ఫుకుషిమా: అణు పరిశ్రమతో బ్రిటన్ ప్రభుత్వం కుమ్మక్కు -ది గార్డియన్


Fukushima-007జపాన్, ఫుకుషిమా అణు ప్రమాదాన్ని ప్రజలకు తక్కువ చేసి చూపడానికి బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు పరిశ్రమతో కుమ్మక్కయిందని ‘ది గార్డియన్’ పత్రిక వెల్లడి చేసింది. బ్రిటన్ లో మరో ఆరు కొత్త అణు విద్యుత్ కర్మాగారాలను నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించినందున ఫుకుషిమా ప్రమాదం వల్ల తమ నిర్ణయాలకు ఆటంకం కలగవచ్చని భయపడింది. ఫుకుషిమా ప్రమాదం వాస్తవాలు వెల్లడయితే కొత్త కర్మాగారాల స్ధాపనకు ప్రతిఘటన పెరుగుతుంది గనక, దానికి వ్యతిరేకంగా అణు పరిశ్రమ వర్గాలతో కలిసి బ్రిటన్ ప్రభుత్వం ‘పబ్లిక్ రిలేషన్స్ కాంపెయిన్’ చేపట్టిందని అంతర్గత ఈ-మెయిళ్ల సాక్ష్యాలతో ‘ది గార్డియన్’ వెల్లడి చేసింది. బ్రిటన్ ప్రభుత్వానికి ప్రజల భద్రత కంటే అణు పరిశ్రమ లాభాలే ముఖ్యమనీ, అందుకోసం ఎంతకయినా తెగిస్తుందని గార్డియన్ కధనం వెల్లడి చేసింది.

గత సంవత్సరం జూన్ 30 తేదీన ‘ది గార్డియన్’ ఈ సంచలనాత్మక కధనం ప్రచురించింది. పత్రిక తన కధనాన్ని ఇలా ప్రారంభించింది.

British government officials approached nuclear companies to draw up a co-ordinated public relations strategy to play down the Fukushima nuclear accident just two days after the earthquake and tsunami in Japan and before the extent of the radiation leak was known.

Internal emails seen by the Guardian show how the business and energy departments worked closely behind the scenes with the multinational companies EDF Energy, Areva and Westinghouse to try to ensure the accident did not derail their plans for a new generation of nuclear stations in the UK.

బ్రిటిష్ ప్రభుత్వమే న్యూక్లియర్ కంపెనీలను సంప్రదించిందనీ, ఫుకుషిమా అణు ప్రమాద స్ధాయిని తక్కువ చేసి చూపడానికి కంపెనీలతో కలిసి సమన్వయంతో ‘ప్రజా సంబంధాల వ్యూహం’ పన్నాడనికి సిద్ధపడిందని పై భాగం చెపుతోంది. ఫుకుషిమా ప్రమాద తీవ్రత, రేడియేషన్ విస్తృతి లకు సంబంధించిన వివరాలు తెలియకుండానే ప్రమాదం తీవ్రత తగ్గించి చూపడానికి ప్రభుత్వం పధకం వేసిందనీ, ప్రభుత్వంలోని వ్యాపార, ఎనర్జీ విభాగాలు బహుళజాతి కంపెనీలతో కుమ్మక్కై కొత్త కర్మాగారాలకు ఆటంకం కలగకుండా చూడడానికి తెరవెనుక ప్రయత్నించిందనీ చెబుతోంది. ఇ.డి.ఎఫ్ ఎనర్జీ, ఆరేవా, వెస్టింగ్ హౌస్ లాంటి బహుళజాతి కంపెనీలతో కలిసి ఈ కుట్రలకు పాల్పడిందని కూడా స్పష్టమవుతోంది.

