క్షణమాత్రంలో ఎర్రని మంటను సైతం శ్వేతశిల గా మార్చగలిగే అంటార్కిటికా వాతావరణంలో నిత్యాగ్నిహోత్రంలా జ్వలించే అగ్నిపర్వతం ‘మౌంట్ ఎరేబస్.’ అంటార్కిటికా లో ‘మౌంట్ సిడ్లే’ తర్వాత ఇదే ఎత్తయినది. శాశ్వత లావా సముద్రం కలిగిన పర్వతంగా ‘మౌంట్ ఎరేబస్’ ప్రాముఖ్యత పొందింది. ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ లో భాగమే మౌంట్ ఎరేబస్ అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రింగ్ లో ఇంకా 160 చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని ‘నేషనల్ జాగ్రఫిక్’ వెబ్ సైట్ తెలిపింది. 1972 నుండి ఈ వోల్కనో మండుతూనే ఉంది. ‘మౌంట్ ఎరేబస్ వోల్కనో అబ్జర్వేటరీ’ పేరుతో ఇక్కడ ప్రయోగశాల కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ వైపు గడ్డకంటే చలి, మంచు కొనసాగుతుండగా దానికి సమీపంలోనే రాళ్లను సైతం కరిగించే ఉష్ణోగ్రతలు మౌంట్ ఎరేబస్ సొంతం. ప్రకృతి వైవిధ్యం పక్క పక్కనే కొలువు తీరడం అన్నమాట. లావా వేడి వల్ల మంచు కరిగిపోయి పెద్ద పెద్ద గుహలు ఈ పర్వతంలో ఏర్పడ్డాయి. ఈ గుహలు అంటార్కిటికా వాతావరణాన్ని, భూమి పరిణామ క్రమాన్నీ అధ్యయనం చేయడానికి సాధనంగా మారాయి. మంచు గుహల పైన ఉండే పలుచని పొరలనుండి సూర్యరశ్మి లోపలికి ప్రవహించి నీలి రంగుతో అద్భుతంగా కనువిందు చేయడం ఈ ఫొటోల్లో చూడవచ్చు. ‘నేషనల్ జాగ్రఫిక్’ వెబ్ సైట్ ఈ ఫొటోల్ని అందించింది.
–