ఫుకుషిమా వద్ద పొంచి ఉన్న పెను ప్రమాదం -ది హిందూ


fukushima-reactor4ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద మరో వినాశకర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తీవ్ర స్ధాయిలో హెచ్చరిస్తున్నారు. హీరోషిమా అణు బాంబు కంటే 5,000 రెట్లు రేడియేషన్ వాతావారణంలోకీ విడుదలయ్యే ప్రపంచ స్ధాయి ప్రమాదం సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కోల్డ్ షట్ డౌన్’ పూర్తయిందని గత డిసెంబరు లో జపాన్ ప్రభుత్వం ప్రకటించినా వాస్తవ పరిస్ధితి అది కాదని వారు వెల్లడించారు. కర్మాగారంలో ప్రమాద స్ధాయిని తగ్గించడం కంటే ప్రమాదాన్ని కప్పి పుచ్చుతూ, సేల్స్ టాక్స్ పెంచుకోవడం కోసం, మూతపడిన ఇతర అణు కర్మాగారాలను తిరిగి తెరవడం పైనే జపాన్ ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతున్నదని వారు విమర్శిస్తున్నారు. జపాన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నవారిలో అణు నిపుణులతో పాటు, అమెరికా రాజకీయ నాయకులు కూడా ఉండడం విశేషం.

గత సంవత్సరం మార్చి 11 తేదీన 8.9 పరిమాణంతో సంభవించిన భూకంపం, ఆ తర్వాత 20 మీటర్ల ఎత్తు అలలతో విరుచుకుపడిన భారీ సునామీ ల ధాటికి జపాన్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఫుకుషిమా దైచి అణు కర్మాగారంలో నాలుగు అణు రియాక్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడు రియాక్టర్లలో పూర్తిగా ‘మెల్ట్ డౌన్’ (రియాక్టర్ కోర్ లో ఉన్న ఇంధన రాడ్లు అధిక వేడి వలన పూర్తిగా కరిగిపోయి బైటికి వచ్చి వాతావరణంలో కలిసి పోవడం) జరగ్గా, నాలుగవ రియాక్టర్ లో పాక్షికంగా ‘మెల్ట్ డౌన్’ జరిగింది. ఫలితంగా రియాక్టర్లలో కరిగిపోయిన అణు ఇంధనం ఇప్పటికీ భూమిలోకి ఇంకిపోతూ, భూగర్భ జలాలను కలుషితం చేస్తూ, ‘కూలెంట్’ నీటి ద్వారా సముద్రంలో కలుస్తోంది. రియాక్టర్ కోర్ లలో ఉన్న అణు ఇంధనం ‘మెల్ట్ డౌన్’ కావడం ఒక ప్రమాదం కాగా, విద్యుత్ ఉత్పత్తి కోసం వాడగా మిగిలిన ‘స్పెంట్ ఫ్యూయెల్’ ను భద్రంగా సమాధి చేయలేకపోవడం మరో ప్రమాదంగా పరిణమించింది.

ఫుకుషిమా లో ఉంచిన ‘స్పెంట్ ఫ్యూయెల్ రాడ్స్’ (అణు ఇంధనాన్ని రాడ్ల రూపంలో రియాక్టర్ కోర్ లో ఉపయోగిస్తారు. వాటిని విద్యుత్ వినియోగం కోసం పూర్తి స్ధాయిలో వినియోగించుకోగా మిగిలిపోయిన రాడ్లను ‘స్పెంట్ ఫ్యూయెల్ రాడ్స్’ అంటారు.) వల్ల సమీప భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉందని అణు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ముఖంగా రియాక్టర్ నెం. 4 వద్ద రియాక్టర్ బిల్డింగ్ పై ఎటువంటి రక్షణా లేకుండా నిలవ చేసిన స్పెంట్ ఫ్యూయల్ రాడ్స్ వల్ల భారీ ప్రమాదం కలగనున్నదని వారు చెబుతున్నారు. 1535 ఫ్యూయల్ రాడ్లు ఈ రియాక్టర్ వద్ద నిలవ ఉంచారనీ, ఇవి నిలవ ఉంచిన నీటి సరస్సుకు ఎలాంటి రక్షణా కల్పించలేదనీ వారు తెలియజేస్తున్నారు.

