ఆసియన్ అమెరికన్ల ఎదుగుదలపై ‘బాంబూ సీలింగ్’ -ఎన్.డి.టి.వి


అమెరికా కంపెనీలలో ఆసియా-అమెరికన్లు ఉన్నత స్ధానాలకు ఎదగకుండా అనేక ఆటంకాలు విధిస్తున్నారని ఎన్.డి.టి.వి తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, తమ సామర్ధ్యం ఎంతగా రుజువు చేసుకున్నప్పటికీ కార్పొరేట్ అమెరికా వారిని గుర్తించడం లేదనీ తెలిపింది. కంపెనీలకి విధేయులుగా ఉంటున్నప్పటికీ తమను తాము కంపెనీలకు చెందినవారుగా భావించలేకపోతున్నార తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎదుర్కొంటున్న ఆటంకాలకు  అమెరికా సమాజంలో ఆసియన్లకు వ్యతిరేకంగా, అమెరికన్లకు అనుకూలంగా ‘పక్షపాతం’ పాతుకుపోయి ఉండడమే కారణమనీ ఇటీవలి సర్వేనూ, వివిధ నిపుణులనూ ఉటంకిస్తూ తెలియజేసింది.

ఆసియా-అమెరికన్ కుటుంబాలు డాక్టర్లు, ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు అనేకమందిని సృష్టిస్తున్నప్పటికీ, వారి విజయసాధనలన్నీ ‘బాంబూ సీలింగ్’ మాటున అణగారిపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. 83 శాతం ఆసియా-అమెరికన్లు తమ కంపెనీలకు విధేయులుగా ఉన్నప్పటికీ 49 శాతం మాత్రమే కంపెనీలకు చెందినవారుగా భావించగలుగుతున్నారని ఆసియా పసిఫిక్ అమెరికన్ రీసర్చ్ కు ఆసియా సోసైటీ తరపున సీనియర్ సలహాదారుగా ఉన్న ‘జొనాధన్ సా’ తెలిపాడు. ఒక పక్క విజయాలు సాధిస్తూనే మరొక పక్క భ్రమలు కోల్పోవడాన్ని ఇది ప్రతిబింబిస్తోందని ఆయన ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధతో మాట్లాడుతూ అన్నాడు.

ఆసియన్ అమెరికన్లు శక్తివంతంగా కెరీర్ ప్రారంభిస్తారు. ప్రతిష్టాకరమైన స్కూళ్ళ నుండి గ్రాడ్యుయేషన్ పొందుతారు. చాలా త్వరగా మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. కానీ అంతే త్వరగా వారి ఎదుగుదలను ‘బాంబూ సీలింగ్’ అడ్డుకుంటుంది. “సీనియర్ లీడర్ షిప్ స్ధానాల్లో ఆసియన్ అమెరికన్లను మీరు ఎక్కువమందిని చూడలేరు” అని జోనాధన్ అన్నాడు. ఆసియన్లను అమెరికన్లతో పాటుగా సమానంగా చూడలేని ‘పక్షపాతం’ అమెరికన్ సమాజంలో పాతుకుపోయి ఉందని అదే ఆసియన్లకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని జోనాధన్ తో పాటు ఆసియా సొసైటీ న్యూయార్క్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

“ఆసియన్ అమెరికన్లు ‘ఇతరులు’ అన్న భావన అమెరికాలో ఎల్లెడలా ఉన్నది” అని జోనాధన్ తెలిపాడు. “ఆసియన్ అమెరికన్లు బాగా పని చేస్తారని ఎల్లప్పుడూ చెబుతారు. మంచిదే. కానీ మిడిల్ మేనేజ్ మెంట్ వరకు మాత్రమే (ఆ అభిప్రాయం) వారిని చేర్చగలుగుతుంది. అటువంటి కీలక తరుణంలో మిడిల్ మేనేజర్, సీనియర్ మేనేజ్ మెంట్ ల మధ్య,  మనం చేసే పని కంటే సంబంధాలే ప్రధాన పాత్ర పోషించే చోట, అటువంటి (పక్షపాత) భావనలు పని చేస్తాయి” అని జోనాధన్ తెలిపాడు. అలాంటి పూర్వ భావనల వల్ల అనేకమంది జాతిపరమైన, తెగపరమైన -ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్లు- సమూహాలు బాధలు అనుభవిస్తున్నారు.

తెలివిగా ఉండాలన్న పునరుక్తి (cliche) లో ఇరుక్కుపోయిన ప్రత్యేక సమస్యను ఆసియన్ అమెరికన్లు ఎదుర్కొంటున్నారు. తెలివి ఎంతవరకు ఉండాలంటే, తెలివి తేటలను ప్రదర్శిస్తూ కూడా ఉన్నత స్ధానాలతో సంబంధం లేనివారుగా, అమెరికా జీవనంలో ప్రధాన స్రవంతికి ప్రాతినిధ్యం వహించలేనివారుగా మిగిలిపోవలసిందే. ఈ కారణం వల్ల -ఓవైపు అసాధారణ పనితనం చూపాలి, మరో వైపు అమెరికన్ సమాజానికి దూరంగా ఉండాలి – ఆసియా అమెరికన్ల సమస్య ప్రత్యేకంగా మారిందని ఎన్.డి.టి.వి భావిస్తోంది.

