కొంతవరకూ ఆంధ్ర జ్యోతి పత్రిక నుండి శ్రీ గారు ఇచ్చిన భాగంలో ఉన్నాయి. (శ్రీ గారికి ధన్యవాదాలు.) అశోక్ గారు ప్రస్తావించిన ఇతర అంశాలను చూస్తే.

  >>దేశంలో సిపిఎం అనుసరిస్తున్న విధానాలు అర్థం చేసుకున్న వారు ఎవరైనా ప్రసేన్ జిత్ బోస్ బహిష్కరణని సరిగానే అర్థం చేసుకుంటారని అనుకుంటాను. కేవలం సిపిఎంని విమర్షించడానికి మాత్రమే ఉన్నవారి విమర్షలకు జవాబు అవసరం లేదు.>>

  అశోక్ గారూ, సి.పి.ఎం విధానాలు ప్రజల కోసమేనని అంగీకరిస్తే గనక అవి వారి విధానాలను అర్ధం చేసుకున్నవారితో పాటు ఇతరులు కూడా సరిగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం లేదంటారా? కమ్యూనిస్టు పార్టీలు కార్మికవర్గ ప్రయోజనాలను అత్యునతంగా భావిస్తాయి గనుక వాటి విధానాలు ప్రజల ప్రయోజనాలనే లక్ష్యంగా చేసుకోవాలి. అలా లేనప్పుడు విమర్శలు సహజంగానే వస్తాయి. విమర్శలకు వీలయితే సమాధానం చెప్పాలి లేదా విమర్శలలో పస లేదంటే అది వివరించాలి. దానికి బదులు జవాబు అవసరం లేదనడం సబబుగా లేదు.

  సి.పి.ఎం ని విమర్శించడానికి మాత్రమే ఉన్నారని ఎవరిని ఉద్దేశిస్తున్నారు? మీరు ఎవరినైనా లక్ష్యంగా చేసుకున్నట్లయితే వారిని సంబోధిస్తూ చెబితే బాగుంటుంది. ఇక్కడ వ్యాఖ్యలు రాసిన వారందరినీ ఒక్క స్వీపింగ్ స్టేట్ మెంట్ తో కొట్టిపారేసినట్లుగా మీ వ్యాఖ్యానం ఉంది.

  పొలిట్ బ్యూరో గానీ, ఇతర కమిటీలు గానీ ఎంత తీవ్ర చర్చ చేసినా అది అంతర్గత విషయమే. నిర్ణయం ప్రకటించాక పార్టీ మొత్తానికి అది వర్తిస్తుంది. ఒక రాజకీయ విధానాన్ని పార్టీ ప్రకటించాక చర్చలు ఎంత తీవ్రంగా జరిగినా పరిగణలోకి రావు. కనుక ఆ సంగతి వదిలేయాల్సిందే.

  పార్టీ ప్రకటిత రాజకీయ విధానానికి భిన్నంగా మాట్లాడడమే కాక ప్రసేన్ జిత్ రాజీనామా కూడా చేశాడు. భిన్నంగా మాట్లాడి పార్టీలో కొనసాగదలిస్తే ‘బహిష్కరణ’లో అర్ధం ఉంటుందనీ, రాజీనామా తిరస్కరించి బహిష్కరించడం అంటే అది భిన్నాభిప్రాయం ప్రకటించిన వారిపైన ఒక ముద్రవేయడమేనని రాజుగారు అంటున్నారు. సభ్యుల అభిప్రాయాలకు విలువ ఉన్నట్లయితే ఆ విలువ ఆ సభ్యులకు ఇవ్వాలి. అతనే రాజీనామా చేసినట్లయితే ఫలానా అభిప్రాయంతో రాజీనామా చేశాడు, అది పార్టీకి ఆమోదయోగ్యం కాదు గనక రాజీనామాను ఆమోదించాం అని పార్టీ చెప్పగలగాలి. అది చేయకుండా రాజీనామాని తిరస్కరించామని చెప్పి బహిష్కరించడం ఏమిటన్నది ప్రశ్న.

  రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్, సంగ్మా లలో ఎవరిని బలపరచాలన్నదే సమస్య అన్నట్లుగా మీరు చెబుతున్నారు. వారిద్దరిలో ఎవరో ఒకరిని బలపరచక తప్పదన్నట్లు చెప్పారు. కానీ సి.పి.ఐ, ఎఫ్.బి లు చేసింది అది కాదు కదా. ఓటింగ్ లో పాల్గొనబోమని అవి చెప్పాయి. ప్రసేన్ జిత్ కూడా ఆ నిర్ణయానికి మద్దతు తెలిపాడని ఆర్టికల్ లో ఉంది కూడా. ఆ సంగతిని మీరు విస్మరించినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్ధిగా రంగం మీదికి రావడం వెనుక ఉన్న ఆర్ధిక ప్రయోజనాలు కూడా ఆర్టికల్ లో చర్చించాను. ఈ ప్రయోజనాలు నేరుగా నూతన ఆర్ధిక విధానాలతో సంబంధం ఉన్నవి. ప్రణబ్ ముఖర్జీ కి కూడా నూతర ఆర్ధిక విధానాలను అమలు చేయడంతో పాటు అంతకు ముందు కూడా సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలను నెరవేర్చిన వ్యక్తే. ఈ సంగతి వదిలేసి ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలని కమిట్ అయినందువల్లనే సి.పి.ఎంపై విమర్శలు. ఎన్నికల్లో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వకతప్పదనే రాజకీయం కార్మికవర్గ రాజకీయమేనా?

  ప్రణబ్ ముఖర్జీ అభ్యర్దిత్వమ్ వెనుక పన్ను ఎగవేత రాజకీయాలున్నాయి. ఒక్క వోడా ఫోన్ కంపెనీయే 11 వేల కోట్లకు టాక్స్ లయబిలిటీ ఉండగా, ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించిన చట్టం ప్రకారం 55 వేల కోట్ల పన్నులు ప్రభుత్వానికి సమకూరుతాయని పత్రికలు చెప్పాయి. దీనివల్లనే ఆయన ఆర్ధిక మంత్రిత్వ శాఖ నుండి గెంటివేతకు గురయ్యాడు. ప్రణబ్ ముఖర్జీ ని రాష్ట్రపతిగా పంపడం వెనుక ఇన్ని వ్యూహ ప్రతివ్యూహాలు ఉండగా ఆయనకు మద్దతు ఇచ్చి ఆయననుండి ఆశించేదేమీ లేదంటే ప్రజలు ఎందుకు నమ్మాలి? నూతన ఆర్ధిక విధానాలను అమలు చేసిన ప్రణబ్ కి ఓవైపు మద్దతు ఇస్తూ ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఎటువంటి మార్పూ ఉండదని సి.పి.ఎం చెప్పినా దానికి విలువ ఎలా ఉంటుంది?

 16. విశేఖర్ గారూ,

  “భిన్నంగా మాట్లాడి పార్టీలో కొనసాగదలిస్తే ‘బహిష్కరణ’లో అర్ధం ఉంటుందనీ, రాజీనామా తిరస్కరించి బహిష్కరించడం అంటే అది భిన్నాభిప్రాయం ప్రకటించిన వారిపైన ఒక ముద్రవేయడమేనని”

  ముద్రవేయడం మాత్రమే కాదండీ. ముందుగానే రాజీనామా చేసిన మైసూరారెడ్డిని, ప్రసేన్ జిత్‌ను అటు తెలుగుదేశం పార్టీ, ఇటు సిపిఎం పార్టీ బహిష్కరించడం వెనకాల ఏ సమాజానికి సంబంధించిన సహజన్యాయమైనా కనబడుతోందా అని నా ప్రశ్న.

  పైగా అశోక్ గారు పైన వ్యాఖ్యానిస్తూ… “పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని బహిష్కరించకుండా పార్టీ ఎలా ఉండగలదు” అన్నారు. అసలుకు నీ పార్టీయే వద్దు అని రాజీనామా చేసిన వారిని బహిష్కరించడం కూడా పార్టీ లక్షణాల్లో భాగమేనా అనేది మరో ప్రశ్న.

  “తన స్వంత బలంతో ఒక వ్యక్తిని బరిలోకి దింపి ఎన్నికలలో పోటీచేయలేపుడు ఉన్న ఇద్దరిలో ఎవరికి మద్దత్తు ఇవ్వాలనే ప్రశ్న వస్తుంది.”

  అశోక్ గారు సిపిఎమ్ సానుభూతిపరుడి స్థానంలో ఉండి ఇలా అంటున్నారో, లేదా ఆ పార్టీ సభ్యుడి స్థానంలో ఉండి ఇలా అంటున్నారో తెలీటం లేదు.

  సిపిఎంకి చెందిన ఉడ్డా మూడు ఓట్లు పడకపోతే అంత పెద్ద ప్రణబ్ ముఖర్జీ ఎన్నికే గల్లంతు అయ్యే స్థితి ఉందా ఇప్పుడు?

  “ప్రణబ్ ముఖర్జీ కి కూడా నూతన ఆర్ధిక విధానాలను అమలు చేయడంతో పాటు అంతకు ముందు కూడా సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలను నెరవేర్చిన వ్యక్తే.”

  శేఖర్ గారూ ఇదే కాదండీ. సాక్షాత్తూ నేతాజీ సుభాష్ జీవన సహచరికే లంచం ఇవ్వచూపిన ఘనాపాఠిత్వం కూడా మన కాబోయే రాష్ట్రపతి గారికి ఉందని కింది లింకు చెబుతోంది చూడండి.