నాలుగవ నెంబర్ రియాక్టర్ బిల్డింగ్ ఎత్తు 30 మీటర్లు కాగా, దాని పై భాగంలో ‘వాటర్ పూల్’ నిర్మించి అందులో స్పెంట్ ఫ్యూయల్ రాడ్స్ ను నిలవ చేశారు. గత సంవత్సరం ప్రమాదం సభవించినపుడు రియాక్టర్ ను చల్లబరిచే వ్యవస్ధ పని చేయడం ఆగిపోవడంతో ఫ్యూయల్ రాడ్లు వేడెక్కి లోపల హైడ్రోజన్ పేలుడు సంభవించింది. పేలుడు వల్ల రియాక్టర్ బిల్డింగ్ బయటి గోడ పై భాగం దెబ్బతినిపోయింది. దెబ్బతిన్న భాగానికి మరమ్మతులు చేయలేని పరిస్ధితుల వల్ల వాటర్ పూల్ రక్షణ లేకుండా అలాగే కొనసాగుతోంది. ఈ వాటర్ పూల్ లో నిలవ ఉన్న రాడ్లలో అత్యధిక భాగం ‘స్పెంట్ ఫ్యూయల్ రాడ్సే’.

ఈ స్పెంట్ ఫ్యూయల్ ద్వారా వెలువడే రేడియో ధార్మిక సీసియం పరిమాణం హీరోషిమా బాంబు కంటే 5000 రెట్లు పరిమాణం గల రేడియో ధార్మికతకు సమానమని ప్రఖ్యాత, అతి పెద్ద జర్మనీ వార్తా సంస్ధ డి.పి.ఎ ను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. 30 మీటర్ల ఎత్తున ఉన్న రియాక్టర్ బిల్డింగ్ ఇప్పటికే పాక్షికంగా దెబ్బతిన్నది గనుక వెంటనే ఫ్యూయల్ రాడ్లను అక్కడి నుండి భద్రంగా తరలించవలసిన ఎమర్జెన్సీ పరిస్ధితి ఏర్పడి ఉంది. పొరబాటున మరొక భూకంపం సంభవించడమో, బలహీనంగా ఉన్న రియాక్టర్ 4 బిల్డింగ్ కూలిపోవడం జరిగితే ప్రపంచ స్ధాయి వినాశనానికి తెరతీసినట్లేనని, 5,000 హీరోషిమా అణు బాంబులను ప్రపంచ దేశాలపై జారవిడిచినట్లేనని ‘క్యోటో యూనివర్సిటీ రీసర్చ్ రియాక్టర్ ఇనిస్టిట్యూట్’ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ‘హీరోయికే కొయిడే’ డి.పి.ఎ కి తెలియజేశాడు.

డి.పి.ఎ ఇలా తెలియజేసింది:

The government estimated the amount of caesium—137 already released by the Fukushima disaster were equal to that of 168 Hiroshima bombs.

జపాన్ ప్రభుత్వం అంచనాల ప్రకారం ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల వాతావరణం లోకి లీక్ అయిన ‘సీసియం-137’ రేడియో ధార్మిక పదార్ధం మొత్తమే 168 హీరోషిమా అణు బాంబుల రేడియేషన్ తో సమానమని తెలుస్తోంది. సీసియం 137 మాత్రమే కాక ఇంకా అనేక రేడియో ధార్మిక పదార్ధాలు ఫుకుషిమా ప్రమాదం వల్ల వాతావరణంలో కలిసి పోయాయి. మరో పెద్ద భూకంపం గానీ, లేదా మరే ఇతర పరిణామాల వల్ల గానీ రియాక్టర్ 4 బిల్డింగ్ దెబ్బతిన్నట్లయితే, దాని వల్ల బిల్డింగ్ పై భాగంలో ఉన్న స్పెంట్ ఫ్యూయల్ పూల్ నుండి రేడియేషన్ వాతావరణంలోకి తప్పించుకున్నట్లయితే జరగనున్నది పెను ప్రమాదమేనని కొయిడే ఆందోళన వ్యక్తం చేశాడు. “ఆ ఫ్యూయల్ ని తొలగించక మునుపే భూకంపం లాంటిదేమీ సంభవించకూడదని భాగవంతుడ్ని ప్రార్ధించవలసిందే” అని అమెరికాలోని ‘ఫెయిర్ విండ్స్ ఎనర్జీ ఎడ్యుకేషన్’ లో అణు ఇంజనీర్ ‘ఆర్నీ గుండర్సన్’ తన వెబ్ సైట్ లో నిస్పృహ వ్యక్తం చేశాడు.

