మతమౌఢ్యం ప్రజలకు ఇష్టం లేదు, మోడిని ఉద్దేశిస్తూ జె.డి(యు)


ప్రధానమంత్రి పదవి కోసం ఎన్.డి.ఏ లో పోటీ తీవ్రం అయినట్లు కనిపిస్తోంది. మౌతమౌఢ్యం ఉన్నవారిని ప్రధానిగా దేశ ప్రజలు అంగీకరించరని ఎన్.డి.ఏ భాగస్వామి జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు శివానంద్ తివారీ బుధవారం వ్యాఖ్యానించి మోడి పట్ల తమ పార్టీ కి ఉన్న వ్యతిరేకతను మరోసారి వ్యక్తం చేశాడు. 2014 లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో లేక ప్రతిపక్షంలోనే కూర్చోవాలో బి.జె.పి నిర్ణయించుకోవాలని ఆయన హెచ్చరించాడు. నరేంద్ర మోడి ని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘మతమౌఢ్యంతో నిండిన ముఖాన్ని ముందు పెట్టి అధికారంలోకి రావడం సాధ్యం కాదని బి.జె.పి నాయకులు గ్రహించాలని సుద్దులు చెప్పాడు.

2014 ఎన్నికల కోసం ప్రధాని పదవికి సెక్యులర్ అబ్యర్ధి అవసరమని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించిన రెండు రోజులకే శివానంద్ ప్రకటన వెలువడడం గమనార్హం. “తమ హార్డ్ కోర్ హిందూత్వ ఎజెండా ఆధారంగా దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమని 1996 లోనే బి.జె.పి గ్రహించింది. అనంతరం తాము ప్రతిపాదిస్తున్న మూడు వివాస్పద అంశాలు -యూనిఫార్మ్ సివిల్ కోడ్, జమ్ము కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ఉపసంహరణ, రాముడి గుడి నిర్మాణం- వదులుకున్న తర్వాత ఎన్.డి.ఏ ఏర్పాటయ్యింది” అని శివానంద్ తివారీ ఢిల్లీలో మాట్లాడుతూ అన్నాడు. దీనికి ఆర్.ఎస్.ఎస్ ఆమోదం కూడా ఉన్నదని ఆయన వెల్లడించాడు.

సెక్యులర్ చట్రాన్ని తమ పార్టీ జె.డి(యు) వదులుకోబోదని శివానంద్ తేల్చి చెప్పాడు. దాని ఆధారంగానే తాము ఎన్.డి.ఏ భాగస్వామిగా చేరామని తెలిపాడు. “బీహార్ లో మా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఈ విషయంలో రాజీ పడేది లేదు” అని ఆయన అన్నాడు. 2004 ఎన్నికల అనంతరం కొన్ని సర్వేలు జరిపామనీ అప్పటి ప్రధాని గుజరాత్ లో ముస్లిం మారణకాండ తర్వాత నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినట్లయితే 2004 సాధారణ ఎన్నికలను ఎన్.డి.ఏ కోల్పోయి ఉండేది కాదని ఆ సర్వేలలో తేలిందనీ ఆయన వెల్లడి చేశాడు.

రాజధర్మం పాటించాలని నరేంద్ర మోడి ని వాజ్ పేయ్ కోరుతూ గుజరాత్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పగా దానిని ఎల్.కె.అద్వానీ లాంటి బి.జె.పి నాయకులు వీటో చేశారనీ కూడా శివానంద్ వెల్లడి చేశాడు. తానా విధంగా వీటో చేసి ఉండకూడదని ఎల్.కె.అద్వానీ బహుశా ఇప్పుడు చింతిస్తూ ఉండవచ్చు. ఎన్.డి.ఏ తరపున ప్రధాన మంత్రి పదవికోసం ఎల్.కె.అద్వానితో నరేంద్ర మోడీ తీవ్రంగా పోటీ పడుతున్న సంగతి విదితమే. ఇటీవల ముంబైలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ప్రదర్శనలో పాల్గొనకుండా అద్వానీ, సుష్మా స్వరాజ్ లు బహిష్కరించారు. బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పోకడలపై తన బ్లాగ్ లో పరోక్ష విమర్శలను సైతం అద్వానీ గుప్పించినట్లు పత్రికలు తెలిపాయి. ప్రధాని అబ్యర్ధిత్వం కోసం అద్వానీ, మోడీ ల మధ్య సంఘర్షణే ఈ పరిణామాలకు కారణమని పత్రికలు విశ్లేషించాయి.

