ఫ్లేమ్: సైబర్ హై వే పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -3


ఇరానియన్ అణు శుద్ధి కేంద్రం ‘నటాంజ్’ లో స్టక్స్ నెట్ వైరస్ సృష్టించిన విధ్వంసం వెల్లడయిన రెండేళ్ల తర్వాత ‘ఫ్లేమ్’ అనే మరో వైరస్ గురించి కంప్యూటర్ నిపుణులు బయటపెట్టారు. ప్రధానంగా ఇరాన్ పై ప్రయోగించబడిన ఫ్లేమ్ ఫైరస్ ఇజ్రాయెల్ తో పాటు, మధ్య ప్రాచ్యంలోని ఇరాక్, సౌదీ అరేబియా, ఇంకా మరికొన్ని చోట్ల కూడా కనుగొన్నామని నెల క్రితం వారు తెలిపారు. ఫ్లేమ్ ఫైరస్ కూ స్టక్స్ నెట్ వైరస్ కూ అనేక పోలికలు ఉన్నాయనీ రెండింటికీ సోర్స్ కోడ్ ఒకటేననీ ప్రఖ్యాత రష్యన్ కంప్యూటర్ భద్రతా సంస్ధ ‘కాస్పరస్కీ’ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ లు సంయుక్తంగా ‘ఫ్లేమ్’ వైరస్ ను సృష్టించాయనీ, ఇరాన్ అణు కర్మాగారాలే లక్ష్యంగా ‘ఇండస్ట్రియల్ సేబోటేజ్’ కోసమే ఈ సృష్టి జరిగిందనీ ‘వాషింగ్టన్ పోస్ట్‘ పత్రిక నిన్న (జూన్ 20) వెల్లడి చేసింది.

‘స్టక్స్ నెట్’ వైరస్ కు ప్రాధమిక రూపంగా అమెరికా, ఇజ్రాయెల్ లు ‘ది బగ్’ ను అభివృద్ధి చేశాయని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించిన సంగతి విదితమే. (‘స్టక్స్ నెట్’ వైరస్ కు ఆ పేరు పెట్టింది దానిని కనుగొన్న కంప్యూటర్ నిపుణులు.) నటాంజ్ అణు శుద్ధి కేంద్రంలోని కంప్యూటర్ల లోకి జొరబడి అక్కడి సమాచారాన్ని అమెరికాలోని ‘నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ’ (ఎన్.ఎస్.ఏ) కు పంపడానికి ‘ది బగ్’ ప్రారంభ కోడ్ ఉద్దేశించబడిందని టైమ్స్ తెలిపింది. ‘ది బగ్’ ప్రారంభ లక్ష్యాలను (సమాచారాన్ని సేకరించి పంపడం) ‘ఫ్లేమ్’ వైరస్ కూడా నిర్వహించిందని  కాస్పరస్కీ వెల్లడించిన సమాచారాన్ని బట్టి అర్ధమవుతోంది.

పవిత్ర దుర్మార్గం

స్టక్స్ నెట్ సృష్టి కర్తలు అమెరికా, ఇజ్రాయెల్ లే ననీ, అణు విద్యుత్ కోసం ఉద్దేశించిన ఇరాన్ అణు శుద్ధి కర్మాగారంలో విధ్వంసం సృష్టించడానికే దీనిని సృష్టించారనీ కొద్ది రోజుల క్రితం ‘న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కధనానికీ నిన్న ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వెల్లడించిన కధనానికి ఒక మౌలికమైన తేడా కనపడుతోంది. ఇరానియన్ అణు కర్మాగారాలపై ‘సేబోటేజ్’ చర్యల కోసమే కంప్యూటర్ వైరస్ లను సృష్టించి ‘సైబర్ యుద్ధానికి’ ఇరు దేశాలు తెరతీసాయన్నది  రెండింటిలోనూ ప్రధానంగా చెప్పినప్పటికీ ‘టోన్’ లో తేడా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ లు ‘సేబోటేజ్’ కి పాల్పడ్డాయి అని టైమ్స్ లో ప్రధానంగా ధ్వనించగా, ఇరాన్ ఇంతవరకూ తయారు చేయని ‘అణు బాంబు’ ప్రమాదాన్ని నివారించదానికే అమెరికా, ఇజ్రాయెల్ లు సేబోటేజ్ కి పాల్పడ్డాయి అని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక చెప్పింది.