బ్రిటన్ ప్రభుత్వంలోని ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ బిజినెస్, ఇన్నోవేషన్, అండ్ స్కిల్స్’ (బి.ఐ.ఎస్) కి చెందిన అధికారి ఒకరు కంపెనీలకు పంపిన ఈ మెయిల్ లో ఇలా పేర్కొన్నాడు. “ప్రపంచ వ్యాపితంగా అణు పరిశ్రమను వెనక్కి తీసుకెళ్ళగల శక్తి దీనికి (ఫుకుషిమా ప్రమాదానికి) ఉంది. అణు వ్యతిరేక మిత్రులు, మిత్రురాళ్ళు (chaps and chapesses) దీని ఆధారంగా బలం సంతరించుకోకుండా చూడాలి. ఈ రంగాన్ని (ఫుకుషిమా ప్రమాదం పై జరిగే చర్చోపచర్చల రంగాన్ని) మనం ముందే ఆక్రమించుకుని పట్టు కలిగి ఉండాలి. న్యూక్లియర్ భద్రమైనదే నని చూపడం చాలా అవసరం (We really need to show the safety of nuclear).” ఫుకుషిమా ప్రమాదం వల్ల అణు శక్తికి ప్రజా మద్దతు పడిపోకుండా చూడవలసిన అవసరానికి చాలా ప్రాముఖ్యత ఉందని ప్రభుత్వ అధికారులు నొక్కి చెప్పినట్లుగా ‘ది గార్డియన్’ ఈ సందర్భంగా తెలియజేసింది. భద్రతా కారణాల రీత్యా ఈ మెయిల్స్ పంపినవారి పేర్లను గార్డియన్ వెల్లడించలేదు.

ఫుకుషిమా ప్రమాదం జరిగి రెండు రోజులు కూడా గడవక మునుపే ఆ ప్రమాదం వల్ల ప్రజల భద్రతకు ముప్పేమీ లేదంటూ ప్రజలకు నచ్చజెప్పడానికి ప్రభుత్వం పరుగులు పెట్టిందన్నమాట. ప్రజాస్వామ్యం పేరుతో జరిగే ఎన్నికల్లో ప్రజల చేత ఓట్లు వేయించుకుని నెగ్గిన ప్రభుత్వం ప్రజానుకూలంగా వ్యవహరించడం మాని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడానికి రెడీ అయింది. ఫుకుషిమా వల్ల ప్రజలకు ముప్పు ఉందని చెప్పాలన్నా, లేదని చెప్పాలన్నా ఆ వివరాలు కనీసం వెల్లడి అయ్యేదాకా ఆగాలి. ఫుకుషిమా రియాక్టార్లలో పేలుళ్లు ఇంకా అప్పటికి జరగలేదు. మెల్ట్ డౌన్ జరగలేదని టెప్కో కంపెనీ అప్పుడే అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టింది. అయినా అవేవీ విచారించకుండానే అణు శక్తి భద్రత గురించి ప్రచార వ్యూహానికి బ్రిటన్ ప్రభుత్వం సిద్ధపడిందన్నమాట.

బ్రిటన్ దిగువ సభ కామన్స్ లో ‘ఎన్విరాన్ మెంటల్ ఆడిట్ కమిటీ’ సభ్యుడయిన కన్జర్వేటివ్ పార్టీ ఎం.పి జాక్ గోల్డ్ స్మిత్ ప్రభుత్వ ధోరణిని తీవ్రంగా ఖండించాడు. ప్రభుత్వానికీ, అణు కంపెనీలకీ మధ్య సహకారం, సమన్వయం ఎంతదూరం వెళ్ళిందో ఈ-మెయిళ్ళు నిరూపించాయని ఆయన పేర్కొన్నాడు. “పరిశ్రమ కోసం పబ్లిక్ రిలేషన్స్ నిర్వహించవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ డిపార్ట్ మెంట్లు ఫుకుషిమా ప్రభావాన్ని తక్కువ చేసి చూపిందంటే అది చాలా దారుణం” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

ప్రఖ్యాత పర్యావరణ పోరాట సంస్ధ గ్రీన్ పీస్ ప్రతినిధి ‘లూయిస్ హచిన్స్’ ప్రభుత్వాధికారుల ఈ మెయిళ్లను “కుంభకోణంతో సమానమైన కుమ్మక్కు” గా అభివర్ణించింది. “అణుశక్తి పట్ల ప్రభుత్వానికి ఉన్న ఆబ్సెషన్ ను ఇది ఎత్తి చూపుతోంది. అణు సంబంధిత విషయాల్లో ప్రభుత్వాన్ని గానీ, పరిశ్రమను గానీ నమ్మడానికి లేదని దీని ద్వారా స్పష్టమవుతోంది” అని ఆమె వ్యాఖ్యానించింది.

ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల 80,000 మంది జపనీయులు ఇళ్ళు వదిలి వెళిపోవలసి వచ్చింది. ఈ ప్రమాదం జరిగాక బ్రిటన్ లోనే గాక ప్రపంచ వ్యాపితంగా అణు కర్మాగారాలకు వ్యతిరేకత ప్రబలిపోయిందని వివిధ ప్రజాభిప్రాయ సేకరణల్లో తేటతెల్లమయింది. ప్రజాభిప్రాయానికి తలొగ్గి జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, ధాయిలాండ్, మలేషియా లాంటి దేశాల ప్రభుత్వాలు ఇక అణు విద్యుత్ కర్మాగారల జోలికి పోకూడదని నిర్ణయించి కొత్తగా అణు కర్మాగారాలు నిర్మించబోమని ప్రకటించాయి. కానీ బ్రిటన్ ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అణు శక్తి పై ప్రజల్లో మరిన్ని భ్రమలు పెంచడానికే నిర్ణయించింది. కేవలం భ్రమలే కాకుండా అబద్ధాలతో పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి పధక రచన చేసుకుంది.

బ్రిటన్ ప్రభుత్వంలోని వాణిజ్య విభాగం మార్చి 13 తేదీన అణు శక్తి కంపెనీల సంఘం ‘న్యూక్లియర్ ఇండస్ట్రీ అసోసియేషన్’ (ఎన్.ఐ.ఎ) కి ఒక ఈమెయిల్ పంపింది. అప్పటికి ప్రమాదం జరిగి రెండు రోజులే అయింది. ఫుకుషిమా రియక్టార్లలో రెండు పెద్ద పేలుళ్లు అప్పటికింకా జరగలేదు. అయినప్పటికీ టి.వి లు చూపుతున్నంత ప్రమాదకరంగా ఫుకుషిమా ప్రమాదం జరగలేదని సదరు వాణిజ్య విభాగం వాదించడం మొదలు పెట్టింది. “విడుదలయిన రేడియేషన్ నియంత్రించబడింది. రికాక్టర్ ని రక్షించారు కూడా” అని బి.ఐ.ఎస్ అధికారి పేర్కొన్నాడని ‘ది గార్డియన్’ తెలిపింది. “ఇలాంటి పరిస్ధితిని నియంత్రించడం భద్రతా వ్యవస్ధలు చేసే పనిలో భాగమే” అని సింపుల్ గా కొట్టిపారేశాడాయన.

కంపెనీలు తమ కామెంట్స్ ను తమకు పంపితే ప్రభుత్వ ప్రకటనల్లోనూ, మంత్రులకు ఇచ్చే సమాచారంలోనూ వాటిని చొప్పిస్తామని సదరు అధికారి కంపెనీలకు సూచించాడు. “మనమంతా ఒకే సమాచారం ఆధారంగా పని చేయాలి. తద్వారా మీడియాకి, ప్రజలకీ ఒకే సందేశం అందించాలి” అని ఆయన పేర్కొన్నాడు. “అణు వ్యతిరేకులంతా సమయం వృధా చేయకుండా దీనిని చెర్నోబిల్ తో సమానం చేస్తున్నారు. దీనిని (ఫుకుషిమా ప్రమాదాన్ని) చెర్నోబిల్ తో సమానం చేసే కధనాలన్నింటినీ మనం కొట్టిపారేయాల్సిన అవసరం ఉంది” అని సదరు అధికారి అరేవా (ఫ్రాన్స్ కి చెందిన న్యూక్లియర్ కంపెనీ) కంపెనీకి రాసిన మెయిల్ లో పేర్కొన్నాడు. చెర్నోబిల్ అణు ప్రమాదాన్ని అణు భద్రతా స్కేల్ పై ఏడవ స్ధాయిగా (అదే అత్యధిక స్ధాయి) వర్గీకరించారు. ఫుకుషిమా ప్రమాదాన్ని కూడా ఏడవ స్ధాయి గానే వర్గీకరిస్తూ జపాన్ ప్రభుత్వం ఏప్రిల్ 11 తేదీన ప్రకటించింది. దీనికి ముందే ఫుకుషిమా ప్రమాదం చెర్నోబిల్ ప్రమాదం కి సమానం కాదని ప్రచారం చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నడుం బిగించింది.