“వాజ్ పేయ్ ఉదారవాద ముఖం చూసి బి.జె.పి కి ఓట్లు వేసిన ప్రజలు గుజరాత్ మారణకాండ అనంతరం ఆ పార్టీకి దూరమయ్యారు. వారంతా కాంగ్రెస్ కి ఓట్లు వేశారు. ఎందుకంటే మతమౌఢ్యంతో నిండిన రాజకీయాలను ప్రజలు అంగీకరించరు” అని శివానంద్ అన్నాడు. “బి.జె.పి అధికారంలోకి రావాలని ఆ పార్టీవారు భావిస్తున్నట్లయితే అది మతమూఢుల ముఖాన్ని ముందు పెట్టి సాధించలేరని వారు గ్రహించాలి” అని నరేంద్రమోడి ని ఉద్దేశిస్తూ శివానంద్ వ్యాఖ్యానించాడు.

బి.జె.పి ప్రతినిధి బల్బీర్ పుంజ్ శివానంద్ వ్యాఖ్యలకు స్పందించాడు. “ఇది అనవసర వివాదం. ఎవరు సెక్యులరో, ఎవరు కాదో ఫత్వా ఇచ్చే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు. ప్రజలకు వారి స్వంత అభిప్రాయాలున్నాయి” అని ఆయన అన్నాడు. అయితే ప్రజల అభిప్రాయాలను రాజకీయ పార్టీలు ఖాతరు చేయకపోవడమే భారత దేశంలో అసలు విషాధం.

18 thoughts on “మతమౌఢ్యం ప్రజలకు ఇష్టం లేదు, మోడిని ఉద్దేశిస్తూ జె.డి(యు)

 1. నరేంద్ర మోడీ లాంటి నరహంతకులు ముఖ్యమంత్రులు అవ్వకూడదంటే మన దేశంలో సెక్యులరిజం అవసరమే. అయినా సెక్యులరిజం అంత గొప్పది అని నేను అనుకోను. కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి ఇప్పటి వరకు సెక్యులర్ ముసుగులోనే దేశాన్ని దోచుకుంది, బిజెపి మధ్యలో ఆరేళ్ళ పాటు మతం ముసుగులో దోచుకుంది. రెండు పార్టీల మధ్య ఉన్న తేడా అదే.

 2. అదేంటీ గోద్రా రైలు ఘటన తరువాత గుజరాత్ లో ముస్లిం మారణకాండ కదా? ముస్లిం మారణకాండ ఒక్కటే కాదు కదా జరిగింది?

 3. నిజమే! నరేంద్ర మోడి ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేడు.
  సొంత పార్టీలోనే ఆయనని అందరూ ఆమోదించరు. అలాంటప్పుడు సంకీర్ణభాగస్వాములు ఎలా అంగీకరిస్తారు?

 4. విశేఖర్ గారు, మీరు గమనించారో, లేదో, మతతత్వం వద్దు అనే నాయకులే కుల రాజకీయాలు నడుపుతుంటారు. “మతతత్వం వద్దు – హిందువులూ, ముస్లింలూ అన్నదమ్ములు” అని ప్రవచించిన గాంధీయే కుల వ్యవస్థని బహిరంగంగా సమర్థించాడు. “ఎవరి కుల వృత్తులు వాళ్ళు శ్రద్ధగా చేస్తే దేవతలు వాళ్ళపై పూల వర్షం కురిపిస్తారు” అని కూడా గాంధీ అన్నాడు. ఈ చరిత్రంతా చదివిన తరువాత నాకు సెక్యులరిజం మీద నమ్మకం పోయింది. నితీశ్ కుమార్ అయినా “మతతత్వం వద్దు – హిందువులూ, ముస్లింలూ కలిసి ఉండాలి” అని అంటాడు. కానీ అతని కులస్తులైన కుర్మీలు ఎక్కువగా లేని నియోజకవర్గంలో పోటీ చేసి గెలచడానికి ప్రయత్నించమంటే అతను ప్రయత్నించడు.