అంటే ఇరాన్ దేశంపైన రెండు ధూర్త రాజ్యాలు ప్రకటించిన అక్రమ సైబర్ యుద్ధానికి ఊహాజనితమైన ‘పవిత్ర లక్ష్యాన్ని’ ఆపాదించడానికి ‘పోస్ట్’ పూనుకుంది. టైమ్స్ కధనం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ లకు జరిగిన ‘నైతిక నష్టాన్ని’ సవరించడానికి ‘పోస్ట్’ రంగంలోకి దిగిందన్నమాట. పశ్చిమ దేశాల కంపెనీలు, పాలకవర్గాల ప్రయోజనాల పరిరక్షణకే పత్రికలు కట్టుబడి ఉంటాయి తప్ప ప్రజాస్వామ్య వ్యవస్ధలలో ప్రజలకు  నిజాలు చెప్పే ప్రక్రియకు అవి ఆమడదూరం అని చెప్పడానికి ఒక చిన్న సాఖ్యం మాత్రమే ఇది. అమెరికాలోని వివిధ కంపెనీలు లేదా పాలకవర్గాల మధ్య వైరుధ్యాలను కూడా పత్రికలు నెత్తిన వేసుకుంటాయని టైమ్స్, పోస్ట్ ల (స్వల్ప) వైరుధ్య కధనాలు స్పష్టం చేస్తున్నాయి.

అమెరికా అధికారులే స్వయంగా జాతీయ భద్రతా విధులను పక్కన పెట్టి అమెరికా ‘అనైతిక సైబర్ యుద్ధం’ గురించి సమాచారం ఎందుకు వెల్లడించారు? స్వతంత్ర దేశం అయిన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగించిన ‘సేబోటేజ్’ చర్యలను పత్రికలకు వెల్లడి చేయడం అంటే అమెరికాకు పరువు తక్కువే కదా! అలాంటి పరువు తక్కువ పనికి సైబర్ యుద్ధానికి కోడ్ నేమ్ అయిన ‘ఒలింపిక్ గేమ్స్’ లో పని చేసిన అధికారులే ఎందుకు పూనుకున్నారు? ఈ ప్రశ్నలకు బహుళ సమాధానాలు కనిపిస్తున్నాయి.

ఒకటి: అమెరికా లోని వివిధ కంపెనీల మధ్య ఉన్న వైరుధ్యాలు. కంపెనీల మధ్య ఉన్న పోటీ, వైరుధ్యాలను ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’, ‘సెనేట్’ ల సభ్యులు ప్రతిబింబిస్తూ నిరంతరం ఘర్షణ పడుతుంటారన్నది తెలిసిన విషయమే. తమలో ఉన్న వైరుధ్యాలు ఉచ్చస్ధాయికి చేరుకున్నపుడు వీరు ఒకరి గుట్టుమట్లు మరొకరు బైటపెట్టుకుంటూ ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా, స్వల్పమాత్రంగానే అయినా, ప్రజలకు ఆయాచితంగా కొన్ని నిజాలు తెలుస్తాయి. సైబర్ యుద్ధం పై కొన్ని వాస్తవాలు వెల్లడికావడానికి ఒదొక కారణం కావచ్చు.

రెండో కారణం అమెరికా కాంగ్రెస్ లోని కొంతమంది సభ్యులు వెల్లడి చేశారు. వారి ప్రకారం రానున్న ఎన్నికల్లో ప్రత్యర్ధులపై కొన్ని పాయింట్లు అధికంగా పొందడానికి ఒబామా ప్రభుత్వ వర్గాలు ఈ లీకేజీకి పాల్పడ్డాయి. అమెరికా జాతీయ భద్రత కోసం ఇరాన్ అణు బాంబు ప్రమాదాన్ని నివారించడం కోసం అధ్యక్షుడు ఒబామా ‘సైబర్ యుద్ధం’ ప్రకటించే సాహసానికి పూనుకున్నాడు అన్న ప్రచారం పొందితే అదనంగా ఓట్లు పొందవచ్చని ఈ లీకేజీకి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఒబామా స్వయంగా ‘సైబర్ సేబోటేజ్’ కు ఆదేశాలిచ్చాడని అధికారులు నొక్కి చెప్పడాన్ని బట్టి ఈ ఆరోపణకు బలం చేకూరుతోంది. అసలు లీకేజీ ద్వారానే ఒబామా జాతీయ భద్రతకు ప్రమాదం తెచ్చిపెట్టాడని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.  లీకేజీ లో ప్రయోజనాలు ఉన్నాయా లేక ఒబామా పై ఆరోపణలలో ప్రయోజనాలు ఉన్నాయా అన్నది చర్చనీయాంశం.

