ఆధునిక శాస్త్ర సాంకేతిక ఉత్పత్తులలో పేరెన్నిక గన్న జర్మనీ, దేశానికి అవసరమైన విద్యుత్తులో మూడు వంతులు సూర్య శక్తి నుండే ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. మరో పదేళ్ళలో అణు విద్యుత్ ను పూర్తిగా త్యజించడానికి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకున్న జర్మనీ, అణు విద్యుత్తు కంటే శుభ్రమైన ఇంధనం లేదన్న కంపెనీల ప్రచారాన్ని తిప్పికొడుతూ సూర్య శక్తి వినియోగంలో ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. 20 న్యూక్లియర్ పవర్ స్టేషన్ల సామర్ధ్యానికి సమానంగా గంటకు 22 గిగావాట్ల విద్యుత్ ను కేవలం సూర్య రశ్మి సాయంతో ఉత్పత్తి చేసింది. మే 25, 26 తేదీలలో ఈ ఫీట్ సాధించి జర్మనీ రికార్డులను తిరగరాసిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.
ఫుకుషిమా అణు ప్రమాదం అనంతరం జర్మనీ వెంటనే ఎనిమిది అణు విద్యుత్ కర్మాగారాలను మూసేవేసింది. మిగిలిన అణు కర్మాగారాలను కూడా 2022 లోపు మొత్తం మూసివేయడానికి నిర్ణయం తీసుకుంది. అణు విద్యుత్ స్ధానంలో గాలి, సూర్య రశ్మి, బయో-మాస్ ల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ దేశ అవసరాలను సమర్ధవంతంగా తీర్చగలుగుతోంది. అందులో భాగంగా సోలార్ పవర్ ప్లాంటులను దేశంలో విస్తృతంగా ప్రవేశపెట్టింది. మే 25, 26 తేదీలలో మధ్యాహ్న సమయంలో గంటకు 22 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలిగింది. ఈ ఉత్పత్తి 20 అణు విద్యుత్ కర్మాగారాలు పూర్తి సామర్ధ్యంతో పని చేయగలిగినపుడు ఉత్పత్తి అయ్యే విద్యుత్ కు సమానమని రాయిటర్స్ తెలిపింది.
మే 25 (శుక్రవారం) తేదీన సూర్య రశ్మి ద్వారా ఉత్పత్తి చేసిన 22 గిగావాట్ల విద్యుత్తును నేషనల్ గ్రిడ్ లోకి పంపగా అది దేశంలోని విద్యుత్ అవసరాలలో 33 శాతాన్ని తీర్చగలిగిందని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ రెన్యువబుల్ ఎనర్జీ ఇండస్ట్రీ’ డైరెక్టర్ నార్బర్ట్ ఆల్నోచ్ తెలిపాడు. మే 26 తేదీనయితే (శనివారం) మధ్యాహ్న సమయంలో 50 శాతం దేశ విద్యుత్ అవసరాలను అది తీర్చగలిగిందని ఆయన తెలిపాడు. “గతంలో ఎన్నడూ, ఏ దేశం కూడా ఇంతమొత్తంలో ఫోటో వోల్టాయిక్ ఎలక్ట్రిసిటీ ని ఉత్పత్తి చేయలేదు. ఇటీవలి వారాల్లో జర్మనీ 20 గిగావాట్ల మార్కు కు సమీపంగా వచ్చింది. కానీ దానిని చేరుకుని దాటటం ఇదే మొదటిసారి” అని నార్బర్ట్ తెలిపాడు.
ఫ్యాక్టరీలు, ఆఫీసులు పూర్తి స్ధాయిలో పని చేసే శుక్రవారం రోజున మూడొంతుల దేశ అవసరాలను సూర్య విద్యుత్ తో జర్మనీ తీర్చగలిగిందన్నమాట. శనివారం పని రోజు కాదు గనక సగం అవసరాలను సూర్య విద్యుత్ తీర్చగలిగింది. సంప్రదాయేతర వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వాలు పూర్తి మద్దతు ఇచ్చినట్లయితే ఎన్ని అద్భుతాలు చేయవచ్చునో జర్మనీ నిరూపించింది.
సంప్రదాయేతర ఇంధన వనరులతో ఉత్పత్తి చేసే ‘రెన్యువబుల్ ఎనర్జీ’ పై ఆధారపడలేమనీ, భారీ పరిశ్రమలకు నిలయమయిన పారిశ్రామిక దేశాలకు సరిపోయినంత విద్యుత్ ను వాటి ద్వారా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదనీ అనేక మంది విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలలో నిజం లేదని, పారిశ్రామిక దేశాలు సైతం రెన్యువబుల్ ఎనర్జీ పై భేషుగ్గా ఆధారపడవచ్చని రుజువు చేయడానికి జర్మనీ ఆతృతగా ఉన్నదని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కొన్ని సందర్భాలలో వ్యాఖ్యానించింది.
సంవత్సరం క్రితం జర్మనీ సోలార్ పవర్ ద్వారా 14 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసింది. 2012 లో మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా అదనంగా 7.5 గిగావాట్ల సోలార్ విద్యుత్ ను జర్మనీ ఉత్పత్తి చేసిందని రాయిటర్స్ తెలిపింది. “జర్మనీ తన విద్యుత్ అవసరాలలో ఎక్కువ భాగాన్ని సోలార్ పవర్ తో తీర్చుకోగల సామర్ధ్యం కలిగి ఉన్నదని ఇది చూపుతోంది. దానితో పాటు బొగ్గు ను పెద్దగా కాల్చకుండానే, గ్యాస్ ను పెద్దగా మండించకుండానే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అవసరం లేకుండానే జర్మనీ తన విద్యుత్ అవసరాలు తీర్చుకోగలదని కూడా ఇది సూచిస్తోంది” అని నార్బర్ట్ అన్నాడని పత్రిక తెలిపింది.
బొగ్గు, సహజవాయువు లాంటి వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కర్బన వాయువులు విడుదలై భూమి వేడెక్కుతున్నదని అనేక సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో అణు విద్యుత్ శుభ్రమైనదంటూ న్యూక్లియర్ లాబీ ప్రచారం మొదలు పెట్టింది. హీరోషిమా, నాగసాకీ లపై అణు బాంబులు సృష్టించిన విధ్వంసాన్ని, 1986 లో చెర్నోబిల్ (ఉక్రెయిన్) అణు కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు వల్ల భూవాతావరణం తీవ్రంగా కలుషితమైన దారుణాన్ని ఈ లాబీ మరిపించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ లోపే ఫుకుషిమా అణు ప్రమాదం వీరి ప్రయత్నాలకు తీవ్రంగా గండి కొట్టింది. అయినప్పటికీ అణు విద్యుత్ శుభ్రమైనదేననీ, ఫుకుషిమా రేడియేషన్ ప్రమాదకరం కాదనీ, అసలు కొద్దిగా రేడియేషన్ సోకితే ఆరోగ్యానికి దోహదం చేస్తుందనీ కూడా దుష్ప్రచారాన్ని ఈ లాబీ ప్రారంభించింది. ఈ ప్రచారానికి కంపెనీల సొమ్ము తిన్న శాస్త్రవేత్తలు, ఎకాలజిస్టులు మద్దతు ఇస్తూ ప్రజా విద్రోహానికి పాల్పడుతున్నారు. ఈ నేపధ్యంలో అణు విద్యుత్ తప్ప మరో మార్గం లేదంటున్న అబద్ధపు ప్రచారాలకు జర్మనీ కృషి చాచి కొట్టినట్టుగా చెప్పుకోవచ్చు.
Nice info 🙂