 5. ఉపరితల అంశాలలొ చరిత్రలొ ఎక్కువగా ప్రముఖ పాత్ర నిర్వహించిందీ మతమే. ఇండియా కమ్యునిస్టు పార్టీలు కుడా మిగిలిన వాటికంటే దీనికి ఎక్కువ విలువ ఇచ్చారు. నరేంద్ర మొడీ మారణహొమనుంచి. పాలక వర్గాలు ముఖ్యంగా ఓట్ల కొసం చుస్తాయి మతాన్ని నమ్ముకుంటే ఓట్లు రావనుకుంటే ఈ క్షణం నుంచి మతప్రస్తావన విడిచిపెట్టడానికి సిద్దమే b j p . మిగతా నాయకులు కుడా మతత్వాన్ని విమర్శిస్తున్నారంటె అది వాళ్ళ స్వప్రయొజనం కొసమే. అబ్యుదయం వల్ల కాదు.

  విశెఖర్ గారు. కేవలం వార్తల మీదే దౄస్టి పెట్టకుండా మిగతా అంశాలపైన కుడా చుస్తె భాగుంటుందని నా అభిప్రాయం బ్లాగుల్లొ అప్పుడప్పుడు కొన్ని ఆశక్తికరమైన చర్చలు కమ్యునిజం పైన జరుగుతూ వుంటాయి. అలాంటి వాటిపైన మీ అభిప్రయం తెలపవచ్చు కదా? మార్కిజం పైన ద్వెషంతొ కొంతమంది చేస్తూ వుంటారు అలాంటి వారికి సమాదానం చెప్పినా ఉపయొగం లేదు. వార్తా చానల్ల చుట్టు తిరిగే తెలకపల్లి రవిగారు లాంటి వారు మార్కిస్టు ముసుగులొ వున్న పచ్చి బుర్జువా అని నా ప్రగాడ విస్వాసం. మీరేమంటారు.?

 6. రామ్మోహన్ గారు,

  ‘మిగతా అంశాలు’ అంటే మీ అభిప్రాయం ఏమిటి? పేరుకి ‘వార్తలు’ అని చెప్పినా పత్రికల వార్తలు యధాతధంగా చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ముఖ్యమైన వార్తలను మార్క్సిస్టు దృక్కోణంలో చూసే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. నా ప్రయత్నం సఫలం కావడం లేదని మీ అభిప్రాయమా?

  మార్క్సిజం పైన ఆసక్తి కరమైన చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి? కమ్యూనిజం పై చర్చలను విస్మరించడం తప్పిదమే కాగలదు. ఫలానా చోట నా అభిప్రాయం అవసరమని మీరు భావించినట్లయితే మీరు చెప్పగలరు. తప్పకుండా స్పందిస్తాను. అందుకు నేను వ్యతిరేకిని కాను.

  రవి గారు సి.పి.ఎం పార్టీకి చెందినవారు. ఆయన రాజకీయ అభిప్రాయాలూ ఆ పార్టీకి భిన్నంగా ఉండవు. సి.పి.ఎం పై నాకున్న అభిప్రాయం ఆయనకి కూడా వర్తిస్తుంది. ఆయన ‘పచ్చి బూర్జువా’ అని చెప్పగలిగే విధంగా ఆయన గురించి నాకు తెలియదు.