ఫుకుషిమా ప్లాంటులో మొత్తం 6 రియాక్టర్ లు ఉండగా, నాలుగు ఒక వరుసలోనూ, రెండు మరో వరుసలోనూ ఉన్నాయి. నాలుగు వరుసలో ఉన్న రియాక్టర్లలో మొదటి మూడు రియాక్టర్ల మొత్తం కంటే నాల్గవ రియాక్టర్ లోనే అత్యధికంగా ఇంధన రాడ్లు ఉన్నాయని డి.పి.ఎ తెలిపింది. అంటే పూర్తి స్ధాయిలో మెల్ట్ డౌన్ సంభవించిన మూడు రియాక్టర్ల కంటే ఇంకా మెల్ట్ డౌన్ సంభవించని నాల్గవ రియాక్టర్ బిల్డింగ్ లోనే అత్యధికంగా ఇంధన రాడ్లు నిలవ ఉన్నాయన్నమాట. కనుక మరో భూకంపం సంభావిస్తే ఇప్పటికే జరిగిన ప్రమాదం కంటే అనేక రేట్లు ఎక్కువ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ప్రమాదానికి సంభంధీచిన వాస్తవాలను ప్రజలకు అందకుండా ప్రభుత్వమూ, కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటున్న నేపధ్యంలో, నాలుగవ రియాక్టర్ వద్ద పరిస్ధితి ఏమిటన్నదీ ఖచ్చితంగా తెలిసే పరిస్ధితి పెద్దగా కనిపించడం లేదు.

స్విట్జర్లాండ్ దేశానికి జపాన్ మాజీ రాయబారిగా పని చేసిన మిత్సుహి మురాటా గత మార్చి చివరిలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘బాన్ కి-మూన్’ ఒక లేఖ రాశాడు. అందులో ఆయన ఇలా పేర్కొన్నాడు:

“It is no exaggeration to say that the fate of Japan and the whole world depends on the No 4 reactor.”

“జపాన్ తో పాటు ప్రపపంచం యావత్తు అదృష్టం నెం.4 రియాక్టర్ పైన ఆధారపడి ఉందనడంలో అతిశయోక్తి లేదు”

అమెరికా సెనేటర్ రాన్ వైడెన్ గత ఏప్రిల్ లో ఫుకుషిమా సందర్శించాడు. అనంతరం అమెరికాలోని జపాన్ రాయబారి కి లేఖ రాస్తూ ఆయన ఇలా పేర్కొన్నాడు.

“The precarious status of the Fukushima Daiichi nuclear units and the risk presented by the enormous inventory of radioactive materials and spent fuel in the event of further earthquake threats should be of concern to all and a focus of greater international support and assistance.”

“The true earthquake risk for the site was seriously underestimated and remains unresolved,”

“మరిన్ని భూకంపాలు పొంచి ఉన్న నేపధ్యంలో, ఫుకుషిమా దైచి న్యూక్లియర్ యూనిట్లు ఉన్న అనిశ్చిత స్ధితి గానీ, భారీ స్ధాయిలో అక్కడ నిలవ చేసిన రేడియో ధార్మిక పదార్ధాల వల్లా, స్పెంట్ ఫ్యూయల్ వల్ల పొంచి ఉన్న ప్రమాదం గానీ అందరికీ ఆందోళన కలిగించే విషయాలు. అంతర్జాతీయంగా మరింత మద్దతు, సహాయం అందేలా కేంద్రీకరణను పెంచవలసిన విషయాలు.”

“ఈ స్ధలంలో భూకంపం సంభవించే ప్రమాదం తీవ్ర స్ధాయిలో తక్కువ అంచనా వేయబడుతూ, పరిష్కారానికి నోచుకోవడం లేదు”

సాధ్యమైనంత త్వరగా రియాక్టర్ నెం.4 నుండి ఇంధనాన్ని వేరే చోటికి తరలించడమే ‘టెప్కో’ (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ) కి గానీ, జపాన్ ప్రభుత్వానికి గానీ ప్రధమ ప్రాధాన్యతగా ఉండాలని  న్యూక్లియర్ ఇంజనీర్ అర్నీ గండర్సన్ కోరుతున్నాడు. ఈ లోపు భూకంపాన్ని తడ్డుకునేందుకు వీలుగా ఫ్యూల్ రాడ్లు నిలవ ఉంచిన వాటర్ పూల్ ను మరింత శక్తివంతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరాడు. “ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం” అని ఆయన పేర్కొన్నాడు. ఈ పరిస్ధితిని టెప్కో గానీ, జపాన్ ప్రభుహుత్వం గానీ సీరియస్ గా తీసుకుంటున్న జాడలు లేవని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