మరో కారణం అనివార్యత. ఇరాన్ అణుకర్మాగారంపై అమెరికా, ఇజ్రాయెల్ లు సేబోటేజ్ కు పాల్పడ్డాయని గత రెండున్నరేళ్ల నుండీ అనుకుంటున్నదే. స్టక్స్ నెట్ సృష్టి కర్త ఇజ్రాయెల్ దేశమేనని కొద్ది నెలల క్రితం బి.బి.సి పత్రిక ఓ కధనం ప్రచురించింది. దానిద్వారా ఇజ్రాయెల్ పాత్ర స్పష్టం అయింది. ఇజ్రాయెల్ కి అమెరికా తోడు నిలిచిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ విధంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ఇరాన్ అణు శుద్ధి కర్మాగారం విధ్వంసానికి పూనుకున్నాయని దాదాపు అందరి నోళ్లలో నానిపోయింది. ఇక దాచి లాభం లేదు. పైగా కంప్యూటర్ల వినియోగం సర్వ వ్యవస్ధలలో అనివార్యంగా మారినందున సైబర్ యుద్ధం కూడా అనివార్యమే.

దురాక్రమణ యుద్ధాల ద్వారా అమాయక ప్రజలను మూకుమ్మడిగా చంపేయడానికి కూడా సిద్ధపడే సామ్రాజ్యవాదులకు సైబర్ యుద్ధంలో నైతికతను నటించవలసిన అవసరం లేదు. నటన అసాధ్యమూ, అనవసరమూ అయిన నేపధ్యంలో ‘స్టక్స్ నెట్’, ‘ఫ్లేమ్’ లు మా పనే అంటూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ‘పరిశోధనాత్మక జర్నలిజం’ ముసుగులో తమను తాము బైటపెట్టుకున్నాయి. తమ సైబర్ వార్ ఫేర్ ‘స్టక్స్ నెట్’, ‘ఫ్లేమ్’ ల వైఫల్యంతో ఆగిపోలేదనీ, మరింత ఆధునిక పద్ధతుల్లో కొనసాగుతోందనీ ‘టైమ్స్’, ‘పోస్ట్’ పత్రికలకు అధికారులు చెప్పడం ఈ సందర్భంగా గమనించాలి. అంతేకాకుండా, ఇరాన్ వరకు మాత్రమే తమ సైబర్ వార్ పరిమితం అని చెప్పడానికి కూడా వారు నిరాకరించారు.

ఫ్లేమ్, అత్యంత శక్తివంతమైనది

‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికకు సమాచారం అందించిన అమెరికా ఉన్నతాధికారుల ప్రకారం భారీ పరిమాణం కలిగిన ఫ్లేమ్ వైరస్ ఇరాన్ కంప్యూటర్ నెట్ వర్క్ లను మానిటర్ చేస్తూ నిరంతరం గూఢచార సమాచారాన్ని సేకరించి పంపించింది. తద్వారా సైబర్ యుద్ధ దాడులకు ముందస్తు ఏర్పాట్లు చేసింది. అమెరికాకి చెందిన ఎన్.ఎస్.ఏ, సి.ఐ.ఏ, ఇజ్రాయెల్ మిలట్రీ ఇందులో భాగం పంచుకున్నాయి. స్టక్స్ నెట్, ఫ్లేమ్ లతో కూడిన ‘సైబర్ సేబోటేజ్’, విస్తృతమైన, దీర్ఘకాలికమైన సైబర్ యుద్ధంలో ఒక భాగం మాత్రమే. దీనికి బుష్ అధ్యక్షరికంలో బీజాలు పడగా, ఒబామా పాలనలో ఊపందుకుంది. నెలరోజుల క్రితం తమ ఆయిల్ పరిశ్రమపై వరుస దాడులు జరిగినట్లు ఇరాన్ కనిపెట్టాక ఫ్లేమ్ వైరస్ పై కంప్యూటర్ భద్రతా సంస్ధలు పరిశోధన మొదలు పెట్టాయి. ఆయిల్ పరిశ్రమపై దాడులు ఇజ్రాయెల్ ఏకపక్షంగా చేసినదేననీ అమెరికా పాత్ర లేదనీ ‘వాషింగ్టన్ పోస్ట్’ చెబుతోంది. తమ దృష్టి ఇరాన్ అణు కర్మాగారాలపైనే తప్ప ఆయిల్ పరిశ్రమపై కాదని దీనిద్వారా అమెరికా చెప్పడలిచినట్లు కనిపిస్తోంది. అయితే ఈ అమెరికా వాదనను నమ్మవలసిన అవసరం లేదు.