  సి.పి.ఎం పార్టీ వర్గ పోరాటం ద్వారా కార్మిక వర్గ విప్లవం సాధించాలన్న మౌలిక లక్ష్యాన్ని నామమాత్రం చేసి పార్లమెంటరీ రాజకీయాల పరిధిలోనే తన పనిని పరిమితం చేసింది. దేశంలో విప్లవ పరిస్ధితులు లేవని లేదా తగినంతగా లేవని చెబుతూ వర్గ పోరాట లక్ష్యాన్ని వాయిదా వేసింది. ఆ పేరుతో పార్లమెంటరీ రాజకీయాల్లో కూరుకు పోయింది. రివిజనిస్టు పార్టీగా మారిపోయింది. పాలక వర్గాల మధ్య వైరుధ్యాలను ఉపయోగించుకునే పేరుతో పాలక పార్టీల వెంట వెళుతోంది. ఎన్నికలను ఎత్తుగడల సమస్య స్ధాయి నుండి వ్యూహాత్మక సమస్య స్ధాయికి ప్రమోట్ చేసింది. బూర్జువా పార్టీలతో ఏ మాత్రం తీసిపోకుండా రైతాంగ ఉద్యమాలపై పాశవిక నిర్బంధాన్ని ప్రయోగించింది. రివిజనిస్టులు ‘బుర్ర బూర్జువా వర్గంలోనూ, కాళ్ళు కార్మిక వర్గంలోనూ’ ఉంచుతారన్న లెనిన్ సూత్రాన్ని ఆ పార్టీ రుజువు చేస్తోంది. డెంగ్ రివిజనిజానికి మద్దతు నిచ్చి ఆయన అనుచరులు చైనాని పెట్టుబడిదారీ దేశంగా మార్చాక ఆ సంగతి కొత్తగా గుర్తించినట్లు చెబుతోంది. విప్లవకారులను ఉగ్రవాదులుగా చెబుతూ వారిపైన బూర్జువా ప్రభుత్వాల తో సమానంగా తీవ్ర నిర్బంధాన్ని అమలు చేసింది. ‘జనతా ప్రజాస్వామిక విప్లవం’ అని చెబుతూ దానికి తగిన కార్యక్రమాన్ని ఆ పార్టీ చూపలేదు. లేదా అలాంటి కార్యక్రమాన్ని ఆచరణలో లేకుండా చేసింది.

  రవి గారివి కూడా ఈ రాజకీయాలే గనక ఆయనపై మరో అభిప్రాయం నాకు లేదు.

 7. రామ్మోహన్ గారూ, మరో విషయం. వార్తా చానెళ్లలో వివిధ సందర్భాలలో విశ్లేషణలలో రవి గారు పాల్గొనడం తప్పు కాదని నా అభిప్రాయం. కాకపోతే ఆయా విశ్లేషణల్లో మార్క్సిస్టు దృక్పధాన్ని ఆయన ఎంతవరకు చెప్పగలుగుతున్నారన్న విషయంపై విమర్శలు చేయవచ్చు. కమ్యూనిస్టు దృక్పధాన్ని ఆయన వివరిస్తే ఈ టీవి లాంటివి పదే పదే ఆయనని ఆహ్వానిస్తాయా అన్నది ఒక అనుమానం. నేను విన్న సందర్భాల్లో మార్క్సిస్టు విశ్లేషణ ఆయన చేసినట్లుగా నాకు పెద్దగా అనిపించలేదు. మార్క్సిస్టు విశ్లేషణ చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు.

 8. తెలకపల్లి రవి గారి వల్ల మార్క్సిజం పరువు పోతోంది. ఆయన మార్క్సిజం ముసుగు వేసుకుని తెలంగాణా ఉద్యమాన్ని వేర్పాటువాద ఉద్యమం అని అంటూ తెలంగాణా-కోస్తా ఆంధ్రల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం జరిగింది. ఇంతకు ముందు తెలంగాణావాద బ్లాగ్ నిర్వాహకుడు తెలంగాణావాదం విషయంలో కమ్యూనిస్ట్‌లని విమర్శిస్తూ వ్రాస్తే తెలకపల్లి రవి గారు ఏమీ సమాధానం చెప్పలేదు. చివరికి ఆయన కమ్యూనిజం ఒక ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతం అని విమర్శించినా తెలకపల్లి రవి గారు ఏమీ సమాధానం చెప్పలేదు. అప్పుడు నేనే ఆ బ్లాగర్‌కి సమాధానం చెప్పాల్సి వచ్చింది. CPI మొదటి సారి జెనెరల్ ఎలెక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు CPIకి మద్రాస్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే ఎక్కువ సీట్లు వచ్చాయి. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైతే రెండు ప్రాంతాలలోనూ అధికారంలోకి రావచ్చు అని అనుకున్నారు. కానీ CPI అనుకున్నది జరగలేదు కాబట్టి CPI ఇప్పుడు ప్రత్యేక తెలంగాణావాదాన్ని వినిపిస్తోంది. నేను ఈ విషయం చెప్పిన తరువాతే ఆ బ్లాగ్ నిర్వాహకునికి “గతంలో CPIకి తెలుగు మాట్లాడే ప్రాంతాలలో ఎక్కువ వోట్లు పడ్డాయనే విషయం ఎక్కడో చదివినట్టు” గుర్తొచ్చింది. అప్పటి నుంచి ఆయన CPIని విమర్శించడం మానేశాడు. CPMకి ఇప్పటికీ తెలంగాణాపై స్పష్టమైన స్టాండ్ లేదు. “మేము సమైక్యాంధ్రనే సమర్థిస్తాము కానీ తెలంగాణా ఏర్పాటుని అడ్డుకోము” అని అంటూనే తెలకపల్లి రవి గారి చేత తెలంగాణా వ్యతిరేక వ్యాసాలు వ్రాయిస్తున్నారు. ఒక ప్రముఖ తెలంగాణావాద బ్లాగ్ నిర్వాహకునికి చరిత్ర గుర్తు చేసి, తెలంగాణావాద బ్లాగర్‌లు కమ్యూనిజంపై విషం కక్కకుండా అడ్డుకున్నది నేనే. నేను లేకపోతే తెలంగాణావాద బ్లాగర్‌లు మార్క్సిజంనీ, కమ్యూనిజంనీ కుక్కలు చింపిన విస్తరిని చూసినట్టు చూసేవాళ్ళు.

 9. తెలకపల్లి రవి గారు మార్క్సిజం ముసుగు వేసుకోకుండా ఒక ప్రాంతంపై విషం చిమ్మి ఉంటే నేను పట్టించుకునేవాణ్ణి కాదు. ఆయన మార్క్సిజం ముసుగు వేసుకోవడమే అసలు సమస్య అయ్యింది. విశాలాంధ్ర మహాసభ నాయకుడు నలమోతు చక్రవర్తి తాను గ్లోబలైజేషన్, నయా ఉదారవాద విధానాలని నమ్ముతానని బహిరంగంగా చెప్పుకున్నాడు. ఆయన ఎలాగూ మార్క్సిజంని వ్యతిరేకించే వర్గానికి చెందినవాడే కనుక ఆయన ఒక ప్రాంతంపై ఎంత విషం చిమ్మినా మార్క్సిజం పరువు పోదు. అందుకే నేను విశాలాంధ్ర మహాసభ గురించి పట్టించుకోకుండా కేవలం మార్క్సిజం ముసుగు వేసుకున్న తెలకపల్లి రవి గారి లాంటి వాళ్ళని మాత్రమే విమర్శించాల్సి వచ్చింది. ఆయన తన బ్లాగ్‌లో మావోయిస్ట్‌లని సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొంటూ వ్రాసాడు. కేవలం తెలంగాణా ఉద్యమాన్నే కాకుండా ఇతర ప్రజా ఉద్యమాలని కూడా ఆయన దూషిస్తూ వ్రాయడం వల్ల నాకు ఆయనంటే రోత పుట్టింది. టివిలో తెలకపల్లి రవి గారు పాల్గొన్న చర్చా కార్యక్రమాలు చూడలేదు కానీ బ్లాగులలో ఆయన వ్రాసిన వ్రాతలు చదివితే రోత పుట్టింది. “మేము సమైక్యాంధ్రకి అనుకూలమే కానీ తెలంగాణా ఏర్పడితే అడ్డుకోము” అని తన బ్లాగ్‌లో వ్రాసిన చేతులతోనే “నాగర్‌కర్నూల్ లాంటి చోట్ల CPMకి కొన్ని వోట్లు పడ్డాయి కనుక తెలంగాణాలో కొంత మంది సమైక్యవాదులు ఉన్నట్టే” అని వ్రాయడం అంటే అది తెలంగాణావాదులని గొఱ్ఱెలని చూసినట్టు చూడడం కాదా? ఈ విషయం ఆయనకి గుర్తు చేస్తే ఆయన నా వ్యాఖ్యలని డిలీట్ చేశాడు. ఆయన పార్టీ ప్రతినిధిగా ఏమి మాట్లాడినా తప్పు కాదని కొందరు అనొచ్చు. కానీ ఆయన మార్క్సిజం ముసుగులో ఒక ప్రాంతంవాళ్ళ మీద విషం చిమ్మడం, గాంధీ లాంటి కులతత్వవాదులని పొగడడం చూడడానికే అసహ్యకరంగా ఉంది. అందుకే తెలకపల్లి రవి గారికీ, నాకూ మధ్య animosity పెరిగింది. ఆరేళ్ళ పాటు కష్టపడి మార్క్సిజం చదివినది మార్క్సిజం పరువు తీసే ఇలాంటి ముసుగు దొంగలని చూసి ఏమీ చెయ్యలేక తొంగోవడానికేనా అనే బాధ కలిగింది.

