జి 20, రియో సభల కోసం ప్రధాని మన్మోహన్ వారం రోజుల పాటు ఉత్తర, దక్షిణ అమెరికాలు వెళ్లివచ్చాడు. మెక్సికో లో జి 20 సమావేశాలు జరగ్గా బ్రెజిల్ రాజధాని ‘రియో డి జనేరియో’ లో ‘రియో + 20’ పేరుతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సమావేశాలు జరిగాయి. గ్లోబల్ వార్మింగ్ పై 1992 లో మొదటి సారి ‘ఎర్త్ సమ్మిట్’ పేరుతో రియోలోనే ప్రపంచ దేశాల సమావేశాలు జరిగాయి. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 2012 లో అదే చోట, అదే సమస్యపై జరుగుతున్నందున ఈ సమావేశాలను ‘రియో + 20 కాన్ఫరెన్స్’ గా పేరు పెట్టారు.
ఈ రెండు సమావేశాల్లోనూ ప్రధాని మన్మోహన్ చెలరేగిపోయాడని భారత పత్రికలు రాస్తున్నాయి. జి 20 సమావేశాల సందర్భంగా రుణ సంక్షోభంతో అట్టుడుకుతున్న తమ ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరాన్ని ‘యూరో జోన్’ కు ప్రధాని బోధించాడు. రియో సమావేశంలో గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం అభివృద్ధి చెందిన దేశాలు, ఇతర దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి నిరాకరిస్తున్నాయని తప్పు పట్టాడు. గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి శతాబ్దాలుగా దోహదం చేసి కూడా తీరా గ్లోబల్ వార్మింగ్ తగ్గించవలసిన ఆపత్సయం వచ్చేసరికి పేద దేశాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని పశ్చిమ దేశాలను ప్రశ్నించాడు. ఎన్ని హామీలు గుప్పిస్తున్నా ఆచరణలోకి రావడం లేదని ఎత్తి చూపాడు. మోయలేని అప్పుల్ని మోస్తున్న బ్యాంకుల్ని బాగు చేసుకోవాలనీ, భారీగా ఉన్న సావరిన్ అప్పులు తగదనీ, బుద్ధిగా పొదుపు విధానాలు పాటించాలనీ యూరో జోన్ కు సుద్దులు చెప్పాడు. పొదుపు విధానాలే పరమావధిగా కాక వాటికి ‘వృద్ధి విధానాలు’ జత చేయాలనీ మర్మం బోధీంచాడు.
అయితే భారత ఆర్ధిక పరిస్ధితి కూడా ఏమంత ప్రోత్సాహకరంగా లేదు. రెండంకెల ఆర్ధిక వృద్ధి కోసం తపన పడి తీరా 7 శాతం కూడా గత సంవత్సరం సాధించలేకపోయింది. అమెరికా, యూరప్ ల ఆర్ధిక బలహీనతలే ఇండియా ఆర్ధిక అధోగమనానికి కారణం అని చెబుతున్నప్పటికీ మన బంగారం బాగుందని మాత్రం చెప్పలేకపోతున్నారు. రూపాయి పతనానికి బ్రేకుల్లేకుండా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ నిధులు తరలిపోతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు పతనం కావడం నిత్యకృత్యంగా మారింది. అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా పడిపోతున్నా రూపాయి పతనం వల్ల ఆ తగ్గుదల ప్రజల వరకూ చేరని పరిస్ధితి దాపురించింది. ఇంట్లో ఈగల మోత పెట్టుకుని బైట పల్లకీ మోతమన్మోహన్ కి ఎలా సాధ్యం? బడాయి కాకపోతే!
కార్టూన్: ది హిందూ