ఏప్రిల్ 7 తేదీన ‘ఆఫీస్ ఫర్ న్యూక్లియర్ డెవలప్ మెంట్’, అణు కంపెనీలను ఎన్.ఐ.ఎ లండన్ కార్యాలయంలో సమావేశానికి ఆహ్వానించింది. ఫుకుషిమా ప్రమాదం నేపధ్యంలో అణు శక్తి కర్మాగారాల భద్రతపైనా, కొత్తగా నిర్మించనున్న అణు కర్మాగారాలపైనా బ్రిటిష్ ప్రజలకు విశ్వాసం కలిగించడానికి వీలుగా ‘joint communications and engagement strategy’ రూపకల్పన చేసే విషయమై చర్చించడమే ఈ సమావేశం ఉద్దేశ్యమని ‘ది గార్డియన్’ తెలిపింది. ‘ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్’ చట్టం ద్వారా సంపాదించిన డాక్యుమెంట్ల ద్వారా ఈ విషయం తెలిసిందని పత్రిక తెలిపింది. ఇదే చట్టం ద్వారా ‘ఆఫీస్ ఆఫ్ న్యూక్లియర్ రెగ్యులేషన్’ (ఒ.ఎన్.ఆర్) నుండి సంపాదించిన డాక్యుమెంట్ల ద్వారా మరో సంగతి తెలిసింది. బ్రిటన్ లో నెలకొల్పనున్న కొత్త అణు కర్మాగారాలపై ఫుకుషిమా ప్రమాదం కలిగించనున్న ప్రభావం గురించి ఒ.ఎన్.ఆర్ ఏప్రిల్ 5 న ఒక ప్రకటన జారీ చేసీంది. ఈ ప్రకటన ఇచ్చే ముందు ఒ.ఎన్.ఆర్, అణు పరిశ్రమ వర్గాల ప్రతినిధుల నుండి అనుమతి తీసుకుందనీ, ఆ తర్వాత మాత్రమే ప్రకటన చేసిందనీ ది గార్డియన్ వెల్లడి చేసింది. అణు శక్తి పరిశ్రమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలని నియంత్రించవలసిన ఒ.ఎన్.ఆర్, ఫుకుషిమా ప్రమాదం ప్రభావం గురించి ప్రకటన చెయ్యడానికి కూడా ఆ కంపెనీల అనుమతి తీసుకోవలసిన అవసరం ఉన్నదంటే ఇక అది ఎవర్ని నియంత్రిస్తున్నట్లు? అణు కంపెనీలను నియంత్రించడానికి ఏర్పడిన ప్రభుత్వ సంస్ధ వాస్తవంలో కంపెనీలతోనే కుమ్మక్కై, వారి ఆజ్ఞలకు తలొగ్గుతుంటే ఇక ప్రజలకు సహాయం చేసేదేవరు? ప్రజల ప్రయోజనాలను కాపాడేదేవరు? ప్రజల భద్రతను ఉల్లంఘించేవారితోనే కుమ్మక్కైతే ఇక ప్రజల భద్రతకు ఎవరు గ్యారంటీ? బ్రిటన్ నియంత్రణా సంస్ధలో పని చేసిన మాజీ అధికారి ఒకరు ఈ అనుమానాల్నే వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అణు కంపెనీలకూ, అణు నియంత్రణా సంస్ధకూ మధ్య ఉన్న కుమ్మక్కు తనను “నిజంగా షాక్ కి గురి చేసింది” అని ఆయన చెప్పాడని ‘ది గార్డియన్’ తెలిపింది.