 10. విశెఖర్ గారూ. మీరు రాసే వార్తలు మార్కిస్టు దౄక్పదం విశ్లేషిస్తున్నారు అందులొ ఏమీ సందేహం లేదు. ఈమద్య రవి గారు. అపసవ్యె వ్యాఖ్యలూ, రంగనాయకమ్మ గారి పుస్తకం “దళిత సమస్య పరిస్కారానికి” అన్న పుస్తకం పై సమీక్షా వ్యాసం రాశారు. దాని పేరు “అతి తర్కం” వీటి రొండింటి పైన నేను కామెంట్ రాశాను కాని ఆయన ఒక్కదానికీ సమాదానం ఇవ్వలేదు. పైగా వాటిని తీసి వేశారు. కొండల రావు లాంటి వాళ్ళు రంగనాయకమ్మ గారిని విమర్శిస్తూ రాశారు. వాటిని మాత్రం అలాగే వుంచడం జరిగింది . నేను ఈమద్య ఒక బ్లాగు మొదలు పెట్టినాను. దాని పైన విమర్శగా ఒక పొస్టు రాసినాను. కాని అది నాకే పేలవంగా కనపడుతుంది నాకు ఏదైనా రొండు ముక్కల్లొ చెప్పడం అలవాటు సుదీర్గంగా చెప్పడం అనేది నాకింకా అబ్బలేదు. నాకు తెలిసిందే అయినా దాన్ని పేపర్ పైన పెట్టలేక పొతున్నాను. మీలాంటి వారు కామెంట్ అవసరం లేదు కనీ దాని పైన ఒక పొస్టు రాయవచ్చు. వీలైతే వాటిని ఒక సారి చుడండి. రవి గారిలొ నిజాయితీ అనేది నాకు ఏకొశానా కనపడలేదు. అది ఆయన రచనలలొనూ , అడిగిన వాటికి సమాదానం ఇవ్వకుండా తనకు నచ్చిన వాళ్ళకు మాత్రం సమాదానం ఇస్తాడు. వీటిని చుసి పచ్చి బుర్జువా అనే అభిప్రాయానికి వచ్చినాను. ఆయనను వార్తా చానల్లు నిత్యం పిలుస్తున్నారంటే ఆయన కమ్యునిజం గురించి మాట్లాడకపొవడమే కాదు. అలాంటి లక్షణాలే లేవు.

 11. రామ్మోహన్ గారూ, మీరు బ్లాగ్ మొదలు పెట్టారా? మరి చెప్పరేం? అర్జెంటుగా ఆ బ్లాగ్ అడ్రస్ ఇక్కడ పోస్ట్ చేయండి.

  మీరు ప్రస్తావించిన ఇతర అంశాలపై తర్వాత స్పందిస్తాను. ప్రస్తుతం ఆఫీసుకి వెళ్తున్నాను.