జపాన్, అమెరికా దేశాల అణు నిపుణులు, అమెరికా సెనేటర్లూ ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ వారి ఆందోళనలను జపాన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జపాన్ అణు ప్రమాదం విషయం చూస్తున్న జపాన్ మంత్రి గోషి హోసోనో మే నెలలో ఫుకుషిమా సందర్శించి రియాక్టర్ బిల్డింగ్ గానీ, దానికి మద్దతుగా ఉన్న నిర్మాణం గానీ చెక్కుచెదరనట్లు ‘కనిపిస్తోంద’ని వ్యాఖ్యానించాడు. ఇది వాస్తవం కాదని డి.పి.ఎ వార్తా సంస్ధ తెలిపింది. ప్రమాదకర పరిస్ధితుల్లో ఫ్యూయల్ రాడ్స్ ను భద్రంగా వేరే చోటికి తరలించవలసిన క్రేన్ లు గత సంవత్సరం ప్రమాదం సందర్భంగా కూలిపోయాయని ఆ సంస్ధ తెలిపింది. క్రేన్ లు పని చేయాలంటే టెప్కో కంపెనీ కొత్తంగా నిర్మాణాలను లేపవలసిందేనని తెలిపింది. టెప్కో మాత్రం 2013 డిసెంబర్ లో మాత్రమే ఫ్యూయల్ రాడ్లను ఫుకుషిమా నుండి తొలగిస్తామని ప్రకటించి ఊరుకుంది. అనంతరం ఫుకుషిమా కర్మాగారాన్ని ప్రమాద రహితంగా చేయడానికి దశాబ్దాలు పడుతుందని కంపెనీ, ప్రభుత్వాలు ప్రకటించాయి. కొందరు మూడు దశాబ్దాలు పడుతుందని చెప్పగా, మరికొందరు అదీ చాలదని చెబుతున్నారు.

క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్ కోయిడే ప్రకారం టెప్కో కంపెనీ ‘సంక్షోభ పరిస్ధితి ఉన్నదన్న బుద్ధితో’ (sense of crisis) పని చేస్తున్నట్లు కనిపిస్తున్నది గానీ, జపాన్ ప్రభుత్వానికి ఆ ధోరణే లేదు. నిలిపివేసిన రియాక్టర్లను తిరిగి పని చేయించడంపైనే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఆయన తెలిపాడు. కొయిడే ఒక్కడే కాక అనేక మంది విమర్శకులు ప్రభుత్వమూ, మీడియాల ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని డి.పి.ఎ తెల్పింది. రియాక్టర్లను పునఃప్రారంభించి సేల్స్ టాక్స్ ని పెంచుకోవడం పైనే వారి దృష్టి ఉందని తెలిపింది.

జపాన్ ప్రధాని యొషిహికో నోడా సెప్టెంబర్ లో ప్రధాని పదవి అధిష్టించినప్పుడే ఫుకుషిమా ను పునరుద్ధరింపజేయడం తన మొదటి ప్రాధాన్యంగా చెప్పుకున్నాడు. ఫుకుషిమా పునర్జన్మ ఎత్తకపోతే జపాన్ కి పునర్జన్మ లేదని ఆయన వాకృచ్చాడు. అంతే కాకుండా ఫుకుషిమాను ‘కోల్డ్ షట్ డౌన్’ చేశామని కూడా ఆయన డిసెంబర్ లో ప్రకటించాడు. అది అవాస్తవమని ఈ కధనంలో నిపుణుల ఆందోళనలే స్పష్టం చేస్తున్నాయి.