బ్రిటన్ ప్రభుత్వానికి పర్యావరణ సలహాదారుగా పని చేసిన టామ్ బర్క్, బ్రిటన్ ప్రభుత్వం జపాన్ ప్రభుత్వ తప్పులను పునరావృతం చేస్తునాదాని హెచ్చరించినట్లు గార్డియన్ వివరించింది. ఆయన ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ లో విజిటింగ్ ప్రొఫెసర్ కూడా. ఆయన ఇలా అన్నాడు. “”వారు (ప్రభుత్వ అధికారులు) పరిశ్రమకు అతి దగ్గరగా వ్యవహరిస్తున్నారు. సమస్యలను వెల్లడి చేస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేయడానికి బదులు వాటిని దాచిపెడుతున్నారు.”

న్యూక్లియర్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు ఈ మెయిళ్లపై నేరుగా వ్యాఖ్యానించకుండా ఇలా అన్నారు “మేము మా సభ్య కంపెనీల నుండి నిధులు పొందుతున్నాం. వారి వ్యాపార ప్రయోజనాలను మేము ప్రాతినిధ్యం వహిస్తాము. బ్రిటన్ లో కొత్త అణు కర్మాగారాలకు అనుకూలంగా పని చేయడమే మా పని.” కంపెనీలకూ, నీతీ నిజాయితీ లు ఉండవు. ప్రజల ప్రయోజనాలు పట్టవు. ఆ సంగతే ఈయన చెబుతున్నాడు. కానీ ప్రభుత్వం పని అది కాదు. ప్రజల ప్రయోజనాలు కాపాడడమే ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని వదిలిపెట్టి అణు కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడమే కాక అబద్ధ ప్రచారాలతో ప్రజలను మోసం చేయడనైకి కూడా సిద్ధపడిందని ‘ది గార్డియన్’ కధనం స్పష్టం చేస్తున్నది.

మరి ఎకాలజిస్టులు ఏం చేయాలి? అణు పరిశ్రమ కూడా అనేకమంది ఎకాలజిస్టులను ప్రజలమీదికి వదులుతుంది. తమ ప్రయోజనాలకు అనుకూలంగా పని చేసే శాస్త్రవేత్తలను కూడా కొనుగోలు చేసి అది నియమించుకుంటుంది. వీరంతా వాస్తవానికి తమ వృత్తిని నిజాయితీగా నిర్వహించాలి. వాస్తవం ఏదయితే అదే ప్రజలకు గానీ ప్రభుత్వానికి గానీ ఆ మాటకొస్తే ఎవరికయినా చెప్పాలి. కానీ కంపెనీల సొమ్ముని బ్యాంకు బ్యాలెన్సులలో భద్రం చేసుకుని బోగ భాగ్యాలు అనుభవిస్తున్న ఎకాలజిస్టులు, శాస్త్రవేత్తలు నీతి, నిజాయితీలు వదిలి పెట్టి ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు. కంపెనీల ప్రయోజనాలు కాపాడడానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారు. తద్వారా మానవజాతి భవిష్యత్తుకే వీరు ప్రమాదకరంగా తయారయ్యారు. వాణిజ్య కంపెనీలకు, ప్రజలకు మధ్య వాస్తవాలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ, వ్యాపార కంపెనీల దురన్యాయాలను ఎండగట్టవలసిన వీరు శాస్త్రబద్ధత పేరుతో అశాస్త్రీయతను కుమ్మరిస్తున్నారు.  అసత్య ప్రచారాలను ఎండగట్టే పేరుతో తామే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు జాగరూకతతో ఉండవలసిన అవసరం ఉంది.

‘ది గార్డియన్’ కధనాన్ని ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.

Revealed: British government’s plan to play down Fukushima

Internal emails seen by Guardian show PR campaign was launched to protect UK nuclear plans after tsunami in Japan.

One thought on “ఫుకుషిమా: అణు పరిశ్రమతో బ్రిటన్ ప్రభుత్వం కుమ్మక్కు -ది గార్డియన్

  1. ఈ వార్తలు థి గార్డియన్ లాంటి మీడియాలలో అయితే వస్తాయి కానీ బిబిసి లాంటి సామ్రాజ్యవాద అనుకూల మీడియాలలో రావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s