టర్కీ విమానం కూల్చివేత పై నాటో సమావేశం


Turkey plane downedసిరియా గగనతలంలోకి చొరబడిన టర్కీ విమానాన్ని సిరియా కూల్చివేయడం పై నాటో దేశాలు సమావేశం కానున్నాయి. టర్కీ, నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశం. నాటో సంస్ధ ఆర్టికల్ 4 ప్రకారం సంస్ధ సభ్య దేశం తమ ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వతంత్రత ప్రమాదంలో పడిందని భావించినపుడు నాటో దేశాల సమావేశం కోసం విజ్ఞప్తి చేయవచ్చు. దాని ప్రకారమే నాటో సమావేశం ఏర్పాటు చేయాలని టర్కీ కోరిందని నాటో ప్రతినిధి ఒనా లుంగెస్క్యూ ని ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది. నాటో లో నిర్ణయాలు తీసుకునే నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్ మంగళవారం సమావేశం జరుపుతుంది.

టర్కీ కి చెందిన ‘ఎఫ్-4 ఫాంటమ్’ యుద్ధ విమానం సిరియా గగనతలంలోకి చొరబడడంతో దానిని సిరియా మిలట్రీ శుక్రవారం కూల్చివేసింది. సిరియా గగనతలంలోకి తమ విమానం చొరబడలేదని టర్కీ చెబుతున్నప్పటికీ విమానం సిరియా సముద్ర జలాల్లోనే కూలిపోయిందని టర్కీ టి.వి చానెళ్లు చెబుతున్నట్లు పత్రికలు తెలిపాయి. సరిహద్దు జలాల్లో ఎగురుతున్నపుడు విమానాలు పొరుగు దేశం గగనతలంలోకి వెళ్ళడం రోటీనేనని టర్కీ విదేశాంగ మంత్రి అహ్మత్ దవుతోగ్లు అన్నాడని ప్రెస్ టి.వి తెలిపింది. టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లా గుల్ కూడా తమ విమానం సిరియా గగనతలన్నీ ఉల్లంఘించ ఉండవచ్చని వ్యాఖ్యానించాడు. విమానాన్ని కూల్చినపుడు మాత్రం అది అంతర్జాతీయ గగనతలంలోనే ఉన్నదని దవుతోగ్లు చెప్పాడు.

సిరియా లోకి టర్కీ విమానం జొరబడ్డ విషయం వదిలి విమానాన్ని సిరియా కూల్చడాన్నే చర్చగా చేయడానికి టర్కీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాల ప్రాపకంతో సిరియాలో అంతర్యుద్ధానికి టర్కీ సహకరిస్తోంది. సిరియా టెర్రరిస్టులకు శిక్షణ కూడా ఇస్తున్నది. టర్కీ ద్వారా సిరియా టెర్రరిస్టులకు ఆయుధ, ధన సహాయంతో పాటు కిరాయి తిరుగుబాటుదారుల సరఫరా కూడా జరుగుతున్నది.

ఈ విషయాన్ని జూన్ 22 నాటి కధనంలో ‘ది గార్డియన్’ పత్రిక మరోసారి తెలియజేసింది కూడా. ఇస్తాంబుల్ లో 22 మంది సభ్యుల కమాండ్ సెంటర్ ను సిరియా తిరుగుబాటుదారులు నెలకొల్పడానికి టర్కీ అనుమతి ఇచ్చిందని గార్డియన్ తెలిపింది. ఈ సెంటర్ ద్వారా సిరియాలోని సాయుధ కిరాయి బలగాలకు సరఫరాలు పర్యవేక్షిస్తున్నట్లు ఆ పత్రిక తెలిపింది. ఈ నేపధ్యంలో సిరియాలో అల్లకల్లోలం సృష్టించి ఆ దేశాన్ని ముక్కలు చేయడానికి నాటో చేస్తున్న ప్రయత్నాలకు విమాన కూల్చివేత అదనపు అవకాశంగా పరిణమించినట్లు కనిపిస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నాటో ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

విమానం కూల్చివేతను సిరియా విదేశాంగ మంత్రి జిహాద్ మక్దిస్సీ యాక్సిడెంట్ గా అభివర్ణించినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. కొంతమంది చెబుతున్నట్లు అది దాడి కాదని ఆయన అన్నాడని తెలిపింది. సిరియా సముద్ర జలాల్లోకి విమానం చొచ్చుకుని వచ్చినందునే కూల్చామని ఆయన అన్నాడని తెలిపింది.

ఇదిలా ఉండగా సిరియాలోకి ఆయుధాలను స్మగుల్ చేయడానికి ప్రయత్నిస్తున్న 40 మంది జర్మన్లను సిరియా అరెస్టు చేసింది. 40 మంది జర్మనీ దేశధులు ఒక సెక్యూరిటీ సంస్ధ లో ఉద్యోగులను ఎన్.ఎస్.ఎన్.బీ.సీ న్యూస్ బ్లాగ్ ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. జర్మన్లతో పాటు 300 మంది విదేశీయులను ఇప్పటివరకూ సిరియా ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకి పంపింది. ఈ విషయంపై జర్మనీ నుండి ఎలాంటి వ్యాఖ్యా వెలువడలేదు. ఇందకుముందు కూడా 100 మందికి పైగా ఫ్రెంచి దేశస్ధులను సిరియా పట్టుకుని అరెస్టు చేసింది. అనేకమంది విదేశీ కిరాయి సైనికులను సిరియా అరెస్టు చేసినప్పటికీ తిరుగుబాటులో తమ పాత్ర లేదని పశ్చిమ దేశాలు బొంకడం మానలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s