  నేతాజీ భార్యకు ప్రణబ్ లంచం
  బోస్ మరణంపై వివాదానికి తెరదించే యత్నం
  జపాన్ నుంచి అస్థికలు తెప్పించాలని డిమాండ్
  నేతాజీ భార్య వద్దకు ప్రణబ్ దూత
  ‘బ్లాంక్ చెక్’ ఆఫర్
  తాజా పుస్తకంలో సంచలనాత్మక సంగతులు
  http://www.andhrajyothy.com/nationalnewsshow.asp?qry=2012/jun/27/national/27national1&more=2012/jun/27/national/nationalmain&date=6/27/2012

  ప్రాంతీయ తత్వం అంటే అంతెత్తున ఎగిరిపడే సిపిఎమ్, ప్రణబ్‌కు మధ్దతు తెలుపడం ద్వారా ఏ బలహీనతకు లోబడిపోయిందో అర్థమవుతోంది కదూ…!

 17. కేవలం ఎవరికి మద్దతు ఇవ్వాలనేది సమస్య అయితే సంగ్మాకి మద్దతు ఇవ్వొచ్చు. కానీ ‘సంగ్మా అధికార పార్టీవాడు కాదు, పైగా కాంగ్రెస్ నుంచి గతంలో బహిష్కరించబడ్డవాడు, కనుక ఆయన గెలిచే అవకాశాలు లేవని’ ఆయనని మద్దతు ఇవ్వలేదా? గెలిచే అభ్యర్థులకి మాత్రమే CPMవాళ్ళు మద్దతు ఇస్తారు కానీ గెలవలేని అభ్యర్థులని గెలిపించడానికి ప్రయత్నించరా? సంతలో గాడిదని కొనేవాళ్ళు దాని శారీరక బలం చూసి కొంటారు. పనులు చెయ్యించడానికి వాటి శారీరక బలం అవసరమే కాబట్టి. కానీ బలహీనంగా ఉన్న గాడిదని కొని, దాన్ని కుడితి, ఉలవలుతో మేపి, అలా శారీరకంగా బలపరచాలనుకోరు. ఎందుకంటే వాళ్ళకి instant ప్రయోజనం ముఖ్యం. CPMవాళ్ళు కూడా ఇలాగే instantగా వ్యక్తిగత ప్రయోజనం పొంది, కార్మిక వర్గానికి secondary justice ఇవ్వాలని చూస్తున్నారా?

 18. ‘వైరుధ్యాలని మరచి, శతృవుతో కలిసి సామరస్య సహకారం చెయ్యడమే’ CPM వారి ఫండమెంటర్ ఆచరణ సూత్రం. సంఘర్షణ నుంచే మార్పు వస్తుంది అని చెపితే CPM వాళ్ళకి రుచించదు. గతితార్కిక-చారిత్రక భౌతికవాదాన్ని కావాలని మర్చిపోయినవాళ్ళకి మనం లాజిక్ గురించి ఏమి చెప్పినా అది బోడిగుండు-మోకాలు పోలికలాగే కనిపిస్తుంది.

 19. రామ్మోహన్ గారూ, మీరడిగింది చెప్పడం మరిచాను.

  అన్నీ పార్టీల్లో ఉన్నట్లే కాంగ్రెస్ లోనూ వైరుధ్యాలున్నాయి. ముఖ్యమైన వైరుధ్యం పాత, కొత్త కాపులకి మధ్య ఉంది. దేశంలో ప్రభుత్వరంగ కంపెనీలపై ఆధారపడిన పెట్టుబడిదారీ వర్గం ఇంకా బలంగానే ఉంది. పూర్రిగా ప్రవేటీకరణను ప్రభోధించే పెట్టుబడిదారీ వర్గం వారికి సవాలుగా ఎదిగింది. నూతన ఆర్ధిక విధానాలు వీరిద్దరికీ ఆమోదమే అయినా తమ పునాదిని వదులుకోవడానికి పాత కాపులు సిద్ధంగా లేరు. పూర్తి ప్రవేటీకరణకు వీరు బలహీనంగానే అయినా ప్రతిఘటన ఇస్తున్నారు. దానిక్కారణం స్వదేశీ, విదేశీ బడా కంపెనీలతో పోటీ పడే స్ధాయి, వివిధ రకాల వనరులు, మెళకువలు వారికి లేకపోవడం కావచ్చు. మొత్తం మీద వీరిమధ్య వైరుధ్యం ఉన్న సంగతి గుర్తించాలి. వీరి వైరుధ్యాలే కాంగ్రెస్ లోనూ ప్రతిఫలిస్తుంటాయి. పాత కాపుల తరపున కొందరూ, కొత్త కంపెనీల తరపున మరికొందరూ ఘర్షణ పడుతుండం వల్ల అవి కాంగ్రెస్ లో విభేధాలుగా వ్యక్తం అవుతుంటాయి. వోడా ఫోన్ పై ప్రణబ్ కత్తి కట్టడం దానిలో భాగమే.

