టెర్రరిస్టు వ్యతిరేక పోరాట సహకారానికి అమెరికా మొండి చేయి


Krishna, Clintonభారత దేశం ఎదుర్కొంటున్న టెర్రరిస్టు సమస్య పై పోరాటంలో సహకారం ఇవ్వవలసిన అమెరికా అందుకు నిరాకరిస్తున్నదని భారత పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. టెర్రరిజం పై పోరాడేందుకు ఇరు దేశాల మధ్య సహకార ఒప్పందం ఉన్నప్పటికి అది ఆచరణలో ఒక వైపు మాత్రమే అమలవుతోందని చెబుతున్నాయి. భారత దేశం వైపు నుండి అమెరికాకి ఎంతగా సహకారం అందజేస్తున్నప్పటికీ భారత దేశానికి సహకారం ఇవ్వవలసిన పరిస్ధితిలో అమెరికా మొండి చేయి చూపుతోందని ఆరోపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన సమావేశం ద్వారా ఈ సంగతి మరో సారి స్పష్టం అయిందని అవి తెలిపాయి.

అమెరికా, ఇండియా ల విదేశాంగ మంత్రులు హిల్లరీ క్లింటన్, ఎస్.ఎం.కృష్ణ లు వాషింగ్టన్ లో సమావేశమై అనంతరం విలేఖరుల సమావేశంలో ప్రసాగించారు. ఇండియా, అమెరికాల మధ్య మూడవ విడత ‘వ్యూహాత్మక చర్చల సమావేశంగా వీరి సమావేశాన్ని పేర్కొన్నారు. తమ సమావేశం విజయవంతం అయిందని ఇరువురు పేర్కొన్నప్పటికీ టెర్రరిస్టుల దాడుల నేపధ్యంలో భారత భద్రతకు సంబంధించి అమెరికా సహకారం దిశగా ఎటువంటి పురోగతి లేదని వారి సమాధానాల ద్వారా స్పష్టమయిందని ‘ది హిందూ’ తెలిపింది.

2008 లో ముంబై లో మూడు రోజుల పాటు మారణ హోమం సాగించిన ‘లక్ష్కర్ ఏ తయిబా’ టెర్రరిస్టులలో ఇరువురు ప్రధాన నిందితులు డేవిడ్ హేడ్లీ, తహవ్వూర్ రాణా లు ఇప్పుడు అమెరికా కస్టడీలో ఉన్నారు. భద్రతా సహకార ఒప్పందం ప్రకారం వీరిని పూర్తి స్ధాయిలో విచారించడానికి భారత విచారణా సంస్ధలకు అమెరికా అనుమతి ఇవ్వకపోవడం భారత ప్రభుత్వానికి తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. 2010 జూన్ లో పది రోజుల పాటు నామ మాత్ర విచారణకు అంగీకరించినప్పటికీ అది కేవలం భారత్ అసంతృప్తిని చల్లార్చడానికే తప్ప పూర్తి విచారణకు అంగీకరించడం లేదని ది హిందూ తెలియజేసింది.

ద్వైపాక్షిక సంబంధాల వృద్ధిలో భాగంగా ఐదు ప్రగతి స్తంభాలు పటిష్టంగా ఉన్నాయని క్లింటన్ విలేఖరులకు తెలిపింది. ఇరు దేశాల మిలట్రీల ఉమ్మడి ఎక్సర్ సైజ్ లు, పైరసీ పై పోరాటంలో సహకారం, కీలక సముద్ర మార్గాలను ఉమ్మడిగా పెట్రోలింగ్ చేయడం, సముద్రయానాంలో స్వేచ్ఛ లాంటి అంశాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని తెలిపింది. ద్వైపాక్షిక మిలట్రీ వాణిజ్యం గత ఐదేళ్లలో 8 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది. ఉమ్మడిగా రక్షణ పరిశోధనలు, ఉత్పత్తులు చేపట్టామనీ తెలిపింది. అయితే హేడ్లీ, రాణాల అప్పగింత విషయంలో మాత్రం మాటల కోసం తడుముకుంది. మరోసారి శుష్క వాగ్దానాలు కురిపించింది.

హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భద్రతా సహకారం, సమన్వయం, సమాచార మార్పిడి అత్యంత అవసరం కాగా, ఈ విషయంలో అమెరికా సహాకారం ఒప్పందాలకే పరిమితం అయింది తప్ప ఆచరణలో ప్రతిఫలించలేదు. ఈ కీలక విషయాల్లో క్లింటన్ నుండి ఖాళీ డైలాగ్ లతో కూడిన సమాధానాలు ఎదురుకాగా, కృష్ణ నుండి పెదవి విరుపే ఎదురయింది. పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఎఉద్రయ్యాయని ‘ది హిందూ’ తెలిపింది. “సమాచారం పంచుకోవడం మా విధానం, ఆచరణ. మేమది చేస్తున్నాం. అయితే వివరాలలోకి వెళ్ళను” అని క్లింటన్ తప్పించుకున్నది. లష్కర్-ఏ-తయిబా నాయకుడు హాఫీజ్ సయీద్ విషయంలో గానీ, హేడ్లీ, రాణాల విషయంలో గానీ అమెరికా నుండి ఏ సమాచారమూ మనకు అందలేదని కృష్ణ విలేఖరులకు తెలిపాడు.

హేడ్లీ ని నేరుగా విచారించాలని ఇండియా సంవత్సరాల తరబడి అమెరికాకు విజ్ఞప్తి చేస్తోంది. హేడ్లీ నిజానికి అమెరికా గూఢచార సంస్ధలకు ఇన్ఫార్మర్. అమెరికా గూఢచార సంస్ధలకు ఇన్ఫార్మర్ గా పని చేస్తూనే ముంబై దాడులకు అతను చురుకుగా ఏర్పాట్లు చేశాడు. అనేక సార్లు, పాకిస్ధాన్, ఇండియా ల మధ్య ‘అమెరికా జాతీయుడు’ ముసుగులో టెర్రరిస్టు దాడులకు ఏర్పాట్లు చేసిపెట్టాడు. అలాంటి హేడ్లీని నేరుగా విచారించాలన్న భారత్ విజ్ఞప్తిని అమెరికా పట్టించుకోవడం లేదు. హేడ్లీ విచారణకు కనీసం హామీ కూడా అమెరికా ఇవ్వడం లేదని ఎస్.ఎం.కృష్ణ సూచించినట్లు ‘ది హిందూ’ తెలిపింది.

హేడ్లీ, రాణాల విచారణ విషయంలో అమెరికా తో జరిగిన చర్చల సరళీపై కనీస సంతృప్తి ని సైతం కృష్ణ వ్యక్తం చేయలేకపోయాడని పత్రిక తెలిపింది. ఈ విషయంలో అమెరికా వ్యవహారం పట్ల కృష్ణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమయిందని తెలియజేసింది.

పెత్తందారీ దేశాలతో సహకారం అంటే ఏక పక్షం తప్ప ద్వైపాక్షికం కాదని భారత దేశంతో పాటు అనేక దేశాల అనుభవాలు రుజువు చేశాయి. పెత్తందారీ దేశాలను పక్కకు నెట్టి మూడవ ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ఒకే మాటపై వ్యవహరించాల్సి ఉంది. మూడవ ప్రపంచ దేశాల మధ్య సహకార సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య సంబంధాలు పెంపొందించుకున్నట్లయితే అవి తమ స్వతంత్రతను కాపాడుకోవచ్చు. ఆ విషయాన్ని దక్షిణ అమెరికా దేశాలయిన అర్జెంటీనా, వెనిజులా, బొలీవియా లాంటి దేశాలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s