ప్రజా తిరుగుబాటును అపహాస్యం చేస్తూ మళ్ళీ అధికారాలు లాక్కున్న ఈజిప్టు మిలట్రీ


Egyptఈజిప్టు ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు రద్దు, అధ్యక్షుడి అధికారాలకు కత్తెర, సర్వాధికారాలను తిరిగి చేజిక్కించుకోవడం మొదలయిన చర్యల ద్వారా ఈజిప్టు మిలట్రీ దేశ ప్రజల రక్తతర్పణకు విలువ లేకుండా చేసింది. మధ్య ప్రాచ్యంలో అంతర్జాతీయ బలా బలాలపై గణనీయమైన ప్రభావం పడనున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే ఈజిప్టు ప్రభుత్వంలోని సర్వాధికారాలనూ మిలట్రీ తిరిగి చేజిక్కించుకుని ఎన్నికలు నామమాత్రమేనని నిరూపించింది. మాజీ నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దించి ప్రజాస్వామిక గాలులను రుచి చూద్దామని ఆశించిన ఈజిప్టు ప్రజల ఆకాంక్షలు మిలట్రీ పాలకుల ఉక్కు పాదాల కింద సమాధి కానున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

గత గురువారం ఈజిప్టు సుప్రీం కోర్టు వెలువరించిన ప్రజాస్వామ్య వ్యతిరేక తీర్పును అడ్డుకుపెట్టుకుని ఈజిప్టు మిలట్రీ తన అధికారాలను సుస్ధిరం చేసుకునే దిశలో పలు డిక్రీలు జారీ చేసింది. ఇండిపెండెంట్లకు కేటాయించిన సీట్లలో రాజకీయ పార్టీల అభ్యర్ధులు పోటీ పడి గెలుచుకోవడానికి అవకాశం ఇచ్చారన్న సాకుతో పార్లమెంటు ను సుప్రీం కోర్టు రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును ఆయుధంగా మలుచుకున్న మిలట్రీ (స్కాఫ్ -సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్) ప్రజలు ఎన్నుకున్న దిగువ సభను రద్దు చేస్తూ శనివారం డిక్రీ జారీ చేసింది. దానితో ప్రజల తిరుగుబాటుకి స్పందనగా మిలట్రీ జరిపిన పార్లమెంటు ఎన్నికలు తిరుగుబాటుపై నీళ్ళు జల్లడానికే తప్ప ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కాదని స్పష్టమయింది.

అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం నెల క్రితం జరిగిన ఎన్నికల్లో పలువురు పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ముస్లిం బ్రదర్ హుడ్ అబ్యర్ధి మోర్సీ, ముబారక్ నియంతృత్వ పాలనలో చివరి రోజుల్లో ప్రధానిగా పని చేసిన అహ్మద్ షఫీక్ లు మొదటి రెండు స్ధానాల్లో నిలిచారు. వీరు ఇరువురి మధ్య జూన్ 13, 14 తేదీల్లో ‘రనాఫ్’ ఎన్నికలు జరగ్గా ముస్లిం బ్రదర్ హుడ్ అభ్యర్ధి మోర్సి గెలుపు దిశలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అనధికార వార్తల ప్రకారం షఫీక్ కంటే మోర్సి మూడు నుండి ఐదు శాతం ఓట్ల ముందంజలో ఉన్నాడని బి.బి.సి తెలిపింది. పశ్చిమ దేశాల మద్దతు ఉన్న అభ్యర్ధి షఫీక్ ఓటమి చెందినట్లు ప్రకటించడమే మిగిలిన ఉన్న దశలో మిలట్రీ పాలకులు వేగంగా స్పందించడం ప్రారంభించారు.

పార్లమెంటును రద్దు చేస్తూ డిక్రీ జారీ చేసిన అనంతరం అధ్యక్షుడు ఖాతాలో ఉన్న సర్వాధికారాలను తిరిగి వశం చేసుకుంటూ మిలట్రీ మరో డిక్రీ జారీ చేసింది. ఈ డిక్రీ ప్రకారం మిలట్రీ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఏమి చేయడానికీ లేదు. తాను హామీ ఇచ్చినట్లు అధ్యక్షుడికే అధికారాలు అప్పజెప్పినట్లయితే మిలట్రీ అధికారాలు నామమాత్రంగా మిగులుతాయి. మాజీ మిలట్రీ పాలకుడు షఫీక్ అధ్యక్షుడుగా ఎన్నిక అయినట్లయితే మిలట్రీకి అధ్యక్ష అధికారాలను నామమాత్రం చేస్తూ డిక్రీ జారీ చేయవలసిన అవసరం తలెత్తేది కాదు. తాము చేసిన ప్రయత్నాలకు భిన్నంగా ముస్లిం బ్రదర్ హుడ్ అభ్యర్ధి అధ్యక్ష పదవి చేపట్టనుండడంతో మిలట్రీ జాగ్రత్తపడింది.