పూర్తి స్ధాయి మెల్డ్ డౌన్ సంభవించిన రియాక్టర్లలో రేడియేషన్ లీకేజి ఆగిపోయిందన్నది వాస్తవ దూరం. మొదటి మూడు రియాక్టర్లలో ఇంధన రాడ్లు పూర్తి గా ‘మెల్ట్ డౌన్’ కావడం వల్ల రియాక్టర్ అడుగుకు చేరిన ప్రమాదకర రేడియేషన్ నీరు నిరంతరం లీక్ అవుతూనే ఉంది. తీవ్రంగా దెబ్బతిన్న నెం.1 రియాక్టర్ వద్ద భూగర్భ జలం, రియాక్టర్ నిర్మాణం లోకి ప్రవేశించి తీవ్రంగా కలుషితమై భూమిలోకి ఇంకిపోతోందని టెప్కో కంపెనీ గత ఏప్రిల్ లో ప్రకటించింది. భూగర్భ జలం రియాక్టర్ నిర్మాణం లోకి ప్రవహించకుండా మళ్లించడానికి చుట్టూ డజను వరకూ బావులు తవ్వాలని టెప్కో నిర్ణయించినట్లు ఏప్రిల్ 25 తేదీన ‘జపాన్ టైమ్స్’ పత్రిక తెలిపింది. అత్యధిక స్ధాయిలో రేడియేషన్ సోకిన కూలింగ్ వాటర్ రియాక్టర్ బిల్డింగ్ ల లోకి, దాని పక్కనే ఉండే టర్బైన్ బిల్డింగ్ ల లోకి, బేస్ మెంట్ల లోకి ప్రవహిస్తోందనీ, దానితో భూగర్భజలం కూడా కలిసిపోయి కలుషిత నీటి పరిమాణాన్ని మరింత పెంచుతోందని టెప్కో తెలిపింది. ఆ విధంగా కలుషితమైన నీరు రోజుకు 1000 టన్నుల వరకూ సమకూరుతోందనీ, దీనిని పసిఫిక్ సముద్రంలోకి మళ్లిస్తున్నామనీ తెలియజేసింది. అంటే ఫుకుషిమా వద్ద రేడియేషన్ లీకేజి ఆగిపోలేదన్నమాట. ఆగకపోగా రోజుకి వెయ్యి టన్నుల కలుషిత నీటి రూపంలో పసిఫిక్ సముద్రంలో కలుస్తూనే ఉందనీ స్పష్టమవుతోంది. వెయ్యి టన్నుల కలుషిత నీటిని సముద్రంలో కలిపే ముందు దాని రేడియేషన్ స్ధాయి చెక్ చేస్తామని టెప్కో చెపుతోంది.

జపాన్ టైమ్స్ ఇలా చెపుతోంది:

The Fukushima plant generates large volumes of highly radioactive water on a daily basis because it must perpetually cool melted fuel in reactors that are riddled with meltdown holes, as well as the spent-fuel pools sitting on top of them. Since the vessels are leaking, the water keeps the reactor buildings, turbine buildings and their basements flooded.

దీని ప్రకారం అత్యధిక స్ధాయిలో రేడియేషన్ తో కలుషితమైన నీరు ప్రతి రోజూ ఫుకుషిమా ప్లాంటు వద్ద తయారవుతోంది. ఎందుకంటే రియాక్టార్లలో కరిగిపోయిన ఇంధనాన్ని నిరంతరం చల్లబరచడానికి నీటిని పంపింగ్ చేస్తున్నారు. కానీ రియాక్టర్లు ‘మెల్ట్ డౌన్ హోల్స్’ తో నిండి ఉండగా, వాటిపైన ‘స్పెంట్ ఫ్యూయల్ ఫూల్స్’ ఉన్నాయి. రియాక్టర్లు నిరంతరం లీక్ అవుతుండడంతో కలుషిత జలం రియాక్టర్ బిల్డింగ్స్ నూ, టర్బైన్ బిల్డింగ్స్ నూ, బేస్ మెంట్ నూ ముంచెత్తుతోంది.

కనుక ఫుకుషిమా ప్రమాదం ముగిసిపోయిందనీ, ప్రమాదం సంభవించిన నెలరోజులకో, లేదా కొద్ది రోజులకో రేడియేషన్ లీక్ ఆవిపోయిందని చెప్పడం సరికాదు. ‘ఎకాలజిస్టు’ నని చెబుతూ వచ్చి అబద్ధాలు (లేదా అజ్ఞానం) గుమ్మరించడం బాధ్యతారాహిత్యం. అలాంటి బాధ్యతారాహిత్యానికి పెట్టుబడిదారీ కంపెనీలు, వారి సమర్ధకులైన ప్రభుత్వాలూ ఎలాగూ పేరెన్నికగన్నాయి. ఎకాలజిస్టులు కూడా వారితో చేరిపోవడమే ఆందోళనకరం.

కొన్ని రిఫరెన్స్ లు:

1. రాయిటర్స్ గ్రాఫిక్స్

2. రియాక్టర్ నిర్మాణాన్ని వివరించే గ్రాఫిక్

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s