  వోడా ఫోన్ పన్ను వివాదం ఒక్కటే ఇక్కడ లేదు. వోడా ఫోన్ బాకీ పడింది 11,000 కోట్లయితే ఇతర కంపెనీలు 44,000 కోట్లు. హచిసన్ కంపెనీ కొనుగోలులో వోడా ఫోన్ కంపెనీ భారత దేశంలోని ఒక పరిస్ధితిని అనుకూలంగా వాడుకుంది. ఈ కొనుగోలులో 11,000 కోట్లు ఆదాయపన్ను కట్టాలని ఇంకంటాక్స్ విభాగం లయబిలిటీ రైజ్ చేసింది. కంపెనీ కోర్టుకి వెళ్లింది. నాలుగేళ్ళు వాదనలు జరిగాక హై కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పినా సుప్రీం కోర్టు కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. కొనుగోలు జరిగిన 2007 నాటి చట్టాల ప్రకారం పన్ను కట్టనవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది. దానితో చట్టాన్ని గత 50 యేళ్ళకు వర్తించేలా సవరణకు ప్రణబ్ పూనుకున్నాడు. ఫైనాన్స్ బిల్లులో లో ఆమేరకు సవరణ పెట్టాడు. ఈ సవరణ పైన బ్రిటన్ ఆర్ధిక మంత్రి, హాలండ్, నార్వే తదితర దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. బ్రిటన్ ఆర్ధిక మంత్రి జార్జి ఒస్బోర్న్ అయితే ఇట్లయితే ఇండియాకి పెట్టుబడులు రావని కూడా బెదిరించాడు.

  కంపెనీల పెట్టుబడులకి పన్నులు తక్కువగా ఉండే దేశాలంటే ముద్దు. పన్నుల ఎగవేతకు సహకరిస్తూ వివిధ దేశాలు అనేక సౌకర్యాలు కల్పించాయి. ఆ సౌకర్యాలను ఉపయోగించుకోవదానికి ‘టాక్స్ ప్లానింగ్’ అని అందమైన పేరు పెట్టుకున్నారు. నిజానికి ఇది కూడా ఎగవేతే. ప్రభుత్వ చట్టాల సాయంతో ఎగవేస్తే అది టాక్స్ ప్లానింగ్ గా మారుతుంది. పెట్టుబడులు రావడమే గొప్పగా ప్రచారం చేసి ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలు తేగలుగుతున్నాయి. ప్రభుత్వాలు, కంపెనీలు పరస్పరం సహకరించుకుంటూ చేస్తున్న వ్యవహారంలో వారిలో వారికి వైరుధ్యాలు తలెత్తడం వల్ల ఇలాంటి వివాదాలు కోర్టుల దాకా వస్తున్నాయి. వోడా ఫోన్ లాంటి కంపెనీలు ఇంకా ఉన్నాయి. ప్రణబ్ సవరణ వల్ల మొత్తం పెట్టుబడిదారీ కంపెనీలకు ఉన్న ఒక పన్ను ఎగవేత సౌకర్యం మూసుకుపోయినట్లే. అందువల్లనే మంత్రి పదవి ఊడిపోయింత స్ధాయికి గొడవ చేరింది.

 20. విశేఖర్ గారు, నాది ఒక సందేహం. 1990 తరువాత మన దేశంలో ఎన్ని దేశీయ పరిశ్రమలు మూతపడినా, గ్లోబలైజేషన్ వల్ల తమ పిల్లలకి ఐటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి గ్లోబలైజేషన్‌ని సమర్థించేవాళ్ళని చూశాను. విదేశీయులు పోసే మోచేతి నీళ్ళు మనవాళ్ళకి అంతగా రుచించాయా అని నాకు సందేహం వచ్చింది. పరిశ్రమలని మూసేసినవాళ్ళు తమ డబ్బుని రియల్ ఎస్టేట్స్ రంగంలో పెట్టుబడులు పెట్టారు కానీ విదేశీ పెట్టుబడులని వ్యతిరేకించలేదు. నాకు తెలిసినంతవరకు మన రాష్ట్రంలో పలాస జీడి ఫాక్టరీల యజమానులు మాత్రమే సరళీకృత ఆర్థిక విధానాలని వ్యతిరేకించారు. అందుకే మన దేశంలోని తెల్ల చొక్కా వర్గంలో సామ్రాజ్యవాదంపై వ్యతిరేకత ఎంత వరకు ఉందా అని సందేహం వచ్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s