ఈ నేపధ్యంలో ‘Linsanity’ అన్నది మీడియా హిస్టీరియాగా మారిందని ‘కాంగ్ అండ్ లీ’ అడ్వర్టైజింగ్ సంస్ధ ప్రతినిధి ‘సాల్ గిట్లిన్’ అభిప్రాయం. ఆసియన్ అమెరికన్ అయిన జెరేమీ లిన్ నిక్స్ బాస్కెట్ బాల్ టీం ను ఇటీవల వరుస విజయాలు సాధించడానికి కారకుడయ్యాడు. లిన్ పట్ల మీడియా చూపుతున్న హిస్టీరియాను ‘Linsanity’ గా సాల్ అభివర్ణిస్తున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ ద్వారా ఆసియన్ అమెరికన్లు పయనించే సాధారణ డాక్టర్ లేదా ప్రోగ్రామర్ ట్రాక్ లోనే కెరీర్ ప్రారంభించిన లిన్ అనూహ్యంగా ఆకర్షణీయమైన స్పోర్ట్స్ హీరోగా అవతరించాడు. స్టీరియో టైప్ కు విరుద్ధంగా వెళ్తే ఏమవుతుందో తెలియజెప్పే ‘టర్నింగ్ పాయింట్’ ఇది అని గిట్లిన్ అభిప్రాయపడినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ‘స్మార్ట్ గై’, ‘గీక్’, ‘టెక్ గై’ లాంటి స్టీరియో టైప్ ముద్రలతో విసిగిపోయిన యువ ఆసియన్లకు లిన్ ఆశాదీపం అని గిట్లిన్ అభిప్రాయం.

అయితే నటుడు ‘సెంధిల్ రామమూర్తి’ అభిప్రాయం వేరే విధంగా ఉంది. డాక్టర్ ట్రాక్ లో బయలుదేరి యాక్టర్ అయిన సెంధిల్ ప్రకారం టి.వి లో గానీ స్టూడియో సినిమాలలో గానీ ఒకే రకం పాత్రల్లో ఆసియన్లను నటింపజేసే ధోరణి ఎప్పటిలాగే బలంగానే ఉంది. “ఆసియన్లు నిర్దిష్ట కేరెక్టర్లు మాత్రమే పోషిస్తారు. డాక్టర్లుగానో, స్మార్ట్ గై గానో వారు నటిస్తారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. అదిమారడానికి ఏంచేయాలో తెలియదు గానీ తెలిస్తే అదే చేస్తాను” అని న్యూయార్క్ కాన్ఫరెన్స్ కి తెలిపాడు. మార్కెట్ శక్తుల ద్వారానే ఆ మార్పు రావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లుగా ఎన్.డి.టి.వి చెబుతోంది.

‘న్యూ అమెరికన్ డైమెన్షన్’ వ్యవస్ధాపకుడు ధామస్ సెంగ్ ప్రకారం “అమెరికాలో వేగంగా వృద్ధి చెందుతున్న బహుళ సాంస్కృతిక విభాగం ఆసియన్ అమెరికన్లే.” అమెరికాలో 17.3 మిలియన్ల మంది ఆసియా అమెరికన్లు ఉన్నారని తెలుస్తోంది. హిస్పానిక్కుల సంఖ్య వారి కంటే మూడు రేట్లు ఎక్కువయినప్పటికీ వారి కంటే ఆసియన్ల రంగం సంపద్వంతమైనదని, సాంకేతికంగా ముందున్నదనీ చెబుతున్నారు. ప్యూ సర్వే ప్రకారం ఆసియన్ అమెరికన్లలో 80 శాతం మంది బ్రాడ్ బాండ్ కలిగి ఉండగా, మొత్తం జనాభాలో 60 శాతం కే ఆ సౌకర్యం ఉంది. 74 శాతం ఆసియన్ అమెరికన్లు లాప్ టాప్ కలిగి ఉండగా, మొత్తం జనాభాలో 52 శాతం మందికే ఆ సౌకర్యం ఉంది. 80 శాతం ఆసియన్ అమెరికన్లు ప్రతిరోజూ ఆన్ లైన్ లో ఉంటుండగా, 74 శాతం అమెరికా రోజూ ఆన్ లైన్ లో ఉంటోంది.

ఈ స్ధాయి లో ధనికత, సాంకేతికత సొంతం చేసుకున్నప్పటికీ ఆసియన్ అమెరికన్ మార్కెట్ ‘సిండ్రిల్లా’ పరిస్ధితినే ఎదుర్కొంటున్నదని గిట్లిన్ తెలిపాడు. “ఈ జనాభా కోసం మార్కెటీర్లు పోటీలు పడతారని మీరు భావించవచ్చు. కానీ పరిస్ధితి అది కాదు. ఇది అందమైన మార్కెట్. నిజంగా ఆకర్షణీయమైనది. కానీ ఎల్లప్పుడూ వారిని ఆహ్వానించే పరిస్ధితి లేదు. ఈ మార్కెట్ ని నేను ఎప్పుడూ ‘సిండ్రిల్లా’ అనే అభివర్ణిస్తాను” అని గిట్లిన్ తెలిపాడు.

————————————————————–

నోట్: ఈ ఆర్టికల్ సమాచారం కోసం మాత్రమే. ఇందులోని సాధారణ, తాత్విక విశ్లేషణలన్నింటికీ నా మద్దతు ఉందని భావించనవసరం లేదు.  -విశేఖర్

3 thoughts on “ఆసియన్ అమెరికన్ల ఎదుగుదలపై ‘బాంబూ సీలింగ్’ -ఎన్.డి.టి.వి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s