మోర్సి యే అధ్యక్షుడుగా ఎన్నిక అవుతాడని భావించే ఈజిప్టు మిలట్రీ తాజా డిక్రీలు జారీ చేసినట్లు కనిపిస్తోందని బి.బి.సి విశ్లేషించడం ఈ సందర్భంగా గమనార్హం. అందువల్లనే అధ్యక్షుడి అధికారాలను కత్తిరిస్తూ, మిలట్రీ అధికారాలను పెంచుకుంటూ వరుసగా అనేక డిక్రీలు జారీ చేసినట్లుగా బి.బి.సి విశ్లేషించింది. ఈజిప్టు మిలట్రీ జారీ చేసిన డిక్రీలను ‘మిలట్రీ కూప్’ గా రాజకీయ పార్టీలు అభివర్ణించాయి. పార్లమెంటును రద్దు చేయడానికి నిరసనగా పార్లమెంటు సభ్యులు గురువారం బలవంతంగా పార్లమెంటులో ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. ఎం.పి లను పార్లమెంటులో ప్రవేశించకుండా అడ్డుకోవాలని మిలట్రీ ఆదేశాలు ఇచ్చిందని బి.బి.సి తెలిపింది.

పార్లమెంటు రద్దు చేసే డిక్రీ జారీ చేసేముందే పార్లమెంటు భవనం వద్దకు సైనికులను తరలించినట్లు తెలుస్తోంది. ముస్లిం బ్రదర్ హుడ్ కి చెందిన ఫ్రీడం అండ్ జస్టిస్ పార్టీ తో పాటు మతతత్వ సలాఫిస్టు పార్టీ లు సంయుక్తంగా పార్లమెంటులో మెజారిటీ స్ధానాలు గెలుచుకున్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం. అధ్యక్షుడి అధికారాలపై జారీ చేసిన డిక్రీ ద్వారా తిరుగుబాటు అనంతరం జరిగిన ‘కాన్స్టిట్యూషనల్ డిక్లరేషన్’ ను మిలట్రీ సవరించింది. చట్ట సభలు, మిలట్రీ వ్యవహారాలు అన్నింటిపైనా మిలట్రీకి సర్వాధికారాలను దఖలు పరుచుకుంటూ ఈ డిక్రీ జారీ అయింది. కొత్త రాజ్యాంగ రచన చేయడానికి ఉద్దేశించిన వంద మంది సభ్యుల ‘కానిస్టిట్యూషనల్ అసెంబ్లీ’ పైన కూడా ఈ డిక్రీ ద్వారా మిలట్రీకి అధికారాలు అప్పగించబడ్డాయి. అంటే మిలట్రీ కనుసన్నల్లో రాజ్యాంగ రచన జరుగుతుందన్నమాట. అలాంటి రాజ్యాంగంలో ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు స్ధానం ఉండే అవకాశమే లేదు. ఈ విధంగా ఈజిప్టు మిలట్రీ తన దేశ ప్రజలను ప్రజాస్వామ్య ఎన్నికల పేరు చెప్పి పచ్చిగా మోసం చేసింది.

ఇక ఇప్పుడు కొత్త అధ్యక్షుడికి అధికారాలు నామ మాత్రమే. శాశ్వత రాజ్యంగం ఏదీ లేకుండానే మొట్టమొదటి ప్రజాస్వామిక అధ్యక్షుడు పీఠం ఎక్కనున్నాడు. అతని అధికారాలు, విధులు నిర్వచించే రాజ్యాంగం ఏదీ లేదు. అధ్యక్షుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. చట్టాలను ఆమోదించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు. యుద్ధం ప్రకటించవచ్చు. కానీ ఇవన్నీ మిలట్రీ ఆమోదంతోనే చేయవలసి ఉంటుంది. ‘మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలు’ అంటూ పశ్చిమ దేశాల పత్రికా సంస్ధలు భాజా భజంత్రీలు వాయిస్తుండగా ఈజిప్టు మిలట్రీ పాలకులు  అట్టహాసంగా జరిపిన ఎన్నికలు ఈ విధంగా నేతిబీర ప్రజాస్వామ్యం చందంగా ముగియనున్నాయి.

ఇంత చేసి కూడా ఈజిప్టు మిలట్రీ ఇప్పటికీ తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన అధ్యక్షుడికి అధికారం అప్పగిస్తామని శుష్క ప్రకటనలు చేస్తూనే ఉంది. ఈజిప్టు ప్రజలు మరోసారి నిర్ణయాత్మకంగా మిలట్రీ పాలకులపై తిరుగుబాటు చేస్తే తప్ప వారి ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేరే అవకాశం లేదు. అయితే ఈ సారి వారు పశ్చిమ దేశాల తరపున పని చేసే ఎన్.జి.ఓ సంస్ధలను దూరం పెట్టవలసి ఉంటుంది. ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించవలసింది ప్రజల ప్రయోజనాలను కాపాడే రాజకీయ పార్టీలు తప్ప పశ్చిమ దేశాల నుండి నిధులు పొందే ఎన్.జి.ఓ లు కావు. సామ్రాజ్యవాద దేశాల నుండి నిధులు పొందే ఎన్.జి.ఓ సంస్ధలకు సామ్రాజ్యవాద ప్రయోజనాలే ప్రధానం తప్ప దేశ ప్రజల ప్రయోజనాలు కాదని ఈజిప్టు ప్రజలు గుర్తించాలి.

One thought on “ప్రజా తిరుగుబాటును అపహాస్యం చేస్తూ మళ్ళీ అధికారాలు లాక్కున్న ఈజిప్టు మిలట్రీ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s