ఫ్లేమ్ వైరస్ అత్యంత శక్తివంతమైనది. నిపుణుల ప్రకారం వైరస్ ల చరిత్రలో ఇంతకంటే భారీ పరిమాణం కలిగినది ఇంతవరకూ వెల్లడి కాలేదు. ఇది అత్యంత ఆధునికమైనది. గూఢచారులు అనేక ప్రమాదాలకు ఓర్చి సాగించే భౌతిక చర్యలను కూడా ఇది చేయగలదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న నెట్ వర్క్ లలో సైతం ఇది తనను తాను పునః సృష్టించుకోగలదు. నెట్ వర్క్ లోకి చొరబడ్డాక అనేక కంప్యూటర్ విధులను తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. రహస్య సమాచారాన్ని సేకరించి ఆదేశించబడిన చోటుకు పంపుతుంది. కంప్యూటర్లకు అనుసంధానించబడిన మైక్రో ఫోన్ లనూ, కెమెరాలనూ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. వాటిని యాక్టివేట్ చేస్తుంది. కంప్యూటర్ ముందు కూర్చున్నవారు కీ బోర్డ్ పై ఏయే కీ లను టైప్ చేస్తున్నారో రికార్డు చేస్తుంది. స్క్రీన్ షాట్లు తీస్తుంది.

కంప్యూటర్ లో ఉన్న బొమ్మలు లేదా ఫోటోలు ఎక్కడెక్కడ తీసిందీ సమాచారాన్ని సేకరిస్తుంది. బ్లూ టూత్ వైర్ లెస్ టెక్నాలజీ ద్వారా కమాండ్లు జారీ చేయడం, రిసీవ్ చేయడం చేస్తుంది. మైక్రో ఫోన్లు, కెమెరాల ద్వారా కంప్యూటర్ ల వద్ద ఉన్న వ్యక్తులను ఫోటోలు తీసి, సంభాషణలు రికార్డు చేస్తుంది. కంప్యూటర్లు ఉన్న గదులను ఫోటోలు తీస్తుంది. వీటన్నింటినీ ఆదేశించబడిన చోటుకు పంపుతుంది. ఇదంతా కేవలం ‘మైక్రోసాఫ్ట్ అప్డేట్’ ముసుగువేసుకుని మరీ చేస్తుందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక తెలిపింది. ఐదు సంవత్సరాల క్రితం నుండీ ఈ వైరస్ తన విధులు నిర్వహిస్తోంది. నిజానికి స్టక్స్ నెట్ కంటే ముందే ఫ్లేమ్ పని చేయడం ప్రారంభించిందనీ, కాకపోతే స్టక్స్ నెట్ వైరస్ ఇరాన్ కంప్యూటర్ల నుండి తప్పించుకోవడం వల్ల అది ముందు ప్రచారంలోకి వచ్చిందనీ నిపుణులు చెబుతున్నారు. (ఇజ్రాయెల్ ఉప సేబోటేజ్ వల్ల స్టక్స్ నెట్ ఇరాన్ నుండి తప్పించుకుందని అమెరికా ఇప్పుడు ఆరోపిస్తోంది.)  దీనిని బట్టి, టైమ్స్ చెప్పిన ‘ది బగ్’ అంటే ‘ఫ్లేమ్’ అయి ఉండవచ్చని అనుమానాలు కలుగుతున్నాయి.

ఫ్లేమ్ ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ‘వాషింగ్టన్ పోస్ట్’ కొంతమంది నిపుణులను ఉటంకించింది. ‘ఫ్యూజన్ X’ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ తాం పార్కర్ ఇలా అన్నాడు. “విస్తృత నైపుణ్యమూ, వనరులూ ఉన్న అనేకమంది భద్రతా పరిశోధకులకు సైతం సాధ్యం కాదిది.”  వైరస్ వెనుక ఎవరున్నారన్న ప్రశ్నకు ఆయన తెలియదని చెప్పాడు. “ఎన్.ఎస్.ఏ లాంటి సంస్ధల కోసం పని చేసే అత్యంత ఉన్నత స్ధాయి పరిజ్ఞానం కలిగిన క్రిప్టో మేధమెటీషియన్ లకు మాత్రమే ఇది సాధ్యం.” అని పార్కర్ వ్యాఖ్యానించాడు.

అమెరికా, ఇజ్రాయెల్ వైరుధ్యాలు

‘ఒలింపిక్ గేమ్స్’ కోడ్ నేమ్ తో ప్రారంభం అయిన అమెరికా, ఇజ్రాయెల్ ల ‘సైబర్ సేబోటేజ్’ అయిదేళ్ళ క్రితం మొదలయింది. ఈ సేబోటేజ్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని నెమ్మదించడానికీ, ఇరాన్ పై మిలట్రీ దాడులు చేయవలసిన అవసరాన్ని నివారించడానికీ మాత్రమేనని, తద్వారా ఇరాన్ తో చర్చలు జరిపే కాలాన్ని పొడిగించాలని భావించారనీ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక పదే పదే తన కధనంలో చెప్పుకుంది. సాంప్రదాయక సేబోటేజ్ చర్యలను సైబర్ దాడులు వేగవంతం చేశాయని పోస్ట్ తెలిపింది. ఇరాన్ అణు శుద్ధి కర్మాగారాలకు సరఫరా అయ్యే ‘సెంట్రీ ఫ్యూజ్’  లను మధ్యలోనే అడ్డుకుని వాటి స్ధానంలో పని చేయని సెంట్రీ ఫ్యూజ్ లనూ ఇతర న్యూక్లియర్ పరికరాలనూ ప్రవేశపెట్టే చర్యలకు అమెరికా పాల్పడింది. సాంప్రదాయక సేబోటేజ్ చర్యలు అని వీటిగురించే పోస్ట్ చెబుతోంది.

ఇరాన్ అణు కర్మాగారాలపై తాము జరిపిన దాడి ఇరాన్ అణు బాంబు వల్ల కలగనున్న ప్రమాదానికి సరిసమానమైనదని అమెరికా గూఢచార అధికారిని ఉటంకిస్తూ పోస్ట్ తెలిపింది. అయితే ఇక్కడ అసలు సంగతి ఏమిటంటే, ఇరాన్ అణు బాంబు అసలు తయారే కాకపోగా, అమెరికా ఇజ్రాయెల్ ల సైబర్ యుద్ధం, వాణిజ్య యుద్ధం, అక్రమ ఆంక్షలు ఇవన్నీ దశాబ్దాలుగా కొనసాగుతూ అక్కడి ప్రజల ఆర్ధిక సామాజిక స్ధితిగతులను విధ్వంసం కావిస్తున్నాయి. ఇరాన్ ప్రజల ఆర్ధిక వనరులను ఆక్రమించుకోవడానికి అమెరికా సాగిస్తున్న అక్రమ, అనైతిక ఆర్ధిక, రాజకీయ, సైబర్ యుద్ధాలకు ఇరాన్ వద్ద లేని అణు బాంబును సాకుగా చూపడమే అసలు దుర్మార్గం.

2008 లో ‘ఒలింపిక్స్ గేమ్స్’ రూపంలో సైబర్ యుద్ధం ఆచరణలోకి వచ్చినప్పటికీ దీనికి ప్రయత్నాలు మాత్రం 2005 ప్రాంతంలో ప్రారంభం అయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ ప్రాజెట్ లో ఉమ్మడిగా పని చేసినప్పటికీ పని చేస్తున్న కాలంలోనే ఇరు దేశాల మధ్యా వైరుధ్యాలు తలెత్తాయి. ప్రాజెక్టులో తమ ప్రయోజనాలనే ప్రధమ స్ధానంలో నిలపాలని ఇరు దేశాలు ప్రయత్నించడం వల్ల ఈ వైరుధ్యాలు తలెత్తాయి. వైరుధ్యాల రూపంలో సంఘర్శిస్తూనే ఉమ్మడి ప్రయోజనాల కోసం తమ ప్రధాన కృషిని అవి కొనసాగించాయి.

వైరుధ్యాల కారణంగానే ‘స్టక్స్ నెట్’ వైరస్ నటాంజ్ కర్మాగారం నుండి కట్టు తప్పడానికి ఇజ్రాయెల్ దోహదం చేసింది. ఆ విధంగా ‘స్టక్స్ నెట్’ గురించి లోకానికి వెళ్లడయింది.  ఇరాన్ ఆయిల్ పరిశ్రమ పై కూడా ‘ఫ్లేమ్’ వైరస్ సాయంతో సమాచారం సేకరించాలని గత ఏప్రిల్ లో ఇజ్రాయెల్ ప్రయత్నించడం వల్ల దానిని కని పెట్టే అవకాశం ఇరాన్ కి లభ్యం అయింది. రష్యన్ కంప్యూటర్ భద్రతా కంపెనీ ‘కాస్పరస్కీ’, హంగేరియన్ సైబర్ లాబ్ ల సాయంతో ‘ఫ్లేమ్’ ను ఇరాన్ కనిపెట్టగలిగిందని పత్రికలు చెబుతున్నాయి. ఈ వార్తను కాస్పరస్కీ ధృవీకరించదానికి నిరాకరించింది. ‘ఫ్లేమ్’ అనే పేరు పెట్టింది ‘కాస్పరస్కీ’ కంపెనీయే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s