గిలానీ ప్రధాని పదవికి అనర్హుడు, పాక్ సుప్రీం కోర్టు సంచల తీర్పు


Gilaniపాకిస్ధాన్ మిలట్రీ, పౌర ప్రభుత్వాల మధ్య ఆధికారాల కోసం జరుగుతున్న ఘర్షణలో తాజా అంకానికి తెర లేచింది. ప్రధాని కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితం సుప్రీం తీర్పు చెప్పిన నేపధ్యంలో ప్రధాన మంత్రి గిలానీ పార్లమెంటు సభ్యత్వం రద్దయినట్లేననీ, కనుక గిలానీ పదవి నుండి దిగిపోవాల్సిందేనని సంచల రీతిలో తీర్పు ప్రకటించింది. ప్రధానిని పదవి నుండి తొలగించే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉందనీ, కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న ప్రభుత్వ వాదనలను సుప్రీం కోర్టు తిరస్కరించిందని ‘ది హిందూ’ తెలిపింది.

బేనజీర్ భుట్టో ప్రధానిగా ఉండగా 1990 లలో ఇప్పటి అధ్యక్షుడు, భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ అక్రమ ఆస్తులను పోగేసి స్విస్ బ్యాంకులకు తరలించాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఈ ఆరోపణలనుండి విముక్తి కల్పిస్తూ పాక్ మిలట్రీ పాలకుడు ముషార్రఫ్ జర్దారీకి క్షమా భిక్ష ప్రసాదించాడు. ఈ క్షమా భిక్ష చెల్లదనీ, జర్దారీ పై ‘మనీ లాండరింగ్’ కేసులను తిరిగి తెరవాలని కోరుతూ ప్రధాని గిలానీ స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని సుప్రీం కోర్టు గత సంవత్సరం ఆదేశాలిస్తూ తీర్పు చెప్పింది.

సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రధాని గిలానీ తిరస్కరించాడు. అధ్యక్షుడు జర్దారీకి పదవిలో ఉన్నంతకాలం కేసులనుండి రక్షణ ఉంటుందని చెబుతూ స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి లేఖ రాయడానికి ఆయన తిరస్కరించాడు. గిలానీ తిరస్కరణ కోర్టు ధిక్కారంగా సుప్రీం కోర్టు గత ఏప్రిల్ 26 తేదీన తీర్పు చెప్పి 37 సెకన్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. జైలు శిక్ష నామమాత్రమే అయినప్పటికీ గిలానీ ప్రధాని పదవిలో ఉండడానికి అనర్హుడంటూ ప్రతిపక్షాలు గొడవ ప్రారంభించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

కానీ ప్రధానిని అనర్హుడిగా చేయడానికి పార్లమెంటు స్పీకర్ సైతం తిరస్కరించాడు. కోర్టు తీర్పు దృష్ట్యా గిలానీ రాజీనామా చేయడానికి తగిన రాజ్యాంగబద్ధ పునాది లేదని ఆయన ప్రతిపక్షాల డిమాండ్ ను తిరస్కరించాడు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాయి. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ‘పాకిస్ధాన్ ముస్లీం లీగ్’, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ‘తెహరీక్-ఎ-ఇన్సాఫ్’ లు స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశాయి.

కేసును విచారించిన సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం, గిలానీ ప్రధాని పదవికి అనర్హుడని కోర్టు ధిక్కార నేరంపై తీర్పు ప్రకటించిన ఏప్రిల్ 26 నుండి ఆయన పదవిలో కొనసాగడం చెల్లదని తీర్పు చెప్పింది. “గిలానీ ఏప్రిల్ 26 నుండి పాకిస్ధాన్ ప్రధాన మంత్రిగా ఉండడానికి అనర్హుడు” అని సుప్రీం తీర్పు చెప్పినట్లు బి.బి.సి తెలిపింది. తీర్పు ప్రకటించిన ధర్మాసనానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరి నాయకత్వం వహించాడు. పాత తేదీ నుండి ప్రధాని పదవికి గిలానీ అనర్హుడని ప్రకటించడంతో ఈ రెండు నెలల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నార్ధకం నిలిచింది.

“(ఏప్రిల్ 26 తీర్పుకి) వ్యతిరేకంగా ఎలాంటి అప్పీలు దాఖలు కానందున సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ‘మజ్లిస్-ఎ-షుర’ (పాక్ పార్లమెంటు) సభ్యత్వానికి అనర్హుడుగా మారిపోయాడు. పాకిస్ధాన్ ప్రధానిగా కూడా ఆయన కొనసాగ జాలడు. ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పుడు ఖాళీ” అని సుప్రీం చీఫ్ జస్టిస్ మరో అనుమానానికి తావు లేకుండా ప్రకటించాడని బి.బి.సి తెలిపింది. పాకిస్ధాన్ పౌర ప్రభుత్వానికీ, న్యాయ వ్యవస్ధకూ కొనసాగుతున్న ఘర్షణలో ఈ తీర్పు తాజా అంకం మాత్రమే. రంగంలో న్యాయ వ్యవస్ధ ఉన్నప్పటికీ దాని తెరవెనుక పాత్ర మిలట్రీ వ్యవస్ధదేనని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. కోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం పడిపోవడమా లేదా అన్నది ఇంకా తెలియలేదు. గిలానీ స్ధానంలో మరొకరిని ప్రధానిగా ఎన్నుకునే బలం అధికార పార్టీ అయిన ‘పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ’ కి ఉన్నదని తెలుస్తోంది.

అధికార పార్టీ నాయకులు ఎమర్జెన్సీ సమావేశం జరిపినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జర్దారీ సైతం వివిధ అధికార కూటమి పార్టీల నాయకులతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.  కోర్టు తీర్పుతో పాకిస్ధాన్ లో మరోసారి రాజకీయ అనిశ్చితి తలెత్తింది.

దేశంలోని వివిధ అధికార అంగాల మధ్య అధికారాల కోసం తలెత్తుతున్న కుమ్ములాటలే ఈ పరిస్ధితికి ప్రధాన కారణం. ఆది నుండీ పాకిస్ధాన్ అధికార రాజకీయాల్లో మిలట్రీయే ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చింది. ముషార్రాఫ్ పతనం అనంతరం ఎన్నికలు జరిగాక పౌర ప్రభుత్వం పేరుతో పాలక వర్గంలోని ఒక సెక్షన్ మిలట్రీ పై పై చేయి సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఆ ప్రయత్నాలను మిలట్రీ నాయకత్వంలోని మరొక సెక్షన్ ప్రతిఘటిస్తోంది. ఇవి కేవలం పాకిస్ధాన్ ధనికవర్గాల మధ్య జరుగుతున్న అధికార కుమ్ములాటలే తప్ప ప్రజల ప్రయోజనాలకు ఇందులో ఎలాంటి పాత్రా లేదు. ప్రజల జీవన స్ధాయిని పెంచడం కోసం ఆలోచిస్తున్న సెక్షన్లు ఎందులో ఒక్కటి కూడా లేవు. ఈ రెండు సెక్షన్లూ అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యానికి దాసోహం అంటున్నవే. అమెరికా ఇచ్చే ఎంగిలి సాయాన్ని వాటాలు వేసుకోవడానికి మాత్రమే ఇవి ఘర్షణ పడుతున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s