 12. తెలకపల్లి రవి గారి వ్యవహారం గురించి నేను రంగనాయకమ్మ గారికి రెండు సార్లు ఉత్తరాలు వ్రాసాను. అవి కూడా సాధారణ ఉత్తరాలు కాదు. A4 సైజ్ పేపర్‌ల మీద మేటర్ ప్రింట్ చేసి, ఆ పేపర్‌లని క్లిప్పింగ్ చేసి, స్పీడ్‌పోస్ట్‌లో పంపాను. ఈ గోముఖ వ్యాఘ్రాల గురించి వివరంగా వ్రాయడానికి సాధారణ లెటర్ కవర్‌లు సరిపోవు.

 13. Mr Ramamohan, Even my friend has similar doubts about CPM. She said “Why can’t CPM openly claim itself as a capitalist party? Most of the people of India are not aware about communism and CPM can get votes even if they claim their party as capitalist party”.

 14. రామ్మోహన్ గారూ,

  మొదట నా అభినందనలు అందుకోండి. మీరు రాసే ప్రతి వ్యాఖ్యలోనూ మార్క్సిస్టు పరిజ్ఞానం లేదా మార్క్సిజం ప్రస్తావన తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది. అందువల్లనే మిమ్మల్ని బ్లాగ్ ప్రారంభించాలని కోరాను.

  ఉబుసుపోక కబుర్లు రాసుకోవడమే బ్లాగింగ్ కి పరమ ప్రమాణంగా కొంతమంది తీర్మానిస్తున్నారు. తాము రాస్తేనే బ్లాగింగ్, తమకు నచ్చనిది ఎవరు/ఏమి రాసినా చెత్తే అని భ్రమిస్తూ ‘ఆత్మ స్తుతి, పర నింద’ లకు పూనుకుని సంతృప్తి పడుతున్నారు. నచ్చని అభిప్రాయాలు రాస్తేనే వ్యక్తిగత దూషణలకి దిగుతూ సంస్కార విహీనంగా ప్రవర్తిస్తున్నారు. వెకిలి వ్యంగ్యాన్ని కుమ్మరిస్తూ బ్లాగింగ్ అంటేనే ఏహ్యం కలిగేలా రాస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో మీ లాంటి వారు బ్లాగ్ ప్రారంభించడం సంతోషకరం.

  మిమ్మల్ని బ్లాగ్ తెరవమని నేను రెండు మూడుసార్లు కోరాను. మే 25 తేదీన బ్లాగ్ లో మొదటి పోస్ట్ రాసిన మీరు ఈ రోజు వరకూ ఆ సమాచారం నాకు చెప్పకపోవడం అన్యాయం.

  మీరు రాసిన పోస్టులు చదివాను. అచ్చు తప్పుల్ని మీరు పట్టించుకోవడం లేదు. అక్కడక్కడా అయితే పాఠకులు పట్టించుకోరు గానీ, ఎక్కువయితే మళ్ళీ రావడానికి వెనకాడవచ్చు. గతంతో పోలిస్తే అచ్చుతప్పులు ఇప్పుడు తగ్గాయి. ఇంకా తగ్గాల్సి ఉంది.

  ఈ వ్యాఖ్య మీ బ్లాగ్ లోనే రాయవలసింది. కాని అలా చేయలేకపోయాను. దానిక్కారణం మీకు మెయిల్ ద్వారా తెలియజేస్తాను.

 15. విశెఖర్ గారూ ఇన్ని రొజులు మీకు చెప్పకపొవడానికి నేను రాసింది నాకు పేలవంగా కనపడటమే కారణం . ఇంకా భాగా రాసివుండవల్సింది గా అనిపిస్తుంది. అచ్చు తప్పులు ఇక నుంచి లేకుండా జాగ్రత్త తీసుకుంటాను. తెలకపల్లి రవి గారి పొస్టులు కుడా వీలైతే ఆ రొండు టపాలూ, చూడండి తర్వాత మీ అభిప్రాయం తెలపండి . మీరు చెప్పిన తర్వాతే బ్లాగు ప్రరంభించాలని ఆలొచన వచ్చింది కాని కార్య రూపం దాల్చడానికి చాలా టైం